అమ్మంటే అమృతమేనా అంతకు మించింది కాదూ అమృతం అమరత్వాన్నివ్వచ్చు..కానీ..జీవితంలో తారసపడే అన్ని రుచులనూ ఆస్వాదించడం, యెదురయ్యే ఆటుపోట్లను తట్టుకోవడం యెలాగో తెలిపేది అమ్మే కదా.. అయిదుగురు అన్నగార్ల తర్వాత అపురూపంగా పుట్టి, పుట్టింటిలో అస్తారుబస్తంగా పెరిగిన పిల్ల ఒక పెద్దింటికి పెద్దకోడలై, ఆ వంశాన్ని అమృతమయం చేసి, అక్కడందరికీ తలలో నాలుకలా మెలిగిన మా అమ్మగారు పద్మావతి గురించి యేమని చెప్పగలను? యెంతని చెప్పగలను? యెప్పటెప్పటివో జ్ఞాపకాలు అవిరామంగా మనసును కలచివేస్తుంటే ఒక్కొక్కటీ విడదీసుకుంటూ, చాలా చాలా కొద్దిగా మాత్రమే చెప్పాలంటే కష్టమే. పుస్తకాలను చేతబట్టి చదువు నేర్వకపోయినా జీవితాన్ని క్షుణ్ణంగా చదివిన ఆవిడ చెప్పిన కొన్ని జీవితసత్యాలు అక్షరసత్యాలనే అనిపిస్తాయి. అందులో ఒకటి.. మన అన్నం మనం తిన్నా యెదుటివారికి బెదరాలి..అన్నారు ఓసారి మా అమ్మగారు.. అంటే యేవిటీ అనడిగాను. దానికి సమాధానంగా.. మనం ఆకలిగా వున్నప్పుడు పిలిచి యెవరూ అన్నం పెట్టరు కానీ మనం ఆపదలో వున్నప్పుడు మాత్రం మాటలనడానికి ప్రతివారూ ముందుంటారు, అందుకే యే పని చేస్తున్నా మనని పదిమంది గమనిస్తున్నారు అన్న స్పృహతో వుండాలి అని చెప్పారు. యెంత సత్యం ఆ మాట. మరోటి.. కట్టూ బొట్టూలో కాస్త తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. నీ కట్టూబొట్టూ చూసి నువ్వెవరి పిల్లవో తెలియాలి అనేవారు. అన్నింటికన్నా నాకు యిప్పటికీ బాగా గుర్తుండిపోయేదేవిటంటే.. ఆ రోజుల్లో మా బంధువుల్లోనే నాకంటే వయసులో చాలా పెద్దయిన హైస్కూల్ దాటని ఆడపిల్లలు కొంతమంది వుండేవారు. వాళ్లంతా ప్రతియేడూ ఆంధ్రామెట్రిక్ అనే పరీక్షకి వెడుతుండేవారు. వాళ్లకి పెళ్ళిసంబంధాలు చూస్తున్నప్పుడు మా అమ్మాయి మెట్రిక్ చదువుతోంది అని చెప్పేవారు వాళ్ల తల్లితండ్రులు. యెప్పుడు పెళ్ళి కుదిరితే అప్పుడు చదువు ఆపెయ్యడమే. అంటే ఆడపిల్లలకి జీవితంలో పెళ్ళికున్న ప్రాముఖ్యం మరి దేనికీ వుండేదికాదు. నాకైతే పధ్నాలుగేళ్ళకే ఎస్.ఎస్.ఎల్.సి. అయిపోయింది. అ తర్వాత ఒకేడాది పి.యు.సి., మరో మూడేళ్ళు డిగ్రీ.. అంటే పధ్ధెనిమిదేళ్ళకే డిగ్రీ చేతికి వచ్చేసేయొచ్చన్న మాట. అలాంటప్పుడు ఒకరోజు నేను డిగ్రీ పరీక్ష రాయడానికి వెడుతూ, “ పరీక్షకి వెళ్ళొస్తానమ్మా.. “ అని చెప్పాను మా అమ్మగారితో. అప్పుడు ఆవిడ నాతో “యిదిగో చూడూ.. ఈ పరీక్ష పాసయ్యేలా రాయకు. ఫెయిలైపో..” అన్నారు. నాకు ఒక్కక్షణం ఆవిడన్న మాట అర్ధంకాలేదు. యెవరైనా పిల్లలు పరీక్ష రాయడానికి వెడుతుంటే పెద్దవాళ్ళు “బాగా రాయమ్మా..” అంటారు కానీ యిలాగ ఫెయిలవమని అంటారా.. నాకు కోపంతోపాటు ఒకవిధమైన దుఃఖం కూడా వచ్చేసింది. “అదేంటమ్మా.. పరీక్షకి వెడుతుంటే అలా అంటావూ?” అన్నాను. అప్పుడు మా అమ్మగారు నెమ్మదిగా, “అదికాదమ్మా, నువ్విలా గబగబా డిగ్రీ పూర్తి చేసేసేవనుకో.. నీకు వయసెక్కువని పెళ్ళిసంబంధంవాళ్ళు అనుకుంటారు. అదే డిగ్రీ చదువుతూ వున్నావనుకో.. ఇంకా చిన్నపిల్లే..చేసుకోవచ్చు అనుకుంటారు. ఆ మెట్రిక్ కి కట్టేవాళ్లని చూడూ.. ఇంకా చిన్నవాళ్లనే అనుకుంటున్నారు..అదే నువ్వు డిగ్రీ తెచ్చేసుకున్నావనుకో.. వయసెక్కువనుకుంటారు. మంచిసంబంధాలన్నీ పోతాయి..” అన్నారు. మా అమ్మగారి తర్కానికి నాకు తల తిరిగిపోయింది. అప్పుడైతే అలా అన్నందుకు అమ్మ మీద చిరాకు పడ్డాను కానీ తర్వాత నేనూ అమ్మనయ్యాక కానీ అందులో వున్న ఆంతర్యం బొధపడలేదు. కూతురిని జీవితంలో బాగా స్థిరపరచడానికి తల్లి పడే ఆతృత ఆ తర్వాత కానీ తెలీలేదు. కూతురికి మంచి కుటుంబజీవితం యేర్పడాలన్న ఆ తల్లి ఆరాటం, దానికోసం తాపత్రయపడే అమాయకత్వం తల్చుకుంటే యిప్పటికీ వళ్ళు జలదరిస్తుంది. అందుకనే అమ్మ అమ్మే.. అమ్మ యేమన్నా అది తన పిల్లల భవిష్యత్తు బంగారం కావాలనే. ఈ రోజు మేమందరం యింత బాగున్నామంటే ఆ చల్లనితల్లి ఆశీర్వచనమే. ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మని మరోసారి గుర్తు చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా వుంది. జి. యస్. లక్ష్మి. (ప్రముఖ రచయిత్రి)
అమ్మంటే ఎవరో తెలుసా “అమ్మంటే ఎవరో తెలుసా?” అంటూ ఒక ఆర్ద్ర గీతపు పల్లవిలో ప్రశ్న వేసి, చరణంలో ‘ తన సుఖాన్ని విడనాడి తరుణి తల్లి అవుతుంది. సంతానం కోసం బ్రతుకంత ధార పోస్తుంది’ అంటూ జవాబిచ్చారు, డా. నారాయణ రెడ్డి గారు. నా జ్ఞాపకాల దొంతరల్లో మా అమ్మ గురించిన తొలి జ్ఞాపకం, పదిమంది పిల్లల్ని తన చుట్టూ కూర్చోపెట్టుకుని, అన్నం కలిపి పెడుతున్న అన్నపూర్ణగానే. అమ్మ పేరు పార్వతి. పశ్చిమ గోగావరి జిల్లా నరసాపురంలో శ్రీ యేలేశ్వరపు జోగినాథస్వామి గారు, శ్రీమతి లక్ష్మీదేవమ్మ గార్ల నాల్గవ సంతానంగా పుట్టిన అమ్మ వివాహం నాన్నగారు శ్రీ రామకృష్ణ శాస్త్రి గారితో జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లి వచ్చిన తాతగారు స్వతంత్ర భారతాన్ని అన్నపూర్ణగా మార్చే యజ్ఞంలో నాన్నగారు పాలుపంచుకోవాలని వందెకరాల అడవిని కొన్నారు. చేస్తున్న ప్రభుత్వోద్యోగానికి పెళ్లైన కొత్తల్లోనే రాజీనామా ఇచ్చేసి నాన్నగారు ఆ అడవిని వ్యవసాయ యోగ్యమైన పొలంగా మార్చే పనిలోకి ప్రవేశించారు. పెట్టుబడికి డబ్బు లేదు. రాయీరప్పలతో ముళ్లపొదలతో నిండిన అడవి. నీటి వసతి లేదు. కనుచూపు మేరలో మరొక్క ఇల్లు కూడా లేని నిర్మానుష్య ప్రదేశం!విశాలమైన మండువా లోగిలిలో ధనవంతుల ఇంటి గారాల బిడ్డగా పెరిగిన అమ్మ , ఆ పరిసరాల్నీ, ఆ తాటాకు కుటీరాన్నీ చూసి బెంగపడినా సర్దుకుని ఆ ఇంట్లో భాగమై పోయింది. అత్త మామలు, ముగ్గురాడపడుచులూ, ముగ్గురు మరుదులూ, వారి పిల్లలూ, మామగారి చెల్లెలు , వారి కుటుంబం, అత్తగారి అక్కలూ , వారి పిల్లలు, ఇంకా పెదమామగారి మనవలు, స్నేహితులు వారి కుటుంబాలూ … ఇలా ఆ వనం లోని పర్ణశాలలో ఎప్పుడూ బంధువాహిని ప్రవహిస్తూ ఉండేది. ముఖ్యంగా ప్రతి వేసవిలోనూ ఆ తోటలో పారే సెలయేరులా , దూకే జలపాతంలా పాతికమంది పిల్లల హోరు ప్రతిధ్వనించేది. ఇంతమందికీ విసుగన్నది లేకుండా మామ్మ వెనకే అమ్మ చిరునవ్వుతో అన్నపానాలు ఏర్పాటు చేసేది. ఆత్మీయంగా, నిష్కల్మషంగా ఆదరించేది. వచ్చిన పిల్లలంతా ఆట పాటల వయసువాళ్లు కావడం వల్లా, వెంట వచ్చిన తల్లి తండ్రులు కొద్దిరోజులుండి వెళ్లిపోవడంతోనూ పని భారమంతా అమ్మ, మామ్మల మీదే పడేది. అయినా ఏనాడూ అమ్మ విసుక్కోగా నేను చూడలేదు. ఇల్లూ వాకిలీ శుభ్రపరచుకోవడం, ఇంతమందికీ కట్టెపుల్లల పొయ్యిమీద వండి వార్చడం, వడ్డించి , భోజనాలయ్యాక ఆ గిన్నెలన్నీ తోముకోవడం ఇలా ఎడతెరిపి లేని పని ఉండేది. వెనక్కి తిరిగి గుర్తు చేసుకుంటే ఆ ఇల్లు కూడా బంధుమిత్రుల రాక కోసం , వాళ్లు కొంతకాలం తీరుబాటుగా గడపడానికి వీలుగా కట్టినట్టు ఉండేది. ముందు పొడవాటి వరండా, మధ్యలో ఒక హాలు, వెనక విశాలమైన వంటగది , అటూ ఇటూ రెండు వసారాలు.. ఇంతే. పడక గది అనదగ్గ గదే లేదు ఆ ఇంట్లో. పక్షుల కిలకిలా రావాల మధ్య అమ్మ చల్లే కళాపి జల్లుల శబ్దంతో మాకు మెలకువ వచ్చేది. పెద్ద పెద్ద మెలికల ముగ్గులు తీర్చి , ఆవులూ గేదెల పాలు పితికి ఇంట్లో వారందరికీ పాలూ, కాఫీలూ అందించేది. అమ్మ కలిపే కాఫీ రుచి ఎంతో బావుండేది. ముందు వరండాకి అటూ ఇటూ ఉండే అరుగుల మీద కూర్చుని ప్రభాతవేళ నలుగురితో కలిసి