మళ్ళీ స్వయంకృషి?
posted on Jan 21, 2015 @ 1:56PM
తెలుగువారు అందరూ కూడా ఒకనాటి అందాల అద్బుత నటి విజయశాంతిని తమ మనిషే అనుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అందరూ అలాగే భావించి ఆదరించారు. కానీ వారిరువురూ రాజకీయాలలో చేరిన తరువాత విజయశాంతి తెలంగాణాకి, చిరంజీవి ఆంధ్రాకి మాత్రమే చెందినవారిగా మారిపోయారు. పోనీ రాజకీయాలలో వారు ఏమయినా రాణించారా అంటే అదీ లేదు.
రెండు మూడు పార్టీలు మారినా విజయశాంతి తలరాత మాత్రం మారలేదు. ఆమె పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోతే ఆమెకు రాఖీలు కట్టిన అన్నయ్య కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉందో, ఏమి చేస్తున్నారో కూడా జనాలకి తెలియదు. అందుకే రాములమ్మ మళ్ళీ తన కర్తవ్యం గుర్తు చేసుకొంటూ సినిమాల్లోకి వచ్చేస్తోంది. కాకపోతే ఇంతకాలం తను వ్యతిరేకించిన ఆంద్రోళ్ళ సినిమాలలోనే మనసు చంపుకొని నటించక తప్పడం లేదు ఆమెకు.
ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా స్వర్గీయ యన్టీఆర్ తెదేపా పెట్టిన 9నెలలోనే ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పగాలేనిదీ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో లక్షలాది అభిమానులున్న తను ప్రజారాజ్యం స్థాపిస్తే మూడు నెలలోనే ముఖ్యమంత్రి కాలేనా? అనే గొప్ప నమ్మకంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేరు చిరంజీవి. ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ట్ అయినప్పటికీ, ఆయన ప్రజారాజ్యం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో కంగుతిన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేసి కేంద్ర మంత్రి సంపాదించుకొని ‘సామాజిక న్యాయం’ కాపాడుకొన్నారు.
కానీ మళ్ళీ రాష్ట్ర విభజనతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. కనీసం అప్పుడయినా సరిగ్గా స్టెప్పులు వేయలేక తడబడటంతో ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలు మూడు నెలలో పోగొట్టుకొన్నారు. ముల్లు వచ్చి అరిటాకు మీదపడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా చిరిగేది అరిటాకే అన్నట్లు కాంగ్రెస్ చేసిన పాపానికి పాపం ఆ జీవి బలయిపోయాడు అన్యాయంగా.
అందుకు పరిహారంగా రాజ్యసభలో ఓ కుర్చీ ఖాళీ అయితే అందులో ఆయనను కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ హై కమాండ్ వ్రాసిచ్చిన స్క్రిప్ట్ లో డైలాగులు ఆయన ఎంత గొప్పగా చదివినా అందరూ వెక్కిరించే వారే కానీ చప్పట్లు కొట్టేవారు కనబడలేదు. క చేసేదేమీ లేక పడిపోయిన చోటనే ఉంగరం వెతుకొనే ప్రయత్నంలో ఆయన కూడా మళ్ళీ సినీపరిశ్రమకు వచ్చేసి జనాల కోరిక మేరకు తన 150 సినిమా కోసం మొహానికి రంగులు పులుముకొని మళ్ళీ జనాల ముందుకు వచ్చేస్తున్నారు.
ఆయనకి మరో ముప్పై ఏళ్ల తరువాత కూడా హీరో వేషాలు వేసే అవకాశాలు ఉండవచ్చునేమో కానీ ఇన్నేళ్ళ తరువాత వస్తున్న రాములమ్మకి మాత్రం అటువంటి అవకాశం ఉండబోదు కనుక గోపీచంద్-నయనతార జంటగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె తల్లి వేషానికో దేనికో సెటిల్ అయిపోక తప్పలేదుట. కానీ అది కూడా ఆ సినిమాలో చాలా ముఖ్యమయిన పాత్రే అని సరిపెట్టుకోక తప్పడంలేదు. ప్రస్తుతం ఏదో ఒక పాత్ర చేస్తున్నా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్ ఇవ్వగలిగితే ఆనక ఎప్పుడయినా అవకాశం వస్తే చిరంజీవితో కూడా మళ్ళీ స్టెప్పులు వేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు.