భయానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి?

 

భయానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి?

మహాభారతంలో యక్షప్రశ్నల్లో ఒక ప్రశ్న "తనకు మరణం తప్పదని తెలిసినా మనిషి తాను శాశ్వతుడనని ఎందుకనుకుంటాడు?" అన్నది. ఈ ప్రశ్నకు సమాధానం అర్ధమై అనుభవిస్తే భయ స్వరూపం సంపూర్ణంగా అర్ధమౌతుంది. ఇతరజీవులకు తమ జీవితం అశాశ్వతం అన్న ఆలోచన, గ్రహింపులేవు. అవి పుడతాయి, పుడుతూనే మరణాన్ని తప్పించుకొనేందుకు పోరాటం ప్రారంభిస్తాయి. పోరాటంలో ఓడిపోయి మరణిస్తాయి. ఇంతే వాటి జీవితం.

మనిషికి "జాతస్య మరణం ధ్రువం" అని తెలుసు, పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక మానదని తెలుసు. కాబట్టి మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదనీ తెలుసు. ఎప్పుడో రాబోయే మరణం గురించి ఇప్పుడే జీవించటం మానేయటం అర్ధరహితం అని తెలుసు. మరణం వచ్చేవరకూ ఏదో ఒక విధంగా జీవిక కొనసాగించక తప్పదని తెలుసు. అందుకే అనేక కోరికలు, వ్యామోహాల మత్తులో పడి, అనుభూతుల వలయంలో చిక్కి మరణభావనను మరుగున పడేయాలని ప్రయత్నిస్తాడు. ఇలా అణగిన మరణభావన ఇతర భయభావనలకు దారి తీస్తుంది. అందుకే మరణమంటే ఏమిటో తెలియకుండా, మరణం గురించిన ఆలోచన లేకుండా అనుక్షణం మరణంతో పోరాడే జీవులకు ఉండేది ఒక్క మరణభయం మాత్రమే. 

మరణస్వరూపం గ్రహించి, ఏ నాడో ఒక నాడు మరణించక తప్పదని తెలిసిన మనిషికి అడుగడుగునా భయాలే. అనుక్షణం రకరకాల భయాలు. ఆధునిక మానసికశాస్త్రం భయాలను 'ఫోబియా'లంటుంది. లెక్క తీస్తే మానసిక శాస్త్రంలో కొన్ని వేల ఫోబియాలున్నాయి. పురుగులంటే కలిగే అకారణభయం నుంచి, నీటిని చూస్తే కలిగే అకారణభయం, ఏ ప్రమాదం లేకున్నా ఊహాప్రమాదం వల్ల అనుక్షణం కలిగే భయం, ఎవరో ఏదో చేస్తారన్న అర్ధం లేని భయం వరకూ కొన్ని వేల రకాల భయాలున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధించి అనేక రకాల భయాలను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు.

'శబ్దం' అంటే ఉండే భయాన్ని 'అకౌస్టికో ఫోబియా' అంటారు. ఎత్తులంటే ఉండే భయాన్ని 'ఆక్రోఫోబియా' అంటారు. పూలను చూస్తే కలిగే భయానికి 'ఆంథోఫోబియా' అని పేరు. వెంట్రుకల వల్ల కలిగే భయం 'కేటోఫోబియా', 'వేగం' వల్ల కలిగే భయాన్ని 'టాకోఫోబియా' అంటారు. కొందరిలో హాస్పిటళ్ళంటే ఉండే భయాన్ని 'నోసోకెమోఫోబియా' అంటారు. ఇలా కొన్ని వేల భయాలున్నాయి. ఫోబియాలు ముదిరితే మేనియా (పిచ్చితనం) లు అవుతాయి. అంటే మెదడు లేని జీవులకు ఒకే భయం ప్రాణభయం' ఉంటే, మెదడు, ఆలోచనలు, విచక్షణలున్న మనిషికి అడుగడుగునా అకారణభయాలే అన్నమాట. 

అయితే మనిషిలో ఈ భయాల వల్ల నష్టంతో పాటు లాభం కూడా ఉంది. అనేక రకాల భయాలు మనిషి స్వభావంపై ప్రభావం చూపుతాయి. అతని సహజ స్వభావం నుంచి అతడిని దూరం చేస్తాయి. కానీ కొందరిలోని భయాలు, వాటిని జయించాలన్న తపన అభివృద్ధికి దారి తీస్తుంది. మానవజాతి అడుగు ముందు పడేట్టు చేస్తూంది. భయం నుంచి మనిషి రక్షణ కోసం చేసే ప్రయత్నాలు అభివృద్ధిపథంలో ప్రయాణానికి దారి తీస్తాయి. కానీ ఎప్పుడైతే మనిషి భయాన్ని జయించాలనే ప్రయత్నం మాని భయానికి లొంగిపోవటం జరుగుతుందో, అది పతనానికి దారి తీస్తుంది. అయితే భయాన్ని జయించేందుకు సక్రమమైన ప్రయత్నాలు కాక అక్రమరీతిలో ప్రయత్నాలు చేయటం అనర్ధదాయకం. 

పురాణాల్లో మరణాన్ని జయించాలన్న వ్యక్తుల స్వార్థ, ప్రయత్నాలు, మనుషులను రాక్షసులనుగా చేయటం మనకు తెలిసిందే. అయితే రాక్షసులై, ప్రజలను పీడించినా వారు మరణం నుంచి తప్పించుకోలేకపోయారు. మరణం నుంచి తప్పించుకోవాలని రాక్షసులు కోరిన చిత్రవిచిత్రమైన కోరికలు, ఆ కోరికలలో ఏదో ఓ చిన్న లోపం ఆధారంగా భగవంతుడు మానవరూపం ధరించి వారిని సంహరించటం, ఎంత ప్రయత్నించినా మనిషి మరణాన్ని జయించలేదని నిరూపిస్తాయి. అంతే కాదు, మనిషి జయించాలని ప్రయత్నించాల్సింది, మరణాన్ని కాదు, మరణం గురించి మనిషిలో కలిగే భయాన్ని అని బోధపరుస్తాయి పురాణకథలు. అందుకే భగవద్గీత ఆరంభంలోనే శ్రీకృష్ణుడు, అర్జునుడిలోని మరణాన్ని గురించిన భయాన్ని తొలగించాడు. ఇది సమస్త మానవాళిలో మరణభావన వల్ల కలిగే భయాన్ని వదిలిపెట్టేందుకు భగవంతుడు స్వయంగా చూపిన దారి అన్నమాట.

                                     ◆నిశ్శబ్ద.