సేవించే ఆ కాఫీ కబుర్ల రుచి దేనితోనూ పోల్చలేనిది. వేసవి సెలవులు వచ్చాయంటే విడతలు విడతలుగా పిల్లకాయలంతా దిగేవారు. పొద్దుటి పన్లన్నీ పూర్తిచేసుకుని హాల్లో పెద్ద పెద్ద బేసిన్లలో-- చద్దెన్నంలో కొత్తావకాయ, మాగాయ, చివరగా పెరుగన్నం కలిపి పెడుతుంటే పిల్లలందరం అమ్మ చుట్టూ కూర్చుని తినేవాళ్ళం. పెరుగన్నం లో నలుచుకుందుకు కోసిన మామిడి ముక్కలు( తోటలోవి)! ఆ సమయంలో సాగే కబుర్లూ, గిల్లికజ్జాలూ, పరిహాసాలూ, నవ్వులూ వీటికి అంతే లేదు. బడిలో చదువుకునే రోజుల్లో ఒకసారి ఆటల్లో ఉండగా నా చెవి కమ్మ శీల ఊడి, ఎక్కడో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఒంటికున్న బంగారం ఆ కమ్మలు మాత్రమే. స్నేహితురాళ్లంతా చుట్టూ మూగి ‘ఇంక నీ పనయిపోయినట్టే. ఇలాగే నేను పారేసుకున్నపుడు మా అమ్మ చింత బరికె పుచ్చుకుని చితక్కొట్టింది’ అంటూ ఎవరి అనుభవాలు వాళ్లు చెప్పడం మొదలు పెట్టారు. బస్సెక్కి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇల్లు చేరేవరకూ భయపడడం, ఇల్లు చేరగానే అమ్మకి చెప్పడం, “అయ్యో ! పోయిందా? పోనీలే… కావాలని పారెయ్యం కదా. ఏం పర్వాలేదు. పోయి ఆడుకోండి” అనడం గుర్తు. పదవ తరగతి పాసవగానే, పదిహేనేళ్లకే పెళ్ళయి అత్తగారింటికి వచ్చేసిన అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. రోజంతా ఇంటి చాకిరీలోనే గడిచిపోయేది. అయినా మధ్యాహ్న భోజనాలతర్వాత దొరికే గంటా గంటన్నర సమయంలో ఏదైనా చదవని పుస్తకం ఉంటే బావుండునని వెతుక్కునేది.అమ్మ అలా శ్రద్ధగా చదివే దృశ్యం నాలో ఏదో ఉత్కంఠని రేకెత్తించేది. అలా ప్రాధమిక పాఠశాలలో ఉండగానే కనిపించిన పుస్తకాన్నల్లా వదలకుండా చదివేయడం అలవాటయింది. ఆర్ధిక ఇబ్బందులు ఎంతగా ఉన్నా ఒకటో, రెండో వార పత్రికలు తప్పనిసరిగా పోస్ట్లో తెప్పించేవారు నాన్నగారు. ఆ పుస్తకం ఎవరు ముందు అందుకుంటే వాళ్లు చదివి ఇచ్చేదాకా మిగిలిన వాళ్లు వేచి ఉండాల్సిందే. ఒకసారి మధ్యాహ్నం వేళ పోస్ట్ లో వచ్చిన వార పత్రిక నా చేతికందింది. మరో పదినిముషాలకి అమ్మ విశ్రాంతి సమయమయింది.’ ఏదర్రా పుస్తకం?’ అంటూ అమ్మ వచ్చేసరికి శ్రద్ధగా సీరియల్ చదివేస్తున్న నేను, ‘చదివేశాక ఇస్తా’నన్నాను. వెంటనే చిన్నబోయిన మొహంతో “నీకు రోజంతా బోలెడు టైముంటుంది. నాకీ కాసేపటి తర్వాత వరసగా పనుంటుంది” అంది. ఆ మొహం , ఆ కంఠం, వెంటనే పత్రిక అమ్మకి ఇచ్చేసిన ఆ సంఘటనా ఇప్పటికీ స్పష్టంగా గుర్తుండిపోయింది. అలాగే ఒక వేసవి రాత్రి, పిల్లలందరం అపుడే కొత్తగా కట్టిన డాబా మీద ఆట పాటల మధ్య సరదాగా గడుపుతూ పిట్టగోడ మీద నుంచి తొంగి చూస్తే వెనక పెరట్లో అమ్మ ఒక్కత్తీ బండెడు గిన్నెలు తోముతూ కనిపించడం, చిన్న పిల్ల గా నాకది సహజంగా అనిపించడం , నా వెంట ఉన్న మా పెద్దమ్మ గారి అమ్మాయి నొచ్చుకుని “దా మనిద్దరం వెళ్లి పిన్నికి సాయం చేద్దాం” అని వెంట తీసుకెళ్లడం నా మనసులో చెదరని దృశ్యంగా నిలిచిపోయింది. అమ్మా నాన్నగార్ల ఆ నిరాడంబర జీవనం, తోటి వారికి వాళ్లు అందించిన ప్రేమాప్యాయతలూ గుర్తొచ్చినపుడు గర్వంగా, వ్యవసాయ దారుల నిరంతర శ్రమకు ఫలితం లభించని వ్యవస్థ పట్ల విచారమూ కలుగుతాయి. నేను బియెస్సీఆఖరి సంవత్సరం చదువుతుండగా అమ్మ కాలుజారి పడి మోకాలి లిగమెంట్ దెబ్బతినడం, నడవలేని స్థితిలో మంచాన పడడం జరిగి, అప్పటి దాకా ఇంటెడు పనీ సమర్ధించుకుంటూ వచ్చిన అమ్మ ఒక్కసారిగా నిస్సహాయస్థితికి లోనైంది. బియెస్సీ పూర్తవుతూనే ఎమ్మెస్సీకి ప్రవేశ పరీక్ష రాస్తానని వెళ్లి , సీటు తెచ్చుకుని నేను హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరాను. అయితే అమ్మకి అవసరమైన సమయంలో నేను దగ్గర లేకపోయాననే ఒక బాధ మనసులో నిలిచిపోయింది. అప్పుడు నా చెల్లెలు డిగ్రీ చదువుతూ అమ్మ దగ్గరే ఉండడం వల్ల నా పై చదువు కొనసాగింది. ఆ తర్వాత సరైన చికిత్స అందడం, అమ్మ మామూలు స్థితికి చేరడం జరిగింది గాని, మొదటి సంవత్సరం సెలవులకి ఇంటికి వచ్చిన నేను ‘డిస్క్ ప్రొలాప్స్ ‘ వల్ల తీవ్ర అస్వస్థతకి గురవడంతో నెలల తరబడి ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. అపుడు నావెంట ఉండి నాకు సేవ చేసింది అమ్మే. అంతవరకు ఆసుపత్రి ఎలా ఉంటుందో ఎరగని నాకు నెలలతరబడి ఆసుపత్రిలో ఉండాల్సి రావడం , విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్నపుడు చదువుకి ఇలా అంతరాయం కలగడం తీవ్రమైన ఆశాభంగాన్ని కలగ జేశాయి. చికిత్స తర్వాత మళ్ళీ చదువు కొనసాగించి కోరుకున్న విధంగా విశ్వవిద్యాలయంలో ప్రథమురాలిగా ఉత్తీర్ణత పొందినపుడు అమ్మ పొందిన ఆనందం ఇంతా అంతా కాదు. అప్పుడే కాదు ఆ తర్వాత కూడా పిల్లల పురుళ్ళపుడూ, వారి పసితనపు అనారోగ్యాలలోనూ, నాకు సుస్తీ చేసినపుడూ నా వెంట ఉండి సాయపడింది , నాకు ఆసరా ఇచ్చిందీ అమ్మే. ఒంటి నిండా నగలతో అత్తగారింటికి వచ్చిన అమ్మకి తన పుట్టింటికి వెళ్లినపుడు నగలేవీ లేకుండా వెళ్లడం నామోషీగా ఉండేది. పంటలు బాగా పండి, చేతి నిండా గాజులు వేసుకోగలగాలని కోరుకునేది. నా మొదటి పెయింటింగ్ అమ్మకమైనపుడు ఆ డబ్బుతో అమ్మకి నాలుగు బంగారు గాజులు కొనివ్వడం నాకొక మధుర స్మృతి. ఇప్పటికీ పిల్లలెవరి దగ్గరున్నా ఏదో ఒక పని అందుకుంటూ, సగంలో ఏపనైనా ఆగిపోయి కనిపిస్తే నిశ్శబ్దంగా ఆ పని పూర్తి చేసేస్తూ, మనవల్ని ఆదరిస్తూ, నిండు గోదారిలా సాగిపోయే అమ్మ నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు నేల మీద ఉదయించిన దేవతే. వారణాసి నాగలక్ష్మి(ప్రముఖ రచయిత్రి).
నేను మా అమ్మ అమ్మ అంటే ప్రేమ! అమ్మ అంటే మమతకు ప్రతిరూపం! అమ్మ లేనిదే ఈ ప్రపంచమే లేదు! అమ్మ అంటే ఒక భద్రతా! ఆమె ప్రథమ గురువు , స్నేహితురాలు, మార్గదర్శకురాలు! మంచి చెడు, సుఖం దుఖం ఎలాంటి పరిస్తితులోచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పినది అమ్మే. మా అమ్మ పేరు అయ్యగారి లక్ష్మీ దేవి. ఆ కాలం లో ఆడపిల్లకి 'చాకలి పద్దు' రాయడం వస్తే చాలనే అనుక్కునే వారు, దానికి తోడూ చిన్నతనాన్నే పెళ్ళి అవడం వల్ల మా అమ్మ4 గో క్లాస్ దాకానే చదువు కుందట. ఆవిడకీ చదువు మీద చాలా మక్కువ, అందుకే మా నలుగురి అక్కచెల్లెళ్ళనీ గ్రాడ్యుఏషన్ అయ్యాకే పెళ్ళిళ్ళని, మా నాన్నగారిని వప్పించింది. మేమందరం చదువుకోవడమే కాకుండా, ఆవిడ ప్రోత్సాహం వల్లే ఉద్యోగాలు కూడా చేసాము. మాకు కావలసిన పుస్తకాలు సర్ది పెట్టడం టిఫిన్ బాక్స్ లు తయ్యారు చెయ్యడం, ఒక్కటేమిటి, ప్రతీ అవసరం తానే చూసుకునేది. పరీక్షలకి చదువుకుంటుంటే అర్ధరాత్రయినా, మాతోటే కూర్చునేది. అసలు ఆవిడా లేనిదెక్కడా, వేనకాలే ప్రతీ అవసరానికీ మమ్మలిని ఆదుకునేది. అమ్మ గురించీ ఏమని చెప్పను ఎంతని చెప్పనూ..... నా విజయానికి, నా మనుగడకి నా జీవిత ప్రగతికి ఆవిడే కారణం. నేను, స్కూల్ లో ఆంగ్ల మాధ్యమంలో చదువు కున్నా , అమ్మ వల్లే తెలుగు నేర్చుకున్నాను. ఆవిడ కోసం మా నాన్నగారు తీసుకు వచ్చిన, అన్ని తెలుగు వార, మాస పత్రికలన్నీ, ఆవిడ కన్నా ముందు నేనే చదివేదాన్నీ. అమ్మ లేని లోటు పూడ్చ లేనిది. ఈ మాతృ దినం నాడు అమ్మని గుర్తు చేసుకుంటూ, జన్మజన్మలకూ నేను ఆమె పుత్రికగానే జన్మించాలనీ, ఆ దేవదేవుణ్ణీ కోరుకుంటూ, ఇవే ఆమెకూ నా స్మృత్యాంజలులు. వడ్లమాని బాలా మూర్తి.-- (రచయిత్రి.)
