ఐదు సంతకాలు-పది చార్జ్ షీట్లు
posted on Apr 14, 2014 @ 3:16PM
వైకాపా తన అభ్యర్దులను కూడా ఇంకా ప్రకటించక ముందే, జగన్మోహన్ రెడ్డి తను చేయబోయే మొదటి ఐదు సంతకాల గురించి జనాలను ఒకటే ఊదరగొడుతూ, తను ముఖ్యమంత్రి అయిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. అంతే గాక సీమాంధ్రకు కొత్త రాజధాని ఏవిధంగా నిర్మించాలి, ఎవరిని కన్సల్టెంటుగా నియమించాలి వంటి విషయాల గురించి మాట్లాడుతూ, దానిపై ప్రజలలో కూడా ఆసక్తి, కొంత చర్చ జరిగేలా చేస్తూ ప్రజలందరూ వైకాపాకే ఓటేయబోతున్నరనే భావనను చాలా తెలివిగా వ్యాపింపజేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకొనేందుకు ఆకర్షణీయమయిన మ్యానిఫెస్టోలు ముద్రించి పంచిపెట్టడం సహజమే. అయితే జగన్ మ్యానిఫెస్టోలో గ్రామ స్థాయి నుండి రైల్వే జోన్, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో రైళ్ళు వంటి జాతీయ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలకు సైతం హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
విశాఖకు రైల్వేజోన్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వంటి డిమాండ్లు ఈనాటివి కావు. కానీ వాటికి ఇంతకాలంగా కేంద్రం నుండి అనుమతులు లేకనే ఏర్పడలేదు. అదేవిధంగా పోలవరం, చేవెళ్ళ, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకి జాతీయ హోదా వ్యవహారం కూడా చిరకాలంగా కేంద్రం వద్ద నాన్చబడిన తరువాత, రాష్ట్ర విభజన కారణంగా ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులను ప్రసన్నం చేసుకోవడానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టుకి జాతీయహోదా కల్పించింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణాలో ఓట్లు రాబట్టుకోవడానికి తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు చేవెళ్ళ-ప్రాణహితల అంశం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.
రాష్ట్ర విడిపోయిన తరువాత ఉద్యోగుల జీతాలకే కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంటే, ఊరికో విమానాశ్రయం, వీధికో మెట్రో రైలు అని శనగకాయలు పంచినట్లు జగన్ పంచిపెట్టేస్తుండటం చాలా హాస్యాస్పదం. అలాగని తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి హామీలు ఇవ్వడం లేదని కాదు. కానీ, జగన్ వారిరువురినీ మించిపోయారు. రాష్ట్రమంతటా ఎనిమిది లైన్ల రోడ్లు నిర్మించకపోయినా ప్రజలేమీ అనుకోరు కానీ, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముందు గుంతలు పడిన రోడ్లను తప్పకుండా బాగు చేయిస్తామని జగన్ హామీ ఇస్తే జనం తప్పకుండా నమ్ముతారు.
ఇక జగన్ ప్రస్తావించిన అంశాలలో మరో ఆసక్తికరమయిన అంశం ఏమిటంటే తమ పాలనలో హైకోర్టు, కాగ్‌లను కూడా భాగస్వాములను చేస్తామని చెప్పడం. జగన్ తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎన్నడూ కూడా కాగ్ సంస్థను పట్టించుకొన్న దాఖలాలు లేవు. అటువంటిది జగన్ తను అమలుచేయబోయే ప్రతీ అంశాన్ని ముందే కాగ్, హైకోర్టులకు నివేదించి వాటి అభిప్రాయలు తీసుకొన్న తరువాతనే ముందుకు వెళతామని, తద్వారా విమర్శలకు తావు లేని పారదర్శకమయిన పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నారు. హైకోర్టు మరియు కాగ్ రెంటికీ కూడా అవి నిర్దిష్టంగా నిర్వర్తించవలసిన బాధ్యతలు చాలానే ఉన్నాయి. వాటితోనే వాటికి తీరికలేనంతగా ఉన్నాయి. జిల్లా నుండి సుప్రీం కోర్టు వరకు ప్రతీ కోర్టులో వేలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగులో పడి ఉన్నసంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా కాగ్ దేశంలో ఉన్న వేలాది ప్రభుత్వ సంస్థల, అవి అమలు చేస్తున్న పధకాల పనితీరుని నిరంతరంగా పరిశీలిస్తుంటుంది. అటువంటి ఈ రెండు సంస్థల చేత తమ ప్రభుత్వం యొక్క రోజువారి కార్యక్రమాలను పర్యవేక్షింపజేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఆయన అపరికత్వతకు అద్దం పడుతోంది.
నిజానికి వైకాపా గనుక తిరుగులేని మెజార్టీ సాధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, ఆయన ఐదు సంతకాల మాటెలా ఉన్నపటికీ, ముందు తనపై ఉన్న పది చార్జ్ షీట్లను ఏవిధంగా ఉపసంహరింపజేసుకొనేందుకు, సీబీఐ, ఈడీల వద్ద పెండింగులో ఉన్న తన కేసులను తక్షణమే మూత పెట్టించేందుకు గట్టిగా ప్రయత్నించడం మాత్రం ఖాయం. అందుకే రాష్ట్ర విభజన జరుగుతున్న తరుణంలో కూడా ఆయన 30 యంపీ సీట్లు గురించే పదేపదే ప్రజలను కోరుతున్నారు. జగన్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నపటికీ, తానే మిగిలిన అందరికంటే పరిశుద్దుడునన్నట్లు మాట్లాడటం, ఎటువంటి పరిపాలనానుభావము లేని తాను మాత్రమే రాష్ట్రాన్ని ప్రగతిపధంలో నడిపించగలనని బల్లగుద్ది చెప్పడం విశేషమే.