జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట

  మాజీ సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట చోటుచేసుకుంది.  మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు ఆంక్షలు ఉల్లంఘించి రోడ్డు పైకి భారీగా చేరుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ మాలకొండయ్యకు గాయాలయ్యాయి.  ఓ సీఐ కిందపడిపోయారు.  కానిస్టేబుల్‌కు చేయి విరగడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వందల మందితో తన నివాసానికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రయత్నించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రసన్న కుమార్ రెడ్డి. మహిళా డీఎస్పీ సింధుపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్‌ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్‌కి ఆటంకం ఏర్పడింది.  దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. మరోవైపు రోడ్డు ప్రయాణంలో జగన్ ఎక్కడంటే అక్కడే కాన్వాయ్ ఆపుతూ అభివాదాలు చేసుకుంటూ వెళ్లారు. శ్రీనివాసులరెడ్డి బొమ్మ సెంటర్ వద్ద జగన్‌ను చూసేందుకు వైసీపీ శ్రేణులు పోలీసులను నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.  
జగన్ నెల్లూరు పర్యటనలో తొక్కిసలాట Publish Date: Jul 31, 2025 6:03PM

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్

  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన రెండు కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు కౌడిపల్లి పీఎస్ లో నమోదైన కేసులను కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, నిరసనల సమయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ స్టేట్  చీఫ్‌గా ఉన్న సమయంలో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి.   ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ ర్యాలీలు నిర్వహించగా.. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని, అనుమతులు లేకుండా బహిరంగ సభలు నిర్వహించారని ఫిర్యాదులు అందాయి. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 26న నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ నేరుగా విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వ వాదనలతో పాటు రేవంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు కేసును 31వ తేదీకి వాయిదా వేయగా తగిన ఆధారాలు సమర్పించడంతో రెండు కేసులను న్యాయస్థానం నేడు కొట్టివేసింది.   
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ Publish Date: Jul 31, 2025 5:10PM

తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక

తిరుమల శ్రీ‌వారి ఆల‌యం ముందు , మాడ వీధుల్లో ఇటీవ‌ల కొంతమంది వెకిలి చేష్టలు చేస్తూ, నృత్యాలు ప్రదర్శిస్తూ వీడియోలు (రీల్స్) చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. తిరుమలవంటి పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర ,అసభ్యకర చర్యలు అనుచితమని పేర్కొంది. ఇటువంటి చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయనీ, అలాగే ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయనీ పేర్కొంది. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  తిరుమలలో పుణ్యక్షేత్రంలో  కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తుల  మనోభావాల పట్ల గౌరవం చూపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కేసులు నమోదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
తిరుమలలో రీల్స్ మోజులో తింగరి వేషాలు.. చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరిక Publish Date: Jul 31, 2025 4:30PM

పార్లమెంట్ వద్ద సైకిల్‌పై సందడి చేసిన బాలయ్య

  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద సందడి చేశారు. విజయనగరం ఎంపీ అప్పలనాయుడు  తీసుకొచ్చిన సైకిల్‌పై కూర్చొని కెమెరాకు పోజులిచ్చారు. సైకిల్‌ను చూసిన బాలయ్య అన్న ఎన్టీఆర్, వారి అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్లమెంట్‌కు రావడం అభినందనీయం అని బాలయ్య ప్రశంసించినట్టు అప్పలనాయుడు ట్వీట్ చేశారు.  కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పార్టీ ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను బాలయ్య కలిశారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హరిదీప్ సింగ్ పురీ, మన్ సుఖ్ మండవీయలను బాలకృష్ణ కలవనున్నారు. ప్రతి తెలుగోడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆరోజు అన్న ఎన్టీఆర్ పెట్టిన టిడిపి పార్టీ గుర్తు సైకిల్ పై పార్లమెంటుకు రావడం అనేది అభినందనీయకమని బాలయ్య పేర్కొన్నారు.   అలాగే మన పార్టీ ప్రాముఖ్యతను భారతదేశం అంతా తెలిపే విధంగా మన పార్టీ సింబల్ సైకిల్ ను పార్లమెంట్ ప్రవేశ ద్వారం పక్కన  ఒక సిగ్నిఫికెన్స్ గా ఉండటం హర్షనీయమని చెబుతూ, అలాగే పక్కన ఉన్న సహచర ఎంపీ ద్వారా రోజు పార్లమెంటుకు సైకిల్ పై వస్తున్న విషయం తెలుసుకొని ఎంపీ  చేస్తున్న పనిని ప్రశంసిస్తూ, పార్లమెంట్ లో మీ గళం ద్వారా మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి అంటూ, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడూ మీ పై సదా ఉంటాయని వారి అభిమానాన్ని ఎంపీ పై  చూపిస్తూ ఇకముందు కూడా ఇలాగే ముందుకు సాగండి అని వారిని అభినందించి కాసేపు సరదాగా సైకిల్ పై కూర్చుని, ఫోటోలు ఇస్తూ  సరదాగా కాసేపు ఢిల్లీ విషయాలపై సంభాషించారని ఎంపీ కలిశెట్టి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు  
పార్లమెంట్ వద్ద సైకిల్‌పై సందడి చేసిన బాలయ్య Publish Date: Jul 31, 2025 4:25PM

ఏపీ @32 జిల్లాలు.. అధికారిక ప్రకటనే తరువాయి?!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల సహిరద్దులు మార్చడంతో పాటు జిల్లాల సంఖ్య పెంచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం మేరకు ప్రస్తుతం ఉన్న జిల్లాలలోని పలు నియోజకవర్గాలు వేరే జిల్లాలకువెళ్లనున్నాయి. గత వైసీపీ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల్ని జిల్లాలుగా మారుస్తూ చేసిన మార్పును ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సవరించి, సరిదిద్దడానికి నిర్ణయించింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 32కు పెరగనుంది.   పలాస, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం, అమరావతి, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, హిందూపురం, అనంతపురం, ఆదోని, కర్నూలు, నంద్యాల, కడప, రాజంపేట జిల్లా కేంద్రాలు కాబోతున్నట్లు సమాచారం. పలాస జిల్లాలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాలు,  శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.  అదే విధంగా  పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు, విజయనగరం జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్ కోట, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇక పోతే విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే అరకు జిల్లాలో అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు, అనకాపల్లి జిల్లాలో  అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని నియోజకవర్గాలు ఉంటాయి. ఇక కాకినాడ జిల్లాలోకి  ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, రూరల్, రామచంద్రాపురం నియోజకవర్గాలూ,  రాజమండ్రి జిల్లాలోకి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, కొవ్వూరు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. అమలాపురం జిల్లాలో  రాజోలు, అమలాపురం, ముమ్మడివరం, పి.గన్నవరం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాలు ఉంటాయి.  నరసాపురం జిల్లాలో  తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం.. అలాగే  ఏలూరు జిల్లాలో గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు నియోజకవర్గాలు ఉంటాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. మచిలీపట్నం జిల్లాలో  కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాలు, విజయవాడ జిల్లాలో తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం రానున్నాయి.  అమరావతి జిల్లా పరిధిలోకి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ రానున్నాయి. గుంటూరు జిల్లా పరిధి లోకి తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పొన్నూరు నియోజకవర్గాలు, బాపట్ల జిల్లా పరిధిలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తోంది. అదే విధంగా నరసరావు పేట నియోజకవర్గ పరిధిలో  చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, మార్కాపురం పరిధిలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, ఇక ఒంగోలు జిల్లాలోకి  ఒంగోలు పరిధి లోకి అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు సీట్లు వస్తాయని విశ్వసనీయవర్గాల సమాచారం. అలాగే  నెల్లూరు జిల్లా పరిధిలో  కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు, గూడురు పరిధిలోకి  సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు ఉంటాయి. ఇక చిత్తూరు జిల్లా పరిధిలో  పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం వస్తాయి. అలాగే మదనపల్లె పరిధిలో పీలేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె,  హిందూపురం పరిధిలోకి కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో  రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాలు, ఆదోని జిల్లా పరిధిలో పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం,  కర్నూలు జిల్లా పరిధిలోకి నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు ఉంటాయని సమాచారం. నంద్యాల జిల్లా పరిధిలో శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాలూ, కడప జిల్లాలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప ఉంటాయనీ, రాజంపేట జిల్లా పరిధిలో బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయనీ విశ్వసనీయ సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
ఏపీ @32 జిల్లాలు.. అధికారిక ప్రకటనే తరువాయి?! Publish Date: Jul 31, 2025 3:54PM

టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. టీమిండియా ఫస్ట్‌ బ్యాటింగ్‌

  భారత- ఇంగ్లాండ్ మధ్య ఓవల్‌లో జరుగుతున్నచివరి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ టెస్ట్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ చూస్తుండగా భారత్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను డ్రా చేయాలని పట్టుదలతో ఉంది. గతంలో ఓవల్ పిచ్‌పై మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు మాత్రమే విజయం సాధించింది.   జట్లు..  ఇంగ్లాండ్‌: క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బ్రూక్‌, జాకబ్‌, స్మిత్‌, వోక్స్‌, అట్కిన్సన్‌, ఓవర్టన్‌, జోష్‌.  భారత్‌: జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సుదర్శన్‌, గిల్‌, కరుణ్‌, జడేజా, జురెల్‌, వాషింగ్టన్‌, అన్షుల్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌.   
టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌.. టీమిండియా ఫస్ట్‌ బ్యాటింగ్‌ Publish Date: Jul 31, 2025 3:30PM

ఐ(వై)పీఎస్ సంజయ్ బెయిలు రద్దు చేసిన సుప్రీం కోర్టు

కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరూ ఇప్పడు కర్మ అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ వంతు వచ్చింది.   జగన్ హయాంలో అప్పటి ఏపీసీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారిగా.. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా కాకుండా  వైసీపీ పోలీస్ సర్వీస్ అధికారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు.  జగన్ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సంజయ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతీగా, జగన్ చెప్పినట్లు చేయడమే విధినిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయనీ కూడా మరిచిపోయారు. మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ కేసులపై మీడియా సమావేశాలలో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అలాగే చంద్రబాబు స్కిల్ కేసులో  అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని సమర్ధిస్తూ పొన్నవోలుతో కలిసి హస్తినలో మీడియా సమావేశాలలో మాట్లాడారు. అయితే అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ  డీజీగా ఉన్న సమయంలో అడ్డగోలుగా పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారు. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హైకోర్టు సంజయ్ కు బెయిలు మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో ప్రభుత్వ వాదన వినకుండా బెయిలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది. అలాగే సంజయ్ పాల్పడిన అవినీతికి ఆధారాలుసమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అందుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో  లభించిన ఆధారాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. చివరికి సుప్రం కోర్టు సంజయ్ ముందస్తు బెయిలును రద్దు చేస్తూ గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. మూడు రావాలలోగా  సంజయ్ లొంగిపోవాలని ఆదేశించింది. 
 ఐ(వై)పీఎస్ సంజయ్ బెయిలు రద్దు చేసిన సుప్రీం కోర్టు Publish Date: Jul 31, 2025 3:22PM

కేటీఆర్‌, హరీశ్‌రావు‌తో కేసీఆర్ కీలక సమావేశం

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు సభాపతి నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. ఈ అంశంపై నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నేటితో పి.జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వర కమిషన్  గడువు ముగిసి.. ప్రభుత్వానికి రిపోర్టు అందిన నేపథ్యంలో ఆ అంశంపై గులాబీ బాస్ చర్చించినట్లు తెలుస్తోంది.  కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేయబోతున్నట్లుగా సమాచారం. చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ శ్రేణులను యాక్టివ్ చేయడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించే చాన్స్ ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  జూబ్లీహిల్స్ బైపోల్ పార్టీ సన్నద్ధత, అభ్యర్థి ఎంపికపై హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కేటీఆర్ తమ అభిప్రాయాలను కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. కష్టకాలంలో మాకు అండగా నిలిచిన లీగల్ టీమ్స్, బీఆర్ఎస్ సైనికులకు ధన్యవాదాలు. నేను అర్థం చేసుకున్నట్లుగా, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు మాకు మూడు నెలల సమయం ఉంది. పనిలోకి వెళదాం బాయ్స్! అని కేటీఆర్ ఎక్స్ పిలుపునిచ్చారు. 
కేటీఆర్‌, హరీశ్‌రావు‌తో కేసీఆర్ కీలక సమావేశం Publish Date: Jul 31, 2025 3:11PM

అయ్యో ఐవైఆర్ కూడానా?

