ఇండియాలో సంతోషం తగ్గిపోతోంది!
ఈ మాట వాళ్లూ వీళ్లూ అంటున్నది కాదు. సాక్షాత్తూ అంతర్జాతీయ నివేదిక చెబుతున్న మాట. ‘హ్యాపీనెస్ రిపోర్ట్’ పేరట ఐక్యరాజ్య సమితి కోసం రూపొందించే ఈ నివేదికలో మన దేశం 118వ స్థానంలో ఉంది. మొత్తం 156 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో డెన్మార్క మొదటి స్థానంలో నిలవగా, దాని వెనుకే స్విట్జర్‌లాండ్ నిలిచింది. ఇక ఐస్‌లాండ్, నార్వే, ఫిన్‌లాండ్ తదుపరి స్థానాలు చేజిక్కించుకున్నాయి. మన దేశం మాత్రం పోయిన ఏడాది కంటే ఒక మెట్టు కిందకి దిగి 118వ స్థానంతో సరిపెట్టుకుంది. తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు, సామాజిక బంధాలు, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నివేదికను రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ విషయాలను కనుక పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో సంతోషం నానాటికీ తగ్గిపోతోందని, నివేదికలో ఆందోళనను వెలిబుచ్చారు. ఈ సంతోష సూచీ ప్రకారం చైనా (83), పాకిస్తాన్ (92), బంగ్లాదేశ్ (110) వంటి పొరుగుదేశాలు కూడా మనకంటే ముందుండటం గమనార్హం! కాకపోతే ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ (154), సిరియా (156) వంటి దేశాలు మనకంటే దిగువనుండటం... సగటు భారతీయుడి మనసుకి తృప్తి కలిగించే అంశం!