Read more!

భగవంతుడిని అంతటా చూడాలంటే ఏం చెయ్యాలి?

 

 

భగవంతుడిని అంతటా చూడాలంటే ఏం చెయ్యాలి?

ఎన్నో ఆకర్షణల మధ్య, ప్రలోభాల మధ్య జీవనం సాగిస్తూ భగవంతుణ్ణి అంతటా, అన్ని వేళలా దర్శించడం, భావించడం, స్మరించడం మనలాంటి వారికి సాధ్యమేనా అనే సందేహం వస్తుంది.

శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ- ఈ మూడూ ఒక్కటే. కాబట్టి మనస్సు పరిశుద్ధమైతే అలాంటి మనస్సుతో సర్వమూ సాధించవచ్చు.

 మనస్సు తెల్లని వస్త్రం లాంటిది. మనస్సనే తెల్లని వస్త్రం విషయ వాంఛలనే మరకలతో ఉన్నంత వరకూ భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్ఠించలేం! ఆయనను దర్శించలేం. మానవుణ్ణి మాధవునిగా చేసినా, దానవునిగా మార్చినా మనస్సే ప్రధాన సూత్రధారి.

పవిత్రమైన మనస్సులో భగవంతుడు ఉంటాడు. అయితే ఈ మనస్సును నిర్మలం చేయడం ఎలా? గుఱ్ఱాల కళ్ళకు గంతలు కడితేగాని అవి ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేవు. అలాగే మనస్సనే గుఱ్ఱానికి వివేక, వైరాగ్యాలనే గంతలు కట్టాలి. అప్పుడే మనస్సు భగవన్మార్గంలో పయనిస్తుంది. భగవద్దర్శనమనే గమ్యాన్ని చేరుకుంటుంది. ఇంద్రియనిగ్రహం లేనిదే భగవంతుణ్ణి మనోఫలకంపై ప్రతిబింబింప చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించాలి. "భగవన్నామ సంకీర్తన చేస్తే ఇంద్రియ నిగ్రహ శక్తి స్వతఃసిద్ధంగా లభిస్తుంది.  కలియుగంలో మనస్సును పవిత్రం చేయడానికి భగవన్నామ స్మరణే ఉత్తమమైనది.


తత్ ప్రాప్య తదేవావలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి |


“ఎవరి మనస్సైతే భగవంతుని పాదపద్మాల మకరందాన్ని పానం చేస్తుందో అలాంటి వారు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ పనిలో నిమగ్నమై ఉన్నా భగవంతుణ్ణి చూడాలని ఆశిస్తారు. భగవంతుని గురించి తప్ప వేరే విషయాలను వినడానికీ, మాట్లాడడానికీ ఇష్టపడరు" అని 'నారద భక్తిసూత్రాలు' చెబుతున్నాయి.


జీవితమనే ఈ సాగరంలో ఉక్కిరిబిక్కిరి అవుతూ, జీవన వలయంలో చిక్కుకోకుండా భగవంతుణ్ణి నిత్యం స్మరించడం, విశ్వమంతా నిండి ఉన్న పరమాత్ముణ్ణి దర్శించడం దుష్కరమైన పనులే! అయితే, కేవలం భగవన్నామ స్మరణతోనే ప్రహ్లాదుడు శ్రీహరినీ,  దర్శించగలిగారు. మనం కూడా ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా  'భగవన్నామస్మరణ' అనే సులభమైన మార్గాన్ని ఆచరించగలిగితే 'ఇందు గల డందు లేడని సందేహము' నుంచి బయటపడగలం. భగవంతుణ్ణి ఆలయంలోనే కాక అంతటా దర్శించగలం! 


                                      *నిశ్శబ్ద.