త్వరలో తెలంగాణాలో మరో తెలుగు దినపత్రిక
posted on Jan 8, 2015 @ 7:44PM
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విడిపోనంత వరకు కూడా రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూవచ్చేరు. కానీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టడం, రెడ్డి సామాజిక వర్గానికి బలమయిన కోట వంటి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో తునాతునకలయిపోవడంతో అంతవరకు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరి పరిస్థితి అకస్మాత్తుగా తలక్రిందులయిపోయింది. వారి సామాజిక వర్గానికే చెందిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ఉన్నప్పటికీ, అందులో ఉన్నవారే ఆయన ధోరణితో విసిగెత్తిపోయి ఒకరొకరుగా బయట పడుతుండటంతో వారు ఎటువైపు వెళ్ళాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర విభజన తరువాత తప్పకుండా ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందనే ఆలోచనతోనే తమకు మంచి బలం ఉన్న రాయలసీమను తెలంగాణాతో కలిపి రాయల తెలంగాణా ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చేరు. కానీ తెరాస నేతలు, తెలంగాణా ప్రజలు అందుకు గట్టిగా అభ్యంతరాలు చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రతిపాదన పక్కనపడేసి రాష్ట్రాన్ని ఆంద్ర, తెలంగాణాలుగా విభజించేసి చేతులు దులుపుకొంది. దానివల్ల కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారింది.
ఆంధ్రాలో ఆ వర్గానికి చెందినవారిని బీజేపీలోకి ఆకర్షించి వారి అండతో రాష్ట్రంలో బలపడాలని ఆ పార్టీ భావిస్తున్నందున వారికి బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. అయితే బీజేపీకి ఉన్న మతతత్వముద్ర కారణంగా నేటికీ ఆ పార్టీలో చేరేందుకు కొందరు వెనుకాడుతున్నారు. ఆంధ్రాలో నేతలు బీజేపీవైపు చూస్తున్నప్పటికీ, తెలంగాణాలో ఆ వర్గానికి చెందిన నేతలు మాత్రం ఎందుకో అసలు బీజేపీ వైపు కన్నెత్తి చూడటం లేదు.
ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు తమకున్న ఆ ప్రత్యేక గుర్తింపు నిలుపుకోవాలనే బలమయిన కోరికతో ఉన్నారు. తెలంగాణా రాజకీయాలలో తమ గొంతు బలంగా వినిపించాలనే ఉద్దేశ్యంతో వారిలో కొంతమంది కలిసి త్వరలో (ఉగాది నాటికి) ఒక తెలుగు దినపత్రికను తీసుకురాబోతున్నట్లు తాజా సమాచారం. అందుకోసం రూ.50 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో మూతపడిన ఒక పత్రిక కార్యాలయాన్ని అందులో యంత్రాలను అన్నిటినీ కొనుగోలు చేసి, పత్రిక రిజిస్ట్రేషన్ కార్యక్రమం వగైరా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టుని సంపాదకుడిగా ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణాలో బలంగా నిలద్రొక్కుకొనున్న నాలుగయిదు తెలుగు దిన పత్రికలతో పోటీపడి తట్టుకొని నిలబడవలసి ఉంటుంది.