Read more!

ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా!

 

ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం ఏమిటో తెలుసా!

'అధ్యాత్మ విద్య, బ్రహ్మవిద్య, వేదాంతం' అనగానే ఇదేదో ముసలితనంలో మూలన కూర్చొని “రామా! కృష్ణా!" అని స్మరించుకుంటూ, మోక్షం కోసం తపించే విషయమని చాలామంది భావిస్తారు. ఈ విధంగా జీవించడమే 'దివ్యజీవనమ'ని భావిస్తారు కూడా! కానీ భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ 'జీవనమే దివ్యమ'ని ఎంతమంది గ్రహిస్తున్నారు?

నేడు మానవుడు తన జీవన పరమావధి ధనార్జనే అని భావిస్తున్నాడు. పక్కవాడితో కలిమి లేములు, హోదాలు, అధికారం, దర్పాలతో పోలిక! నేటి మానవుని సామాజిక ప్రగతికి ఇవే కొలమానాలు. ఇలాంటి వారు తమ జీవితాంతం వరకు వీటి కోసమే ప్రాకులాడుతూ, జీవిత చరమాంకంలో దైవ స్మరణతో, యజ్ఞయాగాదులతో తమ పాపప్రక్షాళన చేసుకోవాలని అనుకుంటారు. 'చర్యకు ప్రతిచర్య ప్రకృతి ధర్మమ'ని ఎరుగరు. నేడు మన సమాజంలో నైతిక విలువలు లోపించడానికి ముఖ్యకారణం 'ఆధ్యాత్మిక జ్ఞాన' రాహిత్యమే! మన పూర్వీకులు పసితనం నుండే పిల్లలకు 'జోలపాటల' నుండి 'గీతాగానం' వరకు రకరకాల రీతుల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారు. ఐదారు సంవత్సరాల ప్రాయంలోనే వారికి ‘ఉపనయన' సంస్కారం చేసేవారు. 'ఉపనయనం' అంటే భౌతికమైన రెండు కళ్ళకు తోడు మరొక 'జ్ఞాననేత్రం' జోడించడం అని కదా అర్థం! ఇలా ఉపనయన సంస్కారం పొందిన పిల్లలు (వటువులు) గురుకులవాసంలో గురువుగారి సాన్నిధ్యంలో అభ్యసించవలసిన విద్యలన్నీ అభ్యసించిన తరువాతనే తమ తల్లితండ్రులను చేరి, వారు నేర్చిన విద్యలతో తల్లితండ్రులను మెప్పించి, వారి అనుమతితోనే నిజ జీవితంలో అడుగిడేవారు. 

జీవిత సత్యాలనూ, అందులోని కష్టసుఖాలనూ, జీవితంలో ఎదురయ్యే ద్వంద్వాల రహస్యాలనూ ఎరిగి, వాటిని అనుభవించి అధిగమించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలనూ, మానసికమైన నిబ్బరాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ పెంపొందించుకొని, సర్వకాల సర్వావస్థలలో సమత్వబుద్ధితో తమ జీవనయానాన్ని సునాయాసంగా గడిపేవారు. ఈ 'విశ్వవిభూతి'లో తాము కూడా అంశలమే అని గ్రహించి, కుటుంబం, సమాజం, దేశం, విశ్వం పట్ల ఏకాత్మభావం కలిగియుండేవారు. లౌకిక సంబంధాలలో కూడా ఆత్మీయతను పెంచి, సర్వజన హితకారులై జీవించేవారు.

ఈ విధంగా 'అధ్యాత్మవిద్య' అనే బలమైన పునాదిపై 'లౌకికవిద్య'లనే ఎన్ని భవంతులు నిర్మించుకొన్నా వాటిని సమాజ హితానికే మానవుడు వినియోగిస్తాడు. అలా చేస్తే, కరిగిపోతూ లోకానికి వెలుగునిచ్చే క్రొవ్వొత్తి లాగా కాలి బూడిదవుతున్నా తన పరిసరాలను సుగంధమయం చేసే అగరుబత్తి లాగా త్యాగధనుడవుతాడు మానవుడు.

                                   ◆ నిశ్శబ్ద.