పనులు పెండింగ్ లో పడుతున్నాయా..     చెయ్యాలనుకునే పనుల లిస్టు పెరుగుతూ మీకు టెన్షన్ తెచ్చిపెడుతోందా. అయితే కొన్ని కిటుకులు పాటిస్తే చాలు,పనులన్నీ చకచకా అయిపోయి మీ టెన్షన్ ని దూరం చేస్తాయి. దీనికోసం ముందుగా మనం చెయ్యాలనుకున్న పనుల జాబితా మన బుర్రలో కాకుండా ఒక పేపరుపై పెట్టి వరుసగా రాసుకోండి. అందులో ఇంటికి సంభందించిన పనులన్నీ ఒక వైపు,బయటకెళ్ళి చెయ్యాల్సినవి మరో వైపు, అలాగే ఇంట్లో వాళ్ళ సహాయంతో చేసేవి ఇంకోవైపు చక్కగా డివైడ్ చేసి పెట్టుకోండి. ఇలా డివైడ్ చేసుకోవటం వల్ల మనం చెయ్యాల్సిన పనులపట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది.       ఇంట్లో చెయ్యాల్సిన పనులలో దేనికి ఎక్కువ ప్రిఫెరెన్సు ఇవ్వాలనుకుంటున్నారో దాని మీద ముందుగా దృష్టి పెట్టండి. ఇలా మన ప్రిఫెరేన్సు కి అనుగుణంగా పనుల లిస్టులో కాస్త మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల పనులు తొందరగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అన్ని పనులని ఒకేసారి తలచుకోవటం వల్ల వచ్చే అలజడి తగ్గి మనకు తెలియకుండానే పనులు చకచకా అయిపోతాయి. ఇక బయట చెయ్యాల్సిన పనుల లిస్టులో కూడా ఆ పనుల కోసం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు పక్కన రాసుకోండి. ఎక్కువగా ఏ ప్లేస్ కి వెళితే చాలా  పనులు పూర్తి చెయ్యచ్చో మనకి క్లియర్ గా అర్ధమవుతుంది. దానికి తగ్గట్టుగా వెళితే మన లిస్టులో పనులూ తగ్గుతాయి. మీకున్న పనులకి ఇంట్లో వాళ్ళ సాయం కూడా తోడయితే ఇంకా హాయి కదా. మొహమాటం పక్కన పెట్టి కాస్త ఆప్యాయంగా అడిగి చూడండి. చేసే పనులు ఎన్ని ఉండి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా వెళితే కొండంత పనయినా చిటికెలో చేసి చూపించే సత్తా మీ సొంతమవుతుంది.   ..కళ్యాణి 

భర్తని ఎన్నుకునే హక్కు 5 శాతం మందికే! కాలం మారిందని గొప్పగా చెప్పుకొంటున్నాం. పురుషులతో సమానమైన హక్కులను సాధించేందుకు స్త్రీలు ప్రయత్నిస్తున్నారనీ, వారి ప్రయత్నానికి సమాజం మొత్తం అండగా నిలబడిందనీ వ్యాసాలు రాస్తున్నాం. కానీ స్త్రీల పరిస్థితి ఏమాత్రమూ..... మారలేదని ఓ సర్వే తేల్చి చెబుతోంది. National Council of Applied Economic Research అనే సంస్థ University of Marylandతో కలిసి భారతీయ మహిళల స్థితిగతుల మీద ఓ సర్వేను నిర్వహించారు. ఇందుకోసం వారు 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 34 వేలమంది స్త్రీల నుంచి వివరాలను సేకరించారు. వీరంతా కూడా 15 నుంచి 81 ఏళ్ల వయసులోపు వారే! ఈ సర్వేలో తేలిన విషయాలతో సామాజికవేత్తలకి నోట మాట రాలేదు. - దాదాపు 80 శాతం మంది స్త్రీలు తాము వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటే ఇంట్లోవారి అనుమతి తీసుకోక తప్పదని చెప్పారు. అది భర్తయినా కావచ్చు, అత్తమామలు అయినా కావచ్చు. మొత్తానికి అనుమతి లేనిదే ఆరోగ్యం కోసం బయటకు వెళ్లడం అసాధ్యం అన్నమాట. - వైద్యుడి దగ్గరకు వెళ్లడం సంగతి అలా ఉంచితే... ఆఖరికి ఉప్పు, పప్పుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లడానికి కూడా వారికి అనుమతి కావాల్సిందే! 58 శాతం స్త్రీలు తాము పచారీల కోసం బయల్దేరేటప్పుడు కూడా ఇంటి యజమాని అనుమతి తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. - ఇంట్లో ఏ వంటకం చేయాలో నిర్ణయించే అధికారం 93 శాతం స్త్రీలకి ఉంది. ఆగండాగండి! ఆ శాతాన్ని చూసి సంబరపడకండి. దాదాపు 50 శాతం సందర్భాలలో ఇంట్లో ఏ వంట చేయాలని చేసే నిర్ణయంలో భర్త కూడా పాలు పంచుకుంటాడట. - వైద్యం దగ్గర్నుంచీ వంట వరకూ పరిస్థితి ఇలా ఉంటే ఇక కుటుంబ విషయంగా భావించే పెళ్లిళ్ల సంగతి చెప్పేదేముంది! కేవలం ఐదంటే ఐదు శాతం ఆడవారికి మాత్రమే తమ భర్తలను ఎన్నుకొనే అధికారం ఉందట. - మన దేశంలో పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లే అధికంగా ఉంటాయి కాబట్టి అందులో వధూవరుల పాత్ర తక్కువ కావడం అంత ఆశ్చర్యం కాకపోవచ్చు. కానీ పెళ్లి కుదిరిన తరువాత కూడా వారిద్దరి మధ్యా ఒక మాటా మంతీ జరగకపోవడం విచిత్రం. దాదాపు 65 శాతం మంది ఆడవారు పెళ్లిరోజునే తనకి కాబోయే భర్తని మొదటిసారి చూసినట్లు చెప్పారు. బీహార్లో అయితే ఇది 94 శాతంగా ఉంది. విస్మయాన్ని కలిగించే విషయం ఏమిటంటే... స్త్రీల అక్షరాస్యతతో కానీ, పురుషులతో పోలిస్తే వారి నిష్పత్తితో కానీ ఈ శాతాలలలో పెద్దగా మార్పు రాలేదు. ఉదాహరణకు స్త్రీపురుష నిష్పత్తి ఎక్కువగా ఉండే చత్తీస్‌ఘడ్‌తో పోలిస్తే, వెనకబడిన రాష్ట్రమైన మేఘాలయలలో స్త్రీల పరిస్థితులు మెరుగ్గా కనిపించాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వాలు స్త్రీలలో అక్షరాస్యత పెరిగితేనో, ఆర్థికంగా వారి పరిస్థితి మెరుగుపడితేనో వారు సాధికారతని సాధిస్తారని భావిస్తూ వచ్చాయి. కానీ ఆడవారి పరిస్థితి మెరుగుపడాలంటే సామాజికంగానే మార్పులు రావాలనీ... అందుకు అనుగుణమైన ప్రయత్నాలు మొదలుపెట్టాలనీ ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.                 - నిర్జర.

  మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.   ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.   ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు. మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు. బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ. ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు. నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

 మహిళలూ బి అలర్ట్!!  మహిళలు మహారాణులు. ప్రస్తుత కాలంలో ఇంటా, బయట, ఏ వ్యవహారాలలో అయినా మహిళలదే పైచేయి. చాలా కుటుంబాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవడం నుండి, అది అమలు జరిగేదాక ఆ ఇంటి ఆడవాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఎంత అంటే అక్షయపాత్ర అంత. వాళ్ళు ఏ పని చేయాలి అంటే ఆ నైపుణ్యాన్ని చాలా సులువుగా సంపాదించేసుకోగలుగుతారు. ఇలా అల్ రౌండర్ మహిళలే కాకుండా సాధారణ గృహిణీలు కూడా అప్డేట్ అవుతున్నారు. వీళ్ల జీవితంలో ఈ ఎదుగుదల వల్ల కలిగే హుషారులో చాలామంది, బాధ్యతల్లోనూ, పనులలోనూ మునిగిలిపోయి కొన్ని మర్చిపోతున్నారు. పర్యవసానంగా వాళ్లకు బోలెడు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చాపకింద నీరులా మహిళలను చుట్టుముట్టే సమస్యలు ఇవే!! వంటింటి విషాదం!! ప్రతి ఇంట్లో మిగిలి పదార్థాలు పడేయలేక, తినలేక ఇబ్బంది పడేది ఆ ఇంటి గృహిణి అనేమాట జగమెరిగిన వాస్తవం. భర్త బయట పార్టీ లో తింటాడు, పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ తో చాట్స్, పిజ్జా లు, బర్గర్లు తింటారు. ఇంట్లో అందరికోసం వండి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తే వాళ్ళందరూ మాకొద్దు అని తినకుండా పోతే, అప్పుడు అదంతా చెత్త కుప్పలో పడెయ్యలేక, ఆ వంట చేయడానికి పడిన కష్టం గుర్తొచ్చి, దాన్ని అలాగే పెట్టేసి. మరుసటిరోజు అదే తిండి తాను తింటూ భర్త, పిల్లలకు  వేడి వేడిగా వడ్డిస్తున్న మాతృమూర్తులు ఎందరో!! ఇలా తాజా ఆహారం తీసుకోక కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రం ఎక్కువగా శరీరంలోకి పోతూ డయాబెటిస్ కు గురవుతున్న మహిళలు అనేకం, అలాగే కుటుంబ సమస్యల గూర్చి ఒత్తిడికి లోనవుతూ కూడా దీన్ని కొనితెచ్చుకుంటున్నవాళ్ళు ఉన్నారు. వాటర్ వార్నింగ్!! మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్లేదు. ఈకాలంలో చాలామంది మహిళలు అధిక విద్యతో సంబంధం లేకుండా కుటుంబాలకు చేదోడుగా ఉండటానికి, ప్రస్తుత కాలంలో ఇల్లు సమస్యలు లేకుండా గడవడానికి ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉంటారు. వీళ్ళు, మరియు పాఠశాల విద్యార్థినిలు ఎదుర్కొనే సమస్య గురించి చెప్పుకుంటే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం కాదు. ఇంటి బయట అడుగు పెట్టాక గమ్యం చేరెవరకు ఎక్కడా ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయదు, ఎక్కడైనా ఉన్న డబ్బు పెట్టాల్సిందే. బయట బాత్రూమ్ వెళ్లాలనే సమస్య తప్పించుకోవడానికి మహిళలు చేసే పని మంచినీళ్లు ఎక్కువగా తాగకపోవడం. దీనివల్ల చాపకింద నీరులా కిడ్నీ సమస్యలు వస్తాయి. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొనే సమస్య ఇదే. హార్మోనల్ ప్రోబ్లేమ్స్!! మహిళల్లో ఎక్కువగా కనిపించే థైరాయిడ్ సమస్య దాని ద్వారా ఊబకాయం చాలా మంది మహిళల్లో కనిపిస్తుంది. కేవలం దీంతో వదిలిపోకుండా ఈ ఊబకాయం రానురాను శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచి అవి మహిళల్లో రొమ్ము కాన్సర్ కు కారణం అవుతాయి అనే ఆశ్చర్యం వేస్తుంది. హార్మోన్ సమస్యల వల్ల డిప్రెషన్, అనవసర ఫోబియాలు, pcod, గర్భాశయ సమస్యలు ఇలా ఒకదానికొకటి అల్లుకుపోతుంటాయి ఈ సమస్యలు అన్ని. ఇవన్నీ కూడా మహిళల ఋతుచక్రం మీద ప్రభావం చూపించి మానసికంగా మహిళలను దిగజారుస్తాయి. రక్తంతో యుద్ధం!! నిజమేనండీ బాబు. భారతదేశంలో అధికశాతం మంది మహిళలు ఎదుర్కొంటున్న మరో సమస్య రక్తహీనత. ఐరన్, కాల్షియం లోపాలు, సరిపడినంత ఎముక సామర్థ్యము, హిమోగ్లోబిన్ స్థాయిలు లేక బలహీనంగా, వాటి ద్వారా ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్న ఆడవాళ్లు ఎందరో. ముఖ్యంగా పోషకాహార లోపం వల్ల శారీరక దృఢత్వం లేక గాజుదేహాల్లా మారుతున్న ఆడవాళ్లు అధికం. ఇలా ఇన్ని సమస్యలు ఉన్నా ప్రపంచంలో పోటీలో ఆగకుండా పరిగెత్తాలని ఆరటపడుతూ ఉన్న మహిళలకు యాడ్స్ లో అందంగా చూపించే ఆహారాలు, ఎనర్జీ డ్రింకులు శక్తిని ఇవ్వవు. ప్రకృతిపరంగా లభించే ఆహారమే ఆరోగ్యం, అందం, ఆనందం కూడా. కాబట్టి మహిళలూ బి అలర్ట్!!మీ ఆరోగ్యం మీ చేతుల్లో!! ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆ రోజుల్లో సెలవు ఇస్తే ఏం!     స్త్రీలు మగవారితో సమానంగా అన్ని బాధ్యతలూ పంచుకుంటున్న రోజులివి. తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని రుజువు చేస్తున్న యుగం ఇది. కానీ తమకి చేయూతగా నిలుస్తున్న ఆడవారిని సమాజం ఎంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది అంటే జవాబు కష్టమే! వారికి మాత్రమే ప్రత్యేకమైన సమస్యలని పట్టించుకునేవారు కానీ, సహానుభూతితో స్పందించేవారు కానీ ఎవరున్నారు అంటే కనిపించేవారు తక్కవే! అందుకు ఉదాహరణే స్త్రీలు తమ రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సెలవు సమస్య!   ఎందుకీ బాధ స్త్రీలు తమ పీరియడ్స్‌ సమయంలో శారీరికమైన ఇబ్బందులను ఎదుర్కొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో వారి గర్భాశయం చుట్టూ ఉన్న రక్తనాళాల మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీనికి తోడు prostaglandins అనే రసాయనాలు కూడా విడుదల కావడంతో పొత్తికడుపు చుట్టూ ఉన్న కండరాలు కుంచించుకుపోయి మరింత బాధకి దారితీస్తాయి. కేవలం కండరాల నొప్పులే కాదు, పీరియడ్స్‌ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలు మహిళలను చుట్టుముట్టే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, వెన్నునొప్పి, క్రుంగుబాటు వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కోవలసి రావచ్చు. రుతుక్రమంలో వచ్చే ఇలాంటి సమస్యలని వైద్య పరిభాషలో dysmenorrhoea అంటారు.   మరోసారి వెలుగులోకి గత వారం బీబీసి రేడియో చేసిన ఒక సర్వేతో ‘పీరియడ్స్ సమయంలో ఉద్యోగం’ అనే సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు వేయిమంది చెప్పిన విషయాలు ఈ సమస్య తీవ్రతని తేల్చిచెప్పాయి. ఈ వేయిమందిలో 52 శాతం మహిళలు, పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పి తమ విధి నిర్వహణ మీద ప్రభావితం చేస్తోందని చెప్పారు. వారిలో ఒక మూడో వంతు మందైతే ఆ నొప్పి కారణంగా సెలవు తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఏతావాతా ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది తాము ఏదో ఒక సమయంలో పీరియడ్స్‌ నొప్పుల కారణంగా, ఉద్యోగ వేళల్లో ఇబ్బందిపడ్డామని చెప్పుకొచ్చారు. పీరియడ్స్‌ వల్ల వచ్చే నొప్పితో తరచూ ఇబ్బండి పడటం వల్ల, ఉద్యోగాన్ని మానివేసినవారూ లేకపోలేదు.   వింత సమస్య పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల గురించి మహిళలు యాజమాన్యం దగ్గర చెప్పునేందుకు జంకుతారు. యాజమాన్యమేమో దీనిని స్వయంగా పట్టించుకునే చొరవా చూపదు. ఫలితంగా కార్మికులలో సగభాగమైన మహిళలు ఈ బాధతోనే ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సమస్య గురించి గొంతుకలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య చాలా సహజమైనదన్న విషయం యాజమాన్యం గుర్తించాలనీ, పీరియడ్స్‌ సమయంలో మహిళలు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించాలనీ వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలకు కనుక ఇలాంటి సెలవులు అందుబాటులో ఉంటే వారు మరింత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తారని, యాజమాన్యం తమకు అండగా ఉందన్న తృప్తితో ఉంటారనీ పలువురు సూచిస్తున్నారు.   సాధ్యమేనా! జపాన్‌, ఇండోనేషియా, తైవాన్‌ వంటి దేశాలలో ఇప్పటికే మహిళలు రుతుక్రమంలో సెలవులు తీసుకునే సౌలభ్యం ఉంది. జపాన్‌లో అయితే దాదాపు 70 సంవత్సరాలుగా ఈ చట్టం అమలులో ఉంది. ఇక కెనడా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ సెలవులను అమలుచేయాలన్న ఉద్యమాలు బలపడుతున్నాయి. మన దేశంలో ఒకటీ అరా సంస్థలు ఇలాంటి సెలవులను ఇస్తున్నప్పటికీ, చట్టబద్ధంగా మహిళలకు ఇలాంటి సెలవులు లభించాలంటే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది. పైగా మహిళలకు ఇలాంటి సెలవులు ఇవ్వడం వల్ల చిన్న తరహా పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందనీ, పారిశ్రామికవేత్తలు మహిళలకు ఉద్యోగాలను ఇచ్చేందుకు జంకుతారనీ వాదించేవారికి మన వద్ద కొదవు లేకపోవడంతో... అసలు ఈ సౌలభ్యం మన దేశంలో వచ్చే అవకాశం ఉందా అన్నది అనుమానమే! అప్పటివరకూ బహుశా మహిళాలోకం మౌనంగా ఈ బాధని భరించాల్సిందేనేమో!   - నిర్జర.  

