వైజాగ్ సీటు వైకాపా ఖాతాలోనేనా?
posted on Apr 11, 2014 @ 11:07AM
దగ్గుబాటి దంపతులతో చంద్రబాబు వైరం ఈనాటిది కాదు. బహుశః అది ఎన్నటికీ సమసిపోదని పార్లమెంటు ప్రాంగణంలో యన్టీఆర్ విగ్రహ స్థాపన విషయంలో రుజువయింది, మళ్ళీ ఇప్పుడు పురందేశ్వరికి వైజాగ్ లోక్ సభ టికెట్ విషయంలో మరోమారు రుజువవుతోంది. తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా వైజాగ్ లోక్ సభ సీటు బీజేపీకి వెళ్ళడంతో, సహజంగానే అది సిటింగ్ యంపీ పురందేశ్వరికే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, ఆమెకు ఆ సీటు ఇవ్వకూడదని చంద్రబాబు గట్టిగా పట్టుబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ వైజాగ్ కాకపోతే విజయవాడ లేదా ఒంగోలు నుండయినా ఆమె పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ, బీజేపీకి దక్కిన వైజాగ్ సీటు నుండే ఆమె పోటీకి అభ్యంతరం తెలుపుతున్న చంద్రబాబు, తెదేపా కోటాలో ఉన్న ఆ రెండు సీట్లను ఆమెకు ఇచ్చేందుకు అంగీకరిస్తారని భావించలేము. పైగా ఆ రెండు సీట్లకు ఇప్పటికే తెదేపా అభ్యర్ధులను ఖరారు చేసేసారు కూడా. అందువల్ల పురందేశ్వరి తను ఎక్కడి నుండి పోటీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారిప్పుడు.
అక్కడ నుండి పోటీ చేసేందుకు సిద్దపడుతున్న సీమంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు అభ్యర్ధిత్వానికి చంద్రబాబు ఎటువంటి అభ్యంతరమూ చెప్పడం లేదని సమాచారం. అయితే పురందేశ్వరితో పోలిస్తే ఆయన చాలా బలహీనమయిన అభ్యర్ధి అని చెప్పవచ్చును.
ఒకవేళ ఆయనే పోటీలో నిలబడితే, జగన్ అక్కడ తమ పార్టీ తరపున తన తల్లి విజయమ్మను పోటీలో నిలబెట్టేందుకు, పురందేశ్వరే పోటీ చేస్తున్నట్లయితే అప్పుడు తన సోదరి షర్మిలను అక్కడ నుండి బరిలో దింపేందుకు సిద్దంగా ఉన్నారని తాజా సమాచారం. హరిబాబుని ఓడించేందుకు విజయమ్మ చాలని జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అందువల్ల తెదేపా, బీజేపీల సీమాంధ్ర అభ్యర్ధుల తుది జాబితాలు విడుదల కాగానే దానిని బట్టి వైకాపా అభ్యర్ధి ఎవరనేది తేలుతుంది.
కీలకమయిన ఈ ఎన్నికలలో చంద్రబాబు పంతాలకు పోయి, బలమయిన అభ్యర్ధి పురందేశ్వరికి అడ్డుపడి, ఆమె స్థానంలో హరిబాబుని పోటీ చేయిస్తే దానివలన ఆ పార్టీలకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైజాగ్ నుండి బీజేపీ తరపున హరిబాబే పోటీలోకి దిగాలని వైకాపా కోరుకోవడం సహజమే. ఒకవేళ ఆయనే పోటీలో దిగితే విజయమ్మకు నామినేషన్ వేయక ముందే సగం విజయం ఖరారు అయిపోయినట్లేనని వైకాపా నేతలు దృడంగా నమ్ముతున్నారు. మరి చంద్రబాబు ఈ సంగతి గ్రహించి పురందేశ్వరికి సహకరిస్తారో లేక తన పంతానికే పోయి వైజాగ్ సీటుని వైకాపా ఖాతాలో జమా చేయిస్తారనే సంగతి నేడో రేపో ఆ పార్టీలు తుది జాబితాలు ప్రకటించగానే తెలిసిపోతుంది.