Read more!

బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ మయం వీటి గూర్చి చక్కని కథ!

 

బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ మయం వీటి గూర్చి చక్కని కథ!

బ్రహ్మజ్ఞానం అనేది, బ్రహ్మమయం అనేది ఆధ్యాత్మికతలో తరచుగా వింటూ ఉంటాం. ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులు ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది శక్తివంతులుగా, ఆధ్యాత్మికతలో గొప్ప స్థానంలో చేరుకుని ఉంటారు. వారందరూ ఈ ప్రపంచమంతా బ్రహ్మమయం అని చెబుతూ ఉంటారు. అయితే దాన్ని అర్థం చేసుకోవడం అధ్యాత్మికత మీద అవగాహన లేనివారికి సాధ్యం కాదు. కొందరు మూర్ఖులు విషయాన్ని తప్పుగా ఏతం చేసుకుంటారు. దాని గురించి ఓ మంచి కథ ఉంది...

ఓ ఊరికి  ఒక యోగి వచ్చాడు. ఆయన అందరికీ తనకున్న జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. అందులో భాగంగా…  ఈ ప్రపంచమంతా బ్రహ్మమయం అని బోధించాడు. నీలో, నాలో చరాచరజగత్తు అణువణువులో ఇమిడి ఉన్నది బ్రహ్మమేనని వివరించాడు. దాన్ని వింటున్న జన సమూహంలో ఓ మూర్ఖుడు ఉన్నాడు. అది విన్న ఆ మూర్ఖుడికి తనకు అంతా అర్థమై పోయిందనిపించింది. ప్రపంచమంతా బ్రహ్మమే అయినపుడు ఇక ఈ బ్రహ్మ ఎదుటి వ్యక్తిలోని బ్రహ్మకు భయపడాల్సిన అవసరం ఏముందని అనుకున్నాడు. దారిలో అడ్డదిడ్డంగా నడవటం ఆరంభించాడు.

'ఎద్దు బ్రహ్మకు భయపడటం అనవసరం. గుర్రం బ్రహ్మ నన్నేం చేయదు' అనుకుంటూ ఎవరెంత చెప్పినా వినకుండా వాటి దారిలో అడ్డంగా వెళ్ళేవాడు. వాటిని నడిపేవారు తిట్టుకుంటూ వాటిని పక్కకు తప్పించేవారు. దాంతో ఆ మూర్ఖుడి విశ్వాసం మరింత పెరిగిపోయింది. ఒక రోజు ఓ ఏనుగు వస్తుంటే దానికి అడ్డంగా నడవటం ఆరంభించాడు. మావటివాడు అడ్డు జరగమని హెచ్చరించాడు. అయితే  మావటివాడి మాట వినకపోగా… ఆ మూర్ఖుడు నవ్వాడు. 'చెట్టు, పుట్ట, గుట్ట, ఏనుగు, ఈగ, దోమ అన్నీ బ్రహ్మమే. నేనూ బ్రహ్మమే. బ్రహ్మానికి బ్రహ్మం భయపడటంలో అర్థం లేదు' అంటూ అలాగే నుంచున్నాడు. 

ఏనుగు తొండంతో ఎత్తి అతడిని పక్కకు విసిరేసింది. అందరూ నవ్వారు. పెద్దగా గాయాలు కాకున్నా మూర్ఖుడికి కోపం వచ్చింది. తిన్నగా యోగి దగ్గరకు వెళ్లాడు. 'మీరు చెప్పిందంతా అబద్ధం. ఏనుగు బ్రహ్మను చూసి నేను  మానవబ్రహ్మ ఎందుకు భయపడాలి?' అని గద్దించాడు. దానికి ఆ యోగి నవ్వి 'ఏనుగు బ్రహ్మకు మనిషి బ్రహ్మ భయపడాల్సిన అవసరం లేదు. బాగానే ఉంది. మరి మనిషి బ్రహ్మ, మావటి బ్రహ్మ మాటెందుకు వినలేదు?' అనడిగాడు. దానికి ఆ మూర్ఖుడి వద్ద సమాధానం లేదు.

బ్రహ్మజ్ఞానానికి సంబంధించి అనేక మంది  పరిజ్ఞానాన్ని ఈ కథ మనసు హత్తుకునే రీతిలో విశ్లేషిస్తుంది. ఈ సృష్టి సర్వం బ్రహ్మమయమని బోధించటం వేరు, సృష్టి బ్రహ్మమయమని వల్లె వేయటం వేరు, సృష్టిసర్వం బ్రహ్మభావనను అనుభవించటం వేరు. సిద్ధాంతాలు వల్లె వేయటం, వాగ్వివాదాలు చేయటం, పెద్ద పెద్ద ఉదాహరణలు ఇవ్వటంతో సరిపోదు. ఆచరించి చూపటంలోనే అసలు నిజం దాగుంటుంది. 

                                      ◆నిశ్శబ్ద.