    చేతులున్నవారి మీద ఆమెది పైచేయి   అసలే ఆడపిల్ల! ఆపై రెండుచేతులూ లేకుండా పుట్టింది. పోనీ కుప్పలకుప్పలుగా డబ్బులున్నాయా అంటే మధ్యతరగతి కుటుంబమయ్యే. ఇదీ ‘దామినీ సేన్‌’ పరిస్థితి. మరొకరు ఆమె స్థానంలో ఉంటే ఏం జరిగేదో కానీ... దామినీ మాత్రం తానేమిటో నిరూపించుకుంది. ప్రతి విషయంలో ఇతరులతో పోటీపడుతూ- ఏకంగా ఓ ప్రపంచ రికార్డునే సాధించింది. దామినికి పుట్టుకతోనే చేతులు లేకపోవడంతో ఆమెకు చదువు ఎలాగా అన్న సమస్య మొదలైంది. పసి దామినికి స్నానం చేయించడం, బట్టలు తొడగడం వంటి పనుల్లో అయితే తల్లి సాయపడగలదు. కానీ ఆమెతో అక్షరాలను రాయించేదెలా! అందుకోసం ఆమె తల్లి మాధురీ సేన్ ఒక నిర్ణయం తీసుకుంది. దామినీ కాళ్లతోనే అక్షరాలను దిద్దించాలనుకుంది. కానీ ఎలా! అందుకోసం ముందు తనే కాళ్లతో అక్షరాలు రాసే ప్రయత్నం చేసింది. అందులో కాస్త నేర్పు సాధించాక అదే విద్యను దామినీకి నేర్పింది.     దామినీకి అక్షరాలు వచ్చేశాయి సరే! మరి ఆమెను బడిలో చేర్చేదెలా? అన్నది మరో సవాలు. చేతులు లేని దామినిని చేర్చుకునేందుకు పాఠశాల యజమాన్యాలు మొదట నిరాకరించాయి. కానీ ‘ఒక్కసారి ఆమెను చేర్చుకుని చూడండి. ఆమెను బడిలో కూర్చోబెట్టి చూడండి..’ అంటూ దామిని తండ్రి అభ్యర్థనను మన్నించక తప్పలేదు. నిజంగానే ఒక్కసారి చేర్చుకున్నాక దామిని మిగతా విద్యార్థులతో ఏమాత్రం తీసిపోదన్న విషయం ఉపాధ్యాయులకు అర్థమైంది. దామిని ఒకో తరగతినే దాటుకుంటూ రెండేళ్ల క్రితం ‘మా బంజారి గురుకుల్ విద్యాలయ(రాయ్‌పూర్)’లో పదో తరగతిని కూడా పూర్తిచేసింది. అది కూడా 80 శాతం మార్కులతో! ఇంతాచేసి దామిని కోసం పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ చేయాల్సి వచ్చేది కాదు. ఆమె కాళ్లతో నోట్స్‌ రాసుకునేందుకు కాస్త విడిగా కూర్చోనిస్తే సరిపోయేది!     దామిని చదువులోనే కాదు! మిగతా ఏ విషయంలోనూ ఇతరులకు తీసిపోదు. దామినిని చూస్తే ఆమెకు చేతులు లేవన్నది ఉత్తమాటే అనిపిస్తుంది. తన రెండు కాళ్లతోనే తలదువ్వుకోవడం, బట్టలు ఉతకడం, పాలు తాగడం దగ్గర్నుంచీ వంట చేయడం వరకూ అన్ని పనులూ చేసేస్తుంది. ఇదంతా ఒక ఎత్తయితే కాళ్లతో చకచకా బొమ్మలు గీసేయడం మరో ఎత్తు. మొదట్లో ఏదో కూతురు సరదా పడుతోంది కదా అని దామని తల్లిదండ్రులు ఆమెను బొమ్మలు గీసేందుకు ప్రోత్సహించేవారు. కానీ కార్టూన్లతో మొదలుపెట్టిన దామినిలోని చిత్రలేఖనం భారీ బొమ్మలు గీసే స్థాయికి చేరుకుంది. అంతేకాదు! కాలితో ఒక గంటలో అత్యధిక బొమ్మలు (38) గీసిన చిత్రకారిణిగా ప్రపంచ రికార్డుని సొంతం చేసుకుంది.     దామిని ప్రస్థానంలో ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు అండగా ఉన్నారన్న మాట నిజమే! అయితే స్వతహగా ఆమెలో సానుకూల దృక్పథం లేకపోతే ఎవరెంతగా ప్రోత్సహించినా ఉపయోగం ఉండేది కాదు కదా! ఆ ఆత్మవిశ్వాసమే దామిని మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మొదట్లో తాను కాళ్లతో పనిచేయడాన్ని నేర్చుకున్నప్పుడు, జనం నవ్వుతారేమో అన్న ఆలోచన వచ్చిందనీ... కానీ ఇతరుల గురించి కాకుండా తన గురించి ఆలోచించడంతో ముందుకు సాగిపోయానని చెబుతుంది. అంతేకాదు! ‘మనమీద మనకి నమ్మకం ఉంటే, ప్రపంచం ఏమనుకుంటుందో అన్న ఆలోచన అడ్డుపడదని’ అంటోంది. ‘భగవంతుడు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించాడనీ... ఆ జీవితంతో ఏదో ఒకటి సాధించాలనీ’ ఆలొచింపచేసేలా మాట్లాడుతోంది.   దామిని ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మున్ముందు తనబోటివారికి సాయంగా నిలిచేందుకు IAS సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. దామిని ప్రతిభ, పట్టుదల ఎరిగినవారికి, ఆమె తన లక్ష్యాన్ని సాధిస్తుందన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. చేతులు ఉండికూడా మనం చేయలేని పనిని దామిని అలవోకగా సాధించి చూపుతుందని... ఆమె నేస్తాల నమ్మకం. నిజమే కదా!     - నిర్జర.

