కశ్మీర్ వాసులకు సైన్యం హెచ్చరిక
కశ్మీర్‌లో తరచూ పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు ఏదో ఒక విధ్వంసాన్ని సృష్టించేందుకు ప్రయత్నించడం, వారిని సైన్యం దీటుగా ఎదుర్కోవడం తరచూ వినే వార్తే! కానీ ఈ మధ్య కాలంలో తీవ్రవాదులను ఎదుర్కొనే సైన్యానికి ఓ కొత్త సమస్య మొదలైంది. స్థానికంగా ఉండే జనం ఈ గొడవను చూసేందుకు వందలకొద్దీ మూగడం మొదలుపెట్టారట. పనిలో పనిగా వీరిలో కొందరు అల్లరిమూకలు చేరి సైన్యం మీదకు రాళ్లు విసరడం, తీవ్రవాదులకు అనుకూలంగా నినాదాలు చేయడంతో.... పరిస్థితి సైన్యం చేయిదాటిపోసాగింది.
మొన్నటికి మొన్న ‘ఆషిముకాం’ అనే ప్రాంతంలో జరిగిన ఇలాంటి ఘటనలో, వేయిమందికి పైగా జనం ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. వారిని వెనక్కి వెళ్లమంటూ సైన్యం ఎంతగా హెచ్చరించినా వినకపోగా, రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. దీంతో సైన్యం గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన తరువాత అమాయకమైన పౌరుల మీద కాల్పులు జరుపుతున్నారంటూ, సైన్యం మీద ఆరోపణలు వచ్చాయి. అయితే ‘పరిస్థితి చేయిదాటిపోవడంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందనీ, పౌరులు కనుక ఇలాగే శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే, తాము కూడా తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందనీ’ సైన్యం తరఫున ప్రతినిధి చెప్పుకొచ్చారు. అంటే మున్ముందు తాము అల్లరిమూకలతో మరింత కఠినంగా వ్యవహరిస్తామనేగా!