Read more!

గురుపౌర్ణమి రోజు షిరిడీలో ఉంటే!

 

 

గురుపౌర్ణమి రోజు షిరిడీలో ఉంటే!

 

 

భారతీయులకు గురుపౌర్ణమి కొత్తేమీ కాదు! భారత భాగవతాది గ్రంథాలను రాసిన వేదవ్యాసుని జన్మదినాన్ని గురుపౌర్ణమిగా జరుపుతునే వస్తున్నాం. కానీ దత్తసంప్రదాయంలో ఈ పండుగకి మరింత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే త్రిమూర్తుల అవతారం అయిన దత్తాత్రేయులవారిని ఆదిగురువుగా భావిస్తుంటారు. ఆయనను కొలిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని నమ్ముతారు. అందుకే దత్తక్షేత్రాలు అన్నింటి వద్దా గురుపౌర్ణమిని వేడుకగా నిర్వహిస్తారు. మరి ఆ దత్తేత్రేయుని గురుపరంపరలో ఒకరిగా భావించే శిరిడీలో గురుపౌర్ణమి ఘనంగా జరగడంలో ఆశ్చర్యం ఏముంది?

 

శిరిడీలో గురుపౌర్ణమిని సాక్షాత్తూ బాబాగారే ప్రోత్సహించారని చెబుతారు. బాబాగారి సన్నిధిలో వినాయక్ సాఠే అనే భక్తుడు ఉండేవాడు. బాబాను చూసేందుకు షిరిడీకి వచ్చేవారంతా ఈయన కట్టించిన సాఠేవాడలోనే దిగేవారు. ఆ సాఠేగారి మామగారి పేరు దాదాకేల్కర్! ఒకరోజు బాబాగారు ఆయనను పిలిచి ‘ఆ రోజు గురుపౌర్ణమి అనీ, గురుపూజ చేసుకోమనీ,’ సూచించారట. మరి బాబాభక్తులకు గురువు, దైవం బాబానే కదా! అందుకనే కేల్కర్, బాబా చెంతకు చేరుకుని ఆయనను ధూపదీపనైవేద్యాలతో పూజించాడు. అలా శిరిడీలో గురుపౌర్ణమి మొదలైంది. బాబాగారికి గురుపౌర్ణమి అంటే చాలా ఇష్టమనీ, ఆ రోజున ఆయన అఖండమైన తేజస్సుతో వెలిగిపోయేదనీ చెబుతారు. అందుకే శిరిడీలో విజయదశమి, శ్రీరామనవమిలతో పాటు  గురుపౌర్ణమిని కూడా ఘనంగా నిర్వహిస్తారు.

 

గురుపౌర్ణమి రోజు ముందు నుంచే శిరిడీలో పండుగ మొదలవుతుంది. ఉదయాన్నే ఆయన పటాన్ని ఊరేగించడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఆరోజు జరిగే రోజువారీ కార్యక్రమాలతో పాటుగా సాయంత్రం వేళ బాబా పల్లకీ ఊరేగింపు ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రంతా ద్వారకామాయి భక్తుల కోసం తెరిచే ఉంటుంది. ద్వారకామాయిలో, ఆ రాత్రివేళ సత్చరిత్రను పారాయణం చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అలా రాత్రంగా జరిగే అఖండపారాయణంలో పాల్గొనేందుకు, భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

 

గురుపౌర్ణమి రోజున కూడా ఉదయం పటాన్ని ఊరేగించడం, సాయంత్రం పల్లకీ ఊరేగింపు ఉంటాయి. గురుపౌర్ణమి రాత్రంతా, సమాధిమందిరం భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. దేశంలోని ప్రముఖ గాయకులు ఆ రాత్రంతా సాయిభజనలతో భక్తులను అలరిస్తారు. గురుపౌర్ణమి మర్నాడు కూడా శిరిడీలో సందడిగానే ఉంటుంది. జన్మాష్టమి రోజున నిర్వహించే ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఈ రోజున కూడా నిర్వహించడం విశేషం! మూడు రోజుల పాటు ఇలా ఘనంగా జరిగే గురుపౌర్ణమి ఉత్సవాలలో పాల్గొనేందుకు సాయిభక్తులు, సాయి భక్తిని ప్రచారం చేసే గురువులు తప్పకుండా శిరిడీని చేరుకుంటారు.

- నిర్జర.