హైదరాబాద్ మెట్రోకి మళ్ళీ బ్రేకులా?
posted on Feb 14, 2015 @ 2:59PM
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్న యల్.యండ్.టి. సంస్థ ఆమధ్య ఒకసారి ఈ ప్రాజెక్టు వలన తమకు లాభం లేదని, తెలంగాణా ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రాజెక్టు నుండి తాము తప్పుకొంటామని లేఖ వ్రాసినప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో చర్చలు జరిపిన తరువాత సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, అనుకొన్న సమయానికే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఆ సందర్భంగా కేసీఆర్ సూచించిన కొన్ని మార్పులకు వారు అంగీకరిస్తున్నట్లే మాట్లాడారు. దానితో సమస్యలన్నీ పరిష్కారమయిపోయాయనే అందరూ భావించారు. కానీ కదా మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ సూచించిన మార్పుల కోసం అధనంగా మరో రూ.2200 కోట్లు వ్యయం అవుతుందని యల్.యండ్.టి. సంస్థ “ప్రాధమిక అంచనా”లను ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించినట్లు తాజా సమాచారం. ఈ అంచనాలు కార్య రూపం దాల్చేసరికి మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంటుందని వేరే చెప్పానవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.6000 కోట్లు ఖర్చు చేసిన యల్.యండ్.టి. సంస్థ ఇప్పుడు మరో రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడటం లేదు. కనుక ముందే ఒప్పుకొన్నట్లు ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని యల్.యండ్.టి. సంస్థ కోరుతున్నట్లు తెలుస్తోంది.
కేవలం సామాజిక బాధ్యతగానే ప్రపంచంలో వివిధ దేశాలు మెట్రో రైల్ నిర్వహిస్తున్నాయి తప్ప మెట్రో రైల్ నిర్వహణ లాభదాయకం కాదని మెట్రో గురు శ్రీధరన్ ఇదివరకే తేల్చి చెప్పారు. యల్.యండ్.టి. సంస్థ కూడా ఇదివరకే ఆ సంగతి కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది. అటువంటప్పుడు మరో రూ.2200 కోట్లు పెట్టుబడి దానిపై పెట్టడానికి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
ఈ భారీ పెట్టుబడి సమస్య గురించి తెలంగాణా ప్రభుత్వం, యల్.యండ్.టి. సంస్థ ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతుంటే, కొత్తగా మరొక సమస్య కూడా వెలుగులోకి వచ్చింది. ఇదివరకు యల్.యండ్.టి. సంస్థ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకొంటామని తెలుపుతూ తెలంగాణా ప్రభుత్వానికి లేఖ వ్రాసినప్పుడు, ఇందులో ఇమిడిఉన్న కొన్ని సాంకేతిక సమస్యలని, ఇబ్బందులను అధిగమించేందుకు, మోడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకువస్తూ చట్ట సవరణ చేసింది. దానివల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో తెలియదు గానీ, ఆ చట్టంలో “ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం-నిర్వహణ” అనే పద్దతి గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో అదే పద్దతిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై యల్.యండ్.టి. సంస్థకి, దానిపై రూ.6000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పటికీ ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా పోయాయి. కనుక చట్టసవరణ చేసి ఈ లోపాన్ని సరిదిద్దమని యల్.యండ్.టి. సంస్థ కేంద్రానికి మోర పెట్టుకొన్నప్పటికీ అటునుండి ఇంతవరకు స్పందన లేకపోవడంతో చాలా ఆందోళన చెందుతోంది.
అయితే నేడు కాకపోతే రేపయినా చట్టసవరణ జరిగే అవకాశం ఉంది. కానీ మలివిడత ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన రూ.2200 కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారు? ఎప్పుడు పెడతారు? అసలు పెట్టుబడి పెడతారా లేదా? అనే ప్రశ్నలకు జవాబు దొరికితే గానీ ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలు ఎక్కేలాలేదు. ఇంతవరకు వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపితే చాలా నష్టమే కాకుండా అది ప్రభుత్వానికి, యల్.యండ్.టి. సంస్థకి కూడా తీరని అప్రదిష్ట కలిగిస్తుంది. అలాగని ముందుకు వెళ్ళాలన్నా చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. మరి తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.