సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్ ముంద‌స్తు బెయిల్ ర‌ద్దు

 

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజ‌య్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయ‌న‌కు హైకోర్టు ముంద‌స్తు  బెయిల్‌ను మంజూరు చేసిన  అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 3 వారాల్లోగా సరెండర్ కావాలని ఆదేశించింది. గత వైసీపీ హయాంలో అగ్నిమాప‌క విభాగంలో అవినీతి కేసులో సంజ‌య్‌పై కుటమి ప్ర‌భుత్వం ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. 

దాంతో హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాద‌న‌ల త‌ర్వాత జ‌స్టిస్ ఎన్‌వీఎన్ భ‌ట్టి, జ‌స్టిస్ అమానుతుల్లా ధ‌ర్మాస‌నం ఈ రోజు తీర్పును వెల్ల‌డించింది. ఇక‌, విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ హైకోర్టు తీర్పుపై ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముంద‌స్తు బెయిల్ ద‌శ‌లోనే ట్ర‌య‌ల్‌ను పూర్తి చేసిన‌ట్టు ఉంద‌ని మండిప‌డింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపకశాఖకు సంబంధించి వెబ్‌సైట్, యాప్‌లతో పాటుగా పలు అంశాలకు సంబంధించి.. ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 

కాంట్రాక్ట్ అప్పగించిన తర్వాత ఆ సంస్థ ఎలాంటి పనులు చేయకపోయినా డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఉన్నాయి. అలాగే సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనలకు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు.. అక్కడా సదస్సులు నిర్వహించకుండా బిల్లులు పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి దీనిపై ఆయనపై కేసు నమోదు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu