ఆంధ్రా నుండి విద్యుత్ కొనుగోలుకు కేసీఆర్ కి అహం అడ్డువస్తోందా? లోకేష్
posted on Jan 10, 2015 @ 3:09PM
తెలంగాణా రాష్ట్రం నేటికీ విద్యుత్ కొరతతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో రామగుండం, నల్గొండ తదితర ప్రాంతాలలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల స్థాపనకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అది ఇంటికి నిప్పు అంటుకొన్నాక నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లేనని భావించవచ్చును. అందుకే రైతులను మరో మూడేళ్ళు ఆగమని చెపుతున్నారాయన.
తెలంగాణా ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ తీసుకొనే ఆలోచన మాత్రం చేయలేదు. తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదు కూడా.
ఒకవైపు విద్యుత్ లేక పంటలకు నీళ్ళు అందక రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కూడా కేసీఆర్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విద్యుత్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కేసీఆర్ కి అహం అడ్డు వస్తోందా? లేకపోతే ఆంధ్రా పాలకులు, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అకారణ ద్వేషం కారణంగా విద్యుత్ తీసుకొనేందుకు అయిష్టత చూపుతున్నారా? అనేది ఆయనకే తెలియాలి.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇస్తామని చెపుతున్నా స్వీకరించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా రావలసిన విద్యుత్ ఇవ్వకుండా కుట్రలు పన్నుతోందని ఎదురు దాడి చేస్తూ తన ప్రజలని మభ్యపెడుతూ అదే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం. కానీ దాని వలన తెలంగాణా ప్రజలకి లాభం కలిగి ఉండి ఉంటే అందరూ సంతోషించే వారు కానీ ఆయన వైఖరి వలన తెలంగాణా ప్రజలు, రైతులే అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నారనేది కాదనలేని సత్యం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ‘కేసీఆర్ & కో’ విద్యుత్ కొనుగోలు చేయకపోవడానికి కారణం ఏమిటి? అహం అడ్డు వస్తోందా? ఆయన అహానికి తెలంగాణా రాష్ట్రం బలయిపోతోంది,” అని నారా లోకేష్ ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.
కానీ అందుకు ఇంకా మరి కొన్ని ఇతర కారణాలు కూడా కనబడుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు చొరవ, కృషి, పట్టుదల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడటమే కాకుండా ఇప్పుడు తెలంగాణాకు కూడా విద్యుత్ సరఫరా చేయగల పరిస్థితికి చేరుకొంది. కానీ కేవలం కేసీఆర్ వైఖరి కారణంగానే తెలంగాణా రాష్ర్టంలో నేటికీ విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందిఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోవడం అంటే కేసీఆర్ తన వైఫల్యాన్ని తనే ఇంటి కప్పు మీదకు ఎక్కి మరీ ప్రకటించుకొన్నట్లవుతుంది. అది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరంగా మారవచ్చును. ప్రతిపక్షాల ముందు మరింత చులకన అయ్యే ప్రమాదం ఉంది.
పైగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసినట్లయితే ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న ఆ రాష్ట్రానికి దాని వలన ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆంద్ర ప్రభుత్వాన్ని పాలకులను ద్వేషిస్తున్న కేసీఆర్ అందుకు ఇష్టపడకపోయుండవచ్చును. అందుకే ఎక్కడో వందల కిమీ దూరంలో ఉన్ననైవేలీ, ఝాఝార్, ధబోల్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుండి విద్యుత్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు సుతరాము ఇష్టపడటంలేదు. అయితే దానివల్ల కూడా మళ్ళీ తెలంగాణా ప్రజలపైనే అదనపు భారం పడుతుంది. సుదూరప్రాంతాల నుండి తెలంగాణా విద్యుత్ సరఫరాకు అదనపు ఖర్చు ఎలాగూ ఉంటుంది. పైగా ఛత్తీస్ ఘర్ వంటి రాశ్రాల నుండి విద్యుత్ సరఫరా అవ్వాలంటే కొత్తగా ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా వేయవలసి ఉంటుంది. అందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయాలి. మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల గుండా అవి నిర్మించాల్సి ఉంటుంది. కనుక దానికి ఎన్ని సం.లు పడతాయో ఎవరికీ తెలియదు. కారణాలు ఏమయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్ల అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం జరుగుతుంది. అదే నారా లోకేష్ కూడా చెపుతున్నారు.