Read more!

సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరువది అయిదవరోజు పారాయణము

 

సంపూర్ణ కార్తీక మహాపురాణము

ఇరువది అయిదవరోజు పారాయణము

 

 

ఏకోన వింశత్యధ్యాయః

పృధువు అడుగుతున్నాడు: 'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహాత్య్య్రున్ని విని ధన్యుడనైనాను. అదే విధంగా __ కార్తీక వ్రతాచరణా ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరి చేత ఎలా ఆచరించబడిందో కూడా విస్తారంగా తెలియజేయి' అని కోరగానే, నారదుడిలా వినిపించసాగాడు.



ధర్మదత్తోపాఖ్యానము

 

 

చాలాకాలం పూర్వం సహ్య పర్వత భూమిని __ కరవీరమనే ఊరుండేది. ఆ ఊళ్ళో ధర్మవేత్త, నిరంతర హరి పూజసక్తుడు, నిత్య ద్వాదశాక్షరీ జపవ్రతుడు అతిథి సేవాపరాయణడూయైన ధర్మదత్తుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఒకానొక కార్తీక మాసంలో ఆ విపురుడు విష్ణుజాగరణ చేయదలచిన వాడై తెల్లవారు ఝామునే లేచి పూజోపకరణాలు సమకూర్చుకుని విష్ణ్వాలయానికి బయలుదేరాడు. ఆ దారిలో వంకరలు తిరిగి ఘోర దంష్ట్రాలూ, పాటిస్తూన్న నాలుకా, ఎర్రటికళ్ళూ, దళసరిపాటి పెదాలూ, మాంసరహితమయిన శరీరమూ గలదీ, పందివలె ఘర్ఘుస్తున్నదీ అయిన ఒక  దిగంబర రాక్షసి తారసపడింది. దానిని చూసి భీతి చెందిన ఆ బ్రాహ్మణుడు హరిస్మరణ చేస్తూనే- ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో సహా దానిని కొట్టాడు. హరిస్మరణతో తులసీభరితమైన జలతాడనం చేయడం వలన, ఆ నీళ్ళు సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలై పోతాయి. తద్వారా ఏర్పడిన జ్ఞానం వలన 'కలహా' అనబడే ఆ రాక్షసి ఆ బ్రాహ్మణునకు సాష్టంగంగా ప్రణమిల్లి __ తన పూర్వ జన్మ కర్మ విపాకాన్నిలా విన్నవించసాగింది. 'కలహా' చెబుతోంది __ పుణ్యమూర్తివైన ఓ బ్రాహ్మణుడా! పూర్వములో నేను సౌరాష్ట్ర దేశమందలి భిక్షుడునే బ్రాహ్మణుని భార్యను. అప్పుడు మిక్కిలి కఠినురాలినై వుంటూ కలహా అనే పేరుతో పిలవబడే దానిని. నేనేనాడూ నా భర్త ఆజ్ఞలను పాటించి ఎరుగను. ఆయన హితవును ఆలకించేదానిని గాను. నేనలా కలహాకారిణై అహంకరించి వుండటం వలన కొన్నాళ్లకు, నాథుని మనసు విరిగి మారుమనువాడాలనే కోరికతో వుండేవాడు. అతనకు నేను సుఖ పెట్టలేకపోయినా, మారు మనువు చేసుకోవాలనే ఆయన కోరికను గుర్తించి, భరించలేక విషం తాగి చనిపోయాను.

 

 


యమదూతలు నన్ను తీసుకు వెళ్ళి యముడి ముందు నిలబెట్టారు. యముడు చిత్రగుప్తుడిని చూసి, చిత్రగుప్తా! దీని కర్మకాండలను తెలియజేయి. శుభమైనా,  అశుభమైనా సరే, కర్మఫలాన్ని అనుభవించావాల్సిందే ' నన్నాడు. అందు మీదట చిత్రగుప్తుడు, ఓ ధర్మరాజా! ఇది ఒక మంచి పని కూడా చేయలేదు. తాను షడ్రసోపేతంగా భోజనం చేసిన తర్వాత కూడా, భర్తకు అన్నము పెట్టేది కాదు. అందువల్ల మేక జన్మమెత్తి బాధిష్టయగు గాక! నిత్యమూ భర్తతో కలహించి అతని మనసుకు బాధ కలిగించినందుకు గాను పంది యోనిని పురుగై పుట్టుగాక! వండిన వంటను తానొక్కతే తినిన పాపానికిగాను పిల్లి యోనిని పుట్టి తన పిల్లలను తానే తినుగాక! భర్త్రుద్వేషిణియై ఆత్మహత్య చేసుకున్నందు వలన అత్యంత నిందితమైన ప్రేత శరీరాన్ని పొందుగాక! ఇది ప్రేతరూపమును పొంది కొన్నాళ్ళు నిర్జల స్థానంలో వుండి, అనంతరం, యోని త్రయాన జన్మించి అప్పటికైనా సత్కార్యముల నాచరించుగాక!" అని తీర్మానించాడు.

 

 

 


అది మొదులుగా ఓ ధర్మదత్తా! నేను అయిదువందల సంవత్సరాల పాటు ఈ ప్రేత శరీరం ధరించి ఆకలి దుప్పులతో అల్లాడుతూ అలనాటి నా పాపాలకై దుఃఖిస్తున్నాను. అనంతరం కృష్ణా, సరస్వతి సంగమ స్థానమైన దక్షణ దేశానికి రాగా __ అక్కడి శివగణాలు నన్ను తరిమికొట్టగా ఇలా వచ్చాను. పరమ పావమైన తులసి జలాలతో నీవు తాడించడం వలన ఈపాటి పూర్వస్మృతి కలిగింది. పుణ్యతేజస్వివైన నీ దర్శనం లభించింది. కాబట్టి కళ౦కరహితుడవైన  భూసురుడా! ఈ ప్రేత శరీరం నుంచీ, దీని తదుపరి ఎత్తవలసిన యోనులలోని జన్మ త్రయాన్నుంచీ, నాకెలా ముక్తి లభిస్తుందో చెప్పి రక్షించు __ అని ప్రాధేయపడింది కలహా చెప్పినదంతా విని కలతపడిన మనస్సు గలవాడైన ఆ విప్రుడు సుదీర్ఘ సమయం యోచించి, యోచించి దుఃఖభార హృదయుడై ఇలా చెప్పసాగాడు.
   
ఏకోనవింశ త్యధ్యాయ సమాప్తః

వింశత్యధ్యాయము

 

 

 


ధర్మదత్తుడు చెబుతున్నాడు : 'ఓ కలహా! తీర్ధాలూ, దానాలు వ్రతాలూ చేయడం వలన పాపాలు నశించిపోతాయి. కాని నీ ప్రేత శరీరం వలన వాటిని ఆచరించేందుకు నీకు అధికారం లేదు. అదీగాక మూడు యోనులలో మూడు జన్మలలో అనుభవించ వలసిన కర్మపరిపాకం స్వల్ప పుణ్యాలతో తీరదు. అందువలన నేను పుట్టి బుద్దెరిగిన నాటినుండి ఆచరిస్తూ వున్న కార్తీక వ్రత పుణ్యంలో సగభాగాన్ని నీకు ధారపోస్తాను. తద్వారా నీవు తరించి ముక్తిని పొందు.' ఈ విధంగా చెప్పి ద్వాదశాక్షరీ  మంత్రయుక్తంగా తులసీతోయాలతో ఆమెనభిషేకించి, కార్తీక వ్రత పుణ్యాన్ని ధారపోశాడు. ఉత్తరక్షణంలోనే కలహా __ ప్రేత శరీరాన్ని విడిచి, దివ్యరూపిణియై, అగ్నిశిఖవలె లక్ష్మికళతో ప్రకాశించింది. అమితానందంతో ఆమె ధర్మదత్తునికి కృతఙ్ఞతలు చెప్పుకుంటూ వుండగానే,.

