మెగా తమ్ముడు కనబడుట లేదు
posted on Apr 10, 2014 @ 12:29PM
రాజకీయాలలోకి దూకుతా...దుమ్ము దులుపుతా...తాట తీస్తా..అంటూ రంకెలు వేసి జనసేనతో జనాల మధ్యకు ఊడిపడిన పవన్ కళ్యాణ్, తన రెండవ (వైజాగ్) సభతోనే పార్టీకి మంగళ హారతి పాడేసి మళ్ళీ కనబడకుండా మాయమయిపోయాడు. “ఆయన సోదరజీవి ప్రజారాజ్యాన్ని దాదాపు ఓ ఏడాది పాటు నెట్టుకొచ్చి చివరికి కాంగ్రెస్ గూటికి చేర్చగలిగాడు. కానీ, ఈ మెగా తమ్ముడు మాత్రం ముచ్చటగా మూడో మీటింగ్ కూడా అవసరం లేకుండానే బోర్డు తిప్పేసి చేజేతులా పరువు తీసుకొన్నాడు” అని జనాభిప్రాయం. “కనీసం ఎన్నికలలో ఓ పది మందిని నిలబెట్టి ఓడిపోయినా ఇంత ఇదిగా ఉండేది కాదు కదాని” అనుకొంటున్నారు. అయితే కాకుల వంటి లోకులు అప్పుడు మాత్రం నోరు పారేసుకోరని గ్యారంటీ ఏమీ లేదు గనుకనే ఇంకా టైము, డబ్బు, శ్రమ ఎందుకని పవన్ బాబు బ్రేకులేసుకొని జనసేన బండిని గ్యారేజీలో పార్క్ చేసేసాడు. అయితే దానిని లోపల పెట్టక ముందే మళ్ళీ వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ దుమ్ము దులిపి, సర్వీసింగ్ చేయించి తప్పకుండా బయటకి తీస్తానని ఆయన హామీ కూడా ఇచ్చేరు.
‘ఈ లోగా మరో ఐదో పదో సినిమాలు తీసుకొని పదో పరకో పోగేసుకొంటూ, ఏవయినా కొత్త రచనలు కూడా మొదలుపెడితే బెటర్ కదా’ అని శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ‘రాజకీయాలలోకి వచ్చే దమ్ము, దైర్యం లేనప్పుడు అలా జగన్ గురించి కాంగ్రెస్ గురించి నోరు పారేసుకోవడం ఎందుకు, కొత్త శత్రువులను సృష్టించుకోవడం ఎందుకు? ఒకవేళ రేపు వారే అధికారంలోకి వస్తే తీరికగా బాధపడటం ఎందుకని’ కొందరు శ్రేయోభిలాషులు బాధ పడుతున్నారు.
ఆయన ఎన్నికల వేళా పనిగట్టుకొని పార్టీ పెట్టి, గుజరాత్ వెళ్లి మోడీకి దండం పెట్టి, అడగకుండానే తమ పార్టీలకే మద్దతు ప్రకటించినందుకు తెదేపా, బీజేపీలు చాలా సంతోషిస్తున్నపటికీ కనీసం తమ పార్టీలకి ఉచిత ఎన్నికల ప్రచారమయినా చేయకుండా ఎలా వచ్చాడో అలాగే మాయమయిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ‘ఇంత హడావుడి చేసిన తరువాత ఈ చిన్నసాయం చేసిపెట్టినా బాగుండేది కదా!’ అని సదరు పార్టీల నేతలు నిట్టూర్పులు విడుస్తున్నారు.
‘చేతిలో కత్తిలాంటి ఛానలొకటి, న్యూస్ పేపర్ ఒకటీ ఉంది గాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే మెగా ఫ్యాన్ల ధాటికి తమ ఫ్యాన్ తిరగడం కూడా కనా కష్టమయిపోయేది కదా!’ అనుకొంటూ జగన్ పార్టీ వాళ్ళు మెటికలు విరిచారు.
మొత్తం మీద పవన్ కళ్యాణ్ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేసుకోమని జనాలకి పర్మిషన్ కూడా ఇచ్చేసి వచ్చినంత వేగంగాను మాయమయిపోయారు. జనాలు మాత్రం “ఎవరో వస్తారని... ఏదో చేస్తారని...ఎదురు చూసి మోసపోకుమా..’ అనే పాత పాటనే మళ్ళీ పాడుకొంటూ ఎదురుగా కనబడుతున్న పాత పార్టీలలో కొత్తగా చేరిన పాత కాంగ్రెస్ నేతలకి ఓటేయాలా వద్దా... అని డైలేమాలో ఉన్నారు.