అమ్మంటే

అమ్మ ఎంత చక్కని పదం. మనిషి జీవితం అమ్మ చుట్టే అల్లుకు పోతుంది. తొలి అడుగు వేసినప్పటి నుంచి జీవితంలో ఎన్ని అడుగులు వేసినా అమ్మే తొలి గురువు. చిన్నప్పటి నుంచి మా అమ్మతో నా అనుబంధం లోని చిరు ఙ్ఞాపకాల పందిరి....అమ్మ కాలం చేసి 25 సంవత్సరాలు గడిచినా అమ్మతో అనుబంధం ఎప్పటికీ మరువలేనిది. మా అమ్మే నా స్నేహితురాలు. స్కూల్లో జరిగే ప్రతి విషయమూ రాగానే చెప్పేదాన్ని. ఆరోజుల్లో మాయింట్లో ఆడైనా, మగైనా డిగ్రీ వరకూ కూడా చదవలేదు. మా అక్కయ్య, అన్నయ్యలు పైస్కూలుతోనే ఆపేశారు. మొట్టమొదటిసారిగా ఇంటరులో కాలేజీలో (మొదటి బాచ్) చేరింది నేనే. నా తరువాత మా చెల్లెల్లు అందరూ డిగ్రీ కూడా చేశారు.

నాకు చదవాలనే కోరిక ఎంతో వుండేది. ఇంటరు తరువాత డిగ్రీలో చేరతానని అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కవ చదవాలంటే ఎక్కువ చదివిన వరుడ్ని తేవాలి అన్నారు. రెండు రోజులు అలిగి భోజనం కూడా చేయలేదు. అయినా నా కోరిక తీరలేదు. ఆ తరువాత శ్రీవారి ప్రోత్సాహంతో బి.ఏ. ఎం ఏ , ఇటీవలే ఎం  సి జె  పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచీ కష్టాలు అనుభవించిన మా అమ్మ జీవితమే మాకు పాఠాలు. . వంటింటి జీవతం నుంచి  రోజూ ఎదురయ్యే సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి... ఎక్కడ పొదుపు చేయాలి... వంటచేయటం లోని మెలుకువలు....   ఎలా మాట్లాడాలి..తెలుసుకున్నాను.  జీవిత పాఠాలు నేర్పింది అమ్మే. పిల్లలు ఎంత వరకు మాట్లాడాలి... పెద్దలు మాట్లాడే టప్పుడు దూరి అవకతవకలు మాట్లాడకూడదు ఇత్యాది మంచి విషయాలూ నేర్పిందీ అమ్మే. తన కష్టాలు, అన్నీ చిన్న దాన్ని అయినా  నాతోనూ పంచుకునేది. అమ్మ చాలా వరకు మాటల్లో మన తెలుగు సామెతెలు వాడేది. అంతే కాదు అమ్మతోటే నా ఆటలు.... అంటే ఆ రోజుల్లో పచ్చీసు, అష్టా చెమ్మా, చింతపిక్కలాట, వామన గుంటలు,  ఇలా ఎన్నో.... ఆటలు....

మా అమ్మ అంటే నాకు మరీ ఇష్టం. మా  అమ్మ చేతి రాత చక్కగా ముత్యాల్లా గుండ్రంగా వుండేవి. మా అమ్మ ఉత్తరాలు రాస్తే అపురూపంగా దాచుకునేదాన్ని. ప్రతి అక్షరం విడి విడిగా లైనులో రాసేది. అదే నేను రాస్తే కన్యాకుమారి నుంచి కాశ్మీరుదాకా పైకి పోయేది లైను. ... చిన్నప్పుడు   నాకు మా అమ్మ చేతి రాత చూసి మా అమ్మ బాగా చదువుకుంది   అనుకునేదాన్ని. మా అమ్మ నేను చదువుకోలేదు. 5వ తరగతి వరకే చదివాను అని . కానీ నేను నమ్మేదాన్ని కాదు. లేదు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని పోట్లాడేదాన్ని.... తరువాత అమ్మ చెప్పేది నిజమే అని తెలిసింది. అన్నిటా అమ్మే స్ఫూర్తి.  మేం ఆరుగురం పిల్లలం అయినా ఇంటి విషయాలు కానీ, పొలం వ్యవహారాలు కానీ, ఆర్ధిక వ్యవహారాలు.... ఇలా అన్ని విషయాలూ నాతో చర్చించేది. ఆవయసులో ఏమిటో గానీ... నాకు నేనే గొప్ప అనుకుని  నాకు తోచిన సలహాలూ ఇచ్చేదాన్ని.... మా నాన్నకు తన వ్యాపారంలో ఎవరికైనా ఉత్తరాలు ఇంగ్లీషులో కానీ, తెలుగులో కానీ రాయాలంటే నేనే రాసేదాన్ని.

ప్చ్... ఏమిటో ఆరోజులే లేవు... మరచిపోని ఆ రోజులు. మళ్లీ రమ్మంటే రావు.... ఙ్ఞాపకాలు తప్ప.... మిగిలినవి అవే.....  ఒక లీడర్ గా పెళ్ళి కాకముందు పుట్టింట్లో మెలిగిన నేను అమ్మ అంటే వివాహం అయిన తరువాత కూడా ప్రతి విషయంలోనూ అమ్మ స్మృతులే వెంటాడేవి....  ఇప్పటికీ మా అమ్మ చేతి వంట ఎంతో రుచి. అమ్మని తలుచుకుంటూ ఇప్పటికీ అమ్మ చేసే ఏ వంట అయినా చేస్తే చాలా రుచిగా వస్తుంది. భోజనం చేసినా అందరం కలిసి తినే వాళ్ళం. మా చిన్నపుడు పిల్లందరికి ఒకే కంచం లో అందరికి కలిపి ముద్దలు పెట్టేది. ఎంత రుచిగా ఉండేదో. ఇట్టే కంచం ఖాళీ అయ్యేది.

లోకం అంతా మదర్స్ డే అని జరుపుకోటం  ఈ రోజు  అమ్మ ఙ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకోవటం నిజంగా మధురమే. ఆసలు మర్చి పొతే కదా ఆ రోజే గుర్తు తెచ్చుకోడానికి. ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా గొప్ప. కెమెరాలు వుండేవి కాదు. అందుకే మా అమ్మా నాన్నా కన్యాదానం చేసే ఫోటో పెట్టా. చూడండి.

మణి కోపల్లె -- (రచయిత్రి.)