“బి.పీ. మాత్ర వేసుకున్నావా?”
నా దగ్గర పదిరోజులు వుండటానికి వచ్చిన అమ్మను అడిగే మొదటి ప్రశ్న!
“వేసుకున్నా..”అనేదే ఎప్పటి సమాధానం....
“రాత్రి నిద్రపట్టదు..నిద్రమాత్ర వుందా?” పడుకునేముందు అమ్మ అడిగితే
“రోజూ నిద్రమాత్ర వేసుకో కూడదు అమ్మా”
“అదికాదే..అర్ధరాత్రి బాత్ రూం వెడితే కళ్ళు తిరిగినట్టవుతుంది. మాత్ర వేసుకుంటే నిద్రపోతా కదా..”
కళ్ళు తిరుగుతున్నాయి అంటే బి.పీ ఎక్కువ వుండవచ్చు. తొంబై ఏళ్ల అమ్మకు వున్న ఏకైక ప్రాబ్లెం బీపీ...

“రేపు డాక్టర్ను పిలిపిస్తా ..ఈ రోజుకు ఈ మాత్ర వేసుకో “ అని ఒక రేస్టిల్ మాత్ర ఇచ్చా. మా పల్లెలో R.M.P.డాక్టర్ ఎప్పటిలాగే వచ్చి అమ్మ బిపీ చెక్ చేసి “ కొంచం ఎక్కువగానే వుంది ఏమి మాత్రలు వేసుకుంటూ వున్నారమ్మా”అని అడిగితె అమ్మ తన బ్యాగ్గు తీసి అందులో ఒక ప్లాస్టిక్ కవరులో మడిచి పెట్టి వున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపితే అది నేను తీసుకుని చూసి”ఇది చాలా పాతది..ఇవే వాడుతున్నవా? ఈ మద్య డాక్టరు దగ్గరికి వెళ్ళలేదా? అసలు మాత్రలు వేసుకుంటూ వున్నావా.. లేదా?” గట్టిగా అంటున్న నన్ను దీనంగా చూసే అమ్మ...నాకర్థం అయ్యింది.. “మీరు రాసివ్వండి డాక్టర్, నేను తెప్పిస్త్తాను..” అన్నాను.

మాత్రలు అయిపోయినా తమ్ముడిని అడగదు అమ్మ. ఎన్ని రోజు లైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని కూడా అడగదు. తొంబై ఏళ్ళ అమ్మకు డాక్టర్ కు చూపించడం అవసరం అనిపించదు తమ్ముడికి.

“ఏం ఎందుకు అడగవు? రేప్పొద్దున నీవు మంచాన పడితే ఎవరు చూస్త్తారు? మందులు సరిగ్గా తీసుకోవాలి అమ్మా” నేను ఎంత మాట్లాడినా అమ్మది మౌనమే... తనను ఏమైనా అన్నా భరిస్త్తుంది కానీ తమ్ముడిని ఏమీ అనకూడదు అమ్మకు...కారణం తమ్ముడికి ఉద్యోగం లేదు కనుక నెలసరి ఆదాయం లేదు..పొలాలు ఎన్ని వున్నా రాయలసీమలో పండని భూములే..వాన చినుకు కోసం ఆకాశం వైపు ఎప్పుడూ ఎదురు చూపులే..అందుకే తన ద్వారా కొడుకు కి కష్టం కలగకూడదు అనే ఆలోచిస్త్తుంది తప్ప తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు. అదే నా బాధ ఎప్పుడూ...

పదిరోజులు గడవగానే “వూరికి పోతా” అనేది. “ఇక్కడ హాయిగా వున్నావు..వుండు... పోవచ్చులే” నా సమాధానం ఎప్పుడూ నచ్చదు ఆమెకు. “ఆడబిడ్డ దగ్గర ఎన్ని రోజులైనా ఎలా వుంటాను?” “ఏం నేనూ నీ కడుపునా పుట్టిన దాన్నే..నా దగ్గరా వుండవచ్చు..” “అట్లా అనకు...ఎక్కడి వాళ్ళు అక్కడే వుండాలి” “ఇలా లాజిక్కులు మాట్లాడకు” నాకు జవాబు చెప్పలేక అక్కడనుండీ కదిలింది అమ్మ...

