విధ్వంస చక్రం తిప్పుతున్న అమెరికా
posted on Jan 20, 2015 @ 8:42PM
సృష్టి స్థితి లయ కారకుడు ఆ భగవంతుడేనని అందరం విశ్వసిస్తాము. కానీ ఈ కలియుగంలో ఆ పాత్ర అగ్ర రాజ్యమయిన అమెరికా పోషిస్తోందని చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేది ఆదేశమే. వారి వలన అపార ప్రాణ నష్టం జరగడానికీ అమెరికాయే కారణం. ఆ ఉగ్రవాదులు రెచ్చిపోయి అదుపు తప్పినప్పుడు వారిపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపించి మట్టుబెట్టి ప్రజలను రక్షించేది అమెరికానే. ఈ విద్వంస చక్రం నిరంతరం తిరుగుతూ ఉండేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.
అమెరికా చేతిలో స్టీరింగులా తిరుగుతున్న విద్వంస చక్రంలో ఉగ్రవాదులతో బాటు నిత్యం వేలాది మంది అమయాకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి అమెరికానే కారణం. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ ఇలా అనేక దేశాలలో రావణ కాష్టంలా రగులుతున్న మారణకాండకు అందుకు సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు నిలిచి ఉన్నాయి. అందుకోసం ప్రపంచ దేశాల ప్రజలే కాదు అమెరికా స్వయంగా తన సైనికులను, కోట్లాది డాలర్లను కూడా తృణ ప్రాయంగా సమర్పించుకోవడం విశేషం.
పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తుంటే, ఉగ్రవాదంపై పాక్ బహు చక్కగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏడు క్రమం తప్పకుండా భారీ నజరానాలు ఇస్తోంది. కానీ అమెరికా సైనికులు రాత్రికి రాత్రి హటాత్తుగా హెలికాఫ్టర్లలలో శాటిలైట్ వీడియో కెమెరాలు పెట్టుకొని మరీ వచ్చి లాడెన్ న్ని హతమారుస్తుంటే, ఆ తంతుని ఎక్కడో అమెరికాలో కూర్చొని వీడియోలో చూసి ఆనందించడం కేవలం అమెరికన్లకే చెల్లు. తను ఇంతకాలంగా వెతుకుతున్న బిన్ లాడెన్ కి పాకిస్తాన్ దేశమే ఆశ్రయం కల్పించినప్పటికీ అందుకు అమెరికా ఏమాత్రం నొచ్చుకోకపోవడం దాని విశాల హృదయానికి ఒక చక్కటి నిదర్శనం. కానీ మళ్ళీ తెల్లారగానే అదే పాకిస్తాన్ దేశంపై ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అంటూ తన డ్రోన్ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తుంటుంది.
ఇదంతా చూస్తుంటే అసలు అమెరికా ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చూస్తోందా? లేకపోతే ఎప్పటికప్పుడు తను తయారు చేసుకొనే అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకోవడానికే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా? అనే అనుమానం కలగడం సహజం.
లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను అణచివేశామని అమెరికా సంతోషపడేలోగానే అంతకంటే కిరాతకమయిన ఈ ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు పుట్టుకొచ్చి ఇరాక్, సిరియా దేశాలలో నిత్యం వందలమంది మహిళలను, పసి పిల్లలను, వృద్ధులను, యువకులను అతి కిరతాకంగా సాముహిక హత్యలు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు అగ్ర రాజ్యాల ప్రయత్నాలేవీ ఫలించకపోగా, వారి చర్యలతో ఉగ్రవాదులు మరింత ప్రతీకారేచ్చతో రగిలిపోతూ విదేశీయులను బందీలుగా పట్టుకొని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు.
ఇందుకు కూడా అమెరికానే ముందుగా నిందించవలసి ఉంటుంది. ఇరాక్ దేశంలో చమురు బావులను స్వంతం చేసుకొనేందుకు రసాయన, అణు బాంబులు ఉన్నాయనే వంకతో ఇరాక్ పై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ న్ని ఉరి తీసింది. సద్దాం హుస్సేన్ కూడా అతి కిరాతకుడే కావచ్చును. కానీ అతని భయంతోనే ఉగ్రవాదులెవరూ తలెత్తే సాహసం చేయలేకపోయారు. కానీ అమెరికా నిర్వాకం వలన ఇప్పుడు ఇరాక్ ఒక దిక్కులేని దేశంగా మారిపోయింది. ఇదే అదునుగా ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఇరాక్ దేశాన్ని క్రమ క్రమంగా తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటూ అక్కడి ప్రజలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తున్నారు.
వారిని కాపాడే శక్తి లేని నామ మాత్రపు ఇరాక్ ప్రభుత్వం అమెరికా అందిస్తున్న ఆయుధాలు, మందు గుండు, బాంబులు వంటి మారణాయుధాలు వారికి అందజేస్తూ మీ ప్రాణాలు మీరే కాపాడుకొమ్మని చేతులు ఎత్తేసింది. ఇటీవల ఇరాక్ లో దాదాపు 5000 మంది జనాభా ఉండే ఒక గ్రామాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టగా ప్రభుత్వం అందించిన ఆ ఆయుధాలతో అక్కడి ప్రజలు ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ అత్యాధునిక ఆయుధాలు కలిగిన వేలాదిమందితో కూడిన ఉగ్రవాద మూకలను తమ వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో ఎంతో సేపు నిలువరించడం కష్టం గనుక ఆ తరువాత ఏమి జరిగి ఉంటుందో తేలికగానే ఊహించుకావచ్చును.
ఈ మారణహోమానికి ఎప్పుడు తెరపడుతుందో? అసలు అంతమొందించడం సాధ్యమో కాదో అనే భయం కలుగుతోంది.