Read more!

గోవర్ధన పూజ - రైతుల పండుగ

 



ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను ‘ఇంద్రయాగం’ అనేవారు.ఇదా పేరుకు ‘ఇంద్రయాగం’ కానీ ఏ విధమైన యాగాలు నిర్వహించరు. ఇంద్రుని షోడశోపచాలతో పూజించి నివేదనలు సమర్పిస్తారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పుదిక్పాలుడు. వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. అందుకే ఈ పండుగనాడు ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పిస్తారు. అందుకే ఈపూజకు ‘అన్నకూటం’ అని మరొక పేరుకూడా ఉంది.

ఈ పూజ వెనుక కథ
శ్రీకృష్ణుడు..శ్రీమహావిష్ణువు అవతారమని ఇంద్రునకు తెలిసినా., మానవుడుగా జన్మించాడు కనుక శ్రీకృష్ణుడు కూడా తనను పూజించాలని భావించాడు ఇంద్రుడు. అది గ్రహించిన శ్రీకృష్ణుడు, ఇంద్రుని గర్వం అణచాలని సంకల్పించాడు. ఎప్పటిలాగే ‘ఇంద్రయాగం’ చేసేరోజు రానే వచ్చింది. గోకులంలోని వారంతా ఇంద్రుని పూజించడానికి  సర్వం సిద్ధం చేసారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ పిలిచి, గోవర్ధన పర్వతాన్ని చూపిస్తూ ‘ఈ రోజు నుంచి ఇంద్రుని పూజించడం మానేయండి. మనందకీ పంటలు., మన పశువులకు మేత ఇచ్చేది ఈ గోవర్ధన పర్వతమే. కనుక  నేటినుంచి ఈ పర్వతాన్నే పూజిద్దాం’ అన్నాడు. గోకులంలో వారందరకూ శ్రీకృష్ణుని మాటంటే వేదం. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాలలో, ఎందరో రాక్షసుల బారి నుంచి గోకులవాసులను కాపాడాడు. అందుచేత గోకుల ప్రజలంతా శ్రీకృష్ణుని మాట గౌరవించి ఇంద్రుని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించడం ప్రారంభించారు.
ఈ సంగతి నారదుని ద్వారా తెలుసుకున్న ఇంద్రుడు కోపగించి.. గోకులంమీద రాళ్ళతో కూడిన భయంకరమైన వర్షాన్ని కురిపించాడు. గోకుల వాసులంతా శ్రీకృష్ణుని శరణు కోరారు.

శ్రీకృష్ణుడు వెంటనే గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనవ్రేలు మీద ఎత్తి, గొడుగులా పట్టుకుని తనవారినందరినీ గోవర్ధన పర్వతం క్రిందకు రమ్మన్నాడు. అందరూ గోవర్ధన పర్వతం క్రిందకు చేరారు. ఇంద్రుడు అలా ఏడు రాత్రులు, ఏడు పగళ్ళు రాళ్ళవాన కురిపిస్తూనే ఉన్నాడు. అప్పటికి ఇంద్రుని గర్వం నశించి, అతనే స్వయంగా శ్రీకృష్ణునిదగ్గరకు వచ్చి శరణు కోరాడు. శ్రీకృష్ణుడు ఇంద్రని క్షమించాడు. నాటి నుండి ‘ఇంద్రయాగం’ ‘గోవర్ధనపూజ’గా మారిపోయింది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్న రోజు ‘కార్తీక శుద్ధ పాడ్యమి’. అందుకనే ఈ రోజున  రైతాంగమంతా ఈ గోవర్ధన పూజను నిర్వహిస్తారు. ఈ రోజున ఉదయమే తలస్నానం చేసి, ఆవుపేడతో శ్రీకృష్ణుని విగ్రహాన్ని తయారుచేసి, షోడశోపచారాలతో శ్రీకృష్ణుని ఆరాధించి., అన్నపు రాశులు, రకరకాల పిండివంటలు, పదార్ధాలు శ్రీకృష్ణునకు నివేదనగా సమర్పిస్తారు. తర్వాత  ఆట పాటలతో శ్రీకృష్ణుని సంతోషపరచి ఆ ప్రసాదాన్ని సామూహికంగా భుజిస్తారు. ఇదీ ‘గోవర్ధన పూజ’ కథ.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం