Read more!

శ్రావణ కళకళలు... తళతళలు

 

 

 

శ్రావణ కలు... తళతళలు


-రచన : యం.వి.ఎస్.

 


                          

 

శ్రావణమాసం వస్తేనే చాలు ఒకటే సందడి. పట్టుచీరల రెపరెపలు, కన్నెగాజుల గలగలలు, కొత్త నగల తళతళలలు, కొత్తకోడళ్ళ కలకలలు, పిండివంటల ఘుమఘుమలతో ఒకటే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ మాసంలో ఒకటి కాదు, రెండు కాదు...నాలుగు పండుగలు   వస్తాయి. అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత. ముందుగా వచ్చేది ‘‘నాగపంచమి వ్రతం’’. నాగపంచమి వ్రతం ఇది స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ జరుపుకునే పండుగ. నాగదోషంవల్ల  వివాహంకాని  స్త్రీ, పురుషులు తొందరగా వివాహం జరగడంకోసం ఈ వ్రతం  ఆచరిస్తారు.పెళ్లయి చాలాకాలం అయినా సంతానం కలుగని ఆడవాళ్లు సర్పదోషం పోగొట్టుకుని సంతానాన్ని పొందడంకోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.


శ్రావణ శుద్ధ పంచమినాడు ఈ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజ ఉదయమేలేచి, తలారా స్నానంచేసి, ఆడవారయితే ముఖానికి, పాదాలకూ  పసుపు రాసుకుని, కుంకుమ బట్టు పెట్టుకుని, పట్టుచీరలు కట్టుకుని కళకళలాడుతూ, ఆవుపాలతో, పూజాద్రవ్యాలతో పాము పుట్టల దగ్గరకు చేరుకుని, పసుపు, కుంకుమలతో, పుష్పాలతో షోడశోపచారాలతో నాగదేవతను అర్చించి, వివాహం జరిగేలా దీవించమనీ, సంతానాన్ని ప్రసాదించి కడుపుచలవ కలిగేలా ఆశీర్వదించమనీ కోరుకుంటూ ఆ పాముపుట్టలో ఆవుపాలు పోసి, చిమ్మిలి, చలిమిడి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల అందరి కోరికలూ తీరుతాయని మనవారి  నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న ఆచారం.


మంగళగౌరీ వ్రతం నిజానికిది కొత్తకోడళ్ళ పండుగ. పెళ్లయిన ప్రతి కొత్తకోడలు తమ భర్తల మేలుకోరి, వారి క్షేమం కోసం, మాంగల్యసౌభాగ్యంకోసం ఈ వ్రతం ఆచరిస్తారు. పెళ్లయిన మొదటి ఐదు సంవత్సరాలూ శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో కొత్తపెళ్లికూతురు చేత ఈ ‘మంగళగౌరీ వ్రతం’  చేయించడం మన ఆనవాయితీ. మంగళవారంనాడు ఇంటి ముందు చక్కని రంగవల్లులు పెట్టిగడపలకు పసుపుపూసి, కుంకుమబట్లు పెట్టి, ముఖద్వారాలకు మామిడితోరణాలు కట్టి అలంకరిస్తారు. కొత్తపెళ్లికూతుళ్లు చక్కగా స్నానంచేసి, పట్టుచీర కట్టుకుని, కొత్తనగలు  పెట్టుకుని, ఈ వ్రతం ఆచరించడానికి సిద్ధమవుతారు. పూజామందిరంలో తూర్పుదిశగా  మండపం అమర్చి, కలశం పెట్టి, పెద్దముత్తయిదువుల సాయంతో ఆ కలశంలోకి మంగళగౌరీ దేవిని ఆవాహన చేసి వేదోక్తవిధి విధానంగా షోడధోపచారాలతో పూజించి, శక్త్యానుసారం  నైవేద్యం సమర్పిచాలి. ఆ తర్వాత కర్పూరహారతినిచ్చి, మంత్రపుష్పం సమర్పించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి, భక్తిగా వ్రతకథను వినాలి. కథ పూర్తయిన తర్వాత...
         
మంగళే మంగళాధారే!
మాంగళ్యే మంగళప్రదే!
మంగళార్థం మంగళేశి!
మాంగళ్యం దేహిమే సదా!

అంటూ తొమ్మిది ముడులు వేసిన పసుపురాసిన దారపు తోరాలకు పూజచేసి, ఒక తోరాన్ని గౌరీదేవికి సమర్పించి, మరొక తోరాన్ని తన కుడిచేతికిగానీ, మెడలోగానీ కట్టుకోవాలి. ఆ తర్వాత దేదీప్యమానంగా వెలుగుతున్న ఆవునేతి దీపంపై అట్లకాడ ఉంచి, ఆ దీపపు పొగతో కాటుక తీసి ముత్తయిదువులందరూ పెట్టుకుంటారు. ఆ తర్వాత బంధువులందరితో భోజనాలు చేస్తారు. ఆ రోజు సాయంత్రం ఇరుగు పొరుగువారినందరిని పేరంటానికి పిలిచి శనగలు, పూవులు, పళ్ళు, చలిమిడి ముద్దలు వాయినాలు యిచ్చి వారి ఆశీర్వాదాలు  అందుకోవాలి. గౌరీదేవి ప్రతిరూపాలుగా ఆ పెద్దముత్తయిదువులు యిచ్చే దీవెనల వల్ల
అఖండ సౌభాగ్యం లభిస్తుందని మన ఆడవారందరి నమ్మకం. పూర్వం సుశీల అనే సాధ్వి ఈ వ్రతం ఆచరించి, గౌరీదేవి అనుగ్రహంతో, అల్పాయుష్కుడైన తన భర్తను బ్రతికించు కుని సకల సౌభాగ్యాలు పొందినటు ్ల ఈ వ్రతకథ వల్ల తెలుస్తుంది.


- స్వస్తి -