ఉండవల్లి తప్పటడుగు వేయబోతున్నారా?
posted on Feb 12, 2015 @ 9:53PM
రాష్ట్ర విభజన సమయంలో ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన వారిలో కాంగ్రెస్ మాజీ యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు. కానీ రాష్ట్ర విభజన తరువాత చాలా మంది కాంగ్రెస్ నేతలలాగే ఆయన కూడా రాజకీయాల నుండి తప్పుకొన్నారు. మళ్ళీ వారితోబాటే ఆయన కూడా ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు కనుక ఉండవల్లి కూడా అటువైపు వెళతారని ప్రజలు భావించినప్పటికీ ఆయన వైకాపాలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లున్నారు. ఆయనను వైకాపాలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు కూడా వచ్చేయి.
ఆయన కూడా తను వైకాపాలో చేరబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలే ఇస్తున్నారు. తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులను ఆయన గురువారం కలిసి వారి అభిప్రాయలు తెలుసుకొన్నారు. తరువాత ఆయన మీడియాతో చెప్పిన ప్రతీ మాట కూడా వైకాపా గొంతును వినిపిస్తున్నట్లే ఉంది.
“చంద్రబాబు నాయుడు కేవలం ఒక్క శాతం ఓట్లు అధికంగా పొందడం చేతనే అధికారంలోకి రాగలిగారు. రాజధాని కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకొనేందుకు ప్రయత్నిస్తే వారి తరపున న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్దం. అవసరమయితే ఈ సమస్య గురించి పార్లమెంటులో కూడా లేవనెత్తుతాము. ఈ తొమ్మిది నెలల పాలనలో మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు” అని అన్నారు.
మోడీ ప్రభుత్వం గురించి ఆయన చెప్పిన ఆ ఒక్క ముక్క మాత్రమే వైకాపా వైఖరికి మ్యాచ్ అవడం లేదు. కానీ మోడీ విషయంలో వైకాపా త్వరలో వైఖరిని మార్చుకోబోతోందనే సంకేతం ఇస్తున్నట్లు భావించవచ్చును. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుండీ జగన్మోహన్ రెడ్డి తనను తాను, తన నేతలను, కార్యకర్తలను ఓదార్చుకొనే ప్రయత్నంలో తమ పార్టీ కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పుకొంటుంటారు. ఇప్పుడు అదే ముక్క ఉండవల్లి నోటి నుండి కూడా వెలువడింది. రాజధాని కోసం భూములు ఇవ్వదలచుకోని కొన్ని గ్రామాల రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన వారి తరపున న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉండవల్లి కూడా అదే చెపుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో సభ్యుడు కాదు. యంపీ కూడా కాదు. కానీ ఈ అంశం గురించి పార్లమెంటులో లేవనెత్తుతానని హామీ ఇస్తున్నారంటే అది ఎవరి ద్వారా వీలవుతుంది? అని ప్రశ్నించుకొంటే వైకాపా యంపీల ద్వారాననే సమాధానం వస్తుంది. అంటే నేడో రేపో ఆయన వైకాపాలో చేరడం తధ్యమని స్పష్టమవుతోంది. మంచి వక్త, రాజకీయ అనుభవజ్ఞుడు, మంచి జనాధారణ ఉన్న నేతగా పేరున్న ఉండవల్లి వైకాపాలో చేరితే ఆ పార్టీకి చాలా లాభమే. కానీ ఆయన రాజకీయ జీవితంలో అదొక పెద్ద పొరపాటు అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకో అందరికీ తెలుసు గనుక మళ్ళీ ప్రత్యేకంగా ఆ విషయాల గురించి ఏకరువు పెట్టనవసరం లేదు.