రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ దేనికయినా సిద్ధం
గత అనేక ఏళ్లుగా దేశంలో అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. కానీ యూపీయే ప్రభుత్వం దేనికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ, సరిగ్గా ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జే.డి.యు.) తమ యూపీయే కూటమిలో చేరేందుకు అంగీకరిస్తే, ఆయన కోరుకొన్నట్లుగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న ఆయన, రాహుల్ గాంధీని నెత్తినపెట్టుకొని తిరుగుతున్న యూపీయే కూటమిలో చేరడం వలన తన లక్ష్యం నెరవేరే అవకాశం ఉండదనే ఆలోచనతో వామపక్ష పార్టీలనన్నిటినీ పోగేసి థర్డ్ ఫ్రంట్ కూటమి కట్టేడు. అందుకే యూపీయే ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. లేకుంటే అప్పుడే ఇచ్చేసేదే. అంటే నితీష్ కుమార్ కి తన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలనే తపన కంటే తను ప్రధానమంత్రి అవ్వాలనే తపనే ఎక్కువని స్పష్టం అవుటోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన చేతిలో అధికారం ఉంది కనుక తనకు లాభం చేకూరుతుందంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఏ రాష్ట్రానికయినా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వెనుకాడదని అర్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా సరిగ్గా అలాగే ఆలోచించి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించేసింది. కానీ వ్రతం చెడ్డా ఫలం మాత్రం దక్కన్నట్లు ఆంద్రప్రదేశ్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మళ్ళీ రాష్ట్రంలో బలం పుంజుకొని నిలబడాలంటే, రాష్ట్ర విభజన చేసినందుకు తనపై ఆగ్రహంగా ఉన్న ప్రజలను మంచి చేసుకోవలసి ఉంటుందని గ్రహించి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతోంది. ఆవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని దానిని నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇరకాటంలో పెట్టవచ్చనే దురాలోచన కూడా ఇమిడి ఉంది.
ఒకప్పుడు రాష్ట్ర ప్రజల మనోభావాలను, వారి ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర విభజన చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుస్తున్నట్లు నటిస్తోంది. కానీ ఆంధ్రాకే కాదు తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఇవ్వవద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పార్లమెంటులో గట్టిగా చేస్తున్న వాదనలు వింటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో, ఇన్నేళ్ళుగా దానిని నెత్తిన పెట్టుకొన్న తెలుగు రాష్ట్రాల పట్ల దానికి ఎంత గొప్ప అభిప్రాయం ఉందో అర్ధమవుతోంది.
ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకి పారిశ్రామిక అభివృద్ధికి సబ్సీడీలు ఇచ్చినట్లయితే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకి నష్టం కలుగుతుందని, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోతాయని వీరప్ప మోయిలీ హెచ్చరిస్తున్నారు. మరి ఆనాడు కాంగ్రెస్ అధిష్టానం బీహార్ రాష్ట్రానికి ఏవిధంగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలనుకొంది?మరి అప్పుడు అడ్డురాని ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఇస్తేనే వస్తాయా? అయినా ఇచ్చేది పుచ్చుకొనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలయినప్పుడు, కందకు లేని కత్తిపీటకు ఎందుకన్నట్లు లోక్ సభలో కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా పొందలేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దురద?