అమ్మంటే అమ్మ ఎంత చక్కని పదం. మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి మా అమ్మతో నా అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి....అమ్మ కాలం చేసి 25 సంవత్సరాలు గడిచినా అమ్మతో అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. మా అమ్మే నా స్నేహితురాలు. స్కూల్లో జరిగే ప్రతి విషయమూ రాగానే చెప్పేదాన్ని. ఆరోజుల్లో మాయింట్లో ఆడైనా, మగైనా డిగ్రీ వరకూ కూడా చదవలేదు. మా అక్కయ్య, అన్నయ్యలు పైస్కూలుతోనే ఆపేశారు. మొట్టమొదటిసారిగా ఇంటరులో కాలేజీలో (మొదటి బాచ్) చేరింది నేనే. నా తరువాత మా చెల్లెల్లు అందరూ డిగ్రీ కూడా చేశారు. నాకు చదవాలనే కోరిక ఎంతో వుండేది. ఇంటరు తరువాత డిగ్రీలో చేరతానని అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కవ చదవాలంటే ఎక్కువ చదివిన వరుడ్ని తేవాలి అన్నారు. రెండు రోజులు అలిగి భోజనం కూడా చేయలేదు. అయినా నా కోరిక తీరలేదు. ఆ తరువాత శ్రీవారి ప్రోత్సాహంతో బి.ఏ. ఎం ఏ , ఇటీవలే ఎం సి జె పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచీ కష్టాలు అనుభవించిన మా అమ్మ జీవితమే మాకు పాఠాలు. . వంటింటి జీవతం నుంచి రోజూ ఎదురయ్యే సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి... ఎక్కడ పొదుపు చేయాలి... వంటచేయటం లోని మెలుకువలు.... ఎలా మాట్లాడాలి..తెలుసుకున్నాను. జీవిత పాఠాలు నేర్పింది అమ్మే. పిల్లలు ఎంత వరకు మాట్లాడాలి... పెద్దలు మాట్లాడే టప్పుడు దూరి అవకతవకలు మాట్లాడకూడదు ఇత్యాది మంచి విషయాలూ నేర్పిందీ అమ్మే. తన కష్టాలు, అన్నీ చిన్న దాన్ని అయినా నాతోనూ పంచుకునేది. అమ్మ చాలా వరకు మాటల్లో మన తెలుగు సామెతెలు వాడేది. అంతే కాదు అమ్మతోటే నా ఆటలు.... అంటే ఆ రోజుల్లో పచ్చీసు, అష్టా చెమ్మా, చింతపిక్కలాట, వామన గుంటలు, ఇలా ఎన్నో.... ఆటలు.... మా అమ్మ అంటే నాకు మరీ ఇష్టం. మా అమ్మ చేతి రాత చక్కగా ముత్యాల్లా గుండ్రంగా వుండేవి. మా అమ్మ ఉత్తరాలు రాస్తే అపురూపంగా దాచుకునేదాన్ని. ప్రతి అక్షరం విడి విడిగా లైనులో రాసేది. అదే నేను రాస్తే కన్యాకుమారి నుంచి కాశ్మీరుదాకా పైకి పోయేది లైను. ... చిన్నప్పుడు నాకు మా అమ్మ చేతి రాత చూసి మా అమ్మ బాగా చదువుకుంది అనుకునేదాన్ని. మా అమ్మ నేను చదువుకోలేదు. 5వ తరగతి వరకే చదివాను అని . కానీ నేను నమ్మేదాన్ని కాదు. లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని పోట్లాడేదాన్ని.... తరువాత అమ్మ చెప్పేది నిజమే అని తెలిసింది. అన్నిటా అమ్మే స్ఫూర్తి. మేం ఆరుగురం పిల్లలం అయినా ఇంటి విషయాలు కానీ, పొలం వ్యవహారాలు కానీ, ఆర్ధిక వ్యవహారాలు.... ఇలా అన్ని విషయాలూ నాతో చర్చించేది. ఆవయసులో ఏమిటో గానీ... నాకు నేనే గొప్ప అనుకుని నాకు తోచిన సలహాలూ ఇచ్చేదాన్ని.... మా నాన్నకు తన వ్యాపారంలో ఎవరికైనా ఉత్తరాలు ఇంగ్లీషులో కానీ, తెలుగులో కానీ రాయాలంటే నేనే రాసేదాన్ని. ప్చ్... ఏమిటో ఆరోజులే లేవు... మరచిపోని ఆ రోజులు. మళ్లీ రమ్మంటే రావు.... ఙ్ఞాపకాలు తప్ప.... మిగిలినవి అవే..... ఒక లీడర్ గా పెళ్ళి కాకముందు పుట్టింట్లో మెలిగిన నేను అమ్మ అంటే వివాహం అయిన తరువాత కూడా ప్రతి విషయంలోనూ అమ్మ స్మృతులే వెంటాడేవి.... ఇప్పటికీ మా అమ్మ చేతి వంట ఎంతో రుచి. అమ్మని తలుచుకుంటూ ఇప్పటికీ అమ్మ చేసే ఏ వంట అయినా చేస్తే చాలా రుచిగా వస్తుంది. భోజనం చేసినా అందరం కలిసి తినే వాళ్ళం. మా చిన్నపుడు పిల్లందరికి ఒకే కంచం లో అందరికి కలిపి ముద్దలు పెట్టేది. ఎంత రుచిగా ఉండేదో. ఇట్టే కంచం ఖాళీ అయ్యేది. లోకం అంతా మదర్స్ డే అని జరుపుకోటం ఈ రోజు అమ్మ ఙ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవటం నిజంగా మధురమే. ఆసలు మర్చి పొతే కదా ఆ రోజే గుర్తు తెచ్చుకోడానికి. ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా గొప్ప. కెమెరాలు వుండేవి కాదు. అందుకే మా అమ్మా నాన్నా కన్యాదానం చేసే ఫోటో పెట్టా. చూడండి. మణి కోపల్లె -- (రచయిత్రి.)
అమ్మతో అనుబంధం అమ్మతో పిల్లలకి ఉండే అనుబంధం చెప్పనలవి కాదు. అమ్మంటే ప్రేమ, అమ్మ దగ్గర చనువు, అమ్మ మీద విసుగు, అమ్మ ఏదన్న నచ్చని విషయం చెబ్తే కోపమ్.... ఎందుకు? మనం ఏం చేసినా అమ్మ ఏమీ అనదనే ధీమానా? ఒక వేళ ఏమైనా అన్నా మళ్ళీ దగ్గరికి తీసుకుని లాలిస్తుందనే భరొసావా ? Do we take her for granted ? Not realizing, that one day she will leave you and everything and replaces herself with you to go through her path ?? చిన్నప్పుడు, అమ్మ ఒక్క నిమిషం కనిపించక పోతే, ఏడ్చేశాను . అమ్మ కోసం ఇల్లంతా, ప్రతి మూల మూలన, వంటింట్లో, స్టోర్ రూం లో, డాబా మీద వెతుక్కున్నాను . చివరికి అమ్మ హాల్లో బొంత మీద పడుక్కుంటే చూసి, అమ్మ పక్కలో చేరి అమ్మ గుండెల్లో తల పెట్టుకుని నిశ్చింతగా పడుక్కున్నాను. అలాంటిది, అమ్మని వదిలి, చదువు పేరు చెప్పి అమ్మకి దూరంగా ఎక్కడో విజయనగరంలో బాబయ్యగారింట్లో, ఒక సంవత్సరం పాటు ఉండాల్సి వచ్చింది. మా నాన్న గారికి, ప్రతీ మూడేళ్లకీ transfers అవుతూ ఉండేది. మా చదువులు పాడవుతాయని విజయనగరంలో మా బాబయ్య గారింట్లో చదివించారు. అన్న అంతకు ముందు సంవత్సరమే వెళ్ళాడు. నాన్న నన్ను కూడా అన్నతో పాటు పంపుతానంటే అమ్మ గోల చేస్తుందని, అమ్మని వదిలి, నిమిషం కూడా ఉండలేని నేను బెంగ పెట్టు కుంటానేమోనని నన్ను ఆ మరుసటి ఏడు పంపారు. నాలుగో తరగతి నుంఛి సెకండ్ ఫార్మ్ కి ఎంట్రన్స్ రాయడానికి విజయనగరం వెళ్ళాను. అక్కడే ఒక ఏడాది చదివాను. అమ్మ గుర్తుకువచ్చి గుబులు గుబులుగా ఉన్నా, కొత్త స్కూలు, కొత్త్తగా English నేర్చుకోవడం higher level maths , science, geography ---వీటన్నితో బిజీ ఐపోయాను. బాబయ్యగారి అమ్మాయి సుందరి తో చాల close ఐపోయాను. కాని ఎంత మంది ఉన్నా అమ్మ అమ్మే. Final Exams అయ్యాక, పిల్లందరం కలిసి, ముద్దుబిడ్డ సినిమా కి వెళ్ళాం. అందులో పాట , "చూడాలని ఉంది, అమ్మా చూడాలని ఉంది," అనే పాటని casual గా పాడుకుంటూ, ఎదురుగా ఉన్న అమ్మా నాన్నల ఫోటో చూడగానే ఏడుపోచ్చేసింది. ఏడుస్తూ కూర్చున్నాను. ఆ రాత్రి భోజనం కూడా చెయ్యకుండా పడుక్కున్నాను. దాంతో నాన్నమ్మ, బాబయ్య, పిన్ని అందరు ఏకగ్రీవంగా , ఎవరి పిల్లలు వాళ్ళ వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరుంటే మంచిది అని decide ఐపోయారు. అమ్మ దగ్గరకి వచ్చాకా, మళ్ళీ ప్రతీ చిన్న చిన్న విషయాలకి, arguments , కోపాలు, అలకలు మామూలే., రోజులు, సంవత్సరాలు, గడిచిపోయాయి. మా కోపతాపాల మధ్య, అలకలు, సాధింపులు, tantrums లన్నీఎంతో సహనంతో భరించి , అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసి, పెళ్ళిళ్ళు చేసి, మంచి భర్తని, జీవితాన్ని, ఇచ్చింది. అన్న America వెళ్లి సెటిల్ అయ్యాక, మమ్మల్ని sponsor చేస్తే మేం కూడా America వెళ్లాం. పిల్లలు, పెద్దవాళ్ళయి, నన్ను ఎదిరించి మాట్లాడడం, arguments , అలకలు, కోపాలు . అమ్మా! నువ్వు మాతో పడ్డ బాధ ఇప్పుడర్థమవుతోందమ్మా! ఎన్ని మంచి సూక్తులు చెప్పేది ? ఎన్ని బుద్ధులు గరిపింది.? ఈ మధ్య అమ్మ బాగా జ్ఞాపకానికి వస్తోంది . ఎప్పుడో చిన్నప్పుడు , బాలానందం కార్యక్రమం లో నేర్చుకున్న పాట మనసులో మెదిలింది . "అమ్మ మాట ఎంతో అనడమూ మా అమ్మ మనసు మంచి గంధము. అమ్మ ముద్దు చల్లన, అమ్మ సుద్దు తెల్లన అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు, అమ్మ మాట సాహిత్యం అమ్మ లాలి సంగీథమ్. " పాట పూర్తిగా గుర్తు లేదు . Friends లో ఎవరికైనా తెలుసేమో కనుక్కొవాలి. చిన్నక్క, బావ, వాళ్ళబ్బాయి కూడా US migrate అయిపోయారు. అమ్మకూడా వాళ్ళతో US వచ్చేసింది . చిన్న చెల్లెలి భర్త పిల్లలు మాత్రం India లొనే ఉండి పోయారు. రోజూ office నుంచి అన్న ఇంటికి వెళ్లి, అమ్మని చూసి వచ్చేదాన్ని. weekends కి అమ్మని మా ఇంటికి తీసుకువచ్ఛేదాన్ని. చిన్నప్పుడంతా అమ్మని సతాయించాను. ఇప్పుడన్నా, అమ్మని, ప్రేమగా చూసుకోవాలి. చిన్నతనంలో miss ఐనదంతా ఇప్పడు పొందాలి. site seeing కి ఎక్కడికి వెళ్ళినా, friends ఇళ్ళకి వెళ్ళినా, గుడికి, స్వామి చిన్మయానంద గారి ప్రవచనాలకి, ఇలా నేనెక్కడికి వెళ్ళినా అమ్మని కూడా తీసుకువెళ్ళేదాన్ని. రెండు వారాలనుంచి ఆఫీసు లో పని ఎక్కువవడంతో అమ్మని చూడడానికి వెళ్ళడానికి వీలుపడ లేదు. ఆ రోజు office కి వెళ్తూ ఉంటే అమ్మ ఫోన్ చేసింది. "ఎలాగున్నావ్? ఆఫీసు లో పని ఎక్కువగా ఉన్నట్టుంది. ఛాల రోజులైందే నిన్ను చూసి . ఒక్కసారి కనిపించి వెళ్ళవే. పోనీ, లోపలికి రావద్దులె. ఆ cul-de-sac లో నీ ఎర్ర car అలా ఓ సారి తిప్పుకుని వెళ్ళు. నీ కారు చూస్తే నిన్ను చూసినట్లే ఉంటుంది నాకు " అంది. అలాగెలేమ్మా, ఈ రోజు overtime ఉంది office లో. early గా పని పూర్తయితే office నుంచి డైరెక్ట్ గా వస్తాను, లేకపోతే రేపు, ఆఫీసుకి వెళ్ళే ముందు వచ్ఛి వెళ్తాను." అని చెప్పాను. ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్ఛే సరికి, 9, అయిపోయిన్ది. అమ్మకి phone చేసి ఇంక ఇవేళ రాలేనమ్మా అని చెబుదామనుకునే లోగా అమ్మే phone చేసింది ."ఏంటి వస్తున్నావా ?" అని. "Sorry అమ్మా ! ఇంక ఇవేళ రాలేనమ్మా, tired గా ఉంది . రేపోస్తాను", అన్నాను. ఏమనుకుందో ఏమో, ఎం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. నేను అన్నది, నిజం చేస్తూ ఆ మర్నాడు పొద్దున్నేఅమ్మని చూడడానికి వెళ్ళాల్సి వచ్చింది . వదిన ఫోన్ చే శారు , "లక్ష్మి! అమ్మ అదోలా ఉన్నారు, మీరు వెంటనే బైలుదేరి రండి, నేను Ambulance కి Phone చెయ్యాలి, మీరు, మీ అక్కకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి.", అని చెప్పేసి నేనేదైనా అడిగే లోపలే ఫోన్ పెట్టేశారు . నేను బట్టలు మార్చుకుని మా వారితో, పిల్లల్ని తీసుకుని అన్నా వాళ్ళింటికి వచ్ఛేయమని చెప్పి, అక్కకి ఫోన్ చేసి చెప్పి, కార్ తీసుకుని బయలు దేరాను. అన్నఇల్లు మా ఇంటికి సరిగ్గా 5 నిమిషాల దూరం. కార్ పార్క్ చేసి, అమ్మ గది లోకి వెళ్లేసరికి అన్న అమ్మ pulse చూస్తున్నాడు. నన్ను చూడగానే, "అమ్మ ఇప్పుడే వెళ్లిపోయిన్దే", అన్నాడు . నమ్మలేకపోయాను. రాత్రే కదా మాట్లాడింది ? ఇంతలోకి ఏమైంది ? కడుపులోంచి దుఖ్ఖ్హమ్ తన్నుకొచ్చింది . "ఎంత పొరపాటు చేసాను. అమ్మ కి ఎందుకు నన్నంతలాగా చూడాలనిపించింది? తన ఆఖరి క్షణాలు, తనకి అనుభవమైన్దా? నాకెందుకు అమ్మని ఇంక చూడలేనేమో అనే భావన రాలేదు? అమ్మలకి ఉండే intuition పిల్లలకి ఉండదా? ఆగలేదు కన్నీళ్ళు. ఒక్కసారి అమ్మ మంచం మీద కూర్చుని, " సారీ అమ్మా !. నువ్వు చివరిగా అడిగిన చిన్న కోరికని కూడా తీర్చ లేకపోయాను.", అని భోరున ఏద్చేసాను. "అమ్మా, చిన్నప్పుడొక సారి నాకిష్టమైన బెండకాయ పులుసునీళ్ళ కూర చెయ్యలేదని అలిగాను గుర్తుందా? . ఇప్పుడు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదని కోపం వచ్చిందా అమ్మా?" ఏదో చెప్పనలవి గాని బాధ ఆవరించింది . ఆవేదన అంచులు దాటింది . నెమ్మదిగా, అన్న నా భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాడు. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా అమ్మ తెల్లవారగట్ల 3 గంటల కి లేచి స్నానం చేసి, పూజ చేసుకుని, అన్నకి ఇడ్లీలు పెట్టి గుండెల్లో నెప్పిగా ఉందని ఒదిన తో చెప్పిందిట. వదిన తో ఆయాసంగా ఉందని, ఊపిరి పీలుస్తూ ఉంటె గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పిందిట."ఇదే మరణ బాధేమోనే , ఇదే ఐతే భరించొచ్ఛు" అందిట. అన్న Doctor. తను వచ్చే సరికి ఆయాసం ఎక్కువయిందిట . మాట్లాడుతూ, మాట్లాడుతూ అన్న చేతుల్లో అమ్మ ప్రాణం పోయింది. ఎన్నో కష్టాలు పడి ఎంతో ప్రేమతో , సహనంతో ఎనమండుగురు పిల్లల్ని కనీ పెంచిన తల్లి, కన్న కొడుకు చేతుల్లో అనాయాస మరణం పొందింది . ఒక మనిషికి ఉండవలసిన రెండు అదృష్టాలలో, మొదటిది -- అనుకూల దాంపత్యం పొందిందో లేదో తెలీదు కాని , రెండో అదృష్టం మాత్రం పొందింది. మనుషులు ఉండగా వాళ్ళ విలువలు తెలియవు. మన దాకా వస్తేనే గాని మనకి అమ్మ పడిన కష్టం ఏమిటో తెలీదు. అమ్మతో మనసారా ఎప్పుడూ 10 నిమిషాలు స్థిమితంగా కూర్చుని మాట్లాడలేదు . అమ్మ ఎప్పుడూ మడి, తడి అంటూ, వంటింట్లో వంటలు వండుతూ పూజలు చేస్తూఉండేది , విజయవాడ జంక్షన్ అవడం తో వచ్చే పోయే బంధువులతో ఎప్పుడూ ఊపిరి సలిపేది కాదు అమ్మకి. మేం పిల్లమంతా మా friends, మా ఆటలు, చదువులు తప్ప అమ్మతో close గా మసలలేదన్పిస్తుంది మా అమ్మ తన పిల్లలకి home work చెయ్యడానికి హెల్ప్ చేయకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు కొనివ్వలేక పోయి ఉండవచ్చు. కానీ, తన సంతానానికి, తన సత్వ గుణాన్ని సమానంగా పంచి పెట్టింది. ఈనాడు, మాలో ఏమన్నా మంచీ, మానవతా ఉన్నాయంటే, అవి మా అమ్మ, మాకిచ్చిన ఆస్తి. అమ్మ ఇచ్చిన సంపద "మానవత, మంచి తనం ", అవి చాలు మాకు కల కాలం. -- లక్ష్మి కర్రా
నేను అమ్మ కన్నా మంచి అమ్మను కాను అమ్మ మనకు మనము తెలియకమున్దె మనము తెలిసిన వ్యక్తి అమ్మ. మన పేరు చెబితె చాలు ప్రపన్చమ్ మనలని గుర్తిన్చాలని తపన పడే వ్యక్తి అమ్మ. తన వూరూ, పేరు కన్న మన పేరు బయట లోకాని కి తెలియాలని తపత్రయపడేది. చిన్నపుడు అమ్మ తిడితె - మన్చి చెడు నేను చెప్పకపోతే ఎవరు చెప్పుతారు? అమ్మ పెన్చిన బిడ్డ,అయ్య పెన్చిన బిడ్ద అని అడుగుతారు అని అన్నప్పుడు అర్థము కానిది, కాపురము మొదలైనప్పుడు బాగా తెలిసివచ్చిన్ది తొన్దర్గ తెమలన్డి,టైమ్ ప్రకారము వున్డాలీ అని చెపితే అబ్బా నస, అనుకొనే దాన్ని,ఇప్పుడు పిల్లల్లకు టైమ్ ప్రకారము నేర్పిన్చినప్పుడు-అచ్చు అమ్మ లాగానే మాట్లాడుతున్నాన్నె. ......... ఆడపిల్లవి-గెన్తకు,దూకకు,అల ఎవరితొ పడితె వాల్లతొ మాటలడకు-అన్నప్పుడు నా అన్త ఫెమినిస్టు వున్దదెమో.ఇప్పుడు నా కూతూరి కి చెప్పే మాటలు అన్ని జాగ్రతలు అని నేను చెబితే మీరు నమ్మాలి. అమ్మ కన్న బాగా చదువుకొన్నా, లోకము చూసినా, మా అమ్మ కన్నా నేను మన్చి అమ్మను కాలేను. మరి అన్త మన్చి అమ్మ కు అమ్మైన అమ్మమ్మ ఇన్కా ప్రియము. మీ అమ్మ, అమ్మమ్మ కూడా మీకు అన్తే కదా. --కనకదుర్గ జొన్నలగడ్డ
నీడలా మా అమ్మే నా వెంట అమ్మతో నా అనుబంధం గురించి రాయాలంటే ఒక ఉత్గ్రంధమే అవుతుంది. చిన్న వ్యాసంలో చెప్పాలంటే కష్టమే. నేను పుట్టినప్పుడు మొదటిసారి తన చేతుల్లోకి తీసుకొని ఎంత ప్రేమగా నా తల నిమిరి ఆతన గుండెలకు హత్తుకుందో నాకు యాభై ఏళ్ళు వచ్చినా అంతే ప్రేమగా తల నిమురుతుంది. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటుంది. అందరు అమ్మలు అదే చేస్తారు. ఇందులో గొప్పెముంది అనుకోవచ్చు. గొప్పే మరి. ఒక చిన్నపాటి జమీందారీ కలిగిన ఇంటికి పెద్ద కూతురు, ఇంకో చిన్న జమీందారీ ఇంటి చిన్న కోడలు. నిప్పులు కడిగే వంశాలు. అనివార్య కారణాల వల్ల మానాన్న సంపాదన సరిగా లేక బాధ్యత లేకుండా తిరుగుతుంటే కష్టపడి చదివి ఉద్యోగం హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగిని అయింది. ఇంటి ఆడవాళ్ళు ఉద్యోగం చేస్తే ఇంటి పరువు పోతుందన్న అత్తింటి వాళ్ళను పుట్టింటి వాళ్ళను ఎదిరించిది. ఇదంతా మా చెల్లిని నన్ను తాను అనుకున్నట్టు పెంచదానికి చదివించడానికి. నాకు ఝాన్సీ అనిపేరు పెట్టినప్పటి నుండే ధైర్యం నూరి పోయడం మొదలు పెట్టింది. "సమాజం తొక్కుతె మొక్కుతుంది, మొక్కితే తొక్కుతుంది" ఇది నాకు నేర్పిన బ్రహ్మ సూత్రం. ప్రతి చిన్న విషయం లోను ఎంతో శ్రధ్ధ తీసుకునేది. ఏమాత్రం సౌకర్యాలు లేని టైమ్ లోనే దూరాలు ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్ళి వచ్చేది. సాయంత్రం వచ్చి నన్నుచెల్లిని చదివించేది. ఒంట్లో బాగాలేక పోయినా పరీక్ష లో మార్కులు బాగా రాక బాధపడుతున్నా ధైర్యం చెప్పి వెన్నంటే ఉండేది. టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు, ఉద్యోగాలాకోసం కంపిటేటివ్ పరీక్షలు ఒకటేమిటి ఏ సందర్భం తలచుకున్నావెనుక కొండత అండగా మా అమ్మే ఉన్నట్టు కనబడుతుంది. ఇవన్ని ఒక ఎత్తు ఐతే నాకు . పుస్తకాల పైన ఇష్టాన్ని పెంచింది. ప్రపంచంలోని వ్యక్తులను అర్థం చేసుకోవడానికి ఇంతకంటే సులువైన మంచి సాధనం లేదని చెప్పింది. ఇప్పటికీ తాను చదివిన మంచి పుస్తకంలో విషయాలు నాతో పంచుకుంటుంది. ఉన్న ఉళ్లోనే సంబందం చేయాలని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగింది. అనుకున్నట్టుగానే హైద్రాబాద్ లోనే ఉండే అబ్బాయి తో పెళ్లి చేసింది. ఉద్యోగం పిల్లలు రెండు భాద్యతలతో నేను సతమవుతూఉంటే పిల్లలను తనతో ఆఫీస్ కి తీసుకేళ్లేది. తన పని చేసుకుంటూనే వాళ్ళను కూడా చూసుకునేది. ఇప్పటికీ ప్రతి ఏడాది దీపావళికి మా నలుగురికీ ఉన్నంతలో బట్టలు పెడుతుంది. ఎన్దుకమ్మా నీకు శ్రమ అంటే, నాన్న వెంట లెక్‌పోవడం వల్ల నాకు లోటు జరిగిందని నువ్వు కానీ అల్లుడు కానీఅనుకోకూడదని అంటుంది. నేను ఈత గింజ ఇవ్వబోతే తాను తాటి పండు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. మా అమ్మ అనే మహా నదిలోనుంచి ప్రవహిస్తూ ఉన్న పిల్ల కాలువని నేను. ఆనాడు మా అమ్మ కనుక అంత సాహసం చేసి సమాజానికి ఎదురు నిలిచి మమ్మల్ని చదివించక పోయి ఉంటే నాకు ఇంత రంగుల మయమైన రసవంతమైన జీవితం దొరికెదే కాదు. యాభై ఏళ్ల జీవితం లో వెనక్కి తిరిగి చూసుకుంటే నీడలా మా అమ్మే నా వెంట ఉంది. --ఝాన్సీ మంతెన
అమ్మ లేని నేనులేనే లేను అవును..పెద్దవుతున్నకొద్దీ....అమ్మలేదని తట్టుకోలేక తిట్టుకుంటానేమో కాని కన్నతల్లి తలపులు తట్టిలేపుతూండడం అనుక్షణం నా దినచర్యలోపెనవేసుకుపోతున్నతరుణం..ఇంతలోనే ఈశీర్షికతోమది తలుపులు తెరచి తలపులు తెలుపమంటూ పిలుపు!!నా జీవనరాగంలో అమ్మ ముద్ర ,మార్కు మరీప్రస్ఫుటం..ఎంతో ప్రధానం..ప్ర ప్రథ మ స్థానం..మా అమ్మకి ఏడుగురు సంతానం..నలుగురు ఆడపిల్లలు ముగ్గురు మగ పిల్లలు..మధ్యనంబరునాది.పెద్దకూతురని అక్క స్పెషలు..పెద్దాడంటూ అన్నయ్య,చిన్నదని చెల్లి..చిట్టచివరాడని తమ్ముడు...మరి మధ్యవారి మాటేమిటి?? అక్కడికే వస్తున్నా!!మానాన్నగారికి బ్యాంకేలోకం..దైవికంగా సంప్రాప్తించిన జ్యోతిష్యం ఆయన పూర్వజన్మ సుకృతం..నేను పుడుతూనే ఆయనన్నారట.."ఇదికళలలో రాణిస్తుందీ "అని..గ్రహస్థితులబట్టి అనుకుంట...అమ్మ అందటా..."ఏడిసింది..బల్లిలా పుట్టింది..బతికి బట్టకట్టనివ్వండీ "అని. ..నాకు ఊహతెలిసి ఎనిమిదొచ్చేసరికి మేమంతా హైదరాబాదుకు బదిలీ మీదొచ్చాం..అంతే..ఏగ్రహబలమో..నేనీ ఊరుకదిలితే ఒట్టూ..బాల్యంలో బాలానందసంఘంలో కళలపట్ల నానగారికున్న మక్కువతో నన్ను చేర్చారు అంతే..మిగతా అంతా అమ్మే...సంగీతం..నాట్యం..నాటకం.. వారునేర్పితే ...క్రమశిక్షణ,సమయపాలన,పెద్దలపట్ల గౌరవం..మర్యాద,కంటిచూపుతోనే నేర్పేది అమ్మ..నేర్చుకున్నకళలకు సంపూర్ణంగా న్యాయంచేసినది అమ్మవల్లే..ఆకతాయిగా ఉందామనిపించినా మా ఆటలు సాగనివ్వలేదు అమ్మ.కళలుకాస్తా.. వయసుతో పాటు అటకెక్కినా...అమ్మఅందించిన అమూల్యాలు...నాతోనే..నావెంటే ఉంటూ..అనుక్షణం అమ్మని తలపిస్తాయి..ముఖ్యంగా ఒకటి అరా కన్నటువంటి మా అందరికి...ఇంతమందినికని..అంతబాగా ఎలా పెంచిందన్నది అంతుచిక్కదు..నటనలో ప్రతిభ కనబరుస్తుందంటూ పెద్దల ప్రశంసల మేరకనుకుంట...ఆకాశవాణి..దూరదర్శన్ లలో నన్ను పదిహేడేళ్ళకే అడల్ట్ ఆర్టిస్టుగా ఆడిషన్ పరీక్షకి రమ్మన్నారు..ససేమిరా అంటూ మొండికేశాను.."చీరకట్టుకెళ్ళాలట..నాకురాదు..అయినా నాకు డిగ్రీ మొదటి ఏడాదిపరీక్ష...తలనొప్పి..అహ..ఊహూఁ..నావల్లకాదు" అంటూ అమ్మకి నేపెట్టిన పేచీ ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూల్లో చెప్పానో... అమ్మ ఈఊరికి రాకమునుపు నాన్నగారి ఉద్యోగ బదిలీలంటూ ఆంధ్రా అంతా చుట్టేశారుట..నాకు గుర్తులేదు..అమ్మకి వాళ్ళమ్మ పురిట్లోనే పోయారట..అమ్మమ్మతాతలు పదేళ్ళకే ఐదోక్లాసు చదువు అర్జంటుగా ఆపించి,పెళ్ళిచేసేశారట పదిహేడేళ్ళ మానానగారికిచ్చి...ఇదే మా అమ్మనేపథ్యం..అమ్మకి అన్ని ఊళ్ళలోనూ...ఇరుగుపొరుగు వారే పురుళ్ళూ గట్రాలకి సాయమట...పెద్దలు అప్పటికే టపా కట్టేసినందుకేమో...తెలీదు!బొత్తిగా ఊరుకూడా తెలియని అమ్మ ఆడిషన్ రోజు ఎక్కడెగ్గొట్టి ఇంటికి చక్కా వచ్చేస్తానోనని..ఏకంగా కోఠీ..ఉమెన్స్ కాలేజీకి రిక్షా కట్టించుకుని వచ్చేసి..మెయిన్ గేటుదగ్గర కాపలా కూర్చుని ఆలిండియా రేడియోకి తీసుకెళ్ళి..ఆడిషన్టెస్టుకి వెనకాలే ఉండిచెఱకు రసం ఇప్పించి తీపిగుర్తుగా ఇప్పటికీ నిలిచిపోయింది..ఆ పరీక్షే ఇప్పటికీ నాకు చిరుసంపాదనతో పాటు పెను గుర్తింపును ఆపాదిస్తూ వస్తోంది..స్వతహాగా పరమపిరికి నైన నేను అందివచ్చిన ప్రతి అవకాశానికి మొరా యించేదాన్ని...చదువుకలో వెనకబడడం...టైముసరిపోకపోవడంనాకు నచ్చేదికాదుమరి! అన్నీ అవసరమనేది అమ్మ..నిజమే...అదితెలిసాకే అమ్మవిలువ అవగతమయ్యేది...రేపు నా ఏకైక పుత్ర రత్నానికైనా!! నాగురించి అమ్మచెప్తూండే మరో మాట..పసితనంలో కారణంచెప్పకుండా గంటల తరబడి ఏడుపు...అలకలూ నట..ఎందుకోమరి..తెలిస్తే మీకైనా చెప్పడానికి సిద్ధమేనేను!! ఆవసూ ఏనా ఈ వసువులు అంటూ చాలా మెచ్చుకునేది..వంటపని..ఇంటిపనిలో నా ఒబ్బిడి,,పద్ధతి..ఖర్చుల్లో పొదుపు..అటు ఉద్యోగంలో కమిట్మెంటు..అన్నీ..మనసారా చూసిందేమో..తన పోలికలు పిల్లలందరికీ అబ్బేయి అని తెగ మురిసిపోయేది..దుబారా అంటేఅమ్మకి నచ్చదు..ఆమాట ఆవిడనోటవిన్నదే..మళ్ళా ఎవరినోటావినలేదు..కొన్నిమాటలు అచ్చంగా అమ్మసొంతం..నిజమే...మాపిల్లలని చూస్తే అమ్మ తరం వారంతా ధన్యులనిపిస్తుందిసుమండీ.. ఇరవైమూడుకే పెళ్ళైనా ,అమ్మున్న ఊరే కనుకేమో..బెంగ ..చొంగ లాంటివిలేవు.ఎటొచ్చీ ఉద్యోగం మూలాన అడపా తడపానే కలిసే వాళ్ళం.ఫోనుల్లో అప్డేట్లు ఒకస్నేహితురాలికి మల్లే వినేది..ఏనాడు పిల్లలసంసారాల్లో తలదూర్చలేదు.తరువాతగాని తెలియలేదు అది సైద్ధాంతికపరమైన నిర్ణయమనీ,,చాలారైటు అనీ..!! ఇంటిల్లిపాది పెళ్ళిళ్ళూపదిహేనేళ్ళ నిడివిలో అయ్యాయి..చివరితమ్ముడి కళ్యాణం ఒక్కదానికే నాన్నగారులేరు.యాభైఏళ్ళతోడు...అమ్మకి మరీకష్టకాలమే..అయినా ఒక్కరోజు ఎవ్వరినీ తనబాధ నుతెలిపి ఇబ్బంది పెట్టలేదు..అందరిదగ్గరా అదే సర్దుబాటుగుణం...ఎంతమొక్కినాతక్కువే..!!రికార్డింగులకెడితే ఇప్పటికీ...నన్ను ....అమ్మనివెంటబెట్టుకొచ్చేదాన్నని ఆటపట్టించే వారెందరో!! ఇలా ఉంటుండగా...ఓసారి ఆంధ్రజ్యోతి నవ్యవారు..౨౦౦౬లోననుకుంట...నాపాతికేళ్ళ గళానుభవాన్ని పేపరుకెక్కించడానికి...ఇంటర్వ్యూకని ఇంటికొచ్చారు..ఫోటో గ్రాఫర్ తో సహా..ఇప్పటికి కంప్లీటుగా భిన్నంగా...!వాట్సప్పులు..ఫేసుబుక్కులు లేవుగాఅపుడూ!!బోలెడుకబుర్లు రాబట్టి "మాటలకోకిల "పేరుతో ప్రచురించారు పేపరులో..ఇప్పటిలాగా క్షణాల్లోవార్త.. ఖండాలు దాటే వీలులేనికాలం.కనుక ఏకొద్దిమందికో అదీ చెప్పుకుంటేనే తెలిసేది.."అమ్మ"కనుక ఆపేపరును లామినేటుచేయించి తలగడకిందే పెట్టుకుని ఇంటికి వచ్చిన ,తనకు నచ్చిన వారికి చూపుకుని తన తనయను కొనియాడుకుని పరవశించేదని వినికిడి..ఇంతలో ఓరోజు అమ్మ అదోలా మాట్లాడుతూ.." అవున్లేమ్మా...నీకు మొదట్నించీ వెనకే ఉంటూ ,,నువు ఆడినా పాడినా మురిసిపోతూ ఉన్నందుకు..భలేగా గుర్తుంచుకున్నావులేవే...ఆఖరికి నువు దూరమెళ్ళలేనని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్.ఎస్సి .మానేస్తే అక్కడే గదితీసుకుని నానగారిని వదిలైనాసరే నీతోనే ఉండటానిక్కూడా సిద్ధపడ్డానుకదమ్మా అప్పట్లో...అందుకనేనేమో..మా బాగా బుద్ధిచెప్పావు అంటూ వగచింది..మొట్టమొదటిసారి అమ్మనాతో ఇలాంటి దెప్పిపొడుపుడైలాగువేయడం!!మైండుబ్లాకైంది..కూపీ లాగాను..కట్చేస్తే,,ఇంటికొచ్చిన ఆపేపరుపెద్దలకి చాలనేవరకు కబుర్లునేనేచెప్పినా,,వారు కాస్తతికమకపడి కొన్నివిషయాలను మకతిక చేసి రాస్తారని నాకు చాలా ఏళ్ళక్రితమేతెలిసినా,,చేసిపొడిచేదేంటిలే అని లైట్ తీసుకున్నాను..ఇపుడు మరోసారి పునరావృతమై...అమ్మకెక్కడోముల్లులా గుచ్చుకుని.. ఎక్కుపెట్టిన బాణంలానన్నుదూసుకునిపోయింది..తుంటినికొడితే పళ్ళు రాలడం అంటే ఇదేనేమో,,,నాట్ స్యూర్!!రాసుకెళ్ళిన పెద్దమనిషి..అమ్మమాట,మాటవరసకైనా రాయకుండా..మానాన్నగారి పేరు మాత్రమే రెండుసార్లు ఉటంకించి..ఆయన మంచి కళాభిమాని కావడం వలననే..నేను ఇలాతయారయ్యానని,అంతా తండ్రిగారిచలవేనని నేనే నొక్కివక్కాణిస్తేనే ఆయన రాసినట్టు అమ్మ అర్థం చేసుకున్నట్టు నాకర్థమైంది.. ఎలా చెప్పినా అమ్మ వినేలాకూడా కనిపించకపోవడంతో...నేనే కాపుకాచి..అవకాశంఅందివస్తే అమ్మకిన్యాయం అర్జంటుగా చేసెయ్యాలి అని మనసులో దృఢంగా తలపోశాను,అడిగి రాయించుకోడం అస్సలు నడవదునాకు..అలాఉండుంటే ఆకాశమే హద్దుగా పెద్దయ్యేదాన్ని.అమ్మేమో పెద్దదైపోతోంది...ఎలాగబ్బా అనుకుంటుండగా...౨౦౦౯లో హెచ్.ఎమ్ టివి ప్రారంభంలో..."ఆకాశంలో సగం "అంటూఒక ప్రోగ్రామ్ లో నన్ను అరగంట నిడివికి ఇంటికొచ్చి షూటింగు చేసుకుంటామంటూనే ...ముందుగా అమ్మకి కబురుచేసి తీసుకొచ్చి..నాపక్కనే కూర్చో పెట్టించి..చక్కగా టివిలో కనపడేలా ఏర్పాటు చేసి నా ఉన్నతికి అమ్మచేసిన కృషిని తెలిపి ఖుష్చేశాను..అప్పుడప్పుడే టెస్ట్ సిగ్నల్స్ ప్రారంభించిన ఆటివి వారు రోజుకు కనీసం పదిసార్లు చెప్పున నా ప్రోగ్రామ్ టెలెకాస్ట్ చేయడమూ..అది విజయనగరంలో నున్న మా అమ్మ ఆడబడచులు,తోటికో డళ్ళు..వాళ్ళపిల్లలు మాకంటే ముందుగాచూసి...అందులో అమ్మనే ముందుగుర్తుపట్టి ఫోన్లు చేసిచెబితే..అమ్మచెప్పగా నేనూ చివరికి చూసి తరించాను మామూలుగా కాదు!! ఆతరువాత ఎంతోకాలం లేదు అమ్మ...!! అనారోగ్యకారణాలవలన జాబ్ మానేస్తూ..చివరిరోజు మీటింగులో..మా అమ్మకి నా అవసరం ప్రస్తుతం చాలా ఉందని చెప్పి,,కాలక్షేపానికిలోటుండదని శలవుతీసుకున్న నేను...ఒక్కనెలరోజులు అమ్మని ఆనందింపచేశాను నా కంపెనీతో..అంతే...తిరిగిరానిలోకాలకు తరలిపోయింది సీతమ్మ...!తోచక...తరచితరచి కుమిలింది వసంతమ్మ.! అమ్మ కలకాలం ఉండాలనుకోవడం ఎంత పేరాశో.. ఉంటుందన్నిది ఒక కల.. పెద్ద కల. --అయ్యగారి వసంతలక్ష్మి
