జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
posted on Sep 26, 2025 @ 4:07PM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. సంప్రదాయాన్ని దాటకుండా.. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఆ సీటును ఆయన సతీమణి మాగంటి సునీతకే కేటాయించారు. దీంతో జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న సందిగ్ధతకు కేసీఆర్ తెరవేశారు. అనవసర ఊహాగానాలకు తెరదించుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ముందుగానే మాగంటి సునీతను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టడం వల్ల సానుభూతితో పాటు.. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కీలక సామాజిక వర్గ మద్దతు కూడా లభిస్తుందన్న అంచనాతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు అంటున్నారు.
అలాగే పార్టీ తరపున నిర్వహించిన సర్వేల్లోనూ మాగంటి కుటుంబానికి అవకాశం ఇస్తేనే బెటర్ అని తేలిందని, దీంతో ఎలాంటి శషబిషలకూ తావు లేకుండా కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారని అంటున్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించారు. ఇందులో మొదటి సారి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందగా, తరువాత రెండు సార్లు బీఆర్ఎస్ తరపున గెలిచారు.
ఏవరు ఔనన్నా కాదన్నా, జూబ్లీ బైపోల్ లో విజయం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం. తాము పుంజుకుంటున్నామనీ, మళ్లీ ప్రజాదరణ పొందుతున్నామనీ నిరూపించుకోవాలంటే జూబ్లీ బైపోల్ లో విజయం తప్పని సరి. ఎందుకంటే ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది. అంతే కాకుండా ఆ స్థానంలో మూడో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు కూడా సిట్టింగ్ స్థానమైన జూబ్లీ హిల్స్ ను బైపోల్ లో కోల్పోతే.. పార్టీ క్యారడ్ స్థైర్యం పూర్దిగా దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారనీ, అన్నివిధాలుగా ఆలోచించే.. ఇప్పుడు అభ్యర్థిని కూడా ప్రకటించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.