Read more!

ప్రతి మనిషీ తెలుసుకోవలసిన రెండు విషయాలు!

 

ప్రతి మనిషీ తెలుసుకోవలసిన రెండు విషయాలు!


వృద్ధాప్యాన్ని గురించి ఆలోచించినప్పుడు మనకు మొట్టమొదట స్ఫురించేది దానిమీద మనకున్న అయిష్టత. వృద్ధాప్యం కావాలని ఎవరూ కోరుకోరు. మనిషి జీవితాంతం యవ్వనావస్థలో ఉండాలని ఎంత ప్రయత్నించినా వృద్ధాప్యం నుండి ఎవరూ తప్పించుకోలేడు.


'వేదాంత సారం'లో ప్రతిజీవి ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఆరు ఉపద్రవాలను 'సదానంద' వివరిస్తారు. అందులో వృద్ధాప్యం కూడా ఒకటి. ఇది తప్పించుకోడానికి ప్రయత్నించిన దృష్టాంతం మహాభారతంలో ఉంది.


'యయాతి' అనే ఒక రాజు విధివశాన శుక్రాచార్యుని కోపాగ్నికి ఆహుతై తన యవ్వనాన్ని కోల్పోయి వృద్ధాప్యం పొందుతాడు. యయాతి తనకు కలిగిన విపరీత పరిణామం నుండి రక్షించమని శుక్రుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు. శుక్రుడు 'నీ ముసలితనం ఎవరిలోనైనా ప్రవేశపెట్టు అప్పుడు నీకు నీ యవ్వనం తిరిగి వస్తుంది' అంటాడు. యయాతి తన కుమారుల్ని పిలిచి, 'మీరు ఎవరైనా నా ముసలితనం తీసుకొని మీ యవ్వనాన్ని నాకివ్వండి. వేయి సంవత్సరాల తరువాత మీ యవ్వనం మీకిచ్చేస్తాను' అని బ్రతిమాలతాడు. ఎవ్వరూ ఒప్పుకోరు, 'పూరువు' అనే కుమారుని మనసు చలించి తన తండ్రి కోర్కె తీర్చడానికి సిద్ధపడతాడు. 


యయాతి తన వార్ధక్యాన్ని పూరువు నందు ప్రవేశపెట్టి తిరిగి యవ్వనాన్ని పొంది ఎన్నో సుఖాలను అనుభవిస్తాడు. వేయి సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అయినా యయాతికి విషయ సుఖాల మీద ఆసక్తి తగ్గనేలేదు. ఇక ఇవి తగ్గవనీ, పెరుగుతూనే ఉంటాయనే జ్ఞానం అతనికప్పుడు కలుగుతుంది. తన వృద్ధాప్యాన్ని తానే ఎదుర్కోవాలన్న తలంపుతో దానిని తిరిగి పొంది వనవాసానికి వెళ్ళి ఆధ్యాత్మిక చింతనలో తన శేష జీవితాన్ని గడుపుతాడు యయాతి.


ఇది ఆ కాలం కథ. ఇప్పటివారు దీన్ని చదివి వాస్తవానికి దూరం అని కొట్టిపారేసే అవకాశం ఉంది. మరి ఇప్పటి వాస్తవం ఒక బట్టతల పెద్దమనిషి స్కూటర్ అద్దం ముందు నుంచొని తనకున్న నాలుగు వెంట్రుకలను అదేపనిగా దువ్వుకోవడం. వృద్ధాప్యంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టు తాపీగా కూర్చొని పేకాడే పెద్దల గురించి ప్రస్తావిస్తారు కథామృతంలో శ్రీరామకృష్ణులు.


యయాతి పొందిన జ్ఞానం ఎలా వస్తుంది? చాలామందికి జీవితంలో తప్పులు చేసి ఎదురు దెబ్బలు తిన్న తరువాత కలుగుతుంది జ్ఞానోదయం. కానీ కొంతమంది ఇతరులు పడే కష్టాలను చూసి వారు తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడతారు. 


ఇప్పుడు ఒక రాజకుమారుడి కథ తెలుసుకుంటే…  నవ యవ్వనంలో ఉన్న ఒక రాజకుమారుడు ఒక రోజు దారిలో వెళుతూ  వృద్ధులు పడుతున్న బాధను కళ్ళారా చూసాడు, అతనిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తాయి. తన యవ్వనం అశాశ్వతం. రాజ్యం, రాజరికం ఏదీ తన సొంతం కాదు అని తలచిన వెంటనే అన్నీ వదిలిపెట్టి అడవికి వెళ్ళాడు. ఇక మొదలయింది సముద్ర మథనం. ఆ సముద్ర మథనంలో 'అశాశ్వతం' విషంగాను ‘శాశ్వతం' అమృతంగాను మిగిలాయి. అతడికి సంఘర్షణను సమాధానం దొరికింది. అతడి మనసులో ఉన్న చావు పుట్టుకల చిక్కు ప్రశ్న విడిపోయింది. అతడే సిద్ధార్థుడు. ఆ సిద్ధార్థుడే గౌతమ బుద్ధుడు అయ్యాడు. యయాతిది వానప్రస్థం అయితే సిద్ధార్థుడిది సన్న్యాసం. 


ప్రతి మనిషి జీవితంలో తప్పక తెలుసుకోవలసిన రెండు విషయాలు ఇవీ…


                                   ◆నిశ్శబ్ద.