అమ్మ అన్న మాటే అమృత౦ అమ్మ అన్న మాటే అమృత౦. అ= ఆప్యాయత, ఆదరణ,అనురాగ౦, మ=మమత, మాధుర్య౦ ఇవన్నీ కలగలిస్తే అమ్మ ప్రతిరూప౦.అ౦దరిలా అమ్మ ప్రేమ పొ౦దలేదు.ఆఖర్న పుట్టిన నేను గార౦ ఎరగకపోయినా అమ్మ ప్రేమ విభిన్న౦గా పొ౦దాననిపిస్తు౦ది. నేను పుట్టేసరికి అమ్మ, అమ్మమ్మ,నాన్నమ్మ కూడా అయిపోయి౦ది. లాలి౦చడానికి సమయ౦ లేదు.అయినా అ౦దులోనే నా కోస౦ ఆరాట౦. చిన్నప్పుడు ఆవిడ మాగాయ ముక్కలు ఎ౦డపెడితే గున గున నడుచుకు౦టూ వెళ్ళి ఒక చె౦బెడు నీళ్ళు పోసానుట. రె౦డు వ౦దల మామిడికాయలు చచ్చి తొక్క తీసి ఊట౦తా పి౦డి ఎ౦డబెడితే అలా చేస్తే ఆవిడ మనస్థితి ఎలా ఉ౦టు౦ది? పెద్దయ్యాక అడిగాను కొట్టావా! అని. నవ్వి కొడితే ఆ నీళ్ళు బైటికి వస్తాయా! అని అడిగి౦ది. ఇ౦కో రోజు గాజుల మలార౦ వాడు వచ్చాడు. అక్కయ్యల కు గాజులు వెయ్యడానికి . అమ్మ గాజు గాజులు వేసుకునేది కాదు మడికి పనికిరావని.నా కెప్పుడూ రబ్బరు గాజులు వేయి౦చేది.ఆ రోజు పేచీ పెట్టి గాజు గాజులు వేయి౦చుకున్నాను వద్దన్నా వినకు౦డా. సాయ౦కాల౦ అయ్యేసరికి చిన్నన్నయ్య కొట్టడ౦ తో కొన్ని, ఆటల్లో పడిపోయి కొన్ని గాజులు విరిగి పోయాయి. నా బోడి చేతులు చూసి అమ్మ “వద్ద౦టే విన్నావా! పె౦కి తన౦,మొ౦డిపట్టు నువ్వూనూ” అ౦టూ ఒక్కటిచ్చి౦ది. ఏడుస్తున్న నన్ను చూసి గాజులు విరగ్గొట్టిన చిన్నన్నయ్య చ౦కలెగరేసాడు.ఏడుస్తూ నేల మీద నిద్రపోయాను. నాన్నగారు ఆఫీస్ ని౦చి వచ్చి నా క౦టి చారికలు చూసి ‘ఎ౦దుకేడ్చి౦ది’ అని అడిగారు. ‘కొట్టాను’ అ౦టూ జరిగిన స౦గతి చెప్పి౦ది. “పోనీ పావలా గాజులే కదా!పోయి౦ది రేపు మళ్ళీ గాజులు కొని వేయి౦చు అనవసర౦గా కొట్టావు” అన్నారు. “పావలా కోస౦ కాద౦డీ గాజుముక్కలు గుచ్చుకు౦టే” అన్న అమ్మ మాటలకు అప్పుడర్ధ౦ తెలియదు.అప్పుడు పావలా కూడా ఎక్కువే ఒక రోజు కూర వస్తు౦ది. మాగాయ ముక్కల సమయ౦ లో నా వయసు మూడేళ్ళు, గాజుల సమయ౦ లో ఐదేళ్ళనుకు౦టాను. అక్కయ్య కూతురికి మా బావ పట్టుపరికిణీ కొన్నాడని, నాకు కూడా కొనాలన్న తాపత్రయ౦. ఎలాగా? పొట్లాల కాగితాలు( అప్పట్లో సరుకులు కాగిత౦ పొట్లాలు కట్టేవారు).అవన్నీ కూడబెట్టి౦ది. అన్నయ్యలు అక్కయ్యల నోటు పుస్తకాలు స౦వత్సర౦ ఆఖరికి పోగేసి అన్నీ చెత్త కాగితాలకి వాడికి అమ్మితే డబ్బులొచ్చేవి. అలా ఎన్నాళ్ళు కూడబెట్టి౦దో పదిహేను రూపాయలు పెట్టి మెడ్రాస్ ని౦చి పట్టుపరికిణీ మామిడి ప౦డు ర౦గు మీద రె౦డు చేతుల వెడల్పు,ఉన్ననెమళ్ళ అ౦చుతో ఉన్నది తెప్పి౦చి, కుట్టి౦చి౦ది.అది వేసుకున్నప్పుడల్లా ఎక్కడ మాసిపొతు౦దో అని,వ౦ద జాగ్రత్తలు చెప్పేది.ఆ తరువాత అన్నయ్య దగ్గర అమ్మకు దూర౦గా పెరిగాను. మళ్ళీ కాలేజీ లో చేరడానికి రాజమ౦డ్రి వచ్చి అమ్మ ప్రేమ.కట్టుబాట్లలో పెరిగాను.రోజూ కాలెజీని౦చి వచ్చాక అమ్మతో ఆ సాయ౦కాల౦ పొట్టు పొయ్యి కూరుతూ కాలెజీ లో ఏ౦ జరిగి౦దో అమ్మతో ప౦చుకునేదాన్ని.మా కుటు౦బ౦లో కాలెజీ గడప తొక్కినదాన్ని నేనే మరి అ౦టే అమ్మ స౦తాన౦లో ఆడపిల్లనయి ఉ౦డి.ఇ౦చక్కా మా అమ్మ నా ఫ్రె౦డ్ లా అవన్నీ వినేది. మా కబుర్లయ్యాక టీ పెట్టమనేది. ఆ తరువాత పక్కి౦టి వాళ్ళ రేడియో లో లలిత స౦గీత౦ పాఠ౦ నేర్చుకునేదాన్ని.మా అమ్మఎ౦త ఆధునిక భావాలు కలదో చూడ౦డి. మా కాలేజ్ కో ఎడ్యుకేషన్ అబ్బాయిలు ఎలా పేర్లు పెట్టేవారు, ఎలా ఏడిపి౦చేవారూ అవన్నీ కూడా అమ్మతో ప౦చుకునేదాన్ని. అప్పటికి ఆమెకు అరవై వచ్చినా కు౦పటి సెగ తగిలితే ర౦గు తగ్గిపోతానని, కాల్చుకు౦టానని భయపడిపొయేది.క౦టి ఆపరేషన్ అయ్యి,మా మూడవ బావగారు పోయినప్పుడు కూడా నన్ను పొయ్యి దగ్గరకు ప౦పడానికి ఆమె మనసు ఒప్పేది కాదు.పెళ్ళి చూపులప్పుడు నాన్నగారు నల్లగా ఉన్నావు కాస్త పౌడర్ రాసుకో అ౦టె ఆవిడకు సర్రున కోప౦ వచ్చి నా పిల్ల నల్లగా ఉ౦ద౦టారా అ౦టూ నాన్నగారి తో దెబ్బలాడి౦ది.నా పెళ్ళిలో కూడా అమ్మ నా మూల౦గా దెబ్బలు తినడానికి స౦సిద్ధమయ్యి౦ది. నేను తెగి౦చి “ నన్ను కొట్ట౦డి మా అమ్మను కొట్టక౦డి ఇలా ఐతే నేను పెళ్ళి చేసుకోను” అ౦టూ మొదటి సారి అమ్మకోస౦ నాన్నగార్ని ఎదిరి౦చాను. అప్పుడు కూడా అమ్మ క౦ట్లో నీళ్ళు బైటికి రాకు౦డా చేసుకుని, అలా వెళ్ళు నాన్నకెదురు చెప్తావా! అని కేకలేసి౦ది. పెళ్ళయిన కొన్నాళ్ళకు గర్భవతి నయ్యి నాలుగవ నెలలో అబార్షన్ అయితే ఆ స౦గతి తెలిసి పెద్దక్క దగ్గర ఏడ్చి౦దట. “నా చేత్తో దానికి పురుడు పుణ్య౦ ముచ్చట తీరుతు౦దో లేదో నేను లేకపోయినా నువ్వు ఆ ముద్దు ముచ్చటా జరిపి౦చు’ అని అక్క దగ్గర మాట తీసుకు౦దట. ఇలా అమ్మ గురి౦చి ఉన్నవి కొద్ది జ్ఞాపకాలైనా అన్నీ రాయలేను అన్నీ మధురాలే అమ్మ౦టే అ౦తే కదా!.ఇ౦తకీ చెప్పలేదు కదూ. అలా బె౦గ పెట్టుకున్న మా అమ్మ నాకు రె౦డు పురుళ్ళు పోయడమే కాకు౦డా మా అబ్బాయిల పెళ్ళి దాకా ఉ౦ద౦డోయ్.అదీ అమ్మ౦టే. అ౦దుకే అన్నారెవరో కవి “అమ్మవ౦టిది అ౦త మ౦చిది అమ్మ ఒక్కటే” అని. -- సుజల గంటి (అనురాధ)- (ప్రముఖ రచయిత్రి)
గ్రేట్ వారియర్ మా అమ్మ అమ్మో.. తప్పు చేస్తే అమ్మ చంపేస్తుంది అని మేము, భాను ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/ అత్తయ్య) కోప్పడుతుందని బంధువులు అందరికీ తన ముందు, కానీ వెనక కానీ తప్పు చెయ్యాలన్నా, అబద్ధం చెప్పాలన్న భయం. ఎందుకంటే ఒప్పుకోదు. తప్పు చెయ్యనివ్వదు, ఛస్తే తప్పు చేయదు. “That is Bhanumathi.” మమ్మల్ని చాలా చాలా క్రమశిక్షణతో, అవసరమయితే శిక్షతో సరి చేసింది. లెఖ్ఖల్లో దిట్ట. చదువులో గ్రేట్.. విపరీతమయిన చురుకు. తను స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు రోజు.. నేను కడుపులో ఉన్నాను. ఆ రోజు సీమంతం.. గాజులు పెట్టించుకుంది, రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నేను పుట్టేనట. ఊరంతటికీ ఫస్ట్ వచ్చింది. స్కూల్ పీపుల్ లీడర్. జీవితం పట్ల విపరీతమయిన ఆసక్తి, అన్నీ తెలుసు కోవాలనే జిజ్ఞాస. బహుముఖ ప్రజ్ఞాశాలి. వీణ వాయించేది, బాగా చదువుకునేది, రచనలు చేసేది. మా అత్తగారి శిష్యురాలు వీణలో. వాళ్ళిద్దరి అనుబంధం ఒదినా- ,మరదళ్ళకి, గురు శుష్యులకీ ఆదర్శ ప్రాయం. చిన్నప్పుడు గురు దక్షిణ సమంగా ఇచ్చేమో లేదోనని 10 సంవత్సరాల క్రితం పగడాల ఉంగరం చేయించేరు గురువుగారికి. ముఖ్యంగా నా మొదటి వీణ గురువు మా అమ్మ గారు. అంతెందుకండీ! మా అమ్మ, నాన్నగారు వాళ్ళ గురువులకు (అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి గార్లకు) నన్ను గురుదక్షిణగా సమర్పించి...” నన్ను వాళ్ళతో సవ్యంగా నడచుకుని, చక్కగా వ్యవహరించి, కుటుంబాన్ని చక్కగా చూసుకుని మంచి పేరు తెచ్చుకోమని ఆదేశించారు.”. నేను అలాగే నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను. నేను గర్వ పడే విషయం ఏమంటే.. మా నాన్నగారు, “నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే నాకు మళ్ళీ కూతురుగా పుట్టాలి” అన్నారు. మా అమ్మ “ పిల్లలంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే మాకు గౌరవంతో కూడిన అభిమానం.” అని చెప్పారు. అభిమానం నా హక్కు, గౌరవం నేను సంపాయించుకున్నది. నా జన్మ ధన్యం. కాకపోతే చివర్లో పులిలాంటి మా అమ్మ పిల్లిలా అయిపోయి, కొన్ని మర్చిపోయి, యోగినిలా నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది మాట్లాడకుండా....... అటు వంటి స్థితిలో కూడా చదువుకి సంబందించినంత వరకూ పర్ఫెక్ట్. లెక్ఖలు ఎంత క్లిష్టమైనవైనా క్షణాల్లో చెప్పేది, ఇంగ్లీష్ లో అమ్మ, “సైట్ అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cited”.. అని చెప్పేవారు, పద్యాలు చెప్పేవారు, అలానే ప్రైజ్ అంటే..”రెండున్నాయి praise, prize..అని, మొదటిది మనం చేసిన ప్రయత్నానికి ఎదురు వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం హక్కుగా సంపాయించు కునేదీ” ట. బాగుందా? అలానే Pedestrians, Trespassers లాంటి క్లిష్టమైన పదాలకి అర్ధాలు చెప్పేరు, పోయే ముందు మూడు నెలల ముందు ఇదంతా... కొత్త కొత్త తెలుగు పద్యాలు ఎన్నో చెప్పి రాసుకోమన్నారు, కానీ అజ్ఞానం వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా.. ఫలితం అర్ధంయ్యిందనుకుంటా..పాపం మా అమ్మ మొదటి నుండి ధైర్యంగా పరిస్థితులతో పోరాడింది, చివరికి మృత్యువుతో కూడా పోరాడి, పోరాడి .అలసి సొలసి ఓడిపోయింది తప్పని పరిస్థితులలో... అమ్మా! నిన్ను చూసి నాలుగు నెలలైంది...... --అయ్యగారి జయలక్ష్మిః
తలవని రోజుందా అమ్మ నేను పదేళ్ళ పాప మురళిఅన్నయ్య ఫ్రెండ్స్ తో బొంగరాలాట ఏడుపెంకులాట ఆడుకొని కను చీకటిపడేటప్పుడు యింట్లో అడుగు పెట్టింది . అమ్మ ఎందుకో కోపంగా వుంది . పిల్లిలా వాకట్లొకెళ్లి కాళ్లు కడుక్కొని పుస్తకాలు ముందు వేసుకొని చదువు కోడానికి కూర్చుంది . అమ్మ భోజనానికి పిలిచేదాకా చదువుకుంది. భోజనాలదగ్గర " రేపటి నుంచి నువ్వు మొగ ఆటలు ఆడకూడదు, కున్ని, మినొతి, విజయలతో ఆడుకోవాలి " అమ్మ శాసనం . " మగ ఆటలా ? ", ఆటలలో కుడా లింగ బేధం ఉంటుందని తెలీని పాప సందేహం . " అంటే చింతపిక్కలాటలు, గచ్చకాయలు ఆడుకోవాలి నాతో సమానంగా బొంగరాలు ఆడకూడదు అదీ సంగతి , వీధినిండా ముగ్గులు కావాలంటే పెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు" సందేహ నివృత్తి చేసేడు మురళి. మురళి గొంతులో హేళన ఉందేమో అనే అనుమానం వచ్చింది పాపకి. అమ్మ ఆ యింటి నియంత, వొక నిర్ణయం తీసుకుంది అంటే మరి దాన్ని మార్చే ప్రసక్తే లేదు. అయినా ఏదో ఆశ. అందుకే నాన్నగారివైపు ఆశగా చూసింది. " మరీ నోటిస్ యివ్వకుండా యిలా ఆర్డరు వేస్తే ఎలా ? వో పదిరోజులు యీ మొగ ఆటలు ఆడేసి, సైకులు తొక్కేసి అప్పుడు మానేస్తుందిలే ? కదమ్మా పాపా, తరవాత అమ్మ దగ్గర కుట్లు అల్లికలు, వీణ నేర్చుకో ఏం " నాన్నగారు మరో పదిరోజుల గడువు యిప్పించేరు. ఆటలకు పంపనప్పుడు అమ్మలో నియంతను చూసింది, కుట్లు, అల్లికలు, సంగీతం నేర్చుకునే టప్పుడు గురువుని చూసింది. బుట్ట చేతుల గౌను, దొంతుల గౌను, పంజాబీ డ్రెస్స్, నిండా కుచ్చిళ్ళ పరికిణి, మూడు నాలుగు రంగుల బట్టలతో గౌను కుట్టినప్పుడు అమ్మ వో ఫాషన్ డిజైనర్." పని ముద్దా, భాగ్యం ముద్దా అని " అంటూ సమర్దవంతం గా అన్ని పనులు స్వయంగా చేసుకోవాలని తాను చేసుకుంటూ పాపకి, కోడళ్ళకి సలహాలిస్తున్నప్పుడు మార్గదర్శి. పదమూడేళ్ల పాపకి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపుతూ అక్కడ ఎలా మసలుకోవాలో చెప్తున్నప్పుడు అమ్మ వో స్నేహితురాలు. పదహారేళ్ళ పాప తల్లయితే పనిమనుషులు దొరకని ఒడ్డిదేశంలో అమ్మ ఆయాగా పురిటి, ' చెత్త ' చేతులతో శుభ్రం చేసింది, పురిటి బట్టలు చాకలి కారంలో ఉడక బెట్టి ఉతికిన అమ్మ వో చాకలి, పాటలు పాడుతూ పసివాడికి లాల పోసి జోల పాడిన నాతల్లి అమృతవల్లి, అనురాగాల తల్లి. యింటి పని, వంట పని, పిల్లల చదువులు, బయట పనులు అన్ని సమర్ధవంతంగా చేసుకో గలిగే శక్తి, దైర్యం యిచ్చిన శక్తి స్వరుపిణి అమ్మే. పిల్లలని, సామాను తీసుకొని రెండు ట్రైన్స్ మారి మూడురోజుల ప్రయాణం సమర్దవంతంగా చెయ్యగలిగే దైర్యాన్ని యిచ్చినదీ అమ్మే. యిక్కడ మరో అమ్మని గురించి కుడా చెప్పుకోవాలి, ఆ అమ్మ పాపని కన్న అమ్మ. యీ అమ్మ పాప పదమూడో యేట అత్తగారిగా పరిచయమై పాపని లక్ష్మిగా చేసిన అమ్మ. అప్పటి నుంచి యిప్పటి వరకు లక్ష్మి మీద యీగని కుడా వాలనివ్వకుండా చూసుకున్న అమ్మ. యింట్లో అడుగు పెట్టిన మొదటి రోజు లక్ష్మి భర్తకి " లక్ష్మి కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకో, దాని కంట్లో నీళ్లు చూసేనా నీ నడ్డి పెట్ల కొడతా " అని వార్నింగ్ యిచ్చిన అత్తమ్మ. లోక ధర్మం ప్రకారం అత్తమ్మలో అమ్మని చూసుకుంటూ లక్ష్మిగా మారిన పాప తల్లిని తలవని రోజుందా ? --కర్ర నాగలక్ష్మి
“బి.పీ. మాత్ర వేసుకున్నావా?” నా దగ్గర పదిరోజులు వుండటానికి వచ్చిన అమ్మను అడిగే మొదటి ప్రశ్న! “వేసుకున్నా..”అనేదే ఎప్పటి సమాధానం.... “రాత్రి నిద్రపట్టదు..నిద్రమాత్ర వుందా?” పడుకునేముందు అమ్మ అడిగితే “రోజూ నిద్రమాత్ర వేసుకో కూడదు అమ్మా” “అదికాదే..అర్ధరాత్రి బాత్ రూం వెడితే కళ్ళు తిరిగినట్టవుతుంది. మాత్ర వేసుకుంటే నిద్రపోతా కదా..” కళ్ళు తిరుగుతున్నాయి అంటే బి.పీ ఎక్కువ వుండవచ్చు. తొంబై ఏళ్ల అమ్మకు వున్న ఏకైక ప్రాబ్లెం బీపీ... “రేపు డాక్టర్ను పిలిపిస్తా ..ఈ రోజుకు ఈ మాత్ర వేసుకో “ అని ఒక రేస్టిల్ మాత్ర ఇచ్చా. మా పల్లెలో R.M.P.డాక్టర్ ఎప్పటిలాగే వచ్చి అమ్మ బిపీ చెక్ చేసి “ కొంచం ఎక్కువగానే వుంది ఏమి మాత్రలు వేసుకుంటూ వున్నారమ్మా”అని అడిగితె అమ్మ తన బ్యాగ్గు తీసి అందులో ఒక ప్లాస్టిక్ కవరులో మడిచి పెట్టి వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపితే అది నేను తీసుకుని చూసి”ఇది చాలా పాతది..ఇవే వాడుతున్నవా? ఈ మద్య డాక్టరు దగ్గరికి వెళ్ళలేదా? అసలు మాత్రలు వేసుకుంటూ వున్నావా.. లేదా?” గట్టిగా అంటున్న నన్ను దీనంగా చూసే అమ్మ...నాకర్థం అయ్యింది.. “మీరు రాసివ్వండి డాక్టర్, నేను తెప్పిస్త్తాను..” అన్నాను. మాత్రలు అయిపోయినా తమ్ముడిని అడగదు అమ్మ. ఎన్ని రోజు లైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని కూడా అడగదు. తొంబై ఏళ్ళ అమ్మకు డాక్టర్ కు చూపించడం అవసరం అనిపించదు తమ్ముడికి. “ఏం ఎందుకు అడగవు? రేప్పొద్దున నీవు మంచాన పడితే ఎవరు చూస్త్తారు? మందులు సరిగ్గా తీసుకోవాలి అమ్మా” నేను ఎంత మాట్లాడినా అమ్మది మౌనమే... తనను ఏమైనా అన్నా భరిస్త్తుంది కానీ తమ్ముడిని ఏమీ అనకూడదు అమ్మకు...కారణం తమ్ముడికి ఉద్యోగం లేదు కనుక నెలసరి ఆదాయం లేదు..పొలాలు ఎన్ని వున్నా రాయలసీమలో పండని భూములే..వాన చినుకు కోసం ఆకాశం వైపు ఎప్పుడూ ఎదురు చూపులే..అందుకే తన ద్వారా కొడుకు కి కష్టం కలగకూడదు అనే ఆలోచిస్త్తుంది తప్ప తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు. అదే నా బాధ ఎప్పుడూ... పదిరోజులు గడవగానే “వూరికి పోతా” అనేది. “ఇక్కడ హాయిగా వున్నావు..వుండు... పోవచ్చులే” నా సమాధానం ఎప్పుడూ నచ్చదు ఆమెకు. “ఆడబిడ్డ దగ్గర ఎన్ని రోజులైనా ఎలా వుంటాను?” “ఏం నేనూ నీ కడుపునా పుట్టిన దాన్నే..నా దగ్గరా వుండవచ్చు..” “అట్లా అనకు...ఎక్కడి వాళ్ళు అక్కడే వుండాలి” “ఇలా లాజిక్కులు మాట్లాడకు” నాకు జవాబు చెప్పలేక అక్కడనుండీ కదిలింది అమ్మ... రిటైర్ అయ్యాక పల్లె చేరిన నాకు...అమ్మను దగ్గర వుంచుకోవాలనీ...ఆ వయసులో అమ్మకు సుఖం ఇవ్వాలని ఏవేవో కోరికలు. కానీ కొద్ది రోజులు గడవగానే కొడుకు మీదే లోకం అమ్మకు.. చివరకు నేనుగా పంపనని నాకు తెలియకుండా దొంగగా పెరట్లోకి వెళ్లి తమ్ముడికి ఫోన్ చేసేది. వాడు మరుసటి రోజు వచ్చి అమ్మను తీసుకేడతా అంటే వాడిని చూసి అమ్మ కళ్ళల్లో ఎంత సంతోషమో!!....నిస్సహాయత నా అధీనం అప్పుడు... ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో చూసుకున్నా అమ్మకు తమ్ముడి మీదే లోకం అని అసూయ నాకు...ఒక్కసారైనా అమ్మ “నాకిక్కడ బాగుంది ఇక్కడే వుంటా “అని అనదే అని బాధ. అదే అంటే “మీది సుఖమయమైన జీవితం..పాపం వాడికే కష్టాలు” జాలి ప్రేమా అంతా వాడి దేనా??? చివరకు తమ్ముడి దగ్గరే ఒక రోజు పొద్దున్న కాఫీ తాగి లేచి వెళ్ళబోతూ కళ్ళు తిరిగి కిందపడ్డ అమ్మ లేవలేకపోయింది. పర్రీక్షల తరువాత తోడ ఎముక విరిగిందనీ ఆపరేషను అవసరమని.... “ఆపరేషను చేస్తే ఆరునెలలు బెడ్ మీద వున్నా లేచి తిరగ వచ్చు..లేదా పర్మనెంటు గా బెడ్ మీద వుండాల్సిందే “ అన్న డాక్టర్ మాటలు విన్నప్పుడు. అమ్మ ఏమి అలోచించి వుండవచ్చో ఉహించగలను. ఆపరేషను చేసుకుని తొందరగా నడవాలి అనుకుని వుంటుంది. మరి అనేస్తీశియా ఇచ్చి ఆపరేషను జరిగాక , ఆపరేషన్ సక్సెస్ అన్నాక, ఆరు గంటల తరువాత కళ్ళు తెరవక పోయినా చేతులు కదిలి ఆక్సిజెన్ ట్యూ బులు పెరికి ‘ఉహ్’ అంటూ చివరి సారిగా గాలిని వదిలి నిశ్చలంగా అయి ప్రశాంతంగా కన్ను మూసింది అమ్మ....అమ్మ బుర్రలో ఏమి ఆలోచనలు వచ్చి వుండవచ్చు? తాను పడక మీద వుంటూ కొడుకు కష్టం కలిగించ కూడదు అనుకుని వుంటుంది.... కొడుకు ఇంటనే తనువు చాలించాలనీ అనుకుని వుంటుంది.... ”ఎంతసేపూ కొడుకేనా అమ్మా ...నాగురించి ఆలోచించావా...”బాధగా మూలిగింది నా మనసు రోజు.. ఇప్పుడు ఆలోచిస్తే.... జీవితంలో అనిర్వచనీయమైన అనురాగాన్ని పంచి ఇచ్చిన అమ్మ,తమ్ముడి పట్ల అమితంగా ప్రేమ చూపుతుందని ఎందుకు అనిపించేది నాకు? ఆర్థికంగా కొడుకు బాధల్లో వున్నదని తల్లడిల్లిపోయిన ఆ మాత్రుహృదయాన్నిఎందుకు అర్థం చేసుకోలేదు నేను??? “అమ్మా క్షమించు” మనస్పూర్తిగా నమస్కరించాను అమ్మ ఫోటోకు. నవ్వుతూవున్న అమ్మ ఆశీర్వదించి నట్టు అనిపించింది... --లక్ష్మీ రాఘవ
అమ్మకి కానుక మా అమ్మ మంచితనం గురించి ఏం చెప్పను? అమ్మంత మంచిది అమ్మ. పేరు సత్య వాణి . ఆవిడ ఎక్కువ చదువుకోలేదు. .కానీ ఆవిడకున్న తెలివి తేటలు సమర్ధత ఇంతా అంతా కాదు. ఆ తరం లో ఏంతో మంది మధ్య తరగతి ఇల్లాళ్ళ లాగా మా అమ్మ కూడా మాలతి చందూర్ గారికి వీరాభిమాని. పొద్దున్న లేచి మాలతీ చందూర్ ని తలచుకోకుండా వుండేది కాదు. ప్రతి విషయంలోను మాలతి గారు అలా చెప్పారు. మాలతి గారు ఇలా చెప్పారు అనుకుంటూ ఆవిడ చెప్పిన సలహాలు తూచా తప్పకుండా పాటించేది అమ్మ. ఆ రోజుల్లో మాలతి చందూర్ గారి పేరు మాఇంట్లో వాసాలకు పెండేలకు పట్టిపోయింది. కాలం గడిచింది .నేను కలం పట్టి రచయిత్రిని అయ్యాను. మా శ్రీవారి ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్లాం . కాస్త ఇల్లూ వాకిలీ సర్దుకుని టెలిఫోనే డైరెక్టరీ నంబర్ వెతికి మాలతి చందూర్ గారికి ఫోన్ చేసాను. అప్పుడు ఆవిడ ఇంట్లో లేరు..ఆవిడ క్లర్క్ నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరునాడు మాలతి గారిదగ్గర్నించి ఫోన్ . మొదటి సారి మాట్లాడినా ఎన్నో ఏళ్ళనించీ పరిచయం వున్నట్లు అప్యాయంగా మాట్లాడటం మాలతి గారి ప్రత్యెకత. ఆ రోజే అమ్మకి ఫోన్ చేసి ఆ విషయం చెప్పాను. బొలెడంత సంబర పడిపోయింది అమ్మ. ఆతరువాత మాలతి గారిని చాలాసార్లు కలుసుకున్నాను. ఆ రోజుల్లోనే అమ్మ చెన్నై వచ్చింది. అప్పటికి నాన్నగారు వెళ్ళిపోయారు. మరికొద్ది రోజుల్లో అమ్మ70 వ పుట్టిన రోజు వస్తోంది. అమ్మా నీకు ఏం కొనను?ఏం కావాలి? అని అడిగాను, నాకేం వద్దు నీకు వీలయితే నన్ను మాలతీ చందూర్ గారి దగ్గరకి తీసుకువెళ్ళు అని అడిగింది. మాలతి గారికి ముందుగా చెప్పి మా వెహికిలూ డ్రైవర్ వగైరా జంజాటాలు పెట్టుకోకుండా అమ్మ నేను ఆటోలో వెళ్లాం. తన 70 వ ఏట తన అభిమాన రచయిత్రిని కళ్ళారా చూసుకుంది అమ్మ. అప్పుడు ఆవిడ కు కలిగిన ఆనందం వర్ణనాతీతం . నాన్నగారు పోయాక అంత కాలానికి మళ్ళీ అమ్మ మొహం లో వెలుగు కనిపించింది. పరిచయం చేయటంతో నా పని ముగిసింది. ఇక వాళ్ళిద్దరూ ఎక్కడికో వెల్లిపొయారు. ఎప్పటెప్పటి సంగతులో గుర్తు చేసుకున్నారు . రెండు గంటలు రెండు క్షణాల్లా గడిచిపోయాయి. ఆటో ఎక్కగానే అమ్మ నా చెయ్యి పట్టుకుంది .. నాకెంతో ఆనందం గా వుంది మాలతి గారిని చూస్తానని కల్లో కూడా అనుకోలేదు . ఇవ్వాల్టికి నా కోరిక తీరింది ,అదికూడా ఏ funtion లోనో కలిసి హడావిడిగా రావటం కాదు . సావకాశం గా మాట్లాడాను అని మురిసి పోయింది. ఆ మర్నాడు కొరియర్ లో హృదయ నేత్రి పుస్తకం పంపించారు మాలతి చందూర్ గారు. అది అందుకుని లాటరీ వచ్చినంత సరదా పడింది అమ్మ. ఆ తరువాత నాలుగేళ్ళకు అమ్మకి కాన్సర్ వచ్చింది. ఎక్కువ బాధ పడకుండానే వెళ్లి పొయింది. పోతానని తెలిసిపోయింది అమ్మకు. తన కళ్ళు దానం చెయ్యమని చెప్పింది చెశాం. ఇద్దరికి చూపు వచ్చిందిట. అమ్మకి ప్రకృతి అంటే ఇష్టం . గుళ్ళు గోపురాలు చూడటం ఇష్టం .. నేను ఎక్కడికైనాటూర్ వెళ్లి రాగానే అక్కడి వివరాలు అడిగి తెలుసుకునేది .నువ్వు చెప్తే నేను స్వయంగా చూసి నట్లు ఉంటుందమ్మా అనేది ' పోయేముందు నేను వెళ్ళిపోతున్నా .ఎక్కడికి వెళ్ళినా ఆ అందాలన్నీ నా కళ్ళతో చూడు అని నాకో బాధ్యత అప్పగించింది అమ్మ కళ్ళు ఎక్కడున్నాయో నాకు తెలియదు. ఎక్కడ ఏ అందమైన దృశ్యం చూసినా అమ్మను తల్చుకుని ఆమె కళ్ళతో మరోమారు చూస్తాను. మరి కూతురిగా నా బాద్యత నిర్వర్తించాలిగా ! .......పొత్తూరి విజయ లక్ష్మి.
