Read more!

పంచమి రోజున నాగపంచమి

 

పంచమి రోజున నాగపంచమి

 

 

 

 

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిర్యాలు, పూలనుపెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగ పడగలను భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే …  పుత్రదైకాదశి సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్ధలతో దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

 

 

 


పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది. ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిధేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుభూతిగల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో ఎప్పుడూ చీము కారుతూ వుండేది.  రాత్రిళ్ళు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు. ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాదువు త్రికాలజ్ఞానుడని విని అతనివద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన చేసిన తరువాత ఆమె తన బాధలను చెప్పి దీనికి గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకుంది.

 

 

 


అందుకు ఆ సాధుపుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గతజన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణాసముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రతవిధానక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు తొలగి సంతోషముగా వున్నది.

 

 

 


పంచమి ఉదయమే తలస్నానము చేసి, ద్వారానికి ఇరువైపులా ఆవుపేడతో అలికి, పసుపు, బియ్యం పిండితో, ముగ్గులు వేసి, పసుపుతోకాని, అవుపేడతో కాని, బియ్యం పిండితో కాని నాగచిత్రాలు వేసి, ఆవుపాలు, వడపప్పు నైవేద్యం పెట్టాలి. ఇలా చేసిన యింటిలోని వారు నాగదోషాలు, అకాలమృత్యువు నుండి కాపాడబడి, పిల్లలకి, కళ్ళు, చెవులు, మూగ దోషాలు పోతాయి. ఆయిల్లు పసిపాపలతో కళ కళ లాడుతూ ఉంటుంది. చతుర్ధి నాడు ఉపవాసము ఉండి, పంచమినాడు ఐదు తలల పాము చిత్రాలువేసి అనంతాది నాగ రాజులను లాజలు, పంచామృతము, గన్నేరు, సంపెంగ, జాజి పూలతో పూజించి ఏమి తరగకుండా, వండకుండా ఉన్న సాత్విక ఆహారం, పెసలు, చిమ్మిరి, చలిమిడి, పాలు నైవేద్యం చేసి, అవి సేవించి, ఉపవాసము చేయాలని నియమం. ఆడువారు, పిల్లలు, కన్నెలు, పుట్ట వద్దకు వెళ్లి  అలంకరించి, యగ్నోపవీతాలు, వస్త్రాలు సమర్పించి పాలు పోసి, పూజలు చేస్తారు. పిల్లలు లేనివారు పుట్టకి, రావి చెట్టు మొదలు ప్రతిష్టించబడిన ప్రతిమలకి ప్రదక్షిణాలు చేయాలి. ఆమట్టిని పోత్తి కడుపుకి రాసుకుంటారు. కొన్ని ప్రదేశాలలో కొబ్బరి చిప్పలకి రంగులు వేసి దారాలు కట్టి తిప్పటం ఆచారం.  దీనిని గురించి కొన్ని కధలు కూడా ప్రచారములో ఉన్నవి.

 

 

 


పూర్వమొక కాపు పొలము దున్నుతుండగా ఆ నాగలి ఒక బొరియలో దిగబడి అందులో వున్న నాగుపాము పిల్లలు చనిపోయాయి. తల్లి పాము వచ్చి చూసి పిల్లలు చనిపోయి ఉండటం చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్లి రైతుని, పిల్లలను చంపి, కసి తీరక పెండ్లి అయిన కుమార్తె ఇంటికి వెళ్ళింది. ఆరోజు నాగ పంచిమి అవటం వలన ఆమె అనంత నాగుని పూజ చేయుచుండెను. ఆతల్లి పాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చింది.  ఆ పాముకి ఆకలి వేసి నైవేద్యానికి పెట్టిన పదార్థాలు తినేసింది. దాని ఆరాటం తీరింది. కుమార్తె పూజ ముగించి కనులు తెరువగా పాము ఆమెకు విషయం చెప్పింది. ఆమె క్షమాపణ అడుగగా క్షమించింది. కుమార్తె తనవారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతము ఇచ్చింది. తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె వారిని బ్రతికించుకుంది. అప్పటినుండు ఈరోజు నాగలితో దున్నరాదు, కూరలు కూడా తరుగ రాదనే నియమం వచ్చింది.