  అక్కడ ఆడవారికి సమాన జీతం ఇవ్వాల్సిందే!     స్త్రీ ఆకాశంలో సగం అంటారు. కానీ నేల మీద మాత్రం తగిన ప్రాముఖ్యత ఇవ్వరు. అడ్డాకూలీల దగ్గర నుంచీ ఆఫీసర్ల వరకూ ఆడవారు చేసే పనికి చాలీచాలని వేతనమే లభిస్తుంది. ఈ విషయం మన కళ్ల ముందు కనిపించేదే! ఇది నిజమని రుజువుచేసేందుకు కావల్సినన్ని పరిశోధనలు కూడా జరిగాయి. నోరు తెరిచి అడిగినా కూడా ఆడవారికీ జీతాలు పెరగవనీ, సున్నితంగా ఉండే ఆడవారి జీతాలు అస్సలు మెరుగుపడవనీ గణాంకాలు రుజువుచేస్తున్నాయి. ఈ సోత్కర్షంతా ఎందుకంటే ఐస్లాండ్లో జరిగిన ఓ విప్లవం గురించి చెప్పుకోవడం కోసం!   మిగతా దేశాలతో పోలిస్తే ఐస్లాండ్లో జీవన పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అందుకే సంతోషకరమైన దేశాలలో ఐస్లాండ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడ స్త్రీపురుషుల మధ్య వివక్షా తక్కువగానే ఉంటుంది. మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగుల జీతాల మధ్య 14 శాతం మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ అక్కడి ఆడవారు ‘తక్కువ వ్యత్యాసం’తో సరిపెట్టుకోలేదు. అసలు వివక్షే లేని సమాజం కావాలని ఉద్యమించారు.   గత అక్టోబరులో ఐస్లాండ్లోని మహిళా ఉద్యోగులు... తమకు సమానమైన జీతాలు కావాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. ఆ తరువాత విధులలో చేరినా... తక్కువ జీతాలను తీసుకునేందుకు నిరాకరించారు. వీరి ఆవేదనను ప్రభుత్వం కూడా అర్థం చేసుకుంది. ఇక మీదట స్త్రీపురుషు ఉద్యోగులందరికీ సమానంగా జీతాలు ఇవ్వాలంటూ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై అక్కడ 25మంది కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థా... తాము సమానమైన వేతనాలను చెల్లిస్తున్నామంటూ ఒక ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. దీంతో చట్టబద్ధంగా సమాన వేతనాలని అమలు చేస్తున్న తొలిదేశంగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది.   ఉద్యోగరంగంలో స్త్రీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం ఐస్లాండ్కి కొత్తేమీ కాదు. 50 మందికి మించి ఉద్యోగులు ఉన్న సంస్థల బోర్డులో కనీసం 40 శాతం మంది మహిళా సభ్యులుండాలని ఇప్పటికే ఓ నిబంధన ఉంది. ఇలాంటి నిబంధనల వల్లే world economic forum ఐస్లాండ్లో మహిళా సాధికారత అత్యుత్తమం అంటూ కితాబు ఇచ్చింది. ఇక మహిళలకు సమాన వేతనాలతో ఐస్లాండ్ మరే దేశానికీ అందనంత ఎత్తుకి చేరుకుంది.   ఐస్లాండ్ని చూసి మన దేశం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఒకపక్క భారతదేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారని డప్పు కొడుతూనే వీలైనంతగా అణచివేతకి గురిచేయడం కనిపిస్తుంటుంది. పార్లమెంటులో మూడోవంతు రిజర్వేషన్ కోసం రూపొందిన బిల్లు దాదాపు 20 ఏళ్లుగా దుమ్ముకొట్టుకుని ఉంది. ఇక సమాన ఉద్యోగాలు, వేతనాలు గురించి ఏమని చెప్పుకోగలం. - నిర్జర.  

ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా!     స్త్రీ పట్ల సమాజం ధోరణ ఎప్పుడూ చిత్రంగానే ఉంటుంది. వారిని ఓ పక్క దేవతగా పొగుడుతూనే... ఆటవస్తువుగానే చూస్తుంటుంది. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే సంకెళ్లు వేస్తుంది. ఆడవారి పట్ల ఈ ద్వంద్వ వైఖరికి సాక్ష్యంగా ఇప్పుడు ఏకంగా ఓ పరిశోధనే వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యకాలం అంతా మెటర్నటీ లీవ్ గురించే మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు పిల్లల్ని కన్న తరువాత ఎంతకాలం మెటర్నిటీ లీవ్ ఉంటే మంచిది? దాని కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటూ తెగ ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. కానీ మెటర్నటీ లీవ్ తీసుకునే ఆడవారి గురించి సమాజం ఏమనుకుంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకి. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ 137 ఆడవారినీ, 157 మగవారినీ తమ ప్రయోగం కోసం ఎన్నుకొన్నారు. ప్రయోగంలో భాగంగా అభ్యర్థులందరికీ ఈమధ్యనే బిడ్డను కన్న ఒక స్త్రీ గురించి చెప్పారు. కాకపోతే ఆమె తన పిల్లవాడిని చూసుకునేందుకు మెటర్నటీ లీవ్ తీసుకుందని కొందరితో చెబితే, మెటర్నటీ లీవ్ పూర్తిగా వాడుకోకుండా ఆఫీసుకి వెళ్తోందని మరికొందరితో చెప్పారు. ఆ తర్వాత ఆ మహిళ గురించి తమ అభిప్రాయం ఏమిటంటూ వారిని ప్రశ్నించారు. అనూహ్యంగా రెండు సందర్భాలలోనూ సదరు వ్యక్తి చేసిన పనిని అభ్యర్థులు తప్పుపట్టారు. మెటర్నటీ లీవ్ని ఉపయోగించుకున్న సందర్భంలోనేమో ఆ వ్యక్తికి ఉద్యోగం పట్ల అంతగా నిబద్ధత లేదన్న అభిప్రాయం వ్యక్తమైది. మెటర్నటీ లీవ్ను వద్దనుకుని ఉద్యోగంలో చేరిన సందర్భంలోనేమో... తల్లిగా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏతావాతా రెండు సందర్భాలలోనూ స్త్రీ నింద పడాల్సి వచ్చింది! ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినవారంతా కూడా 33 ఏళ్ల సగటు వయసున్న యువతే కావడం గమనార్హం. వారిలో దాదాపు సగం మంది స్త్రీలు ఉండటం మరో వైపరీత్యం! పైగా వీరంతా అభివృద్ధి చెందాయని చెప్పే ఇంగ్లండ్, అమెరికా దేశవాసులు కావడం మరో విచిత్రం. మెటర్నటీ లీవ్ పట్ల సమాజపు ధోరణ తెలుసుకునేందుకు ఈ పరిశోధన జరిగి ఉండవచ్చు. కానీ బిడ్డను కనేందుకు, తన జీవితాన్ని పణంగా పెట్టే సందర్భంలోనే ఆడవారి పట్ల ఇలాంటి వివక్ష ఉంటే... ఇక రోజువారీ సందర్భాలలో వారి పట్ల సమాజ ధోరణి ఎలా ఉంటుందో ఇక చెప్పేదేముంది! - నిర్జర.    

