తెదేపా, తెరాసలపై పురందేశ్వరి విమర్శలు
posted on Feb 16, 2015 @ 10:27AM
తెదేపా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ నేతృత్వంలో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసింది. ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తల కోసం ఆవిధంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం దేశంలో అదే మొదటిసారి. తన కార్యకర్తలకి మరింత సంరక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో రెండున్నర లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయం కూడా కల్పించింది. దానికి వచ్చిన మంచి స్పందన చూసి తెలంగాణాలో తెరాస కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియలో రెండు లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తోంది. దానికి కూడా చాలా మంచి స్పందనే వస్తోంది.
సామాన్య కార్యకర్తలకు అంత భారీ ఇన్స్యురెన్స్ కవరేజి తీసుకోవడం కష్టమే కనుక అది వారికి చాలా లబ్ది చేకూరుస్తుంది. పార్టీ కార్యకర్తలకు మేలు జరిగితే వారు కూడా చాలా సంతోషంగా పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తారు. అయితే ఈవిధంగా పరస్పర లబ్ది చేకూర్చే ఈ ఆలోచనని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అక్షేపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కొత్త సభ్యులను ఆకట్టుకొనేందుకే అటువంటి ఆలోచన చేస్తున్నాయని అన్నారు. కానీ బీజేపీకి మాత్రం అటువంటి అవసరం లేదని, పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ పరిపాలన గురించి వివరించి బీజేపీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని, తమ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు.
ప్రాంతీయ పార్టీలయిన తెదేపా, తెరాసలు సామాన్య ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇచ్చి ఉండవచ్చును. గానీ దానివలన ఆ కార్యకర్తలకి, పార్టీకి కూడా మేలు జరుగుతున్నప్పుడు అందులో తప్పు పట్టవలసింది ఏముంది? తాము బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ పరిపాలన గురించి వివరించి పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని పురందేశ్వరి చెపుతున్నారు. పార్టీలో సభ్యులను చేర్చుకొనేందుకు ఆమె ఒక పద్ధతి అనుసరిస్తే, తెదేపా, తెరాసలు మరొక పద్ధతి అనుసరించాయి. అందులో తప్పేమీ లేదు. ఏదో ఒకనాడు కాంగ్రెస్, బీజేపీలు కూడా తెదేపా, తెరాసల పద్ధతినే అనుసరించినా ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయ పార్టీలయినప్పటికీ ఇంతవరకు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చును. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చెప్పట్టిన తరువాత పార్టీకి సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా ఆత్యవసరమని ఆయన గట్టిగా నొక్కి చెప్పిన తరువాతనే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో బీజేపీ నేతలు అందుకు నడుం బిగించారు. ఆయన ఆంధ్రాలో 45 లక్షలు, తెలంగాణాలో30 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకోవాలని నిర్దేశించారు. కానీ కేవలం పార్టీ సిద్దాంతాలు, మోడీ పేరు చెప్పుకొని అన్ని లక్షల మందిని ఆకర్షించడం అసాధ్యమని బీజేపీ నేతలకి కూడా తెలుసు. అందుకే ఆయన నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని వారు ఆనాడే ఆయనకు చెప్పారు కూడా. అప్పటి నుండి రెండు రాష్ట్రాలలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఇంతవరకు వారు తమ లక్ష్యంలో ఎంత సాధించారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఆసంగతి ఒప్పుకోవడం కష్టం. ఆ రెండూ కూడా ప్రాంతీయ పార్టీలు కనుక ఇటువంటి ప్రయోగాలు చేస్తూ బీజేపీ కంటే సభ్యత్వ నమోదులో తెదేపా, తెరాసలు చాలా దూసుకుపోయాయి. కానీ తమకు ఆ ఆవకాశం లేకపోవడంతో సభ్యత్వ నమోదు ప్రక్రియలో నత్తనడకలు సాగుతున్నందునే పురందేశ్వరి ఆ విధంగా విమర్శిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.