Read more!

అణకువగా ఉండాలని అందరూ చెబుతారు.. దీని గొప్పదనం ఏంటంటే..

 

అణకువగా ఉండాలని అందరూ చెబుతారు.. దీని గొప్పదనం ఏంటంటే..

మనిషికున్న గొప్ప లక్షణాల్లో అణుకువ కూడా ఒకటి.  దాని గొప్పదనం గురించి తెలుసుకుంటే తప్ప అర్థం కాదు. 'కొండపైన వర్షపునీరు ఎంతకురిసినా అక్కడ నిలువక అది కొండలోయలోనికి చేరుతుంది. అలాగే గర్వంతో మిడిసిపడే హృదయంలో భగవత్కృప నిలువదు.” అణుకువ గల హృదయంలోనే అది నిలుస్తుంది. త్యాగరాజస్వామి భగవంతుని 'గర్వమానసదూరుడ'ని స్తుతించారు.

ఒక గృహిణి నిద్రకళ్ళతో కొళాయి తెరచి బకెట్ దాని క్రింద పెట్టి లోపలికి వెళ్ళి హడావిడిగా తిరిగొచ్చింది. తీరా చూస్తే నీరు ధారగా పడుతున్నా బకెట్లో ఒక్క నీటి చుక్కైనా లేదు! కారణమేమిటంటారు? బకెట్ బోర్లించి ఉండడమే! ఆ బోర్లించిన బకెట్ లాంటిది గర్వంతో నిండిన మనస్సు.

భక్తితో మనం అర్చించే గుడిలోని విగ్రహం ఒకప్పటి బండరాయే కదా! నేర్పుతో శిల్పి దానిని అందమైన విగ్రహంగా మలుస్తాడు. ఎన్ని సమ్మెట దెబ్బలు తిన్నా బద్దలు కాక, సుత్తి దెబ్బలెన్నిపడినా విరగక, ఎన్నో ఉలి దెబ్బలకు గురయినా విసుగు చెందక, ఆ రాయి శిల్పి చేతిలో తనను తాను సంపూర్ణంగా అర్పించుకొని చివరివరకూ అణకువతో ఉండడం వల్లనే కదా నేడు పూజార్హమైంది. శిల్పి చేతిలో శిలలాంటివాడే గురువు చెంతనున్న శిష్యుడు. శిష్యుడంటే శాసనార్హుడు. గురుశాసనాలను అణకువతో శిరసావహించి, తనలోని అవగుణాలను అధిగమించి ఔన్నత్యాన్ని పొందుతాడు శిష్యుడు. శిష్యునిలోని అణకువ, జిజ్ఞాస, సేవాతత్పరతలకు ప్రసన్నుడై కృపతో గురువు శిష్యునికి జ్ఞానోపదేశం చేస్తాడు. 

భగవద్గీతలో  చెప్పిందీ ఇదే..

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా || ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వ దర్శినః ॥

కంసాలి చేతిలో సుత్తి దెబ్బలెన్నిటికో గురైన బంగారం అమూల్య రత్నాలతో పొదగబడిన కిరీటంగా మారింది. అణకువతో ఉండడం వల్లనేగదా అందరూ శిరస్సులు వంచి నమస్కరించే రారాజు శిరస్సునే అలంకరించిందా కిరీటం!

అణకువ అంటే బానిస బ్రతుకు కాదు. క్రమ శిక్షణతో, శాంతి సహనాలతో, పట్టుదలతో, కార్యాసాధనకై పెద్దలనాశ్రయించి ఆత్మోన్నతికి ఆత్మార్పణ చేసుకోవడం. దీనికి ఆంజనేయస్వామి జీవితమే చక్కని నిదర్శనం. బుద్ధి కుశలతకూ, ధైర్య సాహసాలకూ, స్వామి భక్తికీ తనకు తానే సాటి అయినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ రాముని దాసుడే. బానిస మాత్రం కాదు. కొండ అద్దమందు కొంచెమై యుండదా! "ఎన్నో పండ్లతో నిండుగా ఉన్నచెట్టు ఎప్పుడూ వంగి ఉంటుంది. అందుకే ఆత్మోన్నతి పొందదలచినవారు అణకువ కలిగి ఉండాలి".

జీవితంలో రాణించాలంటే విద్యాధికునికైనా, విద్యా విహీనునికైనా అణకువ చాలా అవసరం. అదిలేని వానికి జీవితం దుర్భరమౌతుంది. అడుగడుగునా మొట్టికాయలు తినాల్సొస్తుంది. అణకువ ఉన్న వానికి అన్నీ సాధ్యమే ఇటు సిరిసంపదలు  అటు సుఖశాంతులు వానికి సొంతమౌతాయి. ధర్మనిరతి అలవడుతుంది. అణుకువ గలవాడే సుగుణాల రాశి. మహాభారత కారుని మాటల్లో..

విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం| పాత్ర త్యాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం తత్సుఖం॥

పాత్రలేనివాడు పాత్రుడు కాదంటారు. అణకువ గలవాడే నిగర్వి. అతడే పాత్రుడు,  యోగ్యుడు. ఆదర్శ ప్రాయుడు, ఆరాధ్యనీయుడూ! అందుకే అణుకువ చాలా ముఖ్యం.

                                           ◆నిశ్శబ్ద