మాజీ సీఎస్ ఐవైఆర్ కి తత్వం బోధపడింది.. జగన్ కు దిమ్మదిరిగి బొమ్మ కనిపించినట్లేగా?!  మద్యం కుంభకోణం కేసులో జగన్ పూర్తిగా ఇరుక్కున్నట్లే కనిపిస్తున్నది. ఒక్కరొక్కరుగా జగన్ కు సన్నిహితంగా లేదా మద్దతుగా నిలిచిన ఒక్కొక్కరుగా ఆయనకు దూరం జరుగుతూ మద్యం కుంభకోణం కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయాన్ని పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో చెబుతూ వస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చేరారు.  ఐవైఆర్ కృష్ణారావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన జగన్ కు గట్టి మద్దతుదారు అనడంలో  సందేహం లేదు.  రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి సీఎస్ గా ఆయన చంద్రబాబు హయాంలో పని చేశారు. ఆయన పదవీ విరమణ తరువాత ఆయన కోరిక మేరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐవైఆర్ ను బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ గా నియమించారు. అయితే 2019కు ముందు నుంచీ కూడా ఐవైఆర్ పరోక్షంగా జనగ్ కు సహకరించేలా  చంద్రబాబు లక్ష్యంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూవచ్చారు. ఇక 2019 - 2024 మధ్యా కాలంలో అంటే జగన్ అధికారంలో ఉండగా ఐవైఆర్ పూర్తిగా మౌనం వహించారు. జగన్ విధానాలను ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దుత ఇచ్చి సహకరించారు.  ఆ తరువాత ఆయన బీజేపీలో చేరారు.  అప్పటి నుంచీ ఐవైఆర్ జగన్ కు మద్దతుగా నోరు తెరిచిన సందర్భంలేదు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగాలంటే చంద్రబాబు మద్దతు అనివార్యమైన పరిస్థితి నెలకొని ఉండటమే ఇందుకు కారణమని పరిశీలకులు విశ్లేషణ. ఎందుకంటే జనగ్ ను మద్దతుగా మాట్లాడితే తనకే బూమరాంగ్ అవుతుందన్న ఉద్దేశంతో ఐవైఆర్ మౌనం వహించారని అంటారు. అయితే ఈ ఏడాది కాలంలో ఐవైఆర్ ఎన్నడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు.   కానీ హటాత్తుగా ఇటీవల ఐవైఆర్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో నోరెత్తారు. నోరెత్తడమే కాదు.. ఈ కేసులో జగన్ పీకల్లోతు కూరుకుపోయారనీ, తప్పించుకోవడం కష్టమనీ కుండబద్దలు కొట్టేశారు.  అంతే కాదు అధికారంలో ఉండగా జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ముఖ్యంగా ఎక్సైజ్ కమిషనర్ గా అనర్హుడిని నియమించడం ద్వారా దిద్దుకోలేని తప్పు చేశారనీ విమర్శించారు.  అ లాగే మద్యం విక్రయాలలో కేవలం నగదు మాత్రమే అన్న విధానాన్ని కేవలం అవినీతి కోసమే తీసుకువచ్చారనీ, అలాగే  నాసిరకం మద్యం బ్రాండ్లను తీసుకురావడం ద్వారా ప్రజల ఆరోగ్యం గుల్ల కావడానికి కారణమై ఘోర తప్పిదానికి పాల్పడ్డానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ విషయంలో జగన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లేననీ, ఆయన తప్పించుకునే అవకాశం లేదనీ ఐవైఆర్ అన్నారు.  అంతే కాదు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే చాలా చాలా పెద్దదన్ని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆఖరికి ఐవైఆర్ కృష్ణారావు కూడా జగన్  వదిలేశారని అర్ధమౌతోంది. నిజంగానే మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు అవ్వడమంటూ జరిగితే.. ఆయనకు రాజకీయంగా కూడా ఎటువంటి సహకారం అందే అవకాశాలు దాదాపు లేవనే పరిశీలకులు అంటున్నారు.  
అయ్యో ఐవైఆర్ కూడానా? Publish Date: Jul 31, 2025 2:50PM

సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు

  ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న‌కు హైకోర్టు ముంద‌స్తు  బెయిల్‌ను మంజూరు చేసిన  అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 3 వారాల్లోగా సరెండర్ కావాలని ఆదేశించింది. గత వైసీపీ హయాంలో అగ్నిమాప‌క విభాగంలో అవినీతి కేసులో సంజ‌య్‌పై కుటమి ప్ర‌భుత్వం ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది.  దాంతో హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాద‌న‌ల త‌ర్వాత జ‌స్టిస్ ఎన్‌వీఎన్ భ‌ట్టి, జ‌స్టిస్ అమానుతుల్లా ధ‌ర్మాస‌నం ఈ రోజు తీర్పును వెల్ల‌డించింది. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముంద‌స్తు బెయిల్ ద‌శ‌లోనే ట్ర‌య‌ల్‌ను పూర్తి చేసిన‌ట్టు ఉంద‌ని మండిప‌డింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖకు సంబంధించి వెబ్‌సైట్, యాప్‌లతో పాటుగా పలు అంశాలకు సంబంధించి.. ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.  కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. అలాగే సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు.. అక్కడా సదస్సులు నిర్వహించకుండా బిల్లులు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై ఆయనపై కేసు నమోదు చేశారు.
సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు Publish Date: Jul 31, 2025 2:35PM

చిరుతను బంధించిన అటవీ అధికారులు

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్న చిరుతను ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు బంధించారు.  గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మంచిరేవులలో ఇటీవల   చిరుత సంచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే చిరుత  గత కొద్దిరోజులుగా మృగవని పార్క్, గ్రే హౌండ్స్, గోల్కోండ ప్రాంతాల్లో  సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు దానిని బంధించేందుకు  14 ట్రాప్ కెమెరాలు,  మూడు బోన్లు ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత మంచిరేవులలోని ట్రెక్ పార్క్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు గురువారం ఉదయం అక్కడ అమర్చిన బోనులో బంధించారు.  అందరినీ హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు పట్టుబడడంతో అధికారులతో పాటు జనం ఊపిరి పీల్చుకున్నారు.  
 చిరుతను బంధించిన అటవీ అధికారులు Publish Date: Jul 31, 2025 1:41PM

మాలేగావ్ పేలుళ్ల కేసు.. నిందితులందరూ నిర్దోషులే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులు అందరూ నిర్దోషులేనంటూ ముంబై ప్రత్యేక కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌ సహా మొత్తం ఏడుగురిపై అభియోగాలున్న సంగతి తెలిసిందే. 2008 నాటి ఈ కేసులో సుదీర్ఘ విచారణ తరువాత నిందితులను  అభియోగాలు ఎదుర్కొన్నారు. సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత ఈ కేసులో నిందితులందరినీ ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది.   ఈ సందర్భంగా కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలలోని లోపాలను ఎత్తి చూపింది.    మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న జరిగిన భారీ పేలుడులో ఆరుగురు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. ఈ తరువాత దీనిని ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి అప్పగించింది.   మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది, మాలెగావ్‌ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా లేల్చుతూ వారిని విడుదల చేసింది. నిందితుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందన్న NIA కోర్టు, సంశయలాభంతో మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసు నిందితుల విడుదల చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అనుమానంతో వారిని దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం తెలిపింది. 2008 సెప్టెంబరు 29న  మాలెగావ్‌ భికుచౌక్‌ ప్రాంతంలో టూవీలర్‌లో అమర్చిన ఐఈడీ  బాంబు పేలి ఆరుగురి వ్యక్తులు మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు.   ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో బీజేపీకి చెందిన  ప్రజ్ణా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులు పేర్కొన్నారు. అలాగే రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్‌ సహా మరో ఐదుగురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో మొత్తం 220మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్  దర్యాప్తు చేసినా.. 2011లో దర్యాప్తునుఎన్ఐఏ చేపట్టింది. 
మాలేగావ్ పేలుళ్ల కేసు.. నిందితులందరూ నిర్దోషులే! Publish Date: Jul 31, 2025 1:29PM

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం   వీలైనంత త్వరగా,  లేదా 3 నెలల్లో  పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు సీజేఐ గవాయ్. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అనర్హత పిటీషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు Publish Date: Jul 31, 2025 1:18PM

