నిధుల కోసం నిలదీసేవరకు వేచి చూడటం ఎందుకు?
తెదేపా, బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా కొనసాగుతున్నప్పటికీ, రాష్ట్రానికి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేకహోదా, వివిధ ప్రాజెక్టుల మంజూరు, నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో తెదేపా నేతలు, మంత్రులు కేంద్రంపై కొంచెం గుర్రుగా ఉన్నారు. కానీ వారు స్నేహధర్మం పాటిస్తూ ఇంతకాలం మౌనంగా ఎదురుచూసారు. కానీ కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడంతో వారి ఆగ్రహం బయటపడింది.
కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో తెదేపా విఫలమయిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల వలన పార్టీపై, ప్రభుత్వంపై ప్రజలలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందనే భయంతోనే ఇంతకాలం పాటిస్తున్న మిత్రధర్మాన్ని కొంచెం పక్కనబెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు అందరూ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించక తప్పలేదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమయిన ప్రత్యమ్నాయ రాజకీయ పార్టీగా ఎదుగుదామని భావిస్తున్న బీజేపీపై కూడా ప్రజలలో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది గనుక కేంద్రం పునరాలోచించుకొని రాష్ట్రానికి తొలివిడతగా రూ.3, 000 కోట్లు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది, అంతే కాదు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
బహుశః ఈ సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ముందుగానే అంది ఉండవచ్చును. అందుకే ఆయన నిన్న ప్రధాని మోడీని ఆయన పాలనను ప్రసంశలతో ముంచెత్తారు. కానీ కేంద్రం ఇదేపని ఇంతకు ముందే చేసి ఉంటే అప్పుడు కేంద్రానికి, బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా గౌరవంగా ఉండేది. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీల అమలుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్రం పదేపదే చెపుతున్నప్పుడు, ప్రజలు, ప్రతిపక్షాలు చివరికి మిత్రపక్షం కూడా నిలదీసే పరిస్థితి కల్పించుకొనే బదులు వాటిని అమలుచేసేందుకు ప్రయత్నించి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషించేవారు. కానీ ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనలను పట్టించుకోకపోవడం వలన బీజేపీకి, తెదేపాకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, చివరికి ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా కొంత నష్టం జరిగింది. ఆ పార్టీలు, ప్రభుత్వాలు, వాటి అధినేతలపై ప్రజలలో కొన్ని అపోహలు ఏర్పడ్డాయి.
ఇటువంటి పరిణామాలు ఎవరికీ కూడా మంచిది కాదు. కనుక ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టుల విషయంలో ప్రతీసారి ఇదేవిధంగా ఒకరినొకరు విమర్శించుకోవడం, ఆ తరువాత నిధులు మంజూరు చేయడం, మళ్ళీ ప్రసంశలు కురిపించుకోవడం, ఆ తరువాత ఇరుపార్టీల నేతలు తమ మధ్య దృడమయిన స్నేహ సంబంధాలున్నాయంటూ ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ఇచ్చుకొంటూ నవ్వులపాలవడం కంటే ఇక ముందు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఆ చేసేపనులేవో అన్నీ సకాలంలో చేయగలిగితే వారికే మంచిది.