Read more!

ఈ వారాంతంలో తిరుమల బ్రహ్మోత్సవాలు

 

 

ఈ వారాంతంలో తిరుమల బ్రహ్మోత్సవాలు

 

నాలుగొ రోజుకి చేరుకునే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు `కల్పవృక్ష వాహనం` మీద ఊరేగుతారు. తన నీడకి చేరినవారి కోరికలను తీరుస్తుంది కల్పవృక్షం. శ్రీవారు కూడా అంతే కదా! ఆయన అనుగ్రహాలను సూచించేందుకు తగిన వాహనం `కల్పవృక్షవాహనమే`. ఇక నాలుగో రోజు సాయంత్రం స్వామివారికి తలకెత్తుకునే భాగ్యం `సర్వభూపాల వాహనాని`ది. భూపాలుడంటే రాజు. మరి ఆ రాజులను సైతం పాలించేవాడు సర్వభూపాలుడే కదా! అష్టైశ్వర్యాలూ, అష్ట దిక్పాలకులూ ఆయన కనుసన్నలలో చరించవలసిందే! నాలుగు మాడవీధులే నలుదిక్కులకూ సూచనగా ఒకమారు వాటిని సర్వభూపాలవాహనంలో చుట్టి, లోకాల మీదకు తన దృక్కులను ప్రసరిస్తాడు ఆ శ్రీనివాసుడు.

బ్రహ్మోత్సవాల సందడి పతాకస్థాయికి చేరుకునే అయిదవ రోజున, స్వామివారు మోహినీ అవతారంలో ఊరేగుతారు. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తే భువనైక సుందరమైన స్త్రీ రూపాన్ని ధరించిన అవతారం మోహిని! క్షీరసాగరమథనంలో దక్కిన అమృతం దుష్టశక్తుల పాల్పడకుండా అడ్డుకున్నదే మోహినిదేవి. మన జీవితాలను కూడా అమృతమయం చేసే శ్రీనివాసునికి, ఆ మోహినీ అవతారం చక్కగా సరిపోలుతుంది. ఇదే రోజు సాయంత్రం స్వామివారు గరుడవాహనం మీద ఊరేగుతారు. విష్ణుమూర్తికి ప్రతినిధి అయిన గరుడుడు విశ్వాసానికి మాత్రమే కాదు… వేగానికీ, చురుకుదనానికీ కూడా మారుపేరే! ధ్వజారోహణంలో భాగంగా జెండాతోపాటు పైకెగిరి ముల్లోకాలలోని దేవతలనూ ఆహ్వానించడమే కాకుండా, సాక్షాత్తూ ఆ శ్రీనివాసుని, విష్ణుమూర్తి అవతారంగా గుర్తించి ఆయనకు వాహనమై చరిస్తాడు.

 



రామానుజాచార్యులవారు
బ్రహ్మోత్సవాల గురించి చెప్పుకునేటప్పడు మర్చిపోకూడనివారు రామానుజాచార్యుల వారు. ఒకప్పుడు బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం మాత్రమే తిరుమలలో జరిగేదట. ఉత్సవాలలో మిగతా కార్యక్రమాలన్నింటినీ తిరుచానూరులో నిర్వహించేవారు. అలాకాకుండా బ్రహ్మోత్సవ కార్యక్రమాలన్నీ తిరుమలలోనే జరగాలని పట్టుపట్టినవారు రామానుజులవారు. ప్రకృతి, మానవుడు, భగవంతుడు… ఈ మూడూ సత్యాలే అని చాటే `విశిష్టాద్వైతాని`కి ప్రచారాన్ని కల్పించినవారు రామానుజా చార్యులు. విశిష్టాద్వైతం ఆయనకంటే పూర్వమే ఉన్నప్పటికీ, దానికి విస్తృతమైన ప్రచారాన్నీ, ప్రాభవాన్నీ తెచ్చిన వారు కావడంతో ఆయననే విశిష్టాద్వైతానికి సిద్ధాంతకర్తగా భావిస్తారు.

 


మానవుడికి పరిపూర్ణమైన ఆయుష్షు 120 సంవత్సరాలని చెబుతారు. అదేమో కానీ పరిపూర్ణ మానవుడైన రామానుజాచార్యులవారు (క్రీ.శ‌. 1017-1137) 120 సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది. రామానుజులవారి జీవితానికి సంబంధించి ఎన్నో రచనలు వెలువడ్డాయి. అయితే వాటిలోని విషయాలు పరస్పర విరుద్ధంగానూ, ఒకోసారి ఆ సమయంలో ఉన్న చారిత్రక పరిస్థితులతో పొంతన లేకుండా ఉంటాయి. అయినా కూడా `ఆరాయిర‌ప్పటి గురు‌పరంప‌రాప్రభావ` (ఆరువేల గురువుల వైభ‌వం) వంటి కొన్ని గ్రంథాల ఆధారంగా ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలు రూఢీగా తెలుసుకోవచ్చు. చెన్నైకి అతి దగ్గరలో ఉన్న శ్రీపెరంబదూరు అనే గ్రామంలో `ఆసూరి కేశవాచార్యులు, కాంతిమతి` అనే తమిళ బ్రాహ్మణ దంపతులకు జన్మించారు రామానుజులు.

