బీజేపీ చేసిన తప్పు టీడీపీ కూడా చేస్తోందా?
posted on Feb 11, 2015 @ 6:08PM
మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో బీజేపీకి పట్టిన గతి అందరూ చూశారు. ఘన విజయం సాధిస్తుందని అందరూ అనుకున్న బీజేపీ దారుణంగా ఓడిపోయింది. దానికి కారణం దారిన పోయే దానమ్మ కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే. ఢిల్లీ బీజేపీలో ఎంతోమంది అర్హులు ఉండగా, పార్టీ జెండాను మోసిన నాయకులుండగా పార్టీకి సంబంధం లేని కిరణ్ బేడీని సీన్‌లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. ఫలితం... బీజేపీ ఎవరూ ఊహించని ఘోర పరాజయాన్ని, అంతకు మించిన పరాభవాన్ని మూటగట్టుకుంది. మాంఛి దూకుడు మీద వున్న మోడీ బండికి పెద్ద కుదుపుతో బ్రేకు పడింది. మరి... ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకీ పట్టనుందా? అవును... అలా పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు... అలా అంటున్నది వేరే ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ జెండాను భుజాల మీద మోస్తున్న ఆ పార్టీ కార్యకర్తలే!
మార్చి 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలబడే వ్యక్తిని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏనాడో ఖరారు చేశారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆ వ్యక్తి వైపే గతంలో మొగ్గు చూపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు... చందు సాంబశివరావు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం రెండు దశాబ్దాలుగా పాటుపడిన వ్యక్తి. ఉన్నత విద్యావంతుడు. ఇండియాలోని ఇస్రోలో, అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకుడిగా కూడా ఎనలేని ఖ్యాతి సంపాదించుకున్న మేధావి. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఆప్తుడు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవించే వ్యక్తి. అలాంటి చందు సాంబశివరావు పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో అందరూ షాకయ్యే నిర్ణయాన్ని పార్టీ నాయకత్వం ప్రకటించింది.
గుంటూరు - కృష్ణాజిల్లాల ఉపాధ్యాయ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎ.ఎస్.రామకృష్ణను తెలుగుదేశం నాయకత్వం ప్రకటించింది. ఎ.ఎస్.రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాదు. సీపీఐ (ఎం) అనుబంధ సంస్థ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో)కి చెందిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో నాయకులే లేనట్టుగా ఇతర పార్టీకి చెందిన నాయకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక తెలుగుదేశం నాయకులు షాక్‌కి గురయ్యారు. పార్టీకి ఎంతో సేవ చేసిన చందు సాంబశివరావును కాదని, ఇతర పార్టీకి చెందిన ఎ.ఎస్.రామకృష్ణను తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి నిలపడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణ గెలుపుకు తాము కృషి చేసే ప్రసక్తే లేదని అంటున్నారు.
ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని, ఖచ్చితంగా ఓడిపోయే వ్యక్తిని తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టడానికి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రిగారు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) అభ్యర్థి లక్ష్మణరావు రంగంలో వున్నాడు. ఈ లక్ష్మణరావు సదరు మంత్రి గారికి మంచి మిత్రుడు. తన మిత్రుడు లక్ష్మణరావు గెలవాలంటే తెలుగుదేశం అభ్యర్థిగా సత్తాలేని వ్యక్తిని నిలపాలి. ఈ ప్లాన్‌తో ఏ రకంగా చక్రం తిప్పాడోగానీ తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణను బరిలో నిలిపేలా చేయడంలో మంత్రిగారు సక్సెస్ అయ్యాడు. మంత్రిగారి మిత్రుడు లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తూ వుంటాడు. అంతేకాదు, గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం వ్యతిరేకి కన్నా లక్ష్మీనారాయణకు జిగిరీ దోస్త్. అలాంటి వ్యక్తిని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున బలహీనుడైన అభ్యర్థిని నిలిపేలా చేసిన మంత్రిగారి తెలివితేటలు చూసి తెలుగుదేశం కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేసిన చందు సాంబశివరావుకు మొండిచెయ్యి చూపడంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందని వ్యక్తిని ఎందుకు పోటీలో నిలిపారో చెప్పాలని పార్టీ నాయకత్వం దగ్గర ఎంతగా మొత్తుకున్నా సమాధానం దొరకడం లేదు. మొన్ననే ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ చాలా సంతోషంగా వున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చందు సాంబశివరావును పోటీలో నిలిపితే కార్యకర్తల కృషితో విజయం సులభంగా దక్కేది. అయితే ఇప్పుడు వేరే పార్టీకి చెందిన వ్యక్తిని నిలపడంతో ఆ అవకాశం లేకుండా పోతోంది.
తెలుగుదేశం నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పొరపాటు నిర్ణయంగా చరిత్రలో నిలుస్తుందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కిరణ్ బేడీని రంగంలోకి దించి బీజేపీ ఎలాంటి చారిత్రక తప్పిదం చేసి పరాభవాన్ని మూటగట్టుకుందో, ఇప్పుడు గుంటూరు - కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అదే పరిస్థితిని చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా చిగురుపాటి వరప్రసాద్ పోటీలో నిలిచారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే వ్యక్తి. దాంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం పనిచేయలేదు. దాంతో ఆయన ఇప్పుడు యుటీఎఫ్ అభ్యర్థిగా వున్న లక్ష్మణరావు చేతిలోనే ఓడిపోయాడు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా జాక్టో రామకృష్ణకు అనుకూలంగా పనిచేయడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మణరావు చేతిలో జాక్టో రామకృష్ణ ఓడిపోతే ఆయనకి మద్దతు ఇచ్చి. విఫల ప్రయోగం చేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పరువు పోవడం ఖాయమని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరుతున్నారు.