బ్లూ ఫిల్మ్స్ తెగ చూసేస్తున్న భారతావని.. ప్రపంచంలో మూడో స్థానం

భారత ప్రభుత్వం పాతిక అశ్లీల యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకొంది.  2018లో కూడా భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు 2015లో సైతం సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 850 పోర్న్‌ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ లెక్కలు ఎలా ఉన్నా.. మనుషుల ఆలోచనాధోరణుల్లో మార్పులు రానంత వరకూ అశ్లీలతకు ఎవరూ అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉన్నాయి. నీలి చిత్రాలను పంపిణీ చేసే పోర్న్ హబ్ అనే సంస్థ సర్వే ప్రకారం.. అశ్లీల చిత్రాలు చూసేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాత స్థానంలో భారతీయులు ఉన్నారు. వివిధ ఇంటర్నెట్ సర్వేలు కూడా మన దేశంలో అశ్లీల చిత్రాలు చూసేవారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 63శాతం మంది చూస్తున్నారు, ఇందులో 75 శాతం మొబైల్స్‌లో చూస్తున్నారు. ఈ మార్కెట్‌ను ఆధారం చేసుకొనే దేశంలో అశ్లీల చిత్రాలు రూపొందించేవారు, నటించేవారు పెరిగిపోయారు. వాటిని యాప్‌లు, వెబ్‌సైట్ల రూపంలో మన ఫోన్లలోకి డంప్ చేస్తున్నారు. ఇటీవల నిషేధానికి గురైన ఉల్లు యాప్ యజమాని ఆస్తి రూ.100కోట్లు అని అంచనా. ఈ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుమ్మరిస్తున్నారు. ఉల్లు యాప్ వాళ్ళు హద్దులు మీరడంతో ఈ యేడాది మే నెలలో జాతీయ మహిళా కమిషన్ సమన్లు ఇచ్చింది. నిషేధానికి గురైన మరో యాప్ ఏఎల్‌టీటీ బాలాజీ. ఈ యాప్ యజమాని ఏక్తా కపూర్. పలు టీవీ సీరియళ్ళు, సినిమాలు తీసిన ఏక్తా కపూర్‌కి  2020లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. ఏఎల్‌టీటీ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుప్పిస్తున్నారు. నిషేధం వార్త వచ్చాక ఆ కంపెనీతో తనకు సంబంధం లేదనీ..  2021లో బయటకు వచ్చానని ఏక్తాకపూర్‌ వివరణ ఇచ్చారు. అయితే సదరు యాప్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ నుంచే పుట్టిందని ఆరోపణ. గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా ఈ అశ్లీల చిత్రాలు నిర్మించి అరెస్టయ్యారు. వెబ్‌సైట్లు, యాప్స్ నిషేధానికి గురవుతుండటంతో వీటిలో నటించేవారు, నిర్మాతలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఖాతాలు తెరిచి అశ్లీల చిత్రాలు గుమ్మరిస్తున్నారు. అంతే కాదు అందులో నటించేవారు వీడియో కాల్స్ వ్యాపారాలకు తెర తీశారు. నిర్దేశిత రుసుములతో సెమీ న్యూడ్, న్యూడ్ లైవ్ షోల ద్వారా వ్యాపారం చేస్తున్నారు. కొంతలో కొంత మెరుగు ఏమిటంటే తెలుగులో ఈ తరహా కంటెంట్‌కు తగిన ఆదరణ దక్కలేదు. కరోనా సమయంలో ఇక్కడ కూడా రొమాంటిక్ పేరుతో ఈ తరహా చిత్రాలు, బూతు కథలు చెప్పే వీడియోలు మొదలైనప్పటికీ, తగిన ఆదరణ రాకపోవడంతో కొద్ది కాలమే ఆ దందా నడిచింది. ఇందులో కొందరు పెయిడ్ వీడియోలు మొదలుపెట్టారు. అలాగే హాస్యం పేరుతో బూతులతో వీడియోలు చేస్తున్నారు. రీల్స్ ద్వారా ప్రవహిస్తున్న అశ్లీలత మరో ఎత్తు. ఏఐ టెక్నాలజీ వాడి స్టాండప్ కామెడీ వీడియోల తరహాలో యువతులను సృష్టించి వారితో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం నమోదు చేస్తున్నారు. 2015లో వచ్చిన తీర్పు మేరకు ఇంట్లో నాలుగు గోడల మధ్య పోర్న్ చూడటం నేరం కాదు. అయితే ఆ తరహా వీడియోలు తీయడం, ప్రచారం, పంపిణీ మాత్రం నేరం. సెక్షన్ 292 అశ్లీలం అంటే ఏంటో వివ‌రిస్తుంది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం వీటిని రూపొందించ‌డం, డిస్ట్రిబ్యూషన్ చేయ‌డం నేరంగా ప‌రిగ‌ణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి  ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెక్ష‌న్ 67ఏ ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో ప‌బ్లిష్ చేయ‌డం, షేర్ చేయ‌డం నేరం. ఈ సెక్ష‌న్ కింద గ‌రిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష‌, రూ.10 ల‌క్ష‌ల వ‌రకు జ‌రిమానా విధిస్తారు.
బ్లూ ఫిల్మ్స్ తెగ చూసేస్తున్న భారతావని..  ప్రపంచంలో మూడో స్థానం Publish Date: Jul 31, 2025 1:02PM

మద్యం కుంభకోణం కేసు.. ఆ 11 కోట్ల వివరాలివ్వండి..సిట్ ను కోరిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ స్పీడ్ పెంచింది.  ఈ కేసులో బుధవారం (జులై 30) పట్టుబడ్డ 11 కోట్లరూపాయల వివరాలను ఇవ్వాల్సిందిగా సిట్ ను కోరింది.  మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీ  మాజీ ముఖ్యమంత్రి జగన్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ కేసులో ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఇప్పుడు  శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్లకు సంబంధించిన వివరాలను ఈడీ సిట్ ద్వారా సేకరించడంతో ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నదన్న విషయం తేటతెల్లమైంది.   మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన రాజ్ కేసి రెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ ఇప్పటికే రికార్డు చేసింది. అలాగే  చంద్రారెడ్డినీ విచారించింది. ఇప్పుడు సిట్ సీజ్ చేసిన 11 కోట్ల రూపాయల వ్యవహారలో కూడా కొందరికి నోటీసులు ఇచ్చే దిశగా ముందుకు సాగుతోంది. దీంతో మద్యం కుంభకోణం కేసులో ఒక వైపు సిట్.. మరో వైపు ఈడీ దర్యాప్తు స్పీడ్ ను పెంచేయడంతో ఈ కేసు పాత్రధారులు, సూత్రధారుల దగ్గరకు దర్యాప్తు చేరుతోందని అంటున్నారు.  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అసలు పాత్రధాని, సూత్రధారి జగనే అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు తమ వాంగ్మూలంలో  జగన్ పేరు చెబితే ఆయన కూడా అరెస్టయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈడీ దూకుడు, సిట్ స్పీడ్ జగన్ కు షాక్ ఇస్తుందనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు నమోదు అయిన వెంటనే దేశం దాటి వెళ్లిన వరుణ్ చక్రవర్తిని అరెస్టు చేసిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టి, దాని ఆధారంగానే 11 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు.  అలాగే వరుణ్ చక్రవర్తి నుంచి రాబట్టిన సమాచారంతో మరి కొన్ని ప్రాంతాలలో కూడా సిట్ సోదాలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేసిన సిట్ మరిన్ని అరెస్టులకు సిద్ధమౌతోందని చెబుతున్నారు.  
మద్యం కుంభకోణం కేసు.. ఆ 11 కోట్ల వివరాలివ్వండి..సిట్ ను కోరిన ఈడీ Publish Date: Jul 31, 2025 11:49AM