రిటైర్ అయ్యాక పల్లె చేరిన నాకు...అమ్మను దగ్గర వుంచుకోవాలనీ...ఆ వయసులో అమ్మకు సుఖం ఇవ్వాలని ఏవేవో కోరికలు. కానీ కొద్ది రోజులు గడవగానే కొడుకు మీదే లోకం అమ్మకు.. చివరకు నేనుగా పంపనని నాకు తెలియకుండా  దొంగగా పెరట్లోకి వెళ్లి తమ్ముడికి ఫోన్ చేసేది. వాడు మరుసటి రోజు వచ్చి అమ్మను తీసుకేడతా అంటే వాడిని చూసి అమ్మ కళ్ళల్లో ఎంత సంతోషమో!!....నిస్సహాయత నా అధీనం అప్పుడు... ఎంతో ప్రేమగా, ఆప్యాయతతో చూసుకున్నా అమ్మకు తమ్ముడి మీదే లోకం అని అసూయ నాకు...ఒక్కసారైనా అమ్మ “నాకిక్కడ బాగుంది ఇక్కడే వుంటా “అని అనదే అని బాధ. అదే అంటే “మీది సుఖమయమైన జీవితం..పాపం వాడికే కష్టాలు” జాలి ప్రేమా అంతా  వాడి దేనా???

చివరకు తమ్ముడి దగ్గరే ఒక రోజు పొద్దున్న కాఫీ తాగి లేచి వెళ్ళబోతూ కళ్ళు తిరిగి కిందపడ్డ అమ్మ లేవలేకపోయింది. పర్రీక్షల తరువాత తోడ ఎముక విరిగిందనీ ఆపరేషను అవసరమని.... “ఆపరేషను చేస్తే ఆరునెలలు బెడ్ మీద వున్నా లేచి తిరగ వచ్చు..లేదా పర్మనెంటు గా బెడ్ మీద వుండాల్సిందే “ అన్న డాక్టర్ మాటలు విన్నప్పుడు.

అమ్మ ఏమి అలోచించి వుండవచ్చో ఉహించగలను. ఆపరేషను చేసుకుని తొందరగా నడవాలి  అనుకుని వుంటుంది. మరి అనేస్తీశియా ఇచ్చి ఆపరేషను జరిగాక , ఆపరేషన్ సక్సెస్ అన్నాక, ఆరు గంటల తరువాత కళ్ళు తెరవక పోయినా చేతులు కదిలి ఆక్సిజెన్ ట్యూ బులు  పెరికి ‘ఉహ్’ అంటూ చివరి సారిగా గాలిని వదిలి నిశ్చలంగా అయి ప్రశాంతంగా కన్ను మూసింది అమ్మ....అమ్మ బుర్రలో ఏమి ఆలోచనలు వచ్చి వుండవచ్చు?
తాను పడక మీద వుంటూ కొడుకు కష్టం కలిగించ కూడదు అనుకుని వుంటుంది.... కొడుకు ఇంటనే తనువు చాలించాలనీ అనుకుని వుంటుంది.... ”ఎంతసేపూ కొడుకేనా అమ్మా ...నాగురించి ఆలోచించావా...”బాధగా మూలిగింది నా మనసు రోజు..

ఇప్పుడు ఆలోచిస్తే.... జీవితంలో అనిర్వచనీయమైన అనురాగాన్ని పంచి ఇచ్చిన అమ్మ,తమ్ముడి పట్ల అమితంగా ప్రేమ చూపుతుందని ఎందుకు అనిపించేది నాకు? ఆర్థికంగా కొడుకు బాధల్లో వున్నదని తల్లడిల్లిపోయిన ఆ మాత్రుహృదయాన్నిఎందుకు అర్థం చేసుకోలేదు నేను???

“అమ్మా క్షమించు” మనస్పూర్తిగా నమస్కరించాను అమ్మ ఫోటోకు. నవ్వుతూవున్న అమ్మ ఆశీర్వదించి నట్టు అనిపించింది...

--లక్ష్మీ రాఘవ