నేను మా అమ్మ

అమ్మ అంటే ప్రేమ! అమ్మ అంటే మమతకు ప్రతిరూపం! అమ్మ లేనిదే ఈ ప్రపంచమే లేదు! అమ్మ అంటే ఒక భద్రతా! ఆమె ప్రథమ గురువు , స్నేహితురాలు, మార్గదర్శకురాలు! మంచి చెడు, సుఖం దుఖం ఎలాంటి పరిస్తితులోచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్పినది అమ్మే. మా అమ్మ పేరు అయ్యగారి లక్ష్మీ దేవి. ఆ కాలం లో ఆడపిల్లకి 'చాకలి పద్దు' రాయడం వస్తే చాలనే అనుక్కునే వారు, దానికి తోడూ చిన్నతనాన్నే పెళ్ళి అవడం వల్ల మా అమ్మ4 గో క్లాస్ దాకానే చదువు కుందట. ఆవిడకీ చదువు మీద చాలా మక్కువ, అందుకే మా నలుగురి అక్కచెల్లెళ్ళనీ గ్రాడ్యుఏషన్ అయ్యాకే పెళ్ళిళ్ళని, మా నాన్నగారిని వప్పించింది. మేమందరం చదువుకోవడమే కాకుండా, ఆవిడ ప్రోత్సాహం వల్లే ఉద్యోగాలు కూడా చేసాము.

మాకు కావలసిన పుస్తకాలు సర్ది పెట్టడం టిఫిన్ బాక్స్ లు తయ్యారు చెయ్యడం, ఒక్కటేమిటి, ప్రతీ అవసరం తానే చూసుకునేది. పరీక్షలకి చదువుకుంటుంటే అర్ధరాత్రయినా, మాతోటే కూర్చునేది. అసలు ఆవిడా లేనిదెక్కడా, వేనకాలే ప్రతీ అవసరానికీ మమ్మలిని ఆదుకునేది. అమ్మ గురించీ ఏమని చెప్పను ఎంతని చెప్పనూ..... నా విజయానికి, నా మనుగడకి నా జీవిత ప్రగతికి ఆవిడే కారణం.  నేను, స్కూల్ లో ఆంగ్ల మాధ్యమంలో చదువు కున్నా , అమ్మ వల్లే తెలుగు నేర్చుకున్నాను. ఆవిడ కోసం మా నాన్నగారు తీసుకు వచ్చిన, అన్ని తెలుగు వార, మాస పత్రికలన్నీ, ఆవిడ కన్నా ముందు నేనే చదివేదాన్నీ. అమ్మ లేని లోటు పూడ్చ లేనిది. ఈ మాతృ దినం నాడు అమ్మని గుర్తు చేసుకుంటూ, జన్మజన్మలకూ నేను ఆమె పుత్రికగానే జన్మించాలనీ, ఆ దేవదేవుణ్ణీ కోరుకుంటూ, ఇవే ఆమెకూ నా  స్మృత్యాంజలులు.

వడ్లమాని బాలా మూర్తి.-- (రచయిత్రి.)