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం.. సుప్రీం ఆదేశం

బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై  అనర్హత  వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన  పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు సూచిస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో  నిర్ణయంపై స్పీకర్ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కాగా గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్  ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవలసింది స్పీకర్ మాత్రమేనని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అయితే నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కు గడువు విధించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటుపై అధికారం పూర్తిగా స్పీకర్ దే. ఆ చట్టంలో ఎటువంటి గడువు కూడా నిర్దేశించలేదు. అందుకే సుప్రీం గతంలో కూడా సూచనలు జారీ చేసిందే కానీ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో  సుప్రీం తాజా తీర్పులో కూడా అనర్హత అంశాన్ని సుదీర్ఘ కాలం పెండింగ్ లో పెట్టడం సరికాదంటూ మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అదే సమయంలో అదే సమయంలో న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్లను తోసిపుచ్చింది.  
తెలంగాణలో  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం.. సుప్రీం ఆదేశం Publish Date: Jul 31, 2025 11:10AM

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీం కోర్టు గురువారం (జులై 31) తీర్పు వెలువరించనుంది. తెలంగాణలో  2023లో జరిగిన ఎన్నికల తరువాత పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటిని వీడి కాంగ్రెస్ పంచన చేరారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈ ఏడాది జనవరిలో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.   జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత విషయంపై గురువారం (జులై 31) తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పుపైనే తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంది.   పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. ఈ ఏడాది జనవరి 15న పిటిషన్లు దాఖలయ్యాయి.  జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి ప్రకాశ్ గౌడ్, ఎ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు. ఇలా ఉండగా.. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పంచన చేరిన పది మంది ఎమ్మెల్యేలలో ఒక్క దానం నాగేందర్ వినా, మిగిలిన తొమ్మిది మందీ తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అయితే దానం నాగేందర్ కు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలో పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన ఓడిపోయారనుకోండి అది వేరే విషయం. కానీ తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి దానంకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తూ సుప్రీం తీర్పు వెలువడితే.. తెలంగాణలో పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికల జరగడం అనివార్యం అవుతుంది. దీంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కుతుందనడంలో సందేహం లేదు. చూడాలి మరి సుప్రీం తీర్పు ఎలా ఉంటుందో?
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ Publish Date: Jul 31, 2025 10:41AM

నెల్లూరు లో టెన్షన్.. టెన్షన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి   జగన్  గురువారం (జులై 31) నెల్లూరు పర్యటన సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాపర్ట్ లో  బయలుదేరిన జగన్   నెల్లూరు జైలుకు చేరుకుని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెడతారు.  కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు పది మందికి మాత్రమే అనుమతించారు. అలాగే జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ములాఖత్ కు జగన్ సహా ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు.  ఇక జగన్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లనున్నారు. అక్కడకు జగన్ తో పాటు వంద మంది మించి ఉండరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆంక్షల ఉల్లంఘనకే సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు కార్యకర్తలను తాము కట్టడి చేయలేమని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది.  నెల్లూరు పర్యటన ముగించుకున్న తరువాత జగన్ నేరుగా అక్కడి నుంచే బెంగళూరుకు వెడతారు.    కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అయితే వైవసీపీ శ్రేణులు మాత్రం ఆంక్షలను ఖాతరు చేయకుండా.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అలాగే నెల్లూరు జైలు వద్ద కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న టెన్షన్ సర్వత్యా కనిపిస్తోంది.  
నెల్లూరు లో టెన్షన్.. టెన్షన్ Publish Date: Jul 31, 2025 10:20AM

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో  బ్యారేజీ వద్ద కృష్ణానది పోటెత్తుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.    ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 55 గేట్లను ఒక అడుగు మేర, మరో 15 గేట్లను రెండడుగుల మేర ఎత్తి దిగువకు 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద  ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా వరద కారణంగా విజయవాడ నగరంలో ముంపునకు గురయ్యే 43 లోతట్లు ప్రాంతాలను గుర్తించిన అధికారులు అక్కడి వారిని అప్రమత్తం చేశారు.  అలాగే కృష్ణా నదీ పరీవాహక ప్రాంత,  లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.   
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం Publish Date: Jul 31, 2025 9:57AM

లిక్క‌ర్ కేసులో ఇరుక్కున్న వారంతా ఓటమిపాలేనా?