Ideas to Showcase Pictures on Shelves Current trend is to install shelves of different kinds....they serve multiple purposes, as storage and picture display. Gone are the days of building concrete showcase shelves...well we are not talking about huge storage shelves, or shelves in closets...the ones in living rooms for photo display are mostly installed after constructing the house, based on the home owner's interest....like the one is the picture, they installed skates as shelves to showcase their kid's pictures. Shadow boxes or Picture frames can be converted into floating shelves for photo display. This idea can be used for book shelves and general storage too. Many home decor stores are selling these in sets for easy installation, and quite good carpenters can make these on custom orders. Even floating shelves are available in a wide range, they are easy to install without any professional help. Some deep, so long, some wide,..in various colors and choices are available over the counter. Mostly these instant shelves are useful in bachelor pads and teen hostel rooms, because of their easy to install, easy to remove and dismantle, easy and quick to replace facility. If you are looking for more picture display ideas...they are coming shortly!!! -pratyusha.t
Ideas to hang Pictures on a wall Who doesnot hang picture frames on walls? Atleast one!?....no matter how minimalistic your home decor is. There are many different interesting ways to hang photo frames on walls of a room, hallway, staircase....wherever there is space to decorate! Before you take a hammer and bang the wall, please consider proper planning. Based on the shape and size of the frames, two or more frames can be hung stylishly and easily without a second thought or alteration. Here are some ideas i found and followed. These could be useful to you. Some in old fashioned way, the side-by-side method, some in a square pattern, some zigzag and wavy. But these ideas are only useful strictly before you drill a nail in the wall or stick a very useful Command Hook to the wall. Many determined people even arrange the frames on the floor according to their chosen plan and then drill nails when totally confident...i have never seen anyone so organised...i am always in a hurry mood to see the frames on wall and end up rearranging...one other way to prep is to use Board pins( mostly useful with soft walls in Western countries), if you dont like the layout, rearrange! Let us know if our ideas help you! In our following articles, we shall learn more about hanging picture frames on walls using shelves or hooks. Pratyusha.T
'మౌనం' మంచిదే 1)"రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం. 2) మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట. 3) మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు, అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? 4) మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. 5) ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది. అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా. -రమ
Interesting Front Doors Entrances can be boring, unwelcoming, ....but those ars the places that are supposed to be interesting and some actually need a facelift..in countries with sentimental feelings, some decorate the front doors pretty well to make them welcoming, sametime, there are people who dont want to welcome anyone and everyone, and so, their front doors remain boring, reason unknown. In western countries too, entrance doors are taken care of. During spring specially, their front doors are decorated well with plant pots full of flowers. Even in India, front doors are lit up, and decked up with floral decor during festive season every year. Even every morning, they are washed and decorated. Here are some ideas for a modern way of front door decorations... We shall come across some more front door decorations in our upcoming articles.....the famous Indian traditional way !! pratyusha.T
ఆమె ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అమ్మ ఎవరికైనా అమ్మే. తన బిడ్డ మాత్రమే బాగుండాలి... వేరే తల్లి కన్న బిడ్డలకు ఏమైనా పర్లేదు అని ఏ అమ్మ అయినా అనుకుందీ అంటే, ఆమె అమ్మతనంలో కమ్మదనం లేనట్టే భావించాలి. అయితే అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మ తన కొడుకు మీద అతిగా ప్రేమ పెంచేసుకోలేదు. అతను తప్పు చేసినా వెనకేసుకు రావాలని ప్రయత్నించలేదు. అతను తప్పు చేస్తున్నప్పుడు నిలదీసింది. ఇతరులకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డుకుంది. అమ్మ అంటే ఎలా వుండాలో ప్రపంచానికి చెప్పింది. అందుకే ఆమెను ఇప్పుడు అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలుస్తున్నారు. అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఇటీవల ఒక విద్యార్థి పోలీసుల కస్టడీలో చనిపోయాడు. ఆ విద్యార్థిని పోలీసులు అన్యాయంగా చంపేశాడని స్థానికులు గత కొద్ది రోజులుగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. అయితే మంగళవారం వరకూ ఆ ప్రదర్శనలు శాంతియుతంగానే జరిగాయి. బుధవారం నాడు ఆ మరణించిన విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా శాంతియుత నిరసన ప్రదర్శన జరుగుతూ వుండగా కొంతమంది కుర్రాళ్లు ముఖానికి ముసుగులు వేసుకుని విధ్వంసకాండకు దిగారు. ఈ అల్లర్ల కారణంగా పరిస్థితులు చెయ్యి దాటిపోయి, పోలీసు ఫైరింగ్ జరిగే ప్రమాదం వుందని అక్కడున్నవారందరూ భయపడిపోయారు. అయితే ఇదే ప్రదేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ‘టోయా గ్రాహమ్’ అనే మహిళ చూపులు ముఖం నిండా ముసుగు కప్పుకుని, పోలీసుల మీదకు రాళ్ళు విసురుతున్న ఒక యువకుడి మీద నిలిచాయి. ఆ ముసుగులో వున్నదెవరో ఆమె కనిపెట్టేసింది. ఎందుకంటే, ఆ యువకుడిని కన్నది తానే కాబట్టి. ఆ ముసుగు యువకుడు తన కుమారుడే అని గ్రహించిన ఆ అమ్మ మనసు ఆగ్రహంతో రగిలిపోయింది. వెంటనే ఆ యువకుడి వెంట పడింది. తన తల్లి తనను పట్టుకుని తన ముసుగు తొలగిస్తుందని భయపడిన ఆ యువకుడు ఆమె నుంచి దూరంగా పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె పట్టు విడవకుండా తన కొడుకు వెంట పరిగెత్తి అతన్ని పట్టుకుంది. అతని ముసుగు తీసి, ఆ చెంపా, ఈ చెంపా వాయించేసింది. తల్లికి దొరికిపోవడంతో ఆ యువకుడు శాంతించి అదుపులోకి వచ్చాడు. మిగతావారు కూడా పారిపోవడంతో అల్లర్లు అదుపులోకి వచ్చి పోలీసు కాల్పులు తప్పాయి. ఈ ఘటనను ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూస్తున్న దాదాపు ఐదు లక్షల మంది ప్రేక్షకులు చూశారు. ఆ మహిళ వెంటాడి పట్టుకున్నది తన సొంత కొడుకునే అని తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ ఘటన తర్వాత టోయా గ్రహమ్ మాట్లాడుతూ, తన కొడుకు ముసుగులో వున్నప్పటికీ తాను గుర్తించానని, అల్లర్ల కారణంగా అతని జీవితం నాశనం కావడంతోపాటు పోలీసులు కాల్పులు జరిగితే ఎంతోమంది మరణించేవారు. ఒక తల్లిగా నా బిడ్డ ఎలా సంతోషంగా వుండాలని కోరుకుంటానో, మిగతా తల్లులు కూడా సంతోషంగా ఉండాలని భావిస్తాను అని చెప్పింది. నా కొడుకు దారి తప్పాడు... ఇప్పుడు అతన్ని సరైన దారిలో పెట్టే పనిలో నిమగ్నమవుతాను అని చెప్పింది. తన చర్యలతో, తన మాటలతో టోయా గ్రహమ్ అమెరికా ప్రజలకు బాగా నచ్చేసింది. ఇప్పుడు ఆమెను అందరూ ‘మదర్ ఆఫ్ ద ఇయర్’ అని పిలవటం మొదలుపెట్టారు.





















