Read more!

మనిషిని పతనావస్థలోకి తోసేవి ఏమిటి?

 

మనిషిని పతనావస్థలోకి తోసేవి ఏమిటి?

మనిషిని అధమ స్థితికి లాగేసేవి మనిషిలో ఉన్న ఇంద్రియాల కోర్కెలు. వాటి గురించి ఎంత చెప్పుకున్నా వాటిని అడుపులో పెట్టుకోకపోతే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయో చరిత్రలోకి చూస్తే తెలుస్తుంది. గీతలో కృష్ణుడు ఇలా అంటాడు…

యతో యతో నిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్ తతస్తతో నియమ్యై తత్ ఆత్మన్యేవ వశం నయేత్

స్వాభావికంగా చంచలం, అస్థిరం అయిన మనస్సు ఎప్పుడెప్పుడు లక్ష్యాన్ని వదిలి విషయ వస్తువులవైపు పరుగిడుతుందో, అప్పుడప్పుడు దానిని మళ్ళీ లక్ష్యం వైపు నిలపాలి.

మానవజీవితమే ఒక 'మహాభారతం' అంటారు పెద్దలు. మహాభారతం మంచి చెడుల నడుమ ఘర్షణను ప్రతిబింబిస్తుంది. అంటే, మనిషి జీవితంలో నిత్యం మంచికీ, చెడుకూ నడుమ సంఘర్షణ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ ఘర్షణలో మనకు మార్గదర్శనం చేసి సక్రమమైన బాట వైపు పయనించేట్టు చేస్తుంది భగవద్గీత. అందుకే అధ్యాత్మికంలో భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యం ఉంది.

మనిషి ఓ లక్ష్యం ఏర్పరచుకుంటాడు. కానీ ఆ లక్ష్యసాధనకు ఉపక్రమించినప్పటి నుంచీ అడుగడుగునా అనేక అవాంతరాలు ఎదురవుతాయి. అనేక ఆకర్షణలు దారి తప్పించాలని చూస్తాయి. వాటన్నిటినీ మించి లక్ష్యం సాధించాలంటే మనస్సును అదుపులో ఉంచుకోవాలి. మనస్సు అదుపు తప్పుతుంది. ఇష్టం వచ్చిన దిశలో, ఇష్టం వచ్చినట్టు పరుగెత్తటం మనస్సు లక్షణం. అందుకే స్వాభావికంగా మనస్సు చంచలం, అస్థిరం అంటుంది భగవద్గీత.

'రామాయణం'లో సీతాదేవి బంగారు లేడిని చూసి ఆశపడింది. ఆ లేడిని ప్రాణాలతో కాకపోతే కనీసం చంపైనా తీసుకురమ్మంది. అప్పుడు దాని బంగారు చర్మంపై తామిద్దరూ కూర్చోవచ్చని రాముడిని బతిమలాడింది. అయితే సీతకు అంతరాంతరాలలో తన కోరిక అనర్థదాయకమని, సర్వం త్యాగం చేసి తాపసుల్లా పర్ణశాలలో బ్రతకాల్సిన తాము బంగారు లేడిని ఆశించటం అంటే లక్ష్యం నుంచి దారి తప్పటమనీ తెలుసు. అందుకే 'కామవృత్తమిదం రౌద్రం స్త్రీణామసదృశం మతమ్' అంటుంది. స్త్రీలకు సమంజసం కాని హింసాత్మకమైంది నా ఆలోచన. కానీ బంగారు లేడిని సాధించాలన్న కోరిక నా స్వాభావిక చిత్తవృత్తిని నిరోధిస్తోంది' అంటున్నదన్నమాట సీత. రాముడు సైతం ఇది రాక్షసమాయ అని తెలిసీ, ఆ లేడి వేటకు వెళ్తాడు. అంటే, ఒక్కసారి మనస్సులోకి ఏదైనా కోరిక కానీ, ఆలోచనకానీ ప్రవేశిస్తే, దాన్ని ఆరంభంలోనే అణచేయకపోతే అది మనిషి విచక్షణను కప్పేస్తుందన్నమాట.

మహామహాఋషులు లక్ష్యసాధన కోసం తపస్సు ఆరంభిస్తారు. వాళ్ళు తపస్సు ఆరంభించి, ఒక దశకు చేరుకోగానే ఇంద్రుడికి కంగారు పెరుగుతుంది. వెంటనే వర్షాలు కురిపిస్తాడు. ఎండను మండిస్తాడు. తుఫానులు సృష్టిస్తాడు. వీటికి కూడా చలించక పోతే రంభ, ఊర్వశి, మేనకలను పంపిస్తాడు. ఎటువంటి కష్టనష్టాలకు తట్టుకుని కూడా తపస్సును కొనసాగిస్తున్నవారు సైతం, ఇంద్రుడు పంపిన సుందరీమణుల మోహాన్ని తట్టుకుని నిలబడటం కష్టం. విశ్వామిత్రుడు ఇందుకు మంచి ఉదాహరణ. సాధించిన తపశ్శక్తిని ఆయన ఊర్వశి ప్రలోభంలో పడి పోగొట్టుకోవటం, ఊర్వశీ వ్యామోహాన్ని జయించిన తరువాత మళ్ళీ తపస్సు కొనసాగించటం కోరికలను కట్టడిలో ఉంచటం ఎంత ఆవశ్యకమో మనకు నిరూపిస్తుంది.

కీచకుడు గొప్ప శక్తిమంతుడు. కానీ ద్రౌపదీ మోహావేశపరుడైన కీచకుడు బలహీనుడు. ధర్మరాజు ఉత్తముడు. ధర్మపాలనా తత్పరుడు. కానీ, జూదవ్యసనలోలుడైన ధర్మరాజు విచక్షణ రహితుడై. ద్రౌపదిని సైతం పణంగా పెట్టి జూదమాడిన అంధుడు. విప్ర నారాయణుడి కథ అందరికీ తెలిసిందే. అంత వరకూ అందరి గౌరవమన్ననలు అందుకున్న ఉత్తముడు, ఒక వేశ్య మోహంలో పడి సర్వం కోల్పోతాడు. అహల్యను మోహించిన ఇంద్రుడు గౌతముని శాపాన్ని సైతం లెక్కచేయకుండా మోసం చేసేందుకు సిద్ధపడతాడు, గౌరవం కోల్పోతాడు. ఇలా అనేక పురాణకథలు, మనిషి మనస్సు చంచలత్వాన్ని, ఆ ప్రలోభంలో పడటం వల్ల కలిగే అనర్థాలను హృదయానికి హత్తుకునే రీతిలో ప్రదర్శిస్తాయి. మనిషికి మార్గదర్శనం చేస్తాయి.

అందుకే కోరికలు మనిషిని పతనావస్థలోకి తీసుకెళతాయని చెప్పేది.

                                   ◆నిశ్శబ్ద.