ఒకపట్ల సనాతన ధర్మమన్నా, ప్రాచీన గ్రంథాలన్నా ఆయనకు గౌరవం ఉన్నప్పటికీ ఛాందసభావాలను వ్యతిరేకించేవారు. అందుకే తక్కువజాతివారైనా కూడా, కంచిపూర్ణుడు అనే జ్ఞాని దగ్గరే తన తొలి విద్యను అభ్యసించారు. అప్పటివరకూ కొద్దిమందికి మాత్రమే అర్హత ఉన్న తిరుమంత్రం అనే పవిత్ర శ్లోకాలను అందరికీ చాటిచెప్పినవాడు రామానుజుడు. ఎంతటి ఆధ్యాత్మిక విషయాలనైనా ఆయన అరక్షణంలో గ్రహించగలిగేవారు. అందుకని ఆయణ్ను యాదవప్రకాశుడే గొప్ప గురువు వద్దకు పంపారు పెద్దలు. తన శిష్యుని ప్రతిభను యాదవప్రకాశుడు వెనువెంటనే గ్రహించాడు. కానీ యాదవప్రకాశుడు బోధించే అద్వైత సిద్ధాంతంతో రామానుజులు తీవ్రంగా విభేదించేవారు. దాంతో ఆయనను భౌతికంగా నిర్మూలించాలన్న కుట్రలు సైతం సాగాయి. తనను చంపేందుకు పన్నిన కుట్రల నుంచి దైవానుగ్రహంతో బయటపడ్డారు రామానుజుల. ఇక యాదవప్రకాశుని వద్ద తన జ్ఞానమూ, దేహమూ రెండూ క్షేమం కాదని గ్రహించి శ్రీరంగంలో ఉండే యమునాచార్యులు అనే గురువుగారి వద్దకు బయల్దేరారు.

 


దురదృష్టవశాత్తూ రామానుజులు శ్రీరంగం చేరుకునే సమయానికి, యమునాచార్యులవారు తమ శరీరాన్ని విడిచిపెట్టేశారు. అయన పార్థివ దేహాన్ని గమనించిన రామానుజులు, ఆయన మూడు వేళ్లు మాత్రం ముడుచుకునే ఉండటాన్ని చూశారట. విశిష్టాద్వైత సిద్ధాంతానికి సంబంధించి గురువుగారిలో ఇంకా తీరని మూడు కోరికలను ప్రతీకగా వాటిని రామానుజులు భావించారు. ఆ మూడు కోరికలూ ఏమిటో గ్రహించి, వాటిని తానే తీరుస్తానని శపథం చేయడంలో మూడు వేళ్లూ తిరిగి చాచుకున్నాయి. అప్పటినుంచీ రామానుజులవారు విశిష్టాద్వైతాన్ని ఆకళింపు చేసుకుని ప్రపంచమంతా వ్యాప్తి చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు.

రామానుజులవారి సమయానికి హిందూమతం, అందులోనూ వైష్ణవం నిర్లక్ష్యం కాసాగింది. దానికి వారు పునర్వైభవాన్ని తీసుకువచ్చారు. `బ్రహ్మసూత్రాలు` తదితర గ్రంథాలను విశిష్టాద్వైత సిద్ధాంతం ఆధారంగా భాష్యాలను చెప్పడం, దేశమంతా తిరుగుతూ పాడుబడిన వైష్ణవాలయాలను పునరుద్ధరించడం, అన్ని వైష్ణవాలయాల్లోనూ ఒకేలాంటి నిత్యపూజ జరిగేలా ఏకరూపత సాధించడం… ఇలా వైష్ణవానికి రామానుజులు చేసిన సేవ అంతాఇంతా కాదు. నిమ్నజాతివారిని సైతం ఆలయాలలోకి తీసుకువెళ్లిన గొప్ప సంఘసంస్కర్తగా ఆయనను పేర్కొంటారు. అలా దేశమంతా తిరుగుతూ తనకు వైష్ణవక్షేత్రాలలో ముఖ్యమైనదైన తిరుపతికి చేరుకున్నారు రామానుజులవారు.

 



రామానుజులవారు తిరుమలకు చేరుకునేనాటికి అక్కడి పరిస్థితులు చాలా వాడివేడిగా ఉన్నాయి. తిరుమల ఆలయంలో ఉన్న విగ్రహం ఎవరిది అన్న విషయాల మీద వాదోపవాదాలు జరుగుతున్నాయి. అది శివుడిదనీ, అమ్మవారిదనీ, కుమారస్వామిదనీ ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు భాష్యాలు చెబుతున్నారు. శాస్త్రప్రమాణాల ఆధారంగా వారందరినీ ఒప్పించి ఆలయంలో ఉన్నది సాక్షాత్తూ ఆ వేంకటేశ్వరుడేనని చాటారు రామానుజులు. అప్పటికి తిరుమలలో వైఖానస సంప్రదాయంలో పూజలు జరుగుతున్నాయి. తాము పాటించేది పాంచరాత్ర పద్ధతి అయినప్పటికీ అప్పటివరకూ ఉన్న సంప్రదాయాన్ని గౌరవించి, మున్ముందు కూడా అదే సాగాలని తన ఉదారతను చాటుకున్నారు ఆయన. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించి, దాని చుట్టూ తిరుపతి నగరం అల్లుకునేందుకు కూడా కారణం వీరే! శ్రీనివాసునితో రామానుజాచార్యులకు ఉన్న అనుబంధాన్ని శాశ్వతం చేస్తూ స్వామివారి సన్నిధిలో  ప్రవచనం చేస్తున్న భంగిమలో రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టించారు.

- నిర్జర.