ఇప్ప‌టి వ‌రకూ ఢిల్లీ, తెలంగాణ, ఛ‌త్తీస్ గ‌డ్ లో జరిగిన మద్యం కుంభకోణాలకు సంబంధించి అప్పటికి అధికారంలో ఉన్న పార్టీలు ఓటమి పాలయ్యాయి. దానిని బట్టి చూస్తే ఏపీలో కూడా అదే జరిగిందని తెలుస్తున్నదా?  అంటే అవున‌నే సమాధానమే వస్తోంది. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మా..ము (మాజీ ముఖ్యమంత్రి)  జమోరె (జగన్మోహన్ రెడ్డి) సైతం పీకల్లోతు కూరుకుపోయారు. ఈయ‌న, ఈయ‌న పార్టీ ప‌రిస్థితి కూడా అంతేనా? అంటే అవున‌నే చెప్పాల్సి ఉందంటారు  విశ్లేషకులు.  వారి విశ్లేషణలను బట్టి  వ‌చ్చే రోజుల్లో ఆయ‌న ఏదైనా ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. లేకుంటే మ‌రేదైనా ఎన్నిక‌ల్లో పాల్గొన్నా.. ఈ మ‌ద్యం పాపం అంత తేలిగ్గా వ‌ద‌ల‌దు. ఆంతే కాదు త్వ‌ర‌లోనే జగన్ అరెస్టు పక్కా అని కూడా అంటున్నారు.  అలాగుంటుంది మ‌ద్యం కుంభ‌కోణ‌మంటే..  ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగింద‌దే ఇక‌పై జ‌రగబోయేది కూడా అదే అంటున్నారు విశ్లేషకులు.   దానికి తోడు మిగిలిన రాష్ట్రాల‌కూ ఏపీకీ ఉన్న మ‌రో పెద్ద తేడా,  డిస్ అడ్వాంటేజీ ఏంటంటే...  ఆంధ్రప్రదేశ్ లో కల్తీ,  నాసిర‌కం మ‌ద్యం తాగి ఎంద‌రో చ‌నిపోయారు. మరెందరో  అనారోగ్యం పాలయ్యారు.  దీంతో వీరి శాపం అంత తేలిగ్గా వ‌ద‌ల‌ద‌ని అంటారు ద‌గ్గుబాటి దుర్గా ప్ర‌సాద్ వంటి నేత‌లు. వారి శాప‌మే జ‌గ‌న్ పార్టీ లీడ‌ర్ల‌ను ఒక్కొక్క‌రిగా అరెస్టు అయ్యేలా చేస్తుంద‌ని అంటారాయ‌న‌.  ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లున్నాయ‌ని అంటారు. ఢిల్లీలో పాల‌నా ప‌రంగా ఎంతో మంచి పేరు సాధించారు కేజ్రీవాల్. ఆయ‌న విద్య, వైద్య రంగాల్లో ఒక రోల్ మోడ‌ల్ గా ఢిల్లీని తీర్చి దిద్దిన ప‌రిస్థితి. అవినీతి మీద పోరాడిన నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ పెట్టి.. ఆ పార్టీ ద్వారా అనూహ్యంగా ఢిల్లీలో విజ‌యం సాదించి.. ఆపై పంజాబ్ లో కూడా ఖాతా తెరిచి.. మినీ కాంగ్రెస్ పార్టీగా పేరు సాధిస్తూ వ‌చ్చిన కేజ్రీ క్రేజ్ అమాంతం త‌గ్గిందంటే అందుకు కార‌ణం లిక్క‌ర్ స్కామ్. ఈ కేసులో సీఎంగా జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారాయ‌న‌. దీంతో మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలు కావ‌ల్సి వ‌చ్చింది. ఇక ఇదే ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో  చిక్కిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌. క‌విత ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ నేత‌. ఎమ్మెల్సీ. ఇప్పుడూ ఆమె అదే పార్టీలో, అదే హోదాలో ఉన్నారు కానీ.. కానీ అప్పుడు మ‌రింత డీప్ గా ఆ పార్టీ ప్ర‌తినిథిగా ప‌ని చేశారు. ఒక స‌మ‌యంలో క‌వితను అరెస్టు చేయ‌కుంటే బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాలుంటాయ‌ని కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి వంటి వారు కామెంట్ చేయ‌డంతో.. అది నిజ‌మేన‌ని న‌మ్మిన జ‌నం కేసీఆర్   పార్టీని గత ఎన్నికలలో  ఓడించి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అంటే మందుకు మంచింగ్ లా.. మందుకు చెందిన  స్కాముల్లో చిక్కిన వారు డెఫినెట్ గా ఓడిపోతార‌న‌డానికి మ‌న‌కు ద‌గ్గ‌ర్లోనే ఇన్నేసి ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. వారు త‌ప్ప‌క‌ అరెస్ట‌వుతార‌న్న మాట కూడా ప్ర‌చారంలో ఉంది.  ఇక చ‌త్తీస్ ఘ‌డ్ మ‌ద్యం కుంభ‌కోణం. 2019- 2022 మ‌ధ్య జ‌రిగిన‌ లిక్క‌ర్ స్కామ్ కార‌ణంగా చైత‌న్య భాగెల్ తండ్రి భూపేష్ భాగెల్ ఘోరంగా ఓడిపోయారు. 1500 కోట్ల రూపాయ‌ల ఈ స్కామ్ వ‌ల్ల  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. త‌ర్వాతి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇక్క‌డ ఓట‌మి పాలు కావ‌ల్సి వ‌చ్చింది. ఈ స్కామ్ కి ఏపీ లిక్క‌ర్ స్కామ్ కి ఎన్నో పోలిక‌లుంటాయి. అక్క‌డా ఇక్క‌డా మ‌నీ ల్యాండ‌రింగ్ కి సంబంధించిన అనేక ఆన‌వాళ్లు క‌నిపిస్తాయ్.  కాబ‌ట్టి జ‌గ‌న్ రెడ్డికి గ‌డ్డుకాల‌మే అంటున్నారు చాలా మంది. మ‌ద్యం కుంభ‌కోణంలో ఇరుక్కుంటే త‌ర్వాత వారికి రాజ‌కీయంగా ఇబ్బందిక‌ర‌ ప‌రిణామాలు తప్పవంటున్నారు పరిశీలకులు. అయినా కొంద‌రు మాత్రం ఎన్నోకేసులు ఉండి కూడా గత  పదేళ్లకు పైగా ద‌ర్జాగా బెయిలు మీద తిరుగుతున్న జ‌గ‌న్ కి ఏమీ కాదంటారు కొంద‌రు. ఆ మాట‌కొస్తే మోడీ ఉండ‌గా జ‌గ‌న్ జైలుకెళ్లే ప్ర‌స‌క్తే లేద‌న్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయ్. అయితే వంద గొడ్ల‌ను తిన్న రాబందు ఒక్క గాలి వాన‌కు కూలిన‌ట్టు.. ఎన్నో స్కాముల ఆరోపణలు ఉన్న  జ‌గ‌న్ ఒక్క మద్యం  స్కాములో జైలుకెల్ల‌డం ఖాయ‌మ‌ని మరి కొందరు గట్టిగా చెబుతున్నారు. 
లిక్క‌ర్ కేసులో ఇరుక్కున్న వారంతా ఓటమిపాలేనా? Publish Date: Jul 31, 2025 9:45AM

వీటిని నిర్లక్ష్యం చేస్తే జీవితం నరకంగా మారడటం ఖాయం..!!

ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతికి ఇప్పటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను అనుసరించడం ద్వారా మనం అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. జీవితంలో పురోగతి, విజయం సాధించాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మీరు కూడా జీవితంలో చాలా పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించాలనుకుంటే, వీటిని పాటించండి. ఆ నియమాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. మీ సమస్యలను మీలోనే ఉంచుకోండి: ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో తన జీవితంలో పురోగతి సాధించాలని, డబ్బు సంపాదించాలని కోరుకునే వ్యక్తి తన సమస్యలను లేదా బాధలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. మీరు మీ సమస్యలను ఇతరులతో పంచుకున్నప్పుడు, వారు దానిని మరింత తీవ్రతరం చేయవచ్చు. జ్ఞానుల సమాజం: చాణక్యుడి ప్రకారం, మనం పురోగతి సాధించాలంటే లేదా విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే, మనం మొదట జ్ఞానులతో సహవాసం చేయాలి. మీరు అజ్ఞానులతో లేదా మూర్ఖులతో ఎప్పుడూ సహవాసం చేయకూడదు. అలాంటి వారితో సహవాసం చేయడం ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకునే బదులు కోల్పోతారు. వారిని నమ్మవద్దు: చాణక్య నీతి ప్రకారం, ఇతరులను విశ్వసించే ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిది కాకుండా వేరే ప్రపంచంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు లేదా సరిగ్గా వినకుండా మిమ్మల్ని పట్టించుకోకండి. అలాంటి వారు మీరు చెప్పినదానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సగం మనస్ఫూర్తిగా వినడం ద్వారా, ఇతరులకు వేరే విధంగా చెప్పడం ద్వారా మీకు సమస్యలను కలిగించవచ్చు. ఎక్కువ నిరీక్షణ, అనుబంధం వద్దు: ఇతరులపై మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదని చాణక్య నీతిలో పేర్కొన్నారు.  ఓవర్ అటాచ్మెంట్ కూడా తప్పు. సంబంధాలు ఎప్పుడు అర్థాన్ని కోల్పోతాయో చెప్పడం కష్టం. ఈ సమయంలో మంచి సంబంధం మరొక క్షణంలో దాని అర్ధాన్ని కోల్పోవచ్చు. ఖర్చుపై పరిమితులు ఉండాలి: సంపాదించిన డబ్బును కూడబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ ఖర్చులు మీ ఆదాయానికి సమానంగా లేదా మించకూడదు. ఎడిటింగ్ ఎల్లప్పుడూ సరైన మార్గంలో మాత్రమే చేయాలి.  
వీటిని నిర్లక్ష్యం చేస్తే జీవితం నరకంగా మారడటం ఖాయం..!! Publish Date: Jul 31, 2025 9:30AM

 నిద్రపోతున్నప్పుడు కాళ్లలో సిరలు పట్టేస్తున్నాయా? ఇదే కారణం..!

  చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే.. విటమిన్ల పాత్ర.. శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ సి లోపం.. విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంటి చికిత్సలు.. ఐస్ కంప్రెస్.. నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ మసాజ్..  అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
 నిద్రపోతున్నప్పుడు కాళ్లలో సిరలు పట్టేస్తున్నాయా? ఇదే కారణం..! Publish Date: Jul 31, 2025 9:30AM

శ్రీవాణి టికెట్ల ద్వారా ఇక ఏ రోజుకా రోజే శ్రీవారి దర్శనం

తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్లు ఇకపై ఏ రోజుకారోజు కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇప్పటి వరకూ శ్రీవాణి టికెట్లతో దర్శనం చేసుకోవడానికి మూడు రోజులు గడువు ఇచ్చేవారు. కానీ ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానాన్ని మార్చి ఏ రోజు శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకుంటే ఆ రోజే దర్శనేం చేసుకోవలసి ఉంటుంది. ఈ నూనత విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆగస్టు 1 నుంచి 15 వరకూ అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. ఆ తరువాత నవంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పేర్కొంది. ఈ నూతన విధానం భక్తులకు, ప్రత్యేకించి ఆఫ్ లైన్ ద్వారా శ్రీవాణి టికెట్లు తీసుకునే వారికి సౌకర్యంగా ఉంటుందని టీటీడీ పేర్కొంది.  శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్ లో తీసుకునే వారి దర్శన సమయాల్లో కూడా మార్పులు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌరది తెలిపారు.   తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో ఆయ‌న శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై బుధవారం (జులై 30) సమీక్ష నిర్వహించారు.  ఆ సమీక్షలో శ్రీవాణి టికెట్ల జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ కొత్త విధానంలో తిరుమలలో ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్ల కౌంటర్లు తెరుస్తారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లు జారీ చేస్తారు.  ఈ టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 గంటల నుంచీ దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకూ జారీ చేస్తారు.   తిరుమలలో ఆఫ్ లైన్ ద్వారా 800, రేణిగుంట విమానాశ్రయంలో 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.  కాగా  ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా  ఆక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు ఆన్ లైన్లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇస్తారు. ఇకపోతే నవంబర్ 1వ తేదీ నుంచి మాత్రం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు సాయంత్రం నాలుగున్నర గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.  
శ్రీవాణి టికెట్ల ద్వారా ఇక ఏ రోజుకా రోజే శ్రీవారి దర్శనం Publish Date: Jul 31, 2025 9:21AM

బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నటి ఖుష్బూ

  ప్రముఖ నటి బీజేపీ నాయకురాలు  ఖుష్బూ తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఖుష్బూ సుందర్ సహా 14 మంది నియమితులయ్యారు.  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఐదుగురు, రాష్ట్ర కార్యదర్శులుగా మరో 14 మందితో కూడిన జాబితాను నాగేంద్రన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఖుష్బూ ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా, ఆమె పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2010లో డీఎంకేతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టింది. 2020లో బీజేపీలో చేరారు.  
బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నటి ఖుష్బూ Publish Date: Jul 30, 2025 9:13PM

కాకాణి అరాచకాలు బయటపెడతా..సోమిరెడ్డి హెచ్చరిక

  మాజీ సీఎం  జగన్ రేపు నెల్లూరు పర్యటనపై  టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు . జగన్ మాట విని ఎంతోమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారని, జగన్ వారిని పరామర్శించకుండా, కాకాణిని పరామర్శించేందుకు నెల్లూరుకు ఎందుకు వస్తున్నట్టు అని నిలదీశారు. మధ్యం కుంభ కోణంలో జైలుకు వెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి కోరారు.  "కాకాణి అక్రమాలతో ఎంతోమంది అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు... అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు... రేపు జగన్ పర్యటన ముగియగానే కాకాణి దుర్మార్గాలన్నీ బయటపెడతా" అని హెచ్చరించారు. కాకాణి పాపాలకు బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు.   గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్ మాట విని చెవిరెడ్డి, కసిరెడ్డి, ధనుంజయరెడ్డి ఇలా చాలా మంది జైలుకు వెళ్లారని, వాళ్ల కుటుంబాలను జగన్ ఎందుకు పరామర్శించడంలేదని నిలదీశారు. మరోవైపు జగన్ పర్యటన దృష్ట్యా జన సమీకరణకు పరిమితులు విధించింది. జిల్లాలో 30 యాక్ట్ అమల్లో ఉందని పర్యటన వేళ బయటకు రావద్దని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సహా పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
కాకాణి అరాచకాలు బయటపెడతా..సోమిరెడ్డి హెచ్చరిక Publish Date: Jul 30, 2025 8:06PM

పోలీసుల పహారాలో నెల్లూరు

  వైసీపీ అధినేత జగన్ గత పర్యాటనలలో చేదు అనుభవాలు దృష్ట్యా. రేపు నెల్లూరు జిల్లా పర్యాటనకు పోలీసులు పటిష్థత బందోబస్తుతో పాటు గట్టి ఆంక్షలు విధించారు. నెల్లూరు పట్టణంలో 34 పోలీసు యాక్టు అమలుతోపాటు, ర్యాలీలు, గుంపులుగా చేరడాన్ని పోలీసులు నిషేధించారు. వైసీపీ నాయకులతోపాటు ముఖ్యమైన కార్యకర్తల స్థాయి వారితో సహా వెయ్యి మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అల్లర్లు, తొక్కసలాట జరిగిన కేసులు పెడతామని వారిని హెచ్చరించారు.  గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు జైలు వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్‌లో హెలికాప్టరు‌లో చేరుకున్న జగన్, జైలులో మాజీ మంత్రి కాకణి గోవర్థన్‌రెడ్డి‌ని ములాఖత్‌లో కలవనున్నారు. అనంతరం ఇటీవల దాడికి గురైన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపూరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడి తిరిగి హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.  నెల్లూరు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పోలీసులు రేపు కఠినతర నిషేధాలు అమలు చేస్తున్నారు. జగన్ పర్యాటనకు హెలీప్యాడ్ దగ్గర, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్ద పరిమిత సంఖ్యలో నాయకులు హాజరుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఘనంగా హాజరు కావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో నెల్లూరు పట్టణంలో రేపు జరగుతుందో జనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు  
పోలీసుల పహారాలో నెల్లూరు Publish Date: Jul 30, 2025 7:07PM

శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన GSLV F - 16 రాకెట్

  శ్రీహరికోట నుంచి నింగిలోకి నిసార్ శాటిలైట్ GSLV-F16  రాకెట్‌ దూసుకెళ్లింది.సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి  ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో, నాసా సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్  ఉపగ్రహాన్ని సాయంత్రం 5:40 గంటలకు  ప్రయోగించగా.. 743 కి.మీ. ఎత్తులో సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా చేర్చింది. వాతవరణ సమాచారం కోసం నాసా-ఇస్రో సంయుక్తంగా ఈ ప్రయోగం చేపట్టాయి. NISAR శాటిలైట్ 12 రోజులకోసారి భూమిని చుట్టేస్తు 3D చిత్రాలను అందిస్తుంది. భూమిని స్కాన్ చేస్తూ తుఫాన్లు సునామీలు, వరదలు, అగ్నిపర్వత విస్పోటనం వంటి ప్రకృతి విపత్తులపై అలర్ట్ చేస్తుంది.
శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన GSLV F - 16 రాకెట్ Publish Date: Jul 30, 2025 6:33PM

సిందూర్ పై చర్చ.. ఎటూతేలని రచ్చ!

