Read more!

ప్రవక్త పరిమళించిన రోజు!!

 

ప్రవక్త పరిమళించిన రోజు!!

 

హిందూ మతంలో ధర్మాన్ని భోదించే గురువులు ఎందరో. అలా ముస్లిం మతంలో దేవుని వాక్కును సకల జనుల వినిపించడానికి సాక్షాత్తు ఆ అల్లాహ్ ఎన్నుకున్న చివరి వాడు మహమ్మద్ ప్రవక్త అన్నది ఇస్లాం మతస్తుల  నమ్మకం. ఇస్లాం మతస్తులు మహమ్మద్ ప్రవక్తను ఇస్లాం మాత స్థాపకునిగా భావిస్తారు కానీ ఇస్లాం మాత స్థాపన ఆదమ్ ప్రవక్తతో మొదలయ్యింది. తరువాత మహమ్మద్ ప్రవక్తతో ఈ ఇస్లాం మతంలో  ప్రవక్తల పరంపర ముగిసిందని చెప్పవచ్చు. 

ఇకపోతే మిలాద్-ఉన్-నబి ని ముహమ్మద్ ప్రవక్త జన్మదినంగా ఇస్లాం మతస్తులు జరుపుకుంటారు. ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం క్యాలెండర్ ప్రకారం క్రీ.శ 571లో ఆల్-అవ్వాల్ నెలలో  12 వ రోజున జన్మించాడని, ఆయన మీద భక్తితో, గౌరవంతో సకల ఇస్లాం మతస్తులు ఆరోజును మిలాద్-ఉన్-నబి గా జరుపుకుంటారని సారాంశం.

ప్రవక్త సర్వ మానవాళికి సందేశాన్ని ఇచ్చిన దయాస్వరూపుడు. ఆయన అనాథ బాలుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి, మక్కా నుండి గెంటివేయబడి, తరువాత మదీనాకు వలస వెళ్లి అక్కడ తన నలభై సంవత్సరాల వయసులో  ధ్యానం చేస్తుండగా అల్లాహ్ దయ వల్ల ఆయన దివ్యదృష్టిని పొందాడు. ఆ తరువాత తాను పొందిన జ్ఞానాన్ని సర్వ మానవాళికి ప్రవచనలుగా భోదించడం మొదలు పెట్టాడు. అవే ఖురాన్ లో పొందుపరచబడి ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే, ప్రతి నిత్యం పఠించి, అందులో ఉన్న విషయాలను జీవితంలో ఆచరించడానికి మూలమైంది.

ముహమ్మద్ ప్రవక్త తాను తెలుసుకున్న ధర్మాన్ని, మతపర కర్తవ్యాన్ని వ్యాప్తి చేస్తూ, దైవ సందేశాలను ప్రజలకు ఉపదేశిస్తూ, కఠోర ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన విడనాడడం, ప్రళయదినం పై విశ్వాసం, విశ్వాసుల ప్రథమకర్తవ్యమని బోధించాడు. అతను అరబ్బులకు తెలిసిన ఇతర రెండూ ఏకేశ్వరోపాసక మతములు, జుడాయిజము (యూదమతము) ను కానీ క్రైస్తవ మతమును గానీ పూర్తిగా తిరస్కరించలేదు.

 అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఒకటే ఏ మతంలోనూ దేవుడి కృపకు పాత్రుడైన ఎవరు కూడా ఇతర మతాలను, మతస్థులను, వారి ఆచారాలను ఎప్పుడూ విమర్శించలేదు, వారిని తప్పు పట్టలేదు. 

ఇకపోతే ఇబ్రాహీం ప్రవక్త అవలంబించిన ఈ మతముల చివరి మెట్టైన ఇస్లాం మతమును ప్రకటిస్తున్నానని ముహమ్మద్ ప్రవక్త యావత్ ప్రపంచానికి చాటి చెప్పాడు. అతి తక్కువ సమయంలోనే అనేక మంది విశ్వాసం పొందిననూ విగ్రహారాధనావలంబీకులైన అరబ్ తెగల ద్వేషాన్ని తప్పించుకొనుటకు, తాత్కాలికంగా 622లో మక్కా నుండి వలసపోయి తన సహచరులతో కలసి ఇప్పుడు మదీనాఅని పిలవబడే యస్రీన్ లో స్థిరపడినాడు. ఇక్కడ ఆయన తొలి ముస్లిం సముదాయము స్థాపించి దానికి నాయకుడయ్యాడు. తరువాత అరబ్బు జాతిలో ఖురేషి తెగ వారికి , మదీనాకు చెందిన వారికి మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మద్‌ , అతని అనుచరులు విజయం సాధించారు. ఈ పోరాటములో సంపాదించిన యుద్ధ ప్రావీణ్యాణ్ణి ఇతర అరేబియా పాగన్ తెగలను జయించడానికి ఉపయోగించారు. మహమ్మద్‌ చనిపోయే నాటికి అరేబియా ద్వీపకల్పమును సమైక్యము చేసి ఉత్తరమున సిరియా , పాలస్తీనా ప్రాంతములలో ఇస్లాంను వ్యాపింపజేశాడు.

ముహమ్మద్‌ తర్వాత వచ్చిన ఖలీఫాల నేతృత్వములో ఇస్లామీయ సామ్రాజ్యము పాలస్తీనా, సిరియా, ఇరాక్ (మెసపొటేమియా), ఇరాన్, ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా, , స్పెయిన్ లకు వ్యాపించింది. ఈయన తరువాత జరిగిన దండయాత్రలు, ముస్లింలు , ముస్లిమేతరుల మధ్య వర్తక సంబంధాలు, మతప్రచారణా కార్యకలాపాలు మహమ్మద్ ప్రవచించిన మతాన్ని భూమి నలుమూలలా వ్యాప్తి చెందడానికి దోహదపడ్డాయి.

ఇలా ప్రవక్త స్థాపించిన ఇస్లామిక్ సామ్రాజ్యం అన్ని దేశాలలో విస్తరించి, అన్ని చోట్లా అల్లాహ్ నామాన్ని ఉచ్చరించేలా చేశాయి. ఇకపోతే ప్రవక్త తన ప్రవచనాలతో ఎన్నడూ ఎవరినీ ఎలాంటి విమర్శలు చేయలేదు, లింగ బేధాన్ని చూపిస్తూ మహిళలను అణచాలని చెప్పలేదు. 

కాలానుగుణంగా కొందరు తమకు నచ్చిన విషయాలను జోడించుకుంటూ కొన్ని విషయాల స్వరూపాన్ని మర్చివేశారు, ఇలాంటివి అన్ని మతలలోనూ ఉన్నాయనే విషయాన్ని గ్రహించాలి.

ఏది ఏమైనా హిందూ-ముస్లిం భాయి, భాయి అనుకునే దేశం మనది. కాబట్టి  సోదర, సోదరీమణులకు మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు. 

◆ వెంకటేష్ పువ్వాడ