Read more!

ఆధ్యాత్మికత వెంట నడిచి పరమాత్ముడిలో లయమైన చింతపల్లి ఇద్దాసు!

 

ఆధ్యాత్మికత వెంట నడిచి పరమాత్ముడిలో లయమైన చింతపల్లి ఇద్దాసు!

ఆధ్యాత్మిక ఉన్నతికి కులమతాలు, జాతి లింగభేదాలు అడ్డుకావని నిరూపిస్తూ నిమ్న కులస్థుల నుండి సైతం ఎంతో మంది ఆధ్యాత్మిక మహాపురుషులు ఆవిర్భవించారు. ఆంధ్రదేశస్థులైన నందనార్ స్వామి, వీరబ్రహ్మంగారి శిష్యులు కక్కయ్య, ఆదోని లక్ష్మమ్మ, చింతపల్లి ఇద్దాసులు తమ కులం తక్కువదైనా గుణం గొప్పదేనని చాటి చెప్పారు.

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం, చింతపల్లిలో దున్న రామయ్య ఎల్లమ్మ దంపతులకు ఇద్దాసు జన్మించాడు. చిన్నతనంలోనే రైతుల వద్ద జీతగాడిగా కుదిరి మోట కొట్టడం, ఏతామెత్తడం, నాగలి దున్నడం వంటి పనులు చేసేవాడు. ఒక రోజు ఉదయం మోట కొడుతుంటే బావి వద్ద నుండి ముగ్గురు సాధువులు వెళ్ళటం గమనించాడు. వారిని చాటుగా వెంబడించి అక్కడి శివాలయానికి వెళ్ళి వారు సంకీర్తన చేయటం చూసి పోయాడు. పరవశించి ఆనాటి నుండి సాధువులతో శివాలయానికి వెళ్ళటం అతని దినచర్యలో భాగంగా మారింది. ఇద్దాను భక్తికి మెచ్చి ఒకనాడు సాధువులు అతని నాలుకపై విభూది రాశారు. అతనిలో భక్తి పొంగి పొర్లింది. ఆశువుగా తత్త్వగీతాలను పాడసాగాడు.

ఒకనాడు ఆ ప్రాంతపు ప్రసిద్ధ జంగమదేవర పూదోట బసవయ్య అతని పక్వతను గుర్తించి పంచాక్షరీ మంత్రోపదేశం చేశాడు. ఇద్దాసు ఆనాటి నుండి జపం చేస్తూ, యోగ మార్గాన్ని సైతం అనుసరించి ఆరు నెలలు కఠోర సాధన చేశాడు. పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుందని ఇంట్లో వాళ్ళు భావించి శివమ్మ అనే కన్యతో వివాహం జరిపించారు. సంసారం, కులవృత్తి చేస్తూనే ఇద్దాసు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి సాధన చేసేవాడు. కొంత కాలానికి మనసు పక్వమై అతనికి సిద్ధికలిగింది. భవబంధాలు పటాపంచలయ్యాయి.

రైతు వద్ద ఇద్దాసు మోటతోలే సమయంలో కొంతమంది బ్రాహ్మణులు అటుగా వెళుతూ బావిలోకి దిగి స్నానం చేయదలచి మోటను ఆపించారు. తోలుబొక్కెనను తాకటం వారి ఆచారానికి విరుద్ధం. బావిలో స్నానం ముగించి పైకి వచ్చి మోట తోలుకోమన్నారు. వారిని చూస్తూ ఇద్దాసు "మీకు శరీరం శుభ్రం అయింది కానీ, మనసులోని మలినం పోలేదు" అన్నాడు. బ్రాహ్మణులకు కోపం వచ్చింది. ఇద్దాసు వారిని శాంత పరిచి తోలు బొక్కెనకు నోటిని ఆనించి నీరు మొత్తం తాగి, ఆసనం గుండా విసర్జించాడు. స్నానం చేసి సూర్యునికి నమస్కరిస్తున్న ఇద్దాసు హృదయ స్థానంలో బ్రాహ్మణులకు భువనేశ్వర శివాలయం, అందులోని శివలింగం కనిపించాయి. తమ తప్పు తెలుసుకొని వారు ఇద్దాసుకు నమస్కరించారు.

చింతపల్లిలో నివసించే ఒక బ్రాహ్మణుడు కాశీకి ప్రయాణమవుతూ ఇద్దాసు ఇంటికి వెళ్ళాడు. అతనికి రెండు పైసలిచ్చి తన పేరుతో గంగకు అర్పించమని ఇద్దాసు అతనికి చెప్పాడు. కాశీలో బ్రాహ్మణుడు గంగలో స్నానంచేస్తూ ఆ రెండు పైసల్ని "ఇవి మా ఇద్దాసు ఇచ్చిన పైసలు" అంటూ గంగలో జారవిడిచాడు. గంగలో నుండి ఒక స్త్రీ చెయ్యి పైకి వచ్చి పైసలందుకుంది. ఎంతో మంది స్త్రీలు అక్కడ స్నానం చేస్తుండటంతో, ఎవరో స్త్రీ పైసలు తీసుకుందని బ్రాహ్మణుడు భావించాడు. తిరిగి వచ్చి ఇద్దాసుతో అదే విషయం చెప్పాడు. ఇద్దాసు "ఆ స్త్రీ ఈమేనా?" అంటూ తన ఇంటి ముందున్న దేవతా విగ్రహాన్ని చూపించాడు. దేవత చేతి కంకణాలు, గాజులు గుర్తించిన బ్రాహ్మణుడు గంగమ్మ తల్లే పైసలందుకుందని తెలుసుకుని ఇద్దాసు పరమ భక్తుడని గుర్తించాడు.

వీరబ్రహ్మంగారి వలె పామరులకు అర్థమయ్యే విధంగా తెలంగాణా వ్యావహారిక భాషలో మార్మిక తత్త్వాలు, వేదాంత కీర్తనలను ఇద్దాసు రచించాడు. ఇద్దాసు మహాయోగియై 108 యేళ్ళు జీవించి, 1919 సంవత్సరంలో మహాసమాధి చెందాడు. దేహం చాలించే ముందు తన మెడలోని లింగం నుంచి పాలు కారితే విధి విధానాలతో సమాధి చేయండనీ, రక్తం కారితే గొయ్యితీసి పాతి పెట్టండనీ చెప్పి కన్ను మూశాడు. శిష్యులు ఆయన మెడలోని లింగం నుండి పాలు కారడం గమనించి, భక్తులందరి సమక్షంలో శాస్త్రోక్తంగా సమాధి చేశారు. కాలక్రమంలో భక్తులు ఆయన అస్థికలను కృష్ణా జలంతో శుద్ధిచేసి సమాధి మందిరాన్ని నిర్మించి, ఆరాధనోత్సవాలను జరుపుతున్నారు.

                                     ◆నిశ్శబ్ద.