Read more!

తొలిపండుగ తొలిఏకాదశి

 

 తొలిపండుగ తొలిఏకాదశి


ఏడాదిలో వుండే 24 ఏకాదశులలో తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత కలిగినది. ఆషాడ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. పూర్వం ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారట. నేటి వరకూ ఉత్తర దిక్కుగా ఉండే సూర్యుడు తొలి ఏకాదశి నాటి నుంచి దక్షిణ దిక్కుకు వాలినట్లు కనిపిస్తాడు. ఈ రోజు నుంచే దక్షిణాయనం ఆరంభమవుతుంది. తొలిఏకాదశి నుంచే పండుగలు మొదలవుతాయి. 

శయన ఏకాదశి

ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీహరి యోగనిద్రలో వుంటాడట. అందుకే నేటి మొదలు ఆనాటి వరకు నారాయణుని భక్తులు ఎటూ వెళ్లకుండా, స్థిరంగా ఒకే చోట వుండి ఆది మహా విష్ణువుని ఆరాధిస్తూ వుంటారు. ఈ నాలుగు మాసాలు కొనసాగే ఈ వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని కూడా అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి రోజు ఆ లక్ష్మీపతి యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులను అలరిస్తాడు. 

తొలి ఏకాదశి అని ఎందుకంటారు..

ఏకాదశిన చాలా మంది పనులు ఆరంభిస్తు వుంటారు. ప్రతి ఏకాదశి అలా ముఖ్యమైనదే. ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకు అంటారంటే, సంవత్సరం కాలన్ని రెండు విభాగాలు చేస్తే అవి రెండు ఆయనాలు ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. చాతుర్మాస్య వ్రతం ఆషాఢ షుద్ధ ఏకాదశితో మొదలై, కార్తిక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో   గురుపూజతో మొదలుకున్న పండుగలు, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాస పూజలు ఇలా ఉత్తరాయణంలోని మాఘ మాసం వరకూ ఉంటాయి. 

గోపద్మవ్రతం 

'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుటం ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు. గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.

'తొలిఏకాదశి' రోజున గోశాలను శుభ్రముచేసి అలికి చుట్టూ ముగ్గులు, మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపై ఉంచి, విధివిధానంగా పూజిస్తారు. ఒక్కొక్క పద్మముపై  ఒక్కో అప్పడం ఉంచుతారు. ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులు బ్రాహ్మణులకిస్తారు. ఇలా గోమాతను పూజించిన వారికి  సకల అభీష్టములు తప్పక తీరుతాయి.   

ఆరోగ్య పరంగా తొలి ఏకాదశి

వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అలా ఉపవాస దీక్షలు తొలి ఏకాదశితో మొదలవుతాయి.