బ్లూ ఫిల్మ్స్ తెగ చూసేస్తున్న భారతావని.. ప్రపంచంలో మూడో స్థానం
posted on Jul 31, 2025 1:02PM

భారత ప్రభుత్వం పాతిక అశ్లీల యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకొంది. 2018లో కూడా భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇచ్చింది. అంతకు ముందు 2015లో సైతం సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి 850 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ లెక్కలు ఎలా ఉన్నా.. మనుషుల ఆలోచనాధోరణుల్లో మార్పులు రానంత వరకూ అశ్లీలతకు ఎవరూ అడ్డుకట్ట వేయలేని పరిస్థితులు ఉన్నాయి.
నీలి చిత్రాలను పంపిణీ చేసే పోర్న్ హబ్ అనే సంస్థ సర్వే ప్రకారం.. అశ్లీల చిత్రాలు చూసేవారిలో అమెరికా, బ్రిటన్ తరువాత స్థానంలో భారతీయులు ఉన్నారు. వివిధ ఇంటర్నెట్ సర్వేలు కూడా మన దేశంలో అశ్లీల చిత్రాలు చూసేవారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 63శాతం మంది చూస్తున్నారు, ఇందులో 75 శాతం మొబైల్స్‌లో చూస్తున్నారు. ఈ మార్కెట్‌ను ఆధారం చేసుకొనే దేశంలో అశ్లీల చిత్రాలు రూపొందించేవారు, నటించేవారు పెరిగిపోయారు. వాటిని యాప్‌లు, వెబ్‌సైట్ల రూపంలో మన ఫోన్లలోకి డంప్ చేస్తున్నారు. ఇటీవల నిషేధానికి గురైన ఉల్లు యాప్ యజమాని ఆస్తి రూ.100కోట్లు అని అంచనా. ఈ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుమ్మరిస్తున్నారు. ఉల్లు యాప్ వాళ్ళు హద్దులు మీరడంతో ఈ యేడాది మే నెలలో జాతీయ మహిళా కమిషన్ సమన్లు ఇచ్చింది. నిషేధానికి గురైన మరో యాప్ ఏఎల్‌టీటీ బాలాజీ. ఈ యాప్ యజమాని ఏక్తా కపూర్. పలు టీవీ సీరియళ్ళు, సినిమాలు తీసిన ఏక్తా కపూర్‌కి 2020లో పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది. ఏఎల్‌టీటీ యాప్‌లో బోల్డ్ కంటెంట్ పేరుతో అశ్లీలాన్ని గుప్పిస్తున్నారు.
నిషేధం వార్త వచ్చాక ఆ కంపెనీతో తనకు సంబంధం లేదనీ.. 2021లో బయటకు వచ్చానని ఏక్తాకపూర్ వివరణ ఇచ్చారు. అయితే సదరు యాప్ బాలాజీ టెలీ ఫిల్మ్స్ నుంచే పుట్టిందని ఆరోపణ. గతంలో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా ఈ అశ్లీల చిత్రాలు నిర్మించి అరెస్టయ్యారు. వెబ్‌సైట్లు, యాప్స్ నిషేధానికి గురవుతుండటంతో వీటిలో నటించేవారు, నిర్మాతలు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఖాతాలు తెరిచి అశ్లీల చిత్రాలు గుమ్మరిస్తున్నారు. అంతే కాదు అందులో నటించేవారు వీడియో కాల్స్ వ్యాపారాలకు తెర తీశారు. నిర్దేశిత రుసుములతో సెమీ న్యూడ్, న్యూడ్ లైవ్ షోల ద్వారా వ్యాపారం చేస్తున్నారు.
కొంతలో కొంత మెరుగు ఏమిటంటే తెలుగులో ఈ తరహా కంటెంట్‌కు తగిన ఆదరణ దక్కలేదు. కరోనా సమయంలో ఇక్కడ కూడా రొమాంటిక్ పేరుతో ఈ తరహా చిత్రాలు, బూతు కథలు చెప్పే వీడియోలు మొదలైనప్పటికీ, తగిన ఆదరణ రాకపోవడంతో కొద్ది కాలమే ఆ దందా నడిచింది. ఇందులో కొందరు పెయిడ్ వీడియోలు మొదలుపెట్టారు. అలాగే హాస్యం పేరుతో బూతులతో వీడియోలు చేస్తున్నారు. రీల్స్ ద్వారా ప్రవహిస్తున్న అశ్లీలత మరో ఎత్తు. ఏఐ టెక్నాలజీ వాడి స్టాండప్ కామెడీ వీడియోల తరహాలో యువతులను సృష్టించి వారితో పచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు. పొర్నోగ్రఫీకి సంబంధించిన కేసులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం నమోదు చేస్తున్నారు. 2015లో వచ్చిన తీర్పు మేరకు ఇంట్లో నాలుగు గోడల మధ్య పోర్న్ చూడటం నేరం కాదు. అయితే ఆ తరహా వీడియోలు తీయడం, ప్రచారం, పంపిణీ మాత్రం నేరం. సెక్షన్ 292 అశ్లీలం అంటే ఏంటో వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం వీటిని రూపొందించడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం నేరంగా పరిగణిస్తూ తొలిసారి అయితే మూడేళ్ల జైలు శిక్ష, రెండోసారి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సెక్షన్ 67ఏ ప్రకారం అశ్లీల కంటెంట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేయడం, షేర్ చేయడం నేరం. ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.