తలవని రోజుందా అమ్మ నేను

పదేళ్ళ పాప మురళిఅన్నయ్య ఫ్రెండ్స్ తో బొంగరాలాట ఏడుపెంకులాట ఆడుకొని కను చీకటిపడేటప్పుడు యింట్లో అడుగు పెట్టింది . అమ్మ ఎందుకో కోపంగా వుంది . పిల్లిలా వాకట్లొకెళ్లి కాళ్లు కడుక్కొని పుస్తకాలు ముందు వేసుకొని చదువు కోడానికి కూర్చుంది . అమ్మ భోజనానికి పిలిచేదాకా చదువుకుంది. భోజనాలదగ్గర " రేపటి నుంచి నువ్వు మొగ ఆటలు ఆడకూడదు, కున్ని, మినొతి, విజయలతో ఆడుకోవాలి " అమ్మ శాసనం .

" మగ ఆటలా ? ", ఆటలలో కుడా లింగ బేధం ఉంటుందని తెలీని పాప సందేహం .

" అంటే చింతపిక్కలాటలు, గచ్చకాయలు ఆడుకోవాలి నాతో సమానంగా బొంగరాలు ఆడకూడదు అదీ సంగతి , వీధినిండా ముగ్గులు కావాలంటే పెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు" సందేహ నివృత్తి చేసేడు మురళి. మురళి గొంతులో హేళన ఉందేమో అనే అనుమానం వచ్చింది పాపకి. అమ్మ ఆ యింటి నియంత, వొక నిర్ణయం తీసుకుంది అంటే మరి దాన్ని మార్చే ప్రసక్తే లేదు. అయినా ఏదో ఆశ. అందుకే నాన్నగారివైపు ఆశగా చూసింది.

" మరీ నోటిస్ యివ్వకుండా యిలా ఆర్డరు వేస్తే ఎలా ? వో పదిరోజులు యీ మొగ ఆటలు ఆడేసి, సైకులు తొక్కేసి అప్పుడు మానేస్తుందిలే ? కదమ్మా పాపా, తరవాత అమ్మ దగ్గర కుట్లు అల్లికలు, వీణ నేర్చుకో ఏం " నాన్నగారు మరో పదిరోజుల గడువు యిప్పించేరు.

ఆటలకు పంపనప్పుడు అమ్మలో నియంతను చూసింది, కుట్లు, అల్లికలు, సంగీతం నేర్చుకునే టప్పుడు గురువుని చూసింది. బుట్ట చేతుల గౌను, దొంతుల గౌను, పంజాబీ డ్రెస్స్, నిండా కుచ్చిళ్ళ పరికిణి, మూడు నాలుగు రంగుల బట్టలతో గౌను కుట్టినప్పుడు అమ్మ వో ఫాషన్ డిజైనర్." పని ముద్దా, భాగ్యం ముద్దా అని "  అంటూ సమర్దవంతం గా అన్ని పనులు స్వయంగా చేసుకోవాలని తాను చేసుకుంటూ పాపకి, కోడళ్ళకి సలహాలిస్తున్నప్పుడు మార్గదర్శి.

పదమూడేళ్ల పాపకి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపుతూ అక్కడ ఎలా మసలుకోవాలో చెప్తున్నప్పుడు అమ్మ వో స్నేహితురాలు. పదహారేళ్ళ పాప తల్లయితే పనిమనుషులు దొరకని ఒడ్డిదేశంలో అమ్మ ఆయాగా పురిటి, ' చెత్త ' చేతులతో శుభ్రం చేసింది, పురిటి బట్టలు చాకలి కారంలో ఉడక బెట్టి ఉతికిన అమ్మ వో చాకలి, పాటలు పాడుతూ పసివాడికి లాల పోసి జోల పాడిన నాతల్లి అమృతవల్లి, అనురాగాల తల్లి.

యింటి పని, వంట పని, పిల్లల చదువులు, బయట పనులు అన్ని సమర్ధవంతంగా చేసుకో గలిగే శక్తి, దైర్యం యిచ్చిన శక్తి స్వరుపిణి అమ్మే. పిల్లలని, సామాను తీసుకొని రెండు ట్రైన్స్ మారి మూడురోజుల ప్రయాణం సమర్దవంతంగా చెయ్యగలిగే దైర్యాన్ని యిచ్చినదీ అమ్మే.

యిక్కడ మరో అమ్మని గురించి కుడా చెప్పుకోవాలి, ఆ అమ్మ పాపని కన్న అమ్మ. యీ అమ్మ పాప పదమూడో యేట అత్తగారిగా పరిచయమై పాపని లక్ష్మిగా చేసిన అమ్మ. అప్పటి నుంచి యిప్పటి వరకు లక్ష్మి మీద యీగని కుడా వాలనివ్వకుండా చూసుకున్న అమ్మ. యింట్లో అడుగు పెట్టిన మొదటి రోజు లక్ష్మి భర్తకి " లక్ష్మి కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకో, దాని కంట్లో నీళ్లు చూసేనా నీ నడ్డి పెట్ల కొడతా " అని వార్నింగ్ యిచ్చిన అత్తమ్మ.

లోక ధర్మం ప్రకారం అత్తమ్మలో అమ్మని చూసుకుంటూ లక్ష్మిగా మారిన పాప తల్లిని తలవని రోజుందా ?

--కర్ర నాగలక్ష్మి