నెల్లూరు లో టెన్షన్.. టెన్షన్
posted on Jul 31, 2025 10:20AM
.webp)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం (జులై 31) నెల్లూరు పర్యటన సందర్భంగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాపర్ట్ లో బయలుదేరిన జగన్ నెల్లూరు జైలుకు చేరుకుని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెడతారు.
కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్దకు పది మందికి మాత్రమే అనుమతించారు. అలాగే జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ములాఖత్ కు జగన్ సహా ముగ్గురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇక జగన్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి కూడా వెళ్లనున్నారు. అక్కడకు జగన్ తో పాటు వంద మంది మించి ఉండరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆంక్షల ఉల్లంఘనకే సిద్ధమయ్యారు. ఇప్పటికే వారు కార్యకర్తలను తాము కట్టడి చేయలేమని ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు వ్యాప్తంగా హై టెన్షన్ నెలకొంది. నెల్లూరు పర్యటన ముగించుకున్న తరువాత జగన్ నేరుగా అక్కడి నుంచే బెంగళూరుకు వెడతారు.
కాగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అయితే వైవసీపీ శ్రేణులు మాత్రం ఆంక్షలను ఖాతరు చేయకుండా.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. అలాగే నెల్లూరు జైలు వద్ద కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడారు. ఈ నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న టెన్షన్ సర్వత్యా కనిపిస్తోంది.