పహల్గాం ఉగ్రదాడి.. ఆపరేషన్  సిందూర్ పై లోక్ సభలో జూలై 28,29 తేదీలలో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే..  ఈ సుదీర్ఘ చర్చ  వలన దేశానికి ఏమి జరిగింది?  దేశం ముందున్న సందేహాలకు ఏ మేరకు సమాధానం లభించిది? అంటే మాత్రం సమాధానం చెప్పడం సాధ్యం కాదు. నిజానికి దేశ భద్రత, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు, సైనిక చర్యల నియమావళితో పాటుగా అనేకానేక సున్నిత అంశాలతో ముడిపడిన విషయాల్లో అన్ని విషయాలు బయటకు చెప్పడం కుదిరే పని కాదు. విజ్ఞత, వివేచన ఉన్న అందరికీ ఇది తెలిసిన విషయమే. కాబట్టి..  ప్రభుత్వం చెప్పిందే  జరిగిందని కానీ..  జరిగిందే ప్రభుత్వం చెప్పిందని కానీ అనుకోవలసిన అవసరం లేదని నిపుణుల అంటున్నారు. అలాగే..  ప్రతిపక్షం దేశ హితం కోరి  విజ్ఞత, వివేచనతో పరిధులు తెలుసుకునే ప్రశ్నలు సంధించిందని  కూడా అనుకోలేమని అంటున్నారు.  నిజానికి.. రాజకీయ లక్ష్యాలు, రాజకీయ ప్రయోజనాలలే పరమార్ధంగా..  రాజకీయాల చుట్టూనే తిరిగిన చర్చను, రాజకీయ కోణంలోనే  చూడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.      అందుకే.. రెండు రోజుల పాటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య, భారత్, పాక్  క్రికెట్ మ్యాచ్  అంత ఉత్కంఠభరితంగా సాగిన చర్చ  దేశంలో రాజకీయ వేడిని పుట్టించింది. ఆ కారణంగానే పార్లమెంట్  చర్చ పై  రాజకీయ వర్గాల్లో రాజకీయ చర్చ మరింత వేడిగా సాగుతోంది. పార్లమెంట్ లో జరిగిన చర్చను,   ఆ సందర్భంగా అధికార విపక్షాలు వ్యవహరించిన తీరును బట్టి రాజకీయంగా ఎవరికి  ప్లస్.. ఎవరికి మైనస్..  ఎవరికి  ఏమిటి, అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఎడతెగని జరుగుతోంది.  నిజానికి..  ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అంతకంటే ఎక్కువగా ఆ పార్టీ అగ్రనాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు.  గట్టిగానే ప్రశ్నించారు. ముఖ్యంగా..  భారత్ పాకిస్థాన్  మధ్య కాల్పుల విరమణ  తన వల్లనే జరిగిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదే పదే  (మొత్తం 29 సార్లు) చెప్పుకున్నా, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మోదీకి దమ్ముంటే..  పార్లమెంట్’ నుంచి ట్రంప్  చెప్పింది అసత్యం.. ట్రంప్ అబద్ధాల కోరు  అని  మోదీ ప్రకటించాలని సవాల్  విసిరారు. అయితే..  చివర్లో చర్చలో  జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ..  ట్రంప్ పేరు ప్రస్తావించకుండా.. ఒక్క ట్రంప్  అని మాత్రమే కాదు ప్రపంచ దేశాల నాయకులలో  ఏ ఒక్కరూ కూడా కాల్పుల విరమణ చేయమని కోరలేదనీ.. పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వచ్చిన తర్వాతనే తాత్కాలికంగా కాల్పుల విరమణకు మన దేశం అంగీకరించిందని స్పష్టం హేశారు. నిజానికి..  ఆ ఒక్క విషయంలోనే కాదు..  పాకిస్థాన్  కూల్చివేసిన యుద్ద విమానాల లెక్కలు చెప్పాలనీ,  మోదీ ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ( పొలిటికల్ విల్) లేక పోవడం వల్లనే ఆరు యుద్ధ విమానాలు కూలిపోయాయనీ..  ఇలా చాల కాలంగా వీధుల్లో వినిపిస్తున్న సందేహలనే రాహుల్ గాంధీ. కొంత గంభీంగా లోక్ సభలో లేవనెత్తారు.   అయితే..  అధికార కూటమి, ముఖ్యంగా బీజేపీ, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహాల శాఖ మంత్రి జయ శంకర్, అలాగే చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పార్టీని  పాకిస్థాన్  అనుకూల పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు.  కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ అనుకూలమనే  నేరేటివ్  బలంగా వినిపించారు.  పాక్ పుట్టుక మొదలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరించిన పాక్  అనుకూల ధోరణి వివరిస్తూ .. కాంగ్రెస్ పార్టీ  పాకిస్థాన్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందని దుయ్య బట్టారు. ఒక విధంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీని  పాకిస్థాన్ అనుకూల పార్టీగా చిత్రీకరించడంలో కాంగ్రెస్ పార్టీకి  పాక్  పార్టీ ముద్రవేయడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్  అయింది. ఈ ముద్రను తొలిగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పడుతుందని, చాలా శ్రమ పడవలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.  నిజానికి  కాంగ్రెస్  పార్టీని దేశ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించడంలో బీజేపీ పాత్ర కంటే హస్తం పార్టీ స్వయంకృతం పాత్ర ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా..  పార్లమెంట్ లో ఆపరేషన్ సిందూర్  పై చర్చ ప్రారంభమయ్యే సమయంలో.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం  పహల్గాంలో దాడి చేసింది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే అని ఎలా చెపుతారు? దేశీయ ఉగ్రవాదులు కూడా కావచ్చును కదా అంటూ చేసిన వ్యాఖ్యలు, అదే విధంగా..  అంతర్జాతీయ దౌత్య బృందంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, మనీష్ తివారీలకు చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా, వారిని వెలివేసినట్లు ప్రవర్తించడం, అందుకు ఆ ఇద్దరు భారత్ అనుకూల స్టాండ్ తీసుకోవడమే కారణమనే ప్రచారం జరగడంతోంది.
సిందూర్ పై చర్చ.. ఎటూతేలని రచ్చ! Publish Date: Jul 30, 2025 5:42PM

మహిళల గౌరవం కాపాడండి.. లోక్ సభలో గళమెత్తిన బైరెడ్డి శబరి

  ఏపీలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలపై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యాలు చేయడం లైంగిక దాడితో సమానమన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు సమంజనం కాదన్నారు.  కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వేసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో  గళమెత్తారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, 33 శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న తరుణంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమన్నారు.  ప్రజాసేవలో ఉండటం.. మహిళా నేతలకు శిక్ష కారాదన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు పునరావృతం కాకుండా రాజకీయాల్లో ఉన్న మహిళల గౌరవానికి భంగం కలగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆమె స్పీకర్‌ను కోరారు.
మహిళల గౌరవం కాపాడండి.. లోక్ సభలో గళమెత్తిన బైరెడ్డి శబరి Publish Date: Jul 30, 2025 5:26PM