  అమ్మతో కాసేపు   గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు.   పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా.   అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు.     అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి.   అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు.   ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం.   ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం.   కళ్యాణి

మహిళల మనసు దెబ్బతింటోంది   ఒక పక్క ఇంటి బాధ్యతలు, మరో పక్క ఉద్యోగం. రెండింటిలోనూ మహిళలు నెగ్గుకువస్తున్నా, ఆ పోరాటంలో వారి మీద ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది, మానసిక సమస్యలను సృష్టిస్తోంది. ఈ విషయాన్నే ప్రతిబింబిస్తోంది ఓ పరిశోధన. ఇదేదో ఆషామాషీ వ్యక్తులు సాగించిన పరిశోధన కాదు. ఇంగ్లండు వైద్య శాఖ ఆధ్వర్యంలో నడిచే National Health Service (NHS) అనే సంస్థ రూపొందించిన నివేదిక.   పరిస్థితులు విషమిస్తున్నాయి.. NHS ప్రతి ఏడేళ్లకి ఓసారి దేశంలోని పౌరుల మానసిక స్థితిగతుల మీద ఓ నివేదికను రూపొందిస్తూ వస్తోంది. అలా తాజాగా రూపొందిన నివేదికలో పురుషులతో పోలిస్తే మహిళల మానసిక ఆరోగ్యం చాలా ఆటుపోట్లలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు 16-24 వయసు మధ్యగల పురుషులలో 9 శాతంమంది మానసిక సమస్యలతో బాధపడుతుంటే, స్త్రీలలో మాత్రం ఇది 26 శాతంగా నమోదైంది. గత నివేదికలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కవేనట! పురుషుల మానసిక ఆరోగ్యంలో మాత్రం గతానికి ఇప్పటికీ పెద్దగా మార్పు లేదని తేలింది. ఇంకా ఈ నివేదికలో ఏమని తేలిందంటే... - 14 శాతం మహిళలు ఒత్తిడి నుంచి నిదానంగా డిప్రెషన్‌లోకి జారుకుంటున్నారని తేలింది. - 4 శాతం మహిళలు తీవ్రమైన బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారట. - 10 శాతం మహిళలు తమ మానసిక సమస్యకి చికిత్సను తీసుకుంటున్నారు. - డిప్రెషన్‌లో తమకు తాము హాని కలిగించుకుంటున్నవారి సంఖ్య 19 శాతానికి చేరుకుంది.   కారణాలు లేకపోలేదు: మునుపటితో పోలిస్తే మహిళలు మరిన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. పనిచేసే పరిస్థితులలో ఒత్తిడి పెరిగిపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలకు తోడు లైంగిక వేధింపులు కూడా మహిళలను క్రుంగుబాటుకి లోను చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక సమాజం నుంచి నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి ఎలాగూ ఉంది. టీవీ, సినిమా, సోషల్‌ మీడియాలతో ఒంటరితనం తగ్గుతున్నట్లు అనిపించినా... వాటిలో చూస్తున్న దృశ్యాలు, ఎదుర్కొంటున్న కామెంట్లు మనలో ఉన్న కాస్త మనశ్శాంతినీ దూరం చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా విషాదకరమైన గతం ఉన్నవారిలో అవి పాతగాయాలని రేపుతున్నాయని హెచ్చరిస్తున్నారు.   మార్గాలూ లేకపోలేదు: ఒత్తిడికి లోను చేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం, సరైన ఆహారం, తగిన వ్యాయామం, తరచూ ధ్యానం చేయడం, సామాజిక బంధాలను దృఢంగా ఉంచుకోవడం వంటి చర్యలతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. అన్నింటికీ మించి తమ మనసులోని అలజడి అదుపు తప్పినట్లు తోస్తే తప్పకుండా వైద్యుని సంప్రదించి కౌన్సిలింగ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు.      

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం   ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. * అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. * కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. * కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. * వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. * దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.

మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త!!   పెరుగుతున్న వయస్సుతో పాటు మహిళలు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు.అవి ఏమిటి అన్న విషయాలు చూద్దాం.మహిళలు లేదా యుక్త వయస్సులో ఉన్న బాలికలు వివిదరకాల అనారోగ్య సమస్యలు మొదలు అవుతాయి.అందులో ముఖ్యంగా నెలసరి సమస్యలు, ప్రెగ్నెన్సీ వంటివి వస్తూ ఉంటాయి. అందుకు ముఖ్యంగా ఆడపిల్లలు పెరుగు తున్న కొద్దీ బాల్యం, కౌమారం దసలు దాటి యవ్వనం లోకి అడుగు పెట్టగానే శరీరంలో వచ్చే మార్పులు వస్తూ ఉంటాయి.అందుకే వారు ఎదుర్కునే సమస్యల నుండి పోరాడేందుకు వారి ఆహార వ్యవహారాలు,జీవన శైలి లో ఆరోగ్యంగా ఉండడం అవసరం.అంటున్నారు నిపుణులు. అందరు మహిళల శరీర తత్వం ఒకే రకం గా ఉండదు. వేరు వేరు గా ఉంటుంది. ఎదో ఒకరకమైన సమస్యలు వస్తూనే ఉంటాయి. డాక్టర్ను సంప్రదించడం అవసరం. కళ్ళు మూసుకుని గుడ్డిగా అనుసరించడం అయితే కొన్ని అంశాల పై మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తునారు. నెలసరి సమస్యల పై సమాచారం తెలుసుకోండి... సరైన సమయం లో సుఖవంత మైన పీరియడ్స్ వస్తేనే ఆరోగ్యసంబంధమైన చాలా సమస్యల కు దూరం చేస్తాయి. దీనిని గమనించడం అత్యవసరం.మీనేలసరి చక్రం ఎన్నిరోజులకు వస్తోంది. ఒక్కసారిగా ఏమైనా మార్పులు వచ్చాయా? ఈ అం శాల పై దృష్టి పెట్టాలి అప్రమత్తం ఉండాలి. ఎదో రకమైన మార్పు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ ను సంప్రదించండి. సరైన సమయం లో కుటుంబ నియంత్రణ... మహిళల వయస్సు ౩౦ సంవత్సరాలు వచ్చే నాటికీ వారిలో శక్తి తగ్గిపోతుంది. 4౦ సంవత్సరాలు దాట గానే పూర్తిగా బలహీన పడతారు.ఈ మధ్య కాలం లో ప్రసవం విజయవంత మై నప్పటికీ అది సరైన సమయం కాదు. స్త్రీలు గర్భిణీ లుగా ఉన్నప్పుడు వారి శరీర పరిస్థితి ని చూసి అర్ధం చేసుకుంటారు. సరైన సమయం లో నే ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. యోని సంబంధిత ఇంఫెక్షన్ల పై అప్రమత్తం గా ఉండాలి... యోని సంబంధిత ఇన్ఫెక్షన్ల పై అప్రమత్తం గా ఉండాలి. ఇది మీకు తెలుసా చాలా రకాల ఇంఫెక్షన్ల లక్షణాలు చాలా తక్కువే క్లేమా డా డియా,గనేరియా, లాంటి ఇన్ఫెక్షన్లు స్పష్టంగా ఉండక పోవచ్చు. మూత్ర విసర్జన తో పాటు నొప్పి ,వేజైనల్ డిస్చార్జ్ ,నేలసరిలో అధిక ఋతుస్రావం,జరుగుతూ ఉంటుంది. మీరు వివాహిత కానట్లయితే గర్భ నిరోధక మాత్రలు లేదా ఇతర సాధనాలు వాడినా పరీక్షలు చేయించడం ఇదీ కాక హెచ్ బి వి సంబంధిత ఇన్ఫెక్షన్లు సర్వైకల్ రోగాలకు సంబందించిన సమస్యలు ఉంది ఉండవచ్చు.మీరు ప్రతి ఏటా పాప్సి మియర్ చేయించడం మానకండి. వాటిని కొనసాగించండి. తద్వారా అనారోగ్య సమస్య నుండి బయట పదండి.                                            

నచ్చినవాడితో పరిచయం ఎలా పెంచుకోవాలి....? ప్రతి అమ్మాయికి కూడా అందరూ అబ్బాయిల యొక్క దృష్టిని తమ వైపు చూసేలా చేసుకోవడం చాలా సులభం. కానీ తనకు ఇష్టమైన అబ్బాయితో మొదటిసారిగా మాట్లాడటం ఎలాగో తెలియక కంగారు పడుతుంటారు. మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలో కొన్ని చిన్ని ప్రయత్నాలు చూద్దామా...!   మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?'' అని ఇలా పలకరించండి. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది. దీనివల్ల మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం.     ప్రపంచంలో తల్లిదండ్రులకైనా సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలు అడిగిన వెంటనే అబ్బాయిలు ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. మీకు నచ్చిన వ్యక్తి దగ్గరగా ఉంటే అతడిని ఏదైనా సహాయం అడగండి. మీరు అతన్ని అలా అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు. ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు, మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు, లేదా అతను కూర్చున్న పక్కనే ప్లేస్ ఉంటే.."కుర్చోవచ్చా" అంటూ ఏదో ఒక విధంగా వారి సహాయం అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన ముచ్చట్లు.     మీకిష్టమైన వ్యక్తితో దగ్గరగా మాట్లాడాలి అనుకుంటే... అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో లేదా పోరపాటుగానో మీ దగ్గర ఉన్న పెన్, బుక్స్, కూరగాయలు, ఖర్చిఫ్ వంటి ఏదైనా ఒక వస్తువును వదిలేయండి. దాంతో వాటిని మీకు ఖచ్చితంగా తీసి ఇస్తాడు. కానీ మీరు పడేసుకున్న వస్తువు అతనికి కనిపించేలా మాత్రమే పడేయండి. లేకపోతే అతని స్థానంలోకి మరో హీరో దిగిపోతాడు. అతను చేసిన సహాయానికి చిరునవ్వు నవ్వి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు అతను కూడా బదులిస్తాడు. దీనివల్ల మీరు ఇపుడు మాట్లాడకపోయినా మరోసారి కలిసినపుడైనా.. ఈ విషయం గుర్తు చేసి అతనితో మాట్లాడవచ్చు.     ఈ సలహాలతో ఖచ్చితంగా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ గ్రీకువీరుడు కోసం మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి.

మార్నింగ్ సిక్‌నెస్‌ మంచిదే!   మాతృత్వం గొప్ప వరమే! కానీ అదో క్లిష్టమైన ప్రయాణం కూడా. తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి బిడ్డను ప్రసవించేదాకా, స్త్రీని రకరకాల సమస్యలు చుట్టుముడతాయి. వాటిలో ‘మార్నింగ్‌ సిక్‌నెస్‌’ ఒకటి. అయితే ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ విషయమై జరిగిన ఓ పరిశోధనతో... ఈ సమస్య వల్ల లాభమే కానీ నష్టం లేదని తెలుస్తోంది. ఈ వివరాలు ఇవీ... ఏమిటీ మార్నింగ్‌ సిక్‌నెస్‌! గర్భవతిగా ఉన్నప్పుడు వాంతులు, వికారంతో కూడిన ఇబ్బందినే మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. ఈ సమస్య సాధారణంగా ఉదయం వేళల్లో మొదలై, రోజు గడిచేకొద్దీ సర్దుకుంటుంది కనుక ఆ పేరు వచ్చింది. గర్భవతులుగా ఉన్న స్త్రీలలో కనీసం 80 శాతం మందిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనిని ఓ తప్పనిసరి పరిస్థితిగానే భావిస్తుంటారు.   ఇంతకీ ఈ మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఎందుకు వస్తుందన్నదానిమీద ఇప్పటివరకూ ఓ స్పష్టత లేదు. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పుల కారణంగానే మార్నింగ్ సిక్‌నెస్‌ వస్తుందని మాత్రం ఊహిస్తున్నారు. మార్నింగ్ సిక్‌నెస్‌ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తనప్పటికీ... చిన్నా చితకా ఇబ్బందులు మాత్రం తప్పవు. మనసంతా అలజడిగా, పనులు చేసుకునేందుకు అడ్డంకిగా ఉండే ఈ సమస్య ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూడటం తప్ప మందులు కూడా అంతగా ఉపయోగం ఉండవు.   మంచిదేనట! మార్నింగ్‌ సిక్‌నెస్‌ వల్ల ఇబ్బందులు ఉన్నమాట నిజమే. మరి దీని వల్ల గర్భవతులకు ఏమన్నా మేలు జరుగుతోందా అని పరిశీలించే ప్రయత్నం చేశారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం గర్భం దాల్చిన ఓ 797 మందిని ఎన్నుకొన్నారు. వారందరినీ కూడా రెండో నెల మొదలుకొని ఎనిమిదో నెల వరకూ ఒక డైరీని రాస్తూ ఉండమన్నారు. అందులో తమ ఆరోగ్యం సమస్యలను నమోదు చేయమని సూచించారు.   పరిశోధన కోసం ఎన్నుకొన్న 797 మంది అభ్యర్థులలో దాదాపు 60 శాతం మంది మార్నింగ్‌ సిక్‌నెస్‌కు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్నారని తేలింది. ఆశ్చర్యకరంగా వీరిలో గర్భస్రావం మాత్రం చాలా తక్కువగా నమోదైంది. మార్నింగ్ సిక్‌నెస్‌ ఇబ్బంది పడని స్త్రీలతో పోల్చుకుంటే, ఆ సమస్యను ఎదుర్కొన్న గర్భవతులలో గర్భస్రావం అయ్యే ప్రమాదం దాదాపు 75 శాతం తక్కువ నమోదైంది.   ఇంతకీ మార్నింగ్‌ సిక్‌నెస్‌ రావడానికీ పిండం ఆరోగ్యంగా ఉండటానికీ కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు స్పష్టమైన జవాబు ఉందంటున్నారు పరిశోధకులు. గర్భవతులు తినే ఆహారంతో పాటుగా రకరకాల సూక్ష్మక్రిములు కూడా శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇవి గర్భస్థ శిశువుకి హాని చేసే ప్రమాదం లేకపోలేదు. ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మన శరీరం చేసే పోరాటంలో భాగంగా కలిగే ఇబ్బందే మార్నింగ్‌ సిక్‌నెస్‌. కాబట్టి ఇకమీదట మార్నింగ్‌ సిక్‌నెస్‌ వస్తే అదేదో వ్యాధి అనుకుని బెంబేలెత్తిపోవడం మానుకుని... కడుపులో శిశువు క్షేమంగా ఉండబోతోందని తృప్తి చెందాలన్న మాట!   - నిర్జర.

