Read more!

జీవితం గురించి యోగ ఏమి చెబుతుంది?

 

జీవితం గురించి యోగ ఏమి చెబుతుంది?

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా॥

తిండిపోతుకు ఈ యోగం సాధ్యం కాదు. మరీ ఉపవాసాలు చేసేవారికి యోగం కుదరదు. ఎక్కువ నిద్రించేవాడికి, నిద్ర మాని జాగరణ చేసేవాడికి కూడా యోగసాధన అసాధ్యం.

కాబట్టి సర్వకర్మలలో మితాన్ని పాటించేవాడికే యోగం సిద్ధిస్తుంది. యోగం సిద్దించినప్పుడే దుఃఖం నశిస్తుంది. భగవద్గీతలోని ఈ శ్లోకం  యోగ ప్రాధాన్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా వివరిస్తుంది.

ఆలోచనల నియంత్రణ మనిషి వికాసానికి రాజమార్గం వంటిది అని మనకు తెలుసు. ఆలోచనల నియంత్రణ యోగశాస్త్రంలో ఒక ప్రధానాంశం. అయితే యోగాభ్యాసం ద్వారా ఆలోచనలను నియంత్రించాలని అనుకునేవారు మౌలికంగా అవలంబించి, ఆకళింపు చేసుకోవాల్సిన లక్షణాలను భగవద్గీత ప్రతిపాదిస్తోంది.

సాధనకు మూలం ఆహార నియమం. సరైన ఆహారం, మితంగా, సరిపోయినంత భుజించాలి. సాత్వికాహారం చక్కగా నమిలి మింగటం వల్ల శరీరం రోగరహితం అవుతుందన్నది ఆరోగ్యశాస్త్రంలో ప్రధాన సూత్రం. రోగరహితమైన శరీరం నిర్మలమైన ఆలోచనలకు ఆలవాలం. అలాగే సరైన వేళలో పడుకుని తెల్లవారే నిద్ర లేవటం వల్ల సరిపడ విశ్రాంతి శరీరానికి లభిస్తుంది. అంటే క్రమబద్ధమైన జీవితం గడపటం యోగసాధనకు మొదటి మెట్టు అన్నమాట.

 ఒకప్పుడు 'గూట్లో దీపం. నోట్లో ముద్ద' అన్న సామెత చెప్పారు. అంటే, దీపాలు పెట్టే వేళకు ఆహారం భుజించేయాలి అన్నమాట. త్వరగా నిద్రించి సూర్యోదయానికి ముందే లేవాలన్నమాట. కానీ ఆధునిక జీవన విధానంలో క్రమబద్ధమైన జీవితానికి తావు లేదు. రాత్రింబవళ్ళు చదివితే కానీ మార్కులు సరిగ్గా రావన్న ఆత్రానికి డే అండ్ నైట్ క్రికెట్ పోటీలు, 24 గంటల టీవీ ఛానళ్లు ఇంకా ఇతర అనేకాంశాలు తోడై వ్యక్తికి రోజులో ఏ పని ఎప్పుడు చేస్తాడో సరిగ్గా నిర్ణయించుకోలేని పరిస్థితిని ఏర్పరుస్తున్నాయి. 'షిఫ్టు డ్యూటీ'లు, రాత్రంతా మేల్కోవాల్సి వచ్చే కాల్ సెంటర్ ఉద్యోగాలు, అవసరమైతే వారం పాటు నిద్రాహారాలు మాని డెడ్లైన్లో పని పూర్తి చేయాల్సిన కంప్యూటర్ ఉద్యోగాలు.... ఇలా ఒకటేమిటి, ప్రతి ఒక్క అంశం జీవితంలో 'క్రమబద్ధత’ అన్నదానికి తావు లేకుండా చేస్తున్నాయి.

యోగసాధనకు మౌలికంగా కొన్ని సూత్రాలను పాటించటం తప్పనిసరి.

యోగశాస్త్రం ఆరంభంలోనే ఏకాగ్రసాధనకు అడ్డు వచ్చే తొమ్మిది కారణాలను పొందుపరచటం కనిపిస్తుంది. అవి 

1. వ్యాధి, 2. బద్ధకం, 3. సంశయం, 4. యోగ సాధనకు తగ్గ మానసికస్థాయి లేకపోవటం, 5. నిరుత్సాహం, 6. విషయచింతన, 7. సరైన విజ్ఞానం లేకపోవటం, భ్రమలలో ఉండటం, 8. రకరకాల ఆలోచనలు, సందిగ్ధాలు ముసురుకోవటం, 9. మానసికచంచలత్వం.

సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ధ్యానంలో ఉంటారు కానీ చుట్టూ జరిగేవన్నీ చూస్తూనే ఉంటారు. పూజలో ఉంటారు కానీ ప్రతి విషయాన్నీ గమనిస్తూ ఉంటారు. పుస్తకం ఎదురుగా ఉంటుంది. కళ్లు అక్షరాల వెంబడి పరుగెత్తుతూంటాయి. కానీ మెదడు వాటిని గ్రహించదు. మన మాటలు వింటూనే ఉంటారు. కానీ ఎక్కడో ఉన్నట్టుంటారు. ఎంతగా ప్రయత్నించినా వారి మనసు ఒక చోట స్థిరంగా ఉండదు. ఒక విషయంపై స్థిరంగా నిలవదు. ఇటువంటి చంచల మనస్కులకు, ఓ వారమో, రెండు వారాలో ప్రత్యేక తరగతులలో శిక్షణనివ్వటం వల్ల ఫలితం ఉండదు. వీరికే కాదు, ఎవరికైనా ఏదైనా ఫలితం ఇవ్వాలంటే, క్రమం తప్పకుండా నిరంతరం అభ్యాసం చేస్తూండాలి ఇదీ యోగా చెప్పే విషయం.

                                       ◆నిశ్శబ్ద.