కొత్త టైటిల్‌తో జగన్ ఓదార్పు యాత్ర
posted on Feb 17, 2015 8:46AM
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పాదయాత్రలను పరిచయం చేస్తే, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు పరిచయం చేసారు. అయితే ఆయన పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి కాగలిగేరు గానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఓదార్పు యాత్రల వలన ఆయనకు అధికారం దక్కకపోయినా వాటిని ఆయనే కనిపెట్టినందున వాటిపై పూర్తి ‘పేటెంట్ హక్కులు’ మాత్రం ఆయనకే స్వంతమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు.
సాధారణంగా ఎవరయినా మనిషిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వస్తుంటారు. కానీ మనిషి పోయిన పదేళ్ళ తరువాత వెళ్లి పోయినవాళ్ళని గుర్తుచేసి మరీ ఓదార్చడం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఏళ్ల తరబడి అలా ఓదార్చుకొంటూపోతే ఎవరిని ఎవరు ఎందుకు ఓదార్చుతున్నారనే కన్ఫ్యుజన్ కూడా ఏర్పడుతోంది. పైగా ఇంకా ఓదార్చవలసిన మనుషులు మిగిలున్నారా? అని వెర్రి జనాలు వెర్రి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. కానీ ‘ఓదార్పు యాత్రలు’ ఇంత పాపులర్ అయిన తరువాత జనాలు ఏదో అనుకొంటున్నారని ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకొంటూ కూర్చోలేరు గనుక వాటికి ఏదో ఒక కొత్త టైటిల్ తగిలించి మళ్ళీ యాత్రలకి బయలుదేరుతుంటారు సోదరసోదరీమణులు.
తెలంగాణా రాష్ట్రంలో తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ తను స్వయంగా వెళ్లి ఓదార్చకుండా షర్మిలమ్మని పంపించేరు ఎందుకో. ఆంధ్రా యాత్రలకి పెట్టిన పేరే తెలంగాణా యాత్రలకి పెడితే అక్కడి జనాలు నొచ్చుకొంటారనొ ఏమో ఆమె చేప్పట్టిన ఓదార్పు యాత్రలకి ‘పరామర్శ యాత్ర’ అని కొత్త టైటిల్ పెట్టేరు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఓదార్పు యాత్రలకి శంఖం పూరించేసారు. వాటికి ‘రైతు భరోసా యాత్రలు’ అని టైటిల్ ఫిక్స్ చేసారు. ఈనెల 22న హిందూపురం నుండి ఐదు రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఈ యాత్రలు చేస్తారు. రాష్ట్రంలో అప్పుల బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఆయన ఓదార్చబోతున్నారు. కేవలం ఓదార్చడంతో సరిపెట్టేయకుండా ఆచేత్తోనే వారి అప్పులు కూడా తీర్చేస్తే ఆ రైతు కుటుంబాలకు నిజమయిన ఊరటనిచ్చినవారవుతారు.
మరి ఆయన ఆపని చేస్తారో లేదో తెలియదు గానీ తనకు అధికారం దక్కకుండా జేసిన చంద్రబాబు నాయుడుపై, ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కడం మాత్రం గ్యారంటీ. తెదేపా ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయినందునే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని బోడిగుండుకి మోకాలికి ముడేసే ప్రయత్నం చేయవచ్చును.
రాష్ట్రంలో ఇప్పుడు అనేక డజన్ల న్యూస్ ఛానళ్ళు డేగ కళ్ళేసుకొని రాష్ట్రాన్ని నిత్యం జల్లెడ పడుతున్నాయి. కానీ వారెవరికీ కనబడని రైతుల ఆత్మహత్యలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనబడటం గొప్ప విషయమే. ఆర్ధిక సమస్యల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లయితే దానిని దాచిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినా మీడియా ఊరుకోదు. ఏమయినప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే అది అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన విషయమే. కనుక జగన్మోహన్ రెడ్డి తన వద్ద ఉన్న ఆ సమాచారాన్ని ఇతర మీడియాకి కూడా అందజేస్తే వారు కూడా ఆ విషయాన్ని దృవీకరించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తారు.
ఇదివరకు తన తండ్రి మరణించినప్పుడు అనేక వేలమంది గుండెలు పగిలి చనిపోయారని చెప్పుకొని ఓదార్పు యాత్రలు చేసుకొని పార్టీని బలపరుచుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా యాత్రలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. కానీ తెలంగాణా రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోని జగనన్న కేవలం ఆంధ్రా రైతులనే ఎందుకు ఓదార్చాలనుకొంటున్నారో అనే ప్రశ్నకు సమాధానం తెలిసినవారికి ఈ యాత్రల పరమార్ధం ఏమిటో కూడా తెలిసే ఉంటుంది.