తెలంగాణా బీజేపీ సభలో వెంకయ్య మిస్సింగ్
posted on Mar 12, 2014 7:45AM
బీజేపీ నిన్న హైదరాబాదులో నిర్వహించిన ‘తెలంగాణ ఆవిర్భావ, అభినందన' సభలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలందరూ పాల్గొన్నారు. కానీ బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కనబడలేదు. ఆయన ఏదో చాలా అర్జెంట్ పనిమీద బెంగళూరు వెళ్ళవలసి రావడంతో సభకు హాజరు కాలేకపోయారని ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నట్లు సమాచారం. షరా మామూలుగానే బండారు దత్తత్రేయతో సహా చిన్నా పెద్ద నేతలందరి ఫోటోలతో బ్యానర్లు, భారీ కటవుట్లు కూడా సభా ప్రాంగణంలో పెట్టబడ్డాయి. కానీ వాటిలో కూడా వెంకయ్య నాయుడు ఫోటో భూతద్దం వేసి వెతికినా ఎక్కడా కనబడలేదు. బహుశః ఆయన బెంగళూరు వెళుతూ వెళుతూ హైదరాబాదులో తన ఫోటోలేవీ ఉంచకుండా వెంటపట్టుకు పోయినందువల్లే బీజేపీ వాళ్ళు ఆయన ఫోటోలు అచ్చు వేయలేకపోయారేమో పాపం!
ఆ తరువాత సభలో ప్రసంగించిన వక్తలందరూ తమ పార్టీ తెలంగాణ కోసం ఫెవీకాల్ పూసుకొని ఒక ఇంచి కూడా పక్కకు జరగకుండా ఏవిధంగా మాట మీద నిలబడిందో, ఏవిధంగా తెలంగాణా ప్రజల కలలను సాకారం చేసిందో పూస గుచ్చినట్లు వివరించారు. తమ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ఝాన్సీ లక్ష్మీ భాయిలా తెలంగాణా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీతో ఏవిధంగా పోరాడి సాధించిందో కళ్ళకు కట్టినట్లు వివరించి, తెలంగాణా క్రెడిట్ మొత్తం ఆమె పద్దులోనే అంటే బీజేపీ పద్దులోనే వ్రాసేసుకొంటునట్లు ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా తెలియజేసారు. అయితే ఈ సందర్భంగా రాజ్యసభలో సీమాంధ్ర కోసం తాండ్ర పాపారాయుడిలా పోరాడేసి, చివరికి చేతులెత్తేసిన వెంకయ్య నాయుడిని తలుచుకోవడం అసందర్భంగా ఉంటుందని ఎవరూ కూడా తలుచుకోలేదు.
బహుశః త్వరలో సీమాంధ్రలో మోడీ నిర్వహించబోయే ఎన్నికల సభలో వెంకయ్య నాయుడి వీర పోరాటం గురించి ప్రజలకు కధలు కధలుగా వివరిస్తారేమో. అప్పటికి ఆయన కూడా ఆంధ్రాకు తిరిగి వచ్చేస్తారు గనుక ఆయన కూడా మోడీ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఆయన ఫోటోలు, బ్యానర్లు కూడా నిరభ్యంతరంగా పెట్టేసుకోవచ్చును. అయితే ఈ సారి తెలంగాణా-చిన్నమ్మ అండ్ కో ఆ సభకు రాకపోవచ్చును. అదేవిధంగా వారి ఫోటోలు బ్యానర్లు కూడా సభలో కనబడకపోవచ్చును. తెలంగాణాలో వెంకయ్య ఫోటోలు పెడితే జనాలు ఏవిధంగా రియాక్టవుతారో, సీమాంధ్రలో చిన్నమ్మ ఫొటోలకి, ప్రస్తావనకు అదేవిధంగా రియాక్టవడం ఖాయం గనుక ఏ ఎండకి ఆ గొడుగు లేదా ఏ ప్రాంతానికి ఆ మనుషులు, కటవుట్లు ఏర్పాటు చేసుకొని, సందర్భోచితమైన డైలాగులే పలకాల్సి ఉంటుంది. లేకుంటే అంతా రచ్చరచ్చయిపోద్ది మరి. ఆంధ్రాకి వెంకయ్య, తెలంగాణాకి చిన్నమ్మని బీజేపీ కేటాయించుకొంది గనుక వారు ఇకపై ఒకరి జోన్లో మరొకరు ఎంటరవరన్నమాట. బహుశః అందుకే నిన్న వెంకయ్య గారు అర్జెంటుగా బెంగుళూరు వెళ్ళిపోవలసి వచ్చిందేమో!పాపం!
ఇదంతా చూస్తే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే చాలా మొండి దైర్యం ఉందని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన తంతుని దగ్గరుండి చకచకా పూర్తి చేసి చేతులు దులుపుకొన్న జైరామ్ రమేష్ నే రెండు ప్రాంతాలలో పర్యటనకు పంపించి కాంగ్రెస్ నెగ్గుకు వస్తోంది కదా! ఆయన ‘కాంగ్రెస్ చర్మం’ కొంచెం మందం గనుక, సీమాంధ్రలో ఎవరు ఎన్ని తిట్లు తిడుతున్నాఅవి చెవిన పడనీయకుండా తన చుట్టూ భజన బృందం ఏర్పాటు చేసుకొని తిరుపతి నుండి వైజాగ్ వరకు కాళ్ళరిగేలా తెగ తిరిగేస్తున్నారు.
ఈ ఎన్నికల తరువాత తమ పార్టీ అధికారంలోకి రాలేక పోవచ్చననే అనుమానం ఉన్నపటికీ, అదేమీ బయటకి కనబడనీయకుండా రాగల పదేళ్లలో సీమంద్రాను తాము ఏవిధంగా మార్చేయబోతున్నామో ఆయన 3డీలో పిక్చర్ వేసి చూపిస్తూ ప్రజలను పడేస్తున్నారు. సీమాంధ్రలో క్లైమేట్ మరికొంత కొంచెం చల్లబడగానే రాజమాతని, యువరాజవారిని స్వయంగా తోడ్కొని వచ్చి సీమాంధ్ర ప్రజలను అనుగ్రహింప జేస్తానని ఆయన హామీ కూడా ఇస్తున్నారు. మరి వెంకయ్య అండ్ కో పార్టీ మోడీ మహాశయుడిని ఎప్పుడు తోడ్కొని వస్తారో ఎప్పుడు సీమాంధ్ర ప్రజలను అనుగ్రహిస్తారో...అని ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏమయినప్పటికీ సీమాంధ్ర ప్రజలకోసం ఇంతగా ఆరాటపడేవాళ్ళు దొరకడం వారి అదృష్టమే!