Read more!

సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది ఏడవ రోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది ఏడవ రోజు పారాయణము

 

 

త్రయోవింశాధ్యాయము  

విష్ణు గణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథానంతరం, ధర్మదత్తుడు మరలా వారిని 'ఓ గాణాధిపతులారా! జయ __ విజములు వైకుంఠమందలి విష్ణుద్వారపాలకులని వినివున్నాను. వారెటువంటి పుణ్యం చేసుకోవటం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు.

జయ __ విజముల పూర్వజన్మలు

 

 

తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృకస్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండో వాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయుణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిదులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన, మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛి౦చాడు. అన్నదమ్ములిద్దరూ కలసి వెళ్ళి, ఒకరు బ్రహ్మ, మరొకరు యజకులుగా వుండి, ఆ యజ్ఞాన్ని దిగ్విజయముగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు, వారికి ఆగణితమైన దక్షణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలచారు. తదర్ధంగా మరుత్తు ఇచ్చిన __మహాదక్షణను పంచుకోవడములో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం  కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి 'నువ్వు మొసలివై పొమ్మని' శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక 'అహంకారంతో శపించిన నువ్వు, సాహంకారియైన సామజమై పుడతావులే' అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరిలిద్దరూ విష్ణ్వర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసికొనినవారై తమ శాపాలనూ, తత్పూర్వాపరాలనూ విన్నవించుకుని శాపవిముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు.'హే భగవాన్! నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ, ఏనుగుగానూ పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్ళించు' అని మనవి చేశారు.

 

 

 

 


అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు 'జయ __ విజయులారా! నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్థంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావాతారాలనూ ధరించాను. అందువలన మీరు సత్యం తప్పనివారై __ మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్నీ పొందండి' అని ఆదేశించడంలో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ __ విజయలిద్దరూ గండకీనది ప్రాంతాన మకర, మాతంగాలుగా జన్మించి, పూర్వ జన్మ జ్ఞానం కలవారై __ విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు. అలా వుండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది.    

 

 


ఆ కార్తీకమాసములో కార్తీకస్నానం చేయాలనే కోరికతో __ ఎనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా వుంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్ధించాడు. తలచినదే తడివిగా ప్రత్యక్షమైన తార్ క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్దరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణుప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి. ఓ ధర్మదత్తా! నీచే అడుగబడిన వారైనా విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా డంభమాత్సర్యాలను దిగనాడీ, సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరన సేవలను ఆచరించు . తులా మకర, మేష సంక్రమణాలతో ప్రాతఃస్నానాలు ఆచరించు, తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గోబ్రహ్మణులునూ, విష్ణుభక్తులనూ సర్వదా సేవించు. కొర్ర ధాన్యము, పులికడుగు నీరు, వంగా మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తూన్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటె __ దన, తపో, యజ్ఞ తీర్ధాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా! దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవూ, నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము' అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్టుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు.

 


నారదుడు చెబుతున్నాడు! 'పృథురాజా! అతిపురాతమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో, వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై __ విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూన్నాడు.
 

త్రయవింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము)
 

చతుర్వి౦శోధ్యాయః
 
  
నారదుడు చెప్పినదంతా విని, ఆశ్చర్యమయుడైన పృథు చక్త్రవర్తి __'హే దేవర్షీ ! ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ, సరస్వతీత్యాదినదుల గురించి విన్నాను. ఆ మహా మహిమలన్నీ ఆ నదులకు చెందినవా? లేక, ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరిచవే' అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు. 'శ్రద్దగా విను. కృష్ణానది సాక్ష్యాత్తూ విష్ణుస్వరూపం. సరస్వతీనది శుద్ధ శివస్వరూపం . వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది.

కృష్ణా __ సరస్వతీ నదుల ప్రాదుర్భావము

 

 

ఒకానొక చాక్షుష మన్వంతరంలో, బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలూ, మునులూ కూడా కలసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి __ కర్త యొక్క కళత్రమయిన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయిన సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు.

దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి __'హే విష్ణూ! సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు. ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడేమిటి గతి? ' అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ 'సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక భార్యయైన గాయత్రి దీక్షాపతిగా విధించండి. ' అని సలహా యిచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్ధించడంతో   భృగువు గాయత్రిని రప్పించి, బ్రహ్మ యొక్క దక్షణభాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరచాడు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్ష నీయడం పూర్తీ చేయగానే __ అక్కడకు సరస్వతి చేరుకుంది. తన స్థానంలో దీక్షితురాలయి వున్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవితయై __

స్వరో వాచః శ్లో "అపూజ్య యత్రపూజ్యంతే, పూజ్యనాం చవ్యతిక్రమః

త్రీణిత్రత భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం "

 

 



'ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో, మరియు పూజనీయులు పూజింప బడడము లేదో __ అక్కడ కరువు, భయము మరణము __ అనే మూడు విపత్తులు కలుగుతాయి.

ఈ బ్రహ్మకు దక్షణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైన ఉవిధ ప్రజలకు కనుపించనటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక! ఓ బ్రహ్మ , విష్ణు, మహేశ్వరులారా! మీరందరూ ఈ యజ్ఞ వాటికలో వుండి కూడా, నా సింహాసనాన-నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు. గనుక మీరు కూడా జఢీభూత నదీరూపాలను పొందండి' అని శంపించింది.
ఆ సరస్వతీ క్రుద్ధ వచనాలను వింటూనే, చివ్వున గాయత్రి __ దేవతలు వారించుకున్నా సరే వినకుండా __ ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా , భర్తయో, అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు గనుక నువ్వుకూడా నదీ రూపాన్ని పొందు, అని ప్రతిశాపమిచ్చింది.

ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి __'మేము నదులమయినట్లయితే లోకాలన్నీ అతలాకుతులమయిపోతాయి. గనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్ళించుకో' మన్నారు. కాని ఆమె వినలేదు. 'యజ్ఞాదిలో మీరు విఘ్నేసుర పూజ చేయక పోవడం వలననే __ నా కోప రూపంగా యాగం విఘ్నుడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీరూపాలను ధరించి, మీ అంశలు జగత్వాన్ని వహించవలసినదే,  సమతులమైన నేను, గాయత్రీ కూడా నదులపై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము' అని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలూ జడాలుగానూ, రూపాలు నదులుగానూ పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు.

 

 

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగానూ, వారి వారి భార్యలు నదులై __ పశ్చిమాభిముఖంగానూ, ప్రవహించనారంభించారు. గాయత్రీ , సరస్వతీ నదీ రూపాలు సావిత్రీ అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్టతులైన శివ, కేశవులు __ మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. సర్వపాప హరిణియైన ఈ కృష్ణానదీ ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా వినిపించినా __ వారి వంశమంతా  కూడా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది.
   
ఏవం శ్రీపద్మ పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు
ఇరువది మూడు, ఇరువది నాలుగు __ అధ్యాయములు

 

 

 

27 వ రోజు

నిషిద్ధములు :- ఉల్లి, ఉసిరి, వంకాయ

దానములు :- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు 

పూజించాల్సిన దైవము :- కార్తీక దామోదరుడు

జపించాల్సిన మంత్రము :- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా

ఫలితము :- మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

 

ఇరువది ఏడవ (బహుళ ద్వాదశి) రోజు పారాయణము సమాప్తము