ఛలో చిక్బల్లాపూర్ అంటున్న చిరు?
posted on Mar 13, 2014 @ 12:46PM
కాంగ్రెస్ తురుపుముక్క మడత పడిపోయిందా? సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా కాడి భుజానికెత్తుకొన్నమెగాజీవిని వీరప్ప మొయిలీ కర్ణాటకకి లాక్కుపోనున్నారా? లేక పోతే మొయిలీని తప్పించేసి ఈ జీవే అక్కడి నుండి పోటీ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కన్నడ నాట వెబ్ సైట్లలో దొరుకుతున్నాయి. జగన్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడితే, తాను నిలబెడతానని కాంగ్రెస్ అధిష్టానం అడక్కుండానే తొడ కొట్టి భరోసా ఇచ్చిన చిరంజీవి అంటే టెన్ జనపథ్ యజమానికి భలే అభిమానం అట!
ఆ అభిమానంతోనే, ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి కావలసిన అంతటి మహావ్యక్తిని అంతకు ఏమాత్రం తీసిపోని పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టేసింది కాంగ్రెస్ అధిష్టాన దేవత. ఆ మెగాజీవి రాష్ట విభజన నిర్ణయాన్ని పైపైన వ్యతిరేకిస్తూ, లోలోన మాత్రం తమకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు రాజమాత, యువరాజులవారు ఇరువురూ కూడా ఆయన పట్ల చాలా ప్రసన్నం అయినప్పటికీ, సరిగ్గా అదే కారణంతో సీమాంధ్ర ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత గూడు కట్టుకొని ఉందని, అందువల్ల ఆయనకు ప్రచార భాధ్యతలు అప్పగించడం వలన రివర్స్ ఎఫ్ఫెక్ట్స్ కనబడతాయని, ఆయన ఇమేజుకి తోడూ యువరాజావారి ఇమేజు కూడా తోడయితే ఇక తిరుగే ఉండదని కాంగ్రెస్ నేతలే ఒకరి చెవులు మరొకరు పరపరా కోరికేసుకొంటున్నట్లు గాలి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒకసారి కమిట్ అయితే తన మాట తనే వినదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టమయింది గనుక ఆ జీవినే నమ్ముకొని ముందుకు వెళ్ళేలా ఉంది.
అయితే చిరంజీవి వచ్చి చెయ్యేస్తే చాలు మళ్ళీ నాకు యంపీ సీటు కన్ఫర్మ్ అని కేంద్ర మంత్రి వీరప్ప మోయిలీగారు ఆశలన్నీ మెగా జీవిపైనే పెట్టేసుకోన్నారుట. ఈ సారి కర్ణాటకలోని చిక్బల్లాపూరు నుండి పోటీ చేస్తున్న ఆయన ఈ చిరు జీవి అండతో ఎన్నికల వైతరిణిని దాటేయాలని ఆశడుతున్నట్లు కన్నడ వెబ్ సైట్లన్నీ కాకుల్లా గోలగోల చేసేస్తున్నాయి. అందుకు అవి మంచి రీజనింగ్ పాయింటు కూడా చెపుతున్నాయి.
చిరంజీవీ ఎందుకంటే.. చిక్బల్లాపూర్ లో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ వారికి చిరు గురించి ఇంకా చాలా గొప్ప అభిప్రాయాలే ఉన్నాయిట! వారు ఇంకా త్రేతాయుగంలోనే ఉండిపోయినట్లుగా నేటికీ ఆయన అభిమాన సంఘాలు, బ్లడ్ బ్యాంకులు, సమాజ సేవ, దానగుణం వగైరా సీనుల వద్దనే ఆగిపోవడంతో, విలీనమే మార్గం- కేంద్రమంత్రి పదవే లక్ష్యం, విభజనే ఆచరణీయం-ముఖ్యమంత్రి పదవే ప్రధానం వంటి తాజా కొటేషన్లను, డెవెలప్మెంట్లను బొత్తిగా గమనించలేకపోయారుట! అందువల్ల ఈ జీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ ఒడ్డుకు చేరుస్తారో తెలియక పోయినా, తనను మాత్రం తప్పకుండా ఒడ్డునపడేయగలడని మోయిలీగారి వీర నమ్మకంతో ఉన్నారు.
మళ్ళీ అవే వెబ్ సైట్లు కొన్ని చిరంజీవి తెలుగు ప్రజలకు హ్యండిచ్చినట్లే, మొయిలీ కూడా ఆయన హ్యండిచ్చేసి ఇంత సేఫ్ గా ఉన్న జోన్ లో తనే స్వయంగా ఎందుకు పోటీ చేయకూడదూ? అనే ఐడియాని అధిష్టానం మెదడులో నేర్పుగా జొప్పించేసినట్లు మరో నాలుగు ముక్కలు గీకి పడేశాయి. అది చూసి మోయిలీ షాకయిపోతే అధిష్టాన దేవత బలే ఇంప్రెస్స్ అయిపోయిందిట!
ఈ మెగాజీవిని కూడా కర్ణాటకలో పోటీకి దింపితే సినీ గ్లామర్, తెలుగువాళ్ళ ఓటు బ్యాంక్ అన్నీ కలిపేసుకొని లెక్క చూసుకొంటే కనీసం మరొక్క లోక్ సభ సీటు ఎక్సట్రాగా వచ్చినా యువరాజవారి పట్టాభిషేకానికి అదే పదివేలు అని భావిస్తోందిట. కనుక, ఏ జీవి మద్దతులేనిదే ఎన్నికలలో గెలవలేని మొయిలీని రాజ్యసభకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఆయనకు బదులు మెగాజీవినే చిక్భుల్లా పూర్ లో పోటీకి దింపితే బెటర్ కదాని ఆలోచిస్తున్నట్లు తాజా గాలివార్తలు వినిపిస్తున్నాయి. ఆయనను అక్కడ నుండి పోటీ చేయిస్తే పనిలోపనిగా ఆయన ఎన్నికల రధాన్ని ఓ సారి కర్ణాటకలో తెలుగు వాళ్ళున్న అన్ని ప్రాంతాలలో కూడా ఓ రౌండేయించేస్తే బెటరేమో.. అని అధిష్టాన దేవతలు ఆలోచిస్తున్నారుట.
మన మెగాజీవి మాత్రం పాలకొల్లు పరాభవం, ఉప ఎన్నికల్లో తిరుక్షవరం కంటే, చిక్బల్లాపూరు కి జంపై పోతే మళ్ళీ ఐదేళ్ళు తిరిగి చూసుకోక్కరలేదు అని లోలోన సంతోషపడిపోతున్నట్లు ఆయన మనసులో తొంగి చూడగల కొన్ని వెన్ సైట్లు కనిపెట్టిసాయి. మరి ఈ గాలి కబుర్లు అన్నీ వినివినీ మొయిలీ హార్ట్ అయిపోయారంటే అవరూ...పాపం మొయిలీ...