Home » Karthikamasa Vaibhavam » కార్తీక మాసంలో ఉపవాసాల వల్ల ప్రయోజనం!


 

కార్తీక మాసంలో ఉపవాసాల వల్ల ప్రయోజనం!

 

ప్రతీ మాసంలోనూ ఏవో కొన్ని పండుగలు రావడం సహజం. కానీ కార్తీక మాస విశిష్ఠత ఏమిటంటే, ఇందులో ప్రతి రోజూ ఒక పండుగే! జపతపాలతో, ఉపవాసాలతో, దీపదానాలతో, కార్తీకస్నానాలతో, వ్రతాలతో… కార్తీక మాసమంతా దైవనామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులేమీ చేయనవసరం లేదు. కోరి ఖర్చుపెట్టాల్సిన అవసరమూ లేదు. కావల్సిందల్లా నిష్ఠ! పాటించవలసిందల్లా నియమం! అలాంటి ఒక నియమమైన ఉపవాసం గురించి…

కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారంనాడూ ఉపవాసాన్ని ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీక మహాపురాణం` చెబుతోంది. ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో, అలాగే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాము. అంతేనా! మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే శరీరం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణం! అలా కాకుండా ఒక రోజంతా కనుక శరీరాన్ని తన మానాన వదిలేస్తే… దానికి ఉన్న రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరంలోని మూలమూలలా ఉన్న దోషాలను ఎదుర్కొని, అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.


 

మన శరీరానికి తనకు తానుగా స్వస్థత పరచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేయగల్గుతుంది. అయితే దానికి అంత అవకాశం ఇచ్చే ఓపిక తీరిక మనకి ఉండవు. పైగా ఏ చిన్న రోగం ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం ఒకటి ఎప్పుడూ మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. అందుకే ఠక్కున మందుబిళ్లలు వేసేసుకుంటాం. కానీ మన పెద్దలు అలా భయపడేవారు కాదు. అజీర్ణం చేసినా, జ్వరం వచ్చినా… ఉపవాసం ఉండి, శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయుర్వేదంలో `లంకణం పరమౌషధం` అని చెప్పారు. బ్రౌన్‌ నిఘంటువులో `A day passed without eating any food when one is attacked with fever and other diseases.` అని లంకణానికి నిర్వచనం కనిపిస్తుంది.


ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతని అలా ఉంచితే, మానసికంగా కూడా దాని ప్రభావం అమోఘం. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్నీ, మనసునీ కూడా ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే… మనం తినే ఆహారమే మన ఔషధం! విపరీతమైన కారం తింటే ఒకరకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరోరకమైన ఆలోచనలకు ప్రోత్సహం ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తల్చుకునేందుకు, అన్ని మతాలవారూ ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారమూ లేనప్పుడూ, భగవన్నామస్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. హైందవ ఆచారాలలో కూడా ఏదో ఒక సందర్భంగా ఉపవాసాలని జోడిస్తూనే వచ్చారు. కనీసం పదిహేను రోజులకి ఒకసారన్నా ఉపవాసం ఉండేలా ఏకాదశినాడు ఉపవాసం ఉండమని సూచించారు. అదీ ఇదీ కాదంటే కనీసం కార్తీక సోమవారాలలో అన్నా ఉపవాసం ఉండమని చెబుతున్నాయి మన శాస్త్రాలు.

ఇక ఉపవాసాల కోసం కార్తీకమాసాన్నే ఎంచుకోవడంలో మరో ఔచిత్యం ఉంది. బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే, శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా ఎంతో కొంత శక్తి అవసరం అవుతుంది. నవంబరు మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి. ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు, మనసుని శివపరం చేసుకునేందుకు కార్తీకమాస ఉపవాసాలని మించి ఏముంటాయి.
 

- నిర్జర


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.