విష్ణుస్వరూపులైన పార్షదులు ఆకాశం నుంచి విమానంతో సహా వచ్చారు. వారిలోని పుణ్యశీల, సుశీల అనే ద్వారపాలకుల చేత కలహా విమానమందాసీనగా, చేయబడి అప్పరోగణాల చేత సేవించబడసాగింది. ఆ విమానాన్ని చూస్తూనే అందులోని విష్ణుగణాలకు సాష్టాంగపడ్డాడు. ధర్మదత్తుడు. సుశీలా పుణ్యశీలులిద్దరూ అతనిని లేవదీసి, సంతసం కలిగించే విధంగా ఇలా చెప్పసాగారు.

 

 


ఓ విష్ణుభక్తా! దీనుల యందు దయాబుద్ధి గలవాడవూ, ధర్మవిదుడవూ, విష్ణుభక్తుడవూ, అయిన నీవు అత్యంత యోగ్యుడవు __ లోకోత్తరమైన కార్తీక వ్రత పుణ్యాన్ని ఒక దీనురాలి కోసం త్యాగం చేయడం వలన __ నీ యొక్క నూరు జన్మలలోని పాపాలు యావత్తూ సర్వనాశనమై పోయాయి. ఈమె పూర్వ సంచితమంతా నీచే చేయించబడిన స్నానఫలం వలన తొలగిపోయింది. విష్ణుజాగరణ ఫలంగా విమానం తేబడింది. నీవామెకు అర్పించిన దీపదాన పుణ్యం వలన తేజోరూపాన్ని తులసీ పూజాదుల వలన విష్ణు సాన్నిధ్యాన్నీ ఆమె పొందబోతోంది. ఓ పవిత్ర చరిత్రుడా ! మానవులకు మాధవ సేవ వలన కలుగని మనోవాంఛిత మంటూ యేదీ లేదు. విష్ణుధ్యాన తత్పరుడవైన నీవు ఇద్దరు భార్యలతోనూ కలసి అనేక వేల సంవంత్సరాలపాటు విష్ణు సాన్నిధ్యంలో వినోదించగలవు.

ధర్మదత్తునికి విష్ణుదూతల వరం

 


విష్ణుదూతలు చెబుతున్నారు : ఓ ధర్మదత్తుడా! వైకుంఠంలో నీ పుణ్యఫలాను  భావానంతరం తిరిగి భూలోకంలోని సూర్యవంశంలో దశరధుడనే మహారాజుగా పుడతావు. నీ భార్యలిద్దరూ ఆ జన్మలో కూడా నీకు భార్యలవుతారు. ఇప్పుడు నీచే పుణ్యాభిషిక్తయైన ఈ 'కలహా' యే నీకా జన్మలో మూడవ భార్యగా పరిణమిస్తుంది. దివ్యకార్యార్ధయై  భూమిని అవతరించనున్న విష్ణువు ఆ పుట్టుకలో నీ కుమారుడిగా జన్మిస్తాడు. ఓ ధాత్రీ సురవ రేణ్యా! విష్ణువునకు అత్యంత ప్రీతకరమైన ఈ కార్తీక వ్రతంతో సమానమయిన యజ్ఞయాగాదులుగాని, దానతీర్దాలుగాని లేవని తెలుసుకో. అంతటి మహొత్క్రుష్ట్యమైనదీ, నీచే ఆచరి౦బడినదీయైన ఈ కార్తీక వ్రతంలో కేవలం సగభాగవు పుణ్యానికే ఈ స్త్రీవిష్ణులోకాన్ని పొందుతూ వుంది. ఆమెను ఉద్దరించాలనే నీ సంకల్పం నెరవేరింది గనుక, నీవు దిగులుడుగవయ్యా అన్నారు విష్ణుదూతలు.
   
 ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందలి


పందొమ్మిదీ, ఇరువదీ  __ అధ్యాయములు

 

25 వ రోజు

నిషిద్ధములు  :- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు

దానములు  :- యథాశక్తి

పూజించాల్సిన దైవము  :- దిక్వాలకులు

జపించాల్సిన మంత్రము :- ఓం ఈశావాస్యాయ స్వాహా

ఫలితము :- అఖండకీర్తి, పదవీప్రాప్తి

 

ఇరువది అయిదవ (బహుశ దశమి) రోజు పారాయణము సమాప్తము