How to make 3D Paper Quilling flowers..    

బ్రిటిష్వారిని వణికించిన గూఢచారి – సరస్వతి రాజమణి స్వేచ్ఛ విలువ, బానిసత్వంలో మాత్రమే తెలుస్తుంది. స్వాతంత్ర్యం కోసం మనసు తపిస్తుంటే... ఆ బాధేమిటో పీడనలో ఉన్నవారికే అర్థమవుతుంది. అలాంటి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనల్ని విడిపించాలని సాహసించినవారు ఎందరో! ఇప్పుడు వాళ్లందరినీ మనం మర్చిపోయి ఉండవచ్చుగాక! కానీ మన స్వేచ్ఛ వారి భిక్ష అన్న విషయాన్ని చరిత్ర గుర్తుచేస్తూనే ఉంటుంది. అలాంటి ఓ గొప్ప యోధురాలే సరస్వతి రాజమణి. రాజమణి కుటుంబంవారు బర్మాలో స్థిరపడిన తమిళురు. రాజమణి తండ్రికి ఓ బంగారు గని ఉండేది. కానీ అతని మనసు మాత్రం భారతదేశంలో అప్పుడు సాగుతున్న స్వాతంత్ర్య పోరాటం మీదే ఉండేది. 1927లో ఆ కుటుంబంలో పుట్టిన రాజమణి, ఊహ తెలిసినప్పటి నుంచే తండ్రి బాటే పట్టింది. భారత స్వాతంత్రానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా వారిద్దరూ వెళ్లేవారు. అలా ఓసారి బర్మాకు వచ్చిన గాంధీజీని కూడా కలిశారు. ‘నేను పెద్దయ్యాక కనీసం ఒక్క బ్రిటిషర్నైనా చంపుతాను,’ అని రాజమణి ఆయనతో అందట. అప్పుడు ఆమె వయసు పదేళ్లు! అహింసావాది అయిన గాంధీజీకి రాజమణి దృక్పథం నచ్చలేదు. రాజమణికేమో అహింస రుచించలేదు.   రాజమణికి 16 ఏళ్ల వయసుండగా నేతాజీ బర్మాకు వచ్చారు. అప్పటికే ఆయన Indian National Army (INA) అనే సంస్థను స్థాపించి సాయుధపోరుని మొదలుపెట్టారు. సహజంగానే ఆయన బాట రాజమణికి నచ్చింది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను,’ అంటూ ఆయన అందించిన పిలుపూ నచ్చింది. వెంటనే తన ఒంటి మీద ఉన్న నగలన్నీ INAకు విరాళంగా ఇచ్చేసిందట. ఓ 16 ఏళ్ల పిల్ల తమకు నగలిచ్చిందని తెలుసుకున్న నేతాజీ వాటిని తిరిగి ఇచ్చేయడానికి రాజమణి ఇంటికి వెళ్లారట. అక్కడ ఆమె తన నగలను తిరిగి తీసుకోనంటే తీసుకోనని మొండికేసింది. ఆమె పట్టుదలకు మెచ్చిన నేతాజీ ‘లక్ష్మీదేవి (సంపద) నీ దగ్గర ఎప్పుడూ నిలకడగా ఉండకపోవచ్చు. కానీ నీలోని సరస్వతి (జ్ఞానం) మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే నీకు సరస్వతి అని పేరు పెడుతున్నాను,’ అని చెప్పారట. అప్పటి నుంచీ రాజమణి పేరు సరస్వతి రాజమణిగా మారింది. నేతాజీతో పరిచయం అయిన ఆ రోజునే తాను INAలో చేరి తీరతానంటూ సరస్వతి పట్టుపట్టింది. దాంతో ఆమెను తన దగ్గర ఉన్న నలుగురు గూఢచారులలో ఒకరుగా నియమించారు నేతాజీ. బ్రిటిష్ అధికారుల ఇళ్లలో పనివారుగా పనిచేస్తూ అక్కడి రహస్యాలను చేరవేయడమే వీరి పని. ఆ పనిలో సరస్వతి ఆరితేరిపోయింది. విలువైన సమాచారాన్నెంతో నేతాజీకి అందచేసింది. అలాంటి ఓసారి తన తోటి గూఢచారిని కాపాడే ప్రయత్నంలో సరస్వతి కాలికి బుల్లెట్ గాయమయ్యింది. అంతటి గాయంతో కూడా మూడురోజుల పాటు బ్రిటిష్వారికి చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టింది. సరస్వతి చూపిన ఈ తెగువకు ఆమెకు బ్రటిష్ చక్రవర్తి చేతుల మీదుగా పతకాన్ని ఇప్పించారు నేతాజీ!   INA పోరు ఉధృతంగా సాగుతుండగా నేతాజీ హఠాత్తుగా అదృశ్యం కావడం, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిపోయాయి. రాజమణి కుటుంబమంతా స్వతంత్ర దేశం మీద ఆశతో ఇండియాకు తిరిగివచ్చేశారు. తమ యావదాస్తినంతా భారత ప్రభుత్వానికి ఇచ్చేశారు. సహజంగానే ప్రభుత్వం వీరి సేవను పట్టించుకోలేదు. రాజమణి చెన్నైలో కటిక దరిద్రాన్ని అనుభవించింది. కానీ ఆమెలోని సేవాగుణానికి మాత్రం ఎలాంటి పేదరికమూ పట్టలేదు. ఎక్కడెక్కడో తిరిగి పాతబట్టలని సేకరించి, వాటిని అనాథ శరణాలయాలకు అందించేవారు. ప్రస్తుతం సరస్వతి రాజమణి ఏ పరిస్థితులలో ఉన్నారో దేశానికి తెలియదు. కానీ మనం ఇంత హాయిగా, స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి సరస్వతివంటివారి త్యాగమే కారణం అన్న విషయాన్ని మాత్రం ఎవరూ విస్మరించలేరు. - నిర్జర.    

