బీ ప్రౌడ్ టు బీ హైదరాబాదీ అంటున్న కెసీఆర్
అసెంబ్లీలో తమపై ప్రతిపక్షం చేసిన ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సిఎం కేసీఆర్. మిషన్ భగీరథను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, అది పూర్తయితే తమకు ఓట్లు రావని కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. ఆర్టీసీకి ఇప్పటికే 700 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, త్వరలోనే పూర్తి స్థాయి లాభాల బాట పట్టిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం, అధికార పార్టీ ఇచ్చిన వాటితోనే సాగుతుందని, అది టిఆర్ఎస్ మానిఫెస్టోనే అంటూ ఆయన తెలిపారు. డిసెంబర్ కల్లా, 6182 గ్రామాలకు మంచినీరు అందిస్తామని, ఆయన స్పష్టం చేశారు.
సమైక్య రాష్ట్రంలో లాండ్ అసైన్ మెంట్ ను కూడా సరిగ్గా చేయలేదని, ఆ అసైన్ మెంట్స్ అన్నింటినీ సరి చేస్తామన్నారాయన. త్వరలోనే తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తండాలన్నింటినీ పంచాయితీలుగా మారుస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామాలన్నింటికీ సింగిల్ ఫేజ్ విద్యుత్ ను నిరంతరంగా అందిస్తామని, ప్రతీ ఊళ్లోని దళితులకు 3 ఎకరాలు భూమిని కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బడ్జెట్లో ఆరోగ్యానికి పెద్దపీట వేయబోతున్నామని, హాస్పటళ్లను అద్భుతంగా, ఆరోగ్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ముప్ఫై నాలుగు వేల ఉద్యోగాలను కల్పిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష ఉద్యోగాలను ఇస్తామన్న దానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. బీ ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ అంటూ మాట్లాడటం విశేషం.