విభజించి పాలించు-1
మొన్న శీతాకాల పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ యంపీలు తమ స్వంత ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడని అధిష్టానం చేత నేటికీ సర్టిఫికెట్లు అందుకొంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న అధిష్టానాన్నే ఇబ్బందిపెట్టే విధంగా రేపు డిల్లీలో దీక్షకు కూర్చుంటారనే వార్తలు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అదేదో సినిమాలో పోలీసు వేషం కట్టిన హీరో చట్టాన్ని కాపాడేందుకు తన స్వంత కుటుంబ సభ్యులకే బేడీలు తగిలించి అరెస్ట్ చేసినట్లు, రాష్ట్రాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు, శాసనసభ్యులు అందరూ కలిసి డిల్లీలో దీక్షలు చేయాలను కోవడం చాలా నాటకీయంగా కనబడుతోంది.
ఒకవైపు వారు అధిష్టానం పట్ల ప్రదర్శిస్తున్న భక్తి, వినయ విధేయతలు, మరోవైపు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేఖంగా వారు ప్రదర్శిస్తున్న ధిక్కార ధోరణి రెండూ చాలా అసంబద్దంగా, ఆహేతుకంగా ఉన్నాయి. వారు అధిష్టానానికి పూర్తి అనుకూలంగానో, లేక పూర్తి వ్యతిరేఖంగానో వ్యవహరిస్తూ ఉంటే వారిపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ ఉండేవి కావు. కానీ వారీవిధంగా వ్యవహరిస్తుండటం వలన వారినే కాదు, కాంగ్రెస్ అధిష్టానాన్నికూడా అనుమానించవలసి వస్తోంది.
కాంగ్రెస్ పెద్దలు చెపుతున్న ప్రకారం చూస్తే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి వచ్చే ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయడం ఖాయమనిపిస్తోంది. ఇక జైపాల్ రెడ్డి, దామోదర రాజనరసింహ వంటివారయితే ఫిబ్రవరి రెండవ వారానికి ముహూర్తం కూడా ఖరారు చేసేసారు. కేసీఆర్ అయితే పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టడం మొదలు రాష్ట్ర ఏర్పాటు వరకు తనకు అన్నీ తేదీలతో సహా చాలా ముందే తెలుసని తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానంతో సహా ఇంతమంది ఇంత నమ్మకంగా చెపుతున్నపుడు, రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషను వేసి ఉండి ఉంటే అది నమ్మ శక్యంగా, అర్ధవంతంగా ఉండేది. కానీ ఆయన, ఆయన సహచరులు జంతర్ మంతర్ దగ్గర కూర్చొని దీక్షలు చేసో లేక పాదయాత్రలు చేయడం ద్వారానో కేంద్రాన్ని ఏవిధంగా ఆపగలరు? ఆపలేరని తెలిసినప్పుడు వారి దీక్షలు, ర్యాలీల వలన లాభం ఏమిటి?
తనకు ఈవిధంగా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, యంపీలని, శాసనసభ్యులపై కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుపోగాఎందుకు వెనకేసుకు వస్తోంది? అని ఆలోచిస్తే నాలుగు కారణాలు కనపడుతున్నాయి.