అక్కడి వ్యాపారులంతా ఆడవారే!   ఆకాశంలో ఎగరాలన్నా, వీధిలో నిలబడి వ్యాపారం చేయాలన్నా అది మగవాడికే సాధ్యం అని ఇంకా నమ్ముతున్న రోజులివి. ఆడవాళ్లంటే డైలీ సీరియల్స్‌ చూసేవారేననీ, ఆ డైలీ సీరియల్స్‌లో పాత్రలలాగానే వారి మనస్తత్వాలూ ఉంటాయని హేళన చేస్తున్న సందర్భం ఇది. ఇలాంటి సందర్భంలో ఓ ఐదువందల సంవత్సరాలుగా ఆడవారే వ్యాపారస్తులుగా సాగుతున్న ఓ వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకోక తప్పదు.   తల్లుల వ్యాపారం అది మణిపూర్‌ రాజధాని ఇంఫాల్. అక్కడికి వెళ్లి ఊళ్లో ‘ఇమా కేతెల్‌’ ఎక్కడ అంటే ఎవరైనా చెబుతారు. అంతా మహిళా వ్యాపారస్తులే కనిపించే ఒక బజారే ఈ ఇమా కేతెల్‌! ‘ఇమా’ అంటే మణిపురి భాషలో తల్లి అనీ, ‘కేతెల్’ అంటే బజారు అనీ అర్థం. అలాగని ఇక్కడ పదిమందో వందమందో మహిళా వ్యాపారస్తులు కనిపిస్తారనుకుంటే పొరపాటే! ఇక్కడ ఏకంగా 4000 మందికి పైగా మహిళలు రోజూ వ్యాపారాన్ని సాగిస్తుంటారు.   వందల ఏళ్ల చరిత్ర ఇమా కేతిల్‌ స్త్రీలను ప్రోత్సహించేందుకు ఏదో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బజారు కాదు. మణిపురి స్త్రీలంతా వందల ఏళ్లుగా ఒక చోట గుమికూడి చేసుకుంటున్న కూడలి. ఈ బజారు గురించి దాదాపు ఐదువందల సంవత్సరాల క్రితమే మణిపురి సాహిత్యంలో ప్రస్తావనలు కనిపిస్తాయి. 1786లోని బ్రిటిషర్ల గెజెట్‌లో అయితే ఇంఫాల్‌ మధ్యలోంచి ప్రవహించే నంబుల్‌ నదీతీరంలో ఆడవారే వ్యాపారస్తులుగా సాగే లావాదేవీల గురించి వివరణ ఉంది.     వ్యాపారానికి పునాది 500 ఏళ్ల క్రితం మణిపురి సమాజం భిన్నంగా ఉండేది. చాలామంది మగవారు పొలం పనుల పేరుతోనో, సైన్యంలో పనిచేసేందుకో... పొట్ట చేతపట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. మరి ఆ సమయంలో ఇంట్లో మిగిలిన కుటుంబసభ్యులు బతికేదెలా! అందుకే ఆడవారు నిదానంగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యతని మహిళలే తీసుకున్నారు. బొమ్మలు చేయడం, బట్టలు అల్లడం, ఆభరణాలు రూపొందించడం... ఇలా తమకు నైపుణ్యం ఉన్న పనిలో వస్తువులని రూపొందించి వాటిని అమ్మేవారు. రానురానూ ఇలా ఒక చోటకి చేరిన ఆడవారితో ‘ఇమా కేతెల్‌’ రూపుదిద్దుకొంది.     కష్టాలను తట్టుకొని 21వ శతాబ్దంలోనే ఆడవారంటే చులకన ఉన్నప్పుడు ఇక వందల ఏళ్ల క్రితం సంగతి చెప్పేదేముంది! స్థానిక వ్యాపారస్తులంతా ఎప్పుడెప్పుడు వీరిని తరిమికొడదామా అని ఎదురుచూసేవారు. ఇక బ్రిటిషర్ల కాలంలో అయితే వీరిని ఖాళీ చేయించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ తన చోటుని వదిలుకొనేందుకు స్త్రీలు ఇష్టపడలేదు. నల్లదొరలైనా, తెల్లదొరలైనా... తమ జోలికి ఎవరు వచ్చినా తలవంచలేదు. వ్యాపారాన్ని అంగుళం కూడా వదులుకోలేదు. ఇప్పటికీ ఇక్కడి ఆడవారిలో అదే సామరస్యం కొనసాగుతోంది. పైగా వీరంతా కలసి కష్టాలలో ఉన్న మహిళలకు రుణాలను అందించేందుకు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.     ప్రపంచంలోనే అతి పెద్దది కేవలం మహిళలలే కనిపించే బజార్లలో ‘ఇమా కేతెల్‌’ అతి పెద్దది అని ఓ అంచనా. ఈ కూడలి ప్రత్యేకతను గ్రహించిన మణిపుర్‌ ప్రభుత్వం వారు వ్యాపారం చేసుకునేందుకు పక్కా భవనాలను నిర్మించి ఇచ్చింది. నెలకి ఓ నలభై రూపాయలు చెల్లిస్తే చాలు మహిళలు ఇక్కడ నిరాటంకంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఎండుచేపల దగ్గర్నుంచీ బట్టల దాకా ఇక్కడ లభించని వస్తువంటూ ఉండదు. పైగా ఇక్కడ వ్యాపారం సాగించే ఆడవారు కూడా చాలా చైతన్యంగా ఉంటారని చెబుతారు. వారు ఇంటింటి రామాయణాల గురించి కాకుండా సామాజిక అంశాల గురించీ, సమకాలీన రాజకీయాల గురించీ చర్చించుకునేందుకే ఎక్కువ ఇష్టపడతారట.     - నిర్జర.  

ఆడవాళ్లలో ప్రేమ పాళ్లు ఎక్కువట     కుటుంబసభ్యులతో కానీ.. సన్నిహితులతో కానీ.. సహచరులతో కానీ ప్రేమానుబంధాలు బలంగా ఉండాలంటే మీరు ముందుగా ప్రేమను పంచటం లేదా ప్రేమగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం.. అయితే ప్రేమను ఆడవాళ్లు బాగా పంచుతారా...? మగవాళ్లు పంచుతారా..? అన్న ప్రశ్న చాలా సందర్భాల్లో.. చాలా వేదికల మీద విని ఉంటాం. ఆడవాళ్లది ఏముందండి..? మేమే బాగా చూపించగలమని మగవాళ్లు.. కాదు.. కాదు మేము అని ఆడవాళ్లు ఇలా రకరకాలుగా వాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానం చెప్పడానికి యూనివర్శిటీ ఆఫ్ జ్యూరిచ్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.   సహాయగుణం, ప్రేమతత్వం మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువని తేల్చారు. మగువల మస్తిష్కంలో ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయని.. పరిశోధకుల బృందం తేల్చింది. కాగా, ఇదే సమయంలో మగవారి ఆలోచనలు మోసపూరితంగా, లాభాపేక్షతో కూడినవిగా ఉంటాయని తెలిపింది. మగవారి కంటే ఆడవారు మృధు స్వభావం కలిగినవారని, నలుగురితో కలుపుగోలు తనంగా ఉండటమే కాకుండా.. వారి శ్రేయస్సును కాంక్షిస్తారని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తేల్చాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ సౌట్స్‌చెక్ చెప్పారు. లాభం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో మగవారు ముందుంటారని ఆయన అన్నారు. మెదడు పనితీరు, ఆలోచనా విధానం వల్లే స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన 27 ఏళ్